పిల్లలు లేకపోతే నేను కూడా బావతోపాటు... | Exclusive interview Disco Shanti with family | Sakshi
Sakshi News home page

పిల్లలు లేకపోతే నేను కూడా బావతోపాటు...

Published Sun, Dec 29 2013 12:30 AM | Last Updated on Sat, Sep 2 2017 2:04 AM

Exclusive interview Disco Shanti with family

ఆ రోజు సందర్భం వేరు.
 దాదాపు ఐదేళ్ల క్రితం... 2009 ఫిబ్రవరి 12....
 వాలెంటైన్స్ డేకి రెండురోజుల ముందు నేను...
 రియల్‌హీరో శ్రీహరి ఇంటర్వ్యూ కోసం వెళ్లినప్పుడు..
 ఆయనతో పాటు ఆయన భార్య శాంతి కూడా...
 రియల్ స్టార్‌లా అనిపించారు!
 ఈ రోజు సందర్భం వేరు.
 శ్రీహరి లేరు. కానీ ఆయన భార్య రియల్ లైఫ్ హీరోలా
 వాస్తవ జీవితంతో పోరాడుతూ కనిపించారు!
 ఆ రోజు సరదాగా శ్రీహరి...
 ‘‘నన్ను ఒక్క పూట వదలవే, కోటి రూపాయలిస్తా’’ అన్నారు.
 ఈ రోజు శాంతి...
 కోట్లు ఖర్చుపెట్టయినా బతికించుకుంటానని
 కన్నీళ్లతో ఎంత వేడుకున్నా
 తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు శ్రీహరి!
 ఆ రోజు శాంతి... ‘శ్రీహరిని విడిచి
 ఒక్కపూటైనా ఉండలేను’ అన్నారు.
 ఈరోజు  దేవుడు శాంతిని ఒంటరిని చేసి...
 జ్ఞాపకాలను మాత్రమే తోడుగా మిగిల్చాడు.
 ఆ రోజు శాంతి... ‘‘నాకు కారే అక్కర్లేదు బావా...
 సైకిల్ మీద తీసుకెళ్లినా నీతోపాటు వచ్చేస్తా’’ అన్నారు.
 ఈ రోజు...
 శ్రీహరితో కలిసి నడిచే భాగ్యాన్ని కూడా కోల్పోయారు.  
 ఆ రోజు శ్రీహరి... ‘‘పెళ్లి కాకముందు పదమూడేళ్లలో...
 రెండు మూడు జీవితాలు చూసింది శాంతి’’ అన్నారు.
 ఈ రోజు శాంతి... భర్త పోయాక ఇంకెన్ని జీవితాలను
 చూడాల్సి వస్తుందో అనిపించింది.
 ఆ రోజు శాంతి... ‘‘బావ లేకుండా బతకలేను’’ అన్నారు.
 ఈ రోజు...
 బావ ఇంకా బతికే ఉన్నాడన్న భ్రాంతిలో బతుకుతున్నారు.
 ఎవరి జీవితంలోనైనా ఇంత వైరుధ్యం ఉంటుందా?
 శాంతి జీవితంలో ఉంది.
 చదవండి... ఈవారం ‘తారాంతరంగం’లో...

 - ఇందిర పరిమి, ఫీచర్స్ ఎడిటర్
 
 ఇందిర: 9 అక్టోబర్... అసలు ఆరోజు ఏం జరిగింది?
 శాంతి: ప్రభుదేవా సినిమా షూటింగ్‌కోసమని ముంబై వెళ్లాం. ముందురోజు రాత్రి హైదరాబాద్ చేరుకోవాల్సిన వాళ్లం కానీ, ఏదో సాంగ్ సీక్వెన్స్ ఉందని ప్రభుదేవా రిక్వెస్ట్ చేయడంతో ముంబైలోనే ఉండిపోయాం. బావకి ముందురోజు కాస్త జ్వరం ఉన్నా, ఆరోజు బాగానే ఉన్నాడు. రోజూ పాలు, బ్రెడ్ తీసుకునేవాడు, ఆరోజు టీ తెప్పించమని చెప్పి, బెడ్ మీదే కూర్చుని తాగాడు. తర్వాత కాళ్లు లాగుతున్నాయని, నాతో కాళ్లు నొక్కించుకుని కాసేపు పడుకున్నాడు. ఉదయం 8.30 టైంలో అనుకుంటా... తనకిష్టమైన ఉడిపి హోటల్ నుంచి ఇష్టంగా తినే ఊతప్పం తెప్పించాను. కానీ, ‘నాకు తినాలని లేదు, నువ్వు తినెయ్’ అన్నాడు. తను తినందే ఏరోజూ ముందు తినే అలవాటు లేని నేను, ముందురోజు తినకపోవడంతో ఆకలిగా ఉందని, తిందామని కూర్చున్నాను. ఇంతలో బావ మళ్లీ పిలిచి, ఛాతీలో మంటగా ఉందన్నాడు. హోటల్ వాళ్లనడిగి, వెంటనే డాక్టర్ని పిలిపించాను. ‘పల్స్ తక్కువగా ఉంది, హాస్పిటల్‌కు తీసుకెళ్లడం మంచిది’ అన్నారు డాక్టర్.  ‘బట్టలు మార్చుకుని వెళ్దాం’ అనే లోపలే బావ గబగబా బయటికెళ్లిపోయాడు. నేను కిందికి వచ్చేలోపలే తనతోపాటు ఉన్న మనుషులను తీసుకుని హాస్పిటల్‌కు వెళ్లిపోయాడు. ‘ఏంటి బావా అలా వెళ్లిపోయావు?’ అని ఫోన్ చేసి అడగ్గానే ‘కంగారేం లేదు... పక్కనే ఉన్న హాస్పిటల్‌కు  వెళ్లి ఇంజక్షన్ తీసుకుని అరగంటలో వచ్చేస్తా’ అన్నాడు. కానీ నాకు కంగారు తగ్గక, ప్రతి 10 నిమిషాలకు కాల్ చేస్తూనే ఉన్నా. చివరికి బావ ‘నైట్ షూటింగ్... నిద్దర లేదు... లొల్లి చేయకుండా కాసేపు నన్ను రెస్ట్ తీసుకోనీవే’ అని విసుక్కుని ఫోన్ పెట్టేశాడు. కాసేపటి తర్వాత మళ్లీ కాల్ చేస్తే తెలిసింది... బావని హాస్పిటల్‌లో అడ్మిట్ చేశారని! అది తెలియగానే నా గుండె ఆగిపోయినట్టయింది! వెంటనే బండి పంపమని చెప్పి, 10.45 కల్లా హాస్పిటల్‌కు చేరుకున్నాను.

 ఎమర్జన్సీ వార్డ్... బావను చూడగానే ఏడవడం మొదలెట్టాను. ‘ఏమీ లేదు, పల్స్ తక్కువ ఉంది. గ్లూకోజ్‌తోపాటు ఏదో మందు ఎక్కిస్తానన్నారు. అది తీసుకోగానే వెళ్లిపోదాం... నాకేం కాదు, ఏడవకు’ అన్నాడు బావ. తర్వాత చీఫ్ డాక్టర్ వచ్చాడు. ‘మేజర్‌గా ఏమీ లేదు’ అంటూ ఏదో చెప్పి వెళ్లిపోయారు కానీ నాకు విషయం పెద్దగా అర్థం కాలేదు. సెలైన్ ఎక్కిస్తుండగా బావ, నేనూ ఎప్పటిలానే మాట్లాడుకున్నాం. అయితే ఉన్నట్టుండి బావ నాలుక మడత పడడం మొదలైంది. ‘ఏ మైంది బావా’ అంటుండగానే కళ్లు మూతలు పడడం మొదలైంది. డ్యూటీ డాక్టర్‌ని, నర్సుల్ని గట్టిగా పిలిచాను. వెంటనే ఏవో ఇంజక్షన్లు ఇస్తూ, కాసేపు నన్ను బయటికి పొమ్మన్నారు. నేనలా పోతుండగా బావ ‘వీళ్లిలా గుచ్చేస్తున్నారు... ఏం చేస్తున్నావ్... రావే’ అని గట్టిగా అరిచాడు. అయినా హాస్పిటల్ వాళ్లు నన్ను అక్కడ ఉండనీయకుండా బైటికి పంపించడంతో ఏమీ చేయలేక వెళ్లిపోయాను. బయటికొచ్చి ఫోన్లు చేయడం మొదలెట్టాను... ముందు హైదరాబాద్‌లో ఉన్న ఫ్యామిలీ డాక్టర్ సంజీవ్‌కి, శ్రీనివాస్ అన్నకి (బావ వాళ్ల అన్న)! ఇద్దర్నీ వెంటనే ముంబై బయల్దేరి రమ్మని చెప్పి, మళ్లీ బావ దగ్గరికి వచ్చాను.   (బోరున  ఏడుస్తూ..) మా ఇద్దరి ప్రేమా మా ఇద్దరికే తెలుసు... మనిషి నిస్తేజంగా అలా పడుకుని ఉన్నాడనే కానీ, తన చూపు మాత్రం నావైపే! ఏం జరుగుతోందో తెలియని అయోమయంలో పిచ్చిదానిలా ఏడుస్తూ కూర్చున్నాను... ఇంతలో బావ నోట్లోంచి ఉన్నట్టుండి రక్తం రావడం మొదలైంది. బావకు తలనొప్పి వస్తేనే తట్టుకోలేని నేను, అంతలా రక్తం రావడంతో గట్టిగా అరవడం మొదలెట్టాను. వెంటనే నన్ను వార్డు నుంచి బయటికి పంపించబోయారు హాస్పిటల్ స్టాఫ్! ‘నాకు ఇక్కడ ఏం జరుగుతోందో చెప్పండి’ అని అడగడంతో, ‘అది తర్వాత... మీరిక్కడుంటే ట్రీట్‌మెంట్ ఇవ్వలేం’ అంటూ నన్ను బయటికి పంపించేశారు. చేసేదేంలేక పిల్లలకు ఫోన్ చేసి, ‘అప్పకి బాలేదు. వెంటనే వచ్చేయండి’ అని చెప్పి మళ్లీ లోపలికి వచ్చేంతలో డాక్టర్ ‘హి ఈజ్ నో మోర్’ అని చెప్పారు! ‘ఇంతలో ఇంత ఘోరమా?’ అని ఒకవైపు... అస్సలు నమ్మకం కలగకపోవడం మరోవైపు!
 సాయంత్రం 7.30 టైంలో అనుకుంటా పిల్లలు వచ్చారు... 9.30 దాకా బావ చేయి పట్టుకుని అక్కడే కూర్చున్నా. మర్నాడు పొద్దున బావని తీసుకుని హైదరాబాద్‌కి వచ్చాం.
 
 ఇందిర: గత సంవత్సరంగా ఆయన సన్నగా, బలహీనంగా కనిపించారు... అసలు ప్రాబ్లమేంటి?
 శాంతి: కొన్నాళ్ల క్రితం ఆయనకు షుగర్ వచ్చింది. దానికితోడు లివర్ ప్రాబ్లమ్ కూడా రావడంతో మనిషి సన్నబడిపోయాడు. అయితే వాటన్నిటినీ తక్కువ కాలంలోనే  కంట్రోల్‌కి తెచ్చుకున్నాడు. సంవత్సరంగా అయితే తాగడం పూర్తిగా మానేశాడు. మనిషి సన్నబడ్డాడనే గానీ, హెల్త్ పర్ఫెక్ట్‌గా ఉండింది. చివరి వరకు ఆరోగ్యంగానే ఉన్నాడు.
 
 ఇందిర: మీరు కూడా అంత ఆరోగ్యంగా కనిపించట్లేదు... చాలా సన్నబడిపోయారు!
 శాంతి: నిజమే... 18 కేజీలు తగ్గాను! ఏం చేయను? బావ లేకుండా... తిండి ఎక్కట్లేదు... మనుషుల్ని కలవాలనిపించట్లేదు... బయటికి పోవాలనిపించట్లేదు... ఏమీ చేయాలనిపించట్లేదు... ఏం చేయను?
 
 ఇందిర: ఇలాంటి పరిస్థితి ఆకస్మికంగా సంభవించినప్పుడు మనం నమ్మకపోవడం నుంచి అపనమ్మకంలో బతుకుతుంటాం...
 శాంతి: నాకైతే బావ చనిపోయినట్లేలేదు! షూటింగ్‌కి వెళ్లాడు... ఏడింటికల్లా తిరిగొస్తాడు, బావకోసం వంట చేయాలి... అనే ఆలోచనలతోనే బతుకుతున్నాను. మీకో విషయం తెలుసా..  పిల్లలకు ఇష్టమున్నా లేకున్నా, రోజూ నేను బావకు ఇష్టమైన వంటలే చేస్తుంటా. మూడుపూటలా బావకి (ఫోటో దగ్గర)  పెడుతుంటా!
 
 ఇందిర: ఒక మనిషి గొప్పతనం పోయిన తర్వాత కానీ తెలీదంటారు. మీ బావ గురించి మీకు తెలీదని కాదు...
 శాంతి: యస్... యస్... యస్... బావ పోయిన రోజు నేను చూసిన అభిమానం అంతా ఇంతా కాదు. అభిమానులు, నచ్చినవాళ్లు, బంధువులు, స్నేహితులు... ఒకరుకాదు ఆరోజు వచ్చింది! బావ నిజంగా చాలా అదృష్టవంతుడు! అయితే ఇంత మంచి వ్యక్తిని 47 ఏళ్లకే దేవుడలా తీసుకెళ్లిపోవడం చాలా అన్యాయం!
 
 ఇందిర: మీరు ఆరోజు అంత నిబ్బరంగా వుండడం చాలా ఆశ్చర్యపరిచింది...
 శాంతి: ఎందుకంటే... ఆరోజు నాకసలు బావ చనిపోయిన ఫీలింగే లేదు! బతికున్నారని, లేస్తారనే అనిపించింది! పొలంలో పాప పక్కన పెట్టినప్పుడు కూడా బావ లేచి వస్తాడని, మట్టి వేయొద్దని అన్నాను. (ఏడుస్తూ) ఇద్దరు పిల్లలు లేకపోతే ఆరోజు నేను కూడా బావతోపాటు లోపల పడిపోయేదాన్ని! వాళ్లిద్దరికోసమే... బతకడం!
 
 ఇందిర: ఆయన మరణం ఆకస్మికంగా జరిగింది... మీకేదైనా జరిగితే పిల్లల సంగతేంటని ఎప్పుడైనా ఆలోచించారా?
 శాంతి: బావకు ప్లానింగ్ చేసే టైం లేకపోయింది. పైగా తను చావు గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. కానీ, ఇప్పుడు నా పరిస్థితి అలా కాదు... కచ్చితంగా ఆలోచిస్తున్నాను. వాళ్లు ఎదిగి వాళ్ల కాళ్ల మీద వాళ్లు నిలబడేదాకా జాగ్రత్తగా ఉంటా! వాళ్లకోసం ప్లానింగ్ చేయాల్సింది చాలా ఉందని తెలుసు. అందుకే ఇప్పటినుంచే మొదలెట్టాను. నాకేదైనా అయినా నా పిల్లల జీవితాలే కాదు, మనవలు, మనవరాళ్ల జీవితాలు కూడా సాఫీగా గడిచిపోయేలా ప్లాన్ చేస్తున్నాను.
 
 ఇందిర: పిల్లలు ఉన్నట్టుండి మెచ్యూర్డ్‌గానో, బాధ్యతగానో అయినట్టు ఏమైనా అనిపించిందా?
 శాంతి: పెద్దోడు చాలా అండర్‌స్టాండింగ్! సందర్భాన్ని బట్టి... ఓదారుస్తాడు, నవ్విస్తాడు! చిన్నవాడికి ఇంకా అంత తెలీదు. కానీ వాడు కూడా ఇప్పుడిప్పుడు... తిన్నానా లేదా? నిద్రపోయానా లేదా? అని కనుక్కుంటుంటాడు. నేను తినకపోతే ఒక్కోసారి పిల్లలు  కూడా తినరు. అలానే నిద్రపోతారు. అప్పుడు మాత్రం బాధనిపిస్తుంది. అందుకే మర్నాడు వాళ్లకోసమైనా తింటుంటాను. నేను పైకి బెడ్‌రూంలోకి వెళ్లకపోతే, రాత్రి ఒంటిగంటైనా, రెండయినా వాళ్లు కూడా నాతోపాటే కూర్చుంటారు. అప్పుడప్పుడు బెడ్‌రూం తలుపు తీసి చూసి, నేను పడుకున్నాను అనుకున్నాక పడుకుంటారు. నేను ఎప్పుడూ ఏడుస్తుంటాననో ఏమో కానీ, నా ముందు ఒక్కసారి కూడా వాళ్లు కంట నీరు పెట్టలేదు.  దే కేర్ ఫర్ మి సోమచ్!  అయామ్ వెరీ లక్కీ దట్ వే!
 
 ఇందిర: ఇప్పుడు పరిస్థితి ఇంతకుముందులా కాదుకదా! జీవితానికి సంబంధించి ఏమైనా నేర్పిస్తున్నారా?
 శాంతి: యాజ్ సచ్... పిల్లలు చాలా మెచ్యూర్డ్ అండ్ స్మార్ట్! దే కెన్ లుక్ ఆప్టర్ దెమ్‌సెల్వ్స్ వెల్! దానికితోడు ఇప్పుడిప్పుడు నేను ఇంటి ఖర్చులన్నీ పెద్దోడి చేతుల మీదుగా చేయిస్తున్నాను... డబ్బు విలువ తెలియాలని! ఉల్లిపాయ రేట్ల నుంచీ బియ్యం రేట్ల దాకా అన్నీ చెప్తున్నాను. ఒకవైపు బాధ్యత నేర్పుతూనే, బావ లేని లోటు లేకుండా వాళ్లను ‘శ్రీహరి పిల్లలు’గానే పెంచుతున్నాను! వాళ్లకోసం ఎంతయినా కష్టపడతాను!
 ఇందిర: పిల్లలు ఏం కావాలని ఆయనకుండేది?
 శాంతి: ఇద్దరూ ఆయనలా ఇండస్ట్రీలోకి రావాలని! నాకు మాత్రం వాళ్లు చదువుకోవాలని! ఇక పిల్లల విషయానికి వస్తే...  పెద్దవాడికి డెరైక్టర్ అవ్వాలని (ఇప్పటికే షార్ట్ ఫిల్మ్స్ తీస్తున్నాడు), చిన్నోడికి యాక్టర్ అవ్వాలని (చైల్డ్ యాక్టర్‌గా చేశాడు అవార్డు కూడా వచ్చింది)! బావ కలగన్నదీ, పిల్లలకు నచ్చింది నెరవేర్చడం నా బాధ్యత... అయితే, ఇద్దరు పిల్లలూ గ్రాడ్యుయేషన్ పూర్తిచేశాకే!
 
 ఇందిర: అసలు ఆయనకి ఫ్యూచర్ ప్లాన్స్ ఏముండేవి?
 శాంతి: బావకు ఎప్పుడూ జనాలతో ఉండాలని, వాళ్లకు చేతనైనంత సాయం చేయాలని, అందుకోసం మినిస్టర్ అవ్వాలని కోరిక ఉండేది. 2009లో రాజకీయాల్లోకి వెళ్లే అవకాశం వచ్చినా  రెండు పడవల మీద కాళ్లు పెట్టొద్దని నేనే తనను వెనక్కి లాగా! ఫ్యామిలీ పరంగా చూస్తే పిల్లలు చిన్నవాళ్లు, నేనూ తనను చూడకుండా ఉండలేను... పైగా తన కెరీర్ కూడా అప్పుడు చాలా బాగుంది. ఇటు ఇండస్ట్రీపరంగా చూసినా, తను రాజకీయాల్లోకి వెళ్తే ప్రొడ్యూసర్లు ఇబ్బందులు పడతారని ససేమిరా అన్నాను. అందుకే తను 2014 కల్లా అన్ని కమిట్‌మెంట్లు పూర్తిచేసుకుని, పూర్తిగా రాజకీయాల్లోకి వస్తానన్నాడు. కానీ, ఆ కోరిక తీరకుండానే వెళ్లిపోయాడు. అందుకే అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది... బావకోసమైనా నేను రాజకీయాల్లోకి రావాలని, తను ప్రజలకు చేయాలనుకున్న మంచి నేను చేయాలని!
 
 ఇందిర: ఈ రెండున్నర నెలల్లో ... ‘అసలు మనుషులు ఇలా ఉంటారా?’ అని అనిపించిన సందర్భాలున్నాయా?
 శాంతి: నాకు ముందే తెలుసు... మనుషులు ‘ఇలానే’ ఉంటారని! నాకేదీ షాకింగ్ కాదు. ఎందుకంటే,  జీవితంలో ఢక్కామొక్కిలు తిని వచ్చినదాన్ని! అప్ప (నాన్న  ఆనందన్ - తమిళ్‌లో పెద్ద యాక్టర్) బతికి ఉండగానే అప్స్ అండ్ డౌన్స్ చూసినదాన్ని! ఇక నాన్న పోయాక చెప్పనక్కర్లేదు! ఒక్క జీవితంలో ఎన్నో జీవితాల్ని చూసినదాన్ని కాబట్టి ఈరోజు ఎలాగైనా బతకగలుగుతున్నాను. అయితే, మనుషులం కదా... చిన్న ఆశ ఉంటుంది. ఇన్నాళ్లు నన్ను అక్క, చెల్లి, అమ్మ, వదిన అని పిలిచినవాళ్లు, బావకు అతిదగ్గరగా ఉన్న కొందరు  ఈరోజు అసలు కనిపించకపోవడంతో, ఆ ఆప్యాయతను మిస్సవుతున్నాను. అదొక్కటే కొంచెం బాధనిపిస్తుంది. ఎందుకంటే, నేనే కాదు... నా పిల్లలకు కూడా వాళ్లు చాలా క్లోజ్. అయినా మేం కోరుకునేదేంటని? కాస్తంత ఓదార్పు... మాటసాయం! అది కూడా వాళ్లకు అంత కష్టంగా ఉంటే మనమేం చేయగలం!
 
 ఇందిర: ఎందుకంటారు?
 శాంతి: (నిర్వేదంగా నవ్వుతూ) నా దగ్గర డబ్బు లేదు... నేనేమైనా అడుగుతాననుకుంటున్నారేమో! వాళ్లకు తెలీదు... నేను చచ్చేంతవరకు నా చేయి పైన ఉండాల్సిందే కాని, కింద ఉండదని!  చిన్నప్పుడు అంత కష్టంలో ఉన్నప్పుడే ఒకరి దగ్గర చేయి చాచలేదు...  ఇప్పుడు చేస్తానా! అవసరమైతే తిరిగి సినిమా ఇండస్ట్రీలోకి వస్తా... సినిమాలు పొడ్యూస్ చేస్తా... సీరియల్స్ తీస్తా... ఏదైనా చేస్తాను, ఎంతైనా కష్టపడతాను కానీ, ఒకరి నుంచి ఆశించను!
 
 ఇందిర: రివర్స్‌లో... మీ దగ్గరికి డబ్బుకోసం (సాయం) వచ్చినవాళ్లు, డబ్బు ఇవ్వాలని (అప్పులు) వచ్చినవాళ్లు ఉన్నారా?
 శాంతి: ఉన్నారు. సాయంకోసం వచ్చిన ఎవ్వరినీ బావ కాదనేవాడు కాదు. నమ్ముతారో లేదో ‘మన దగ్గర 10 వేలే ఉన్నాయి బావా’ అన్న రోజున కూడా ‘ఇచ్చెయ్‌వే... వాళ్లేదో కష్టంలో ఉన్నారు’ అని ఇచ్చేసేవాడు. అటువంటి మనిషి బావ! తనలా నేనెప్పటికీ చేయలేను... అయితే ఇప్పటికీ కుదిరినంత చేస్తున్నాను. ఇక డబ్బులు ఇవ్వాలని వచ్చినవాళ్ల గురించి అంటారా... సరైన డాక్యుమెంట్లు, ప్రూఫ్‌లు చూపిస్తే తప్ప ఇవ్వనని కరాఖండిగా చెప్పేస్తున్నాను. లేకపోతే ప్రతివాళ్లూ మోసం చేస్తారు.
 
 ఇందిర: ఆయన ఉండగా ఇల్లంతా సందడిగా, హడావిడిగా ఉండేదేమో కదా? ఇప్పుడు..? మీ సంగతి?
 శాంతి: బావను తలుచుకుంటూ, గతాన్ని గుర్తుచేసుకుంటూ ఇంట్లోనే కూర్చుంటా. రోజుకో గంటసేపు మాత్రం బావ సమాధి దగ్గర కూర్చుని వస్తా.  సాయంత్రం పిల్లలు ఇంటికొచ్చాక, వాళ్లకి కావలసినవి చూసుకుని, ఓ గంటసేపు నిద్రపోతా... ఎందుకంటే, నాకు రాత్రిపూట నిద్రపట్టడం లేదు. బాగా దగ్గరివాళ్లను తప్ప ఎవ్వర్నీ పెద్దగా కలవాలని కూడా ఉండట్లేదు. ఓ వారం నుంచే కాస్తంత బయటికెళ్తున్నా. రికవర్ కావడానికి, దీన్నుంచి బైటికి రావడానికి ట్రై చేస్తున్నాను.
 
 ఇందిర: ‘మళ్లీ తెల్లారుతోందా?’ అని భయపడిన సందర్భాలున్నాయా?
 శాంతి: (నిర్లిప్తంగా) అసలు నిద్రపోతేగా!
 
 ఇందిర: బావ విషయంలో బాగా మిస్సయ్యే క్షణాలు..?
 శాంతి: భోజనం టైం! తను తిని లేచాక కబుర్లు చెబుతూ అదే ప్లేట్‌లో భోంచేయడం! అది అలవాటయ్యే ఇప్పుడు ఏమీ తినాలనిపించట్లేదు!
 
 ఇందిర: మీరు ఆయన్ని కంటికి రెప్పలా కాపాడుకున్నారు... ఆయన మిమ్మల్ని కనుపాపలా చూసుకున్నారు. ఇద్దరిలో ఎవరు అదృష్టవంతులంటారు?
 శాంతి: (నవ్వుతూ) నేను ఆయన్ని అనేదాన్ని... ఆయన నన్ను అనేవారు! అది పక్కనపెడితే ఇప్పుడూ, ఎప్పుడూ నేను ఒక్కటే అంటాను... అలాంటి భర్త దొరకడం నా అదృష్టమని! ఎందుకంటే - ఆయన ఒక ట్రెడిషనల్‌గా ఉండే చదువుకున్న అమ్మాయిని చేసుకోలేదు... ఒక ఆర్టిస్ట్‌ని, అందులోనూ గ్లామర్ ఆర్టిస్ట్‌గా ఉన్న నన్ను పెళ్లి చేసుకుని, ఇంతగా నెత్తినపెట్టుకుని చూసుకున్నాడు. అందుకే ఏ జన్మయినా నాకు ఆయనే భర్తగా కావాలనుకుంటున్నాను!
 
 ఇందిర:  గతంలో డిసెంబర్ 31 అంటే ఎలా ఉండేది? ఈ సంవత్సరం..?
 శాంతి: ప్రతి ఏడాది డిసెంబర్ 31న ఇంట్లో విపరీతమైన సందడి! ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చేవారు. బయట ఈయన ఫ్రెండ్స్‌తో ఎంజాయ్ చేస్తుంటే, నేను వాళ్ల ఫ్యామిలీ మెంబర్స్‌తో సరదాగా గడిపేదాన్ని! ఈ సంవత్సరం ముగ్గురం (నేను, పిల్లలు) బావ సమాధి దగ్గర గడుపుతాం!
 
 మొదట్లో బావ యాక్టింగ్ నాకు నచ్చేది కాదు
     
 మొదట్లో  ఈయన యాక్టింగ్ నాకు అసలు నచ్చేది కాదు. ‘నీకసలు యాక్టింగ్ రాదు... ఎలా యాక్టర్‌వి అయ్యావు బావా’ అని ఎప్పుడూ ఏడిపించేదాన్ని! కాని ‘సాంబయ్య’, ‘అయోధ్య రాముడు’ చూశాక మాత్రం ‘చాలా బాగా యాక్ట్ చేశావు బావా’ అని మెచ్చుకున్నా!
     
 నా అభిప్రాయానికి చాలా విలువ ఇచ్చేవాడు బావ! ప్రివ్యూ అవగానే నా వంకే చూసేవాడు... ఏమంటానా అని! నిర్మొహమాటంగా అభిప్రాయం చెప్పేదాన్ని... తన యాక్టింగ్ గురించే కాదు, మొత్తం సినిమా గురించి!
     
 అందుకే మొదట్లో ప్రివ్యూకి తీసుకువెళ్ళేవాడు కాస్తా తరువాత తరువాత ఫస్ట్ కాపీకి తీసుకెళ్లడం మొదలు పెట్టాడు. ‘ఇక్కడ ఇక్కడ ఈ తప్పులు ఉన్నాయి.... ఈ షాట్స్ మార్చాలి’ అని చెబితే మార్పించేవాడు.
 
 బావ ఎప్పుడూ అనేవాడు - ‘నీ నాలుక మీద నల్లమచ్చలు ఉన్నాయి... నువ్వు ఏమి చెబితే అదే జరుగుతుంది’ అని! నిజంగానే అన్నట్టే జరిగేది... సినిమా రిజల్ట్!
 
 ఆయన భార్యగా నేనెప్పుడూ ఆయన్ని హీరోగా చూడడానికే ఇష్టపడేదాన్ని. అందుకే క్యారెక్టర్ రోల్స్‌కి షిఫ్ట్ అవుతానన్నప్పుడు వద్దని గొడవ చేశాను. కానీ వాటిలో తన యాక్టింగ్ చూశాక మాత్రం గర్వంగా ఫీలయ్యాను... ముఖ్యంగా ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా, ఢీ, మగధీర...’లలో... హీరోలకు సమానంగా తననీ గుర్తుంచుకునేలా యాక్ట్ చేశాడు!
 
 బావ - నేను
1991... నా  కెరియర్ పీక్‌లో ఉంది... ఎంతోమంది ‘ఐ లవ్ యూ’ చెప్పారు కానీ, ఈయన ఒక్కరే నన్ను ‘పెళ్లి చేసుకుంటాను’ అన్నారు. అది నచ్చే, వెంటనే పెళ్లికి ఒప్పుకున్నాను. చెల్లెళ్లు, తమ్ముళ్ల పెళ్లిళ్లు అయితే కానీ పెళ్లి చేసుకోనని చెప్పినా, నాకోసం ఎన్నాళ్లయినా వెయిట్ చేస్తానన్నాడు.
 
 1993లోగా పెళ్లి చేసుకోకపోతే తనకు పెళ్లి యోగం లేదని ఎవరో జాతకం చెప్పడంతో, మా తల్లిదండ్రులు, తోబుట్టువుల సమక్షంలో బయటెవ్వరికీ చెప్పకుండా, అదే సంవత్సరం నన్ను రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. నా తోబుట్టువులందరి పెళ్లిళ్లు అయిపోయాక 1996లో అందరి సమక్షంలో మళ్లీ చేసుకున్నాడు.
 
 పెళ్లి తర్వాత నా ఇంటి నుంచి నన్ను కట్టుబట్టలతో తీసుకెళ్లి, తనే అన్నీ (పెళ్లి నగలు, చీరలు, ఫ్లాట్, కారు..) సమకూర్చి, పువ్వుల్లో పెట్టుకుని చూసుకున్నాడు.
 
 నాకు కోరికలు చాలా తక్కువ. బావను ఎక్కువ ఏదీ అడిగేదాన్ని కాదు. కానీ నా నోటి నుంచి ‘బాగుంది’ అన్న పదం వచ్చినా సాయంత్రంకల్లా అది ఇంటికి రావలసిందే...  కారైనా, నగైనా! అది కూడా సర్‌ప్రైజ్ చేస్తూ!
 
 ఇద్దరం చాలా పొసెసివ్! టీవీలో ఒక అమ్మాయి వైపు ఇంట్రస్ట్‌తో చూసినా నేను ఊరుకునేదాన్ని కాదు. ఎక్కడున్నా ప్రతి పది నిమిషాలకు కాల్ చేసేదాన్ని. బావ కూడా ఏం తక్కువ కాదు... తను లేకుండా నన్ను ఎక్కడికీ ఒంటరిగా వెళ్లనిచ్చేవాడు కాదు.
 
బావకు ఎప్పుడైనా పిల్లలకన్నా నేనే ఎక్కువ. నేనెలా ఉన్నాను... తిన్నానా లేదా? అని ఎప్పుడూ కనుక్కుంటూనే ఉంటాడు... ఆఖరికి పోయే ముందు కూడా! హోటల్ నుంచి హాస్పిటల్‌కు వెళ్తూ రిసెప్షన్‌లో ఉన్న అబ్బాయితో ‘మేడమ్ గారు బ్రేక్‌ఫాస్ట్ చేయలేదు... తినమని చెప్పండి’ అని చెప్పి మరీ వెళ్లాడు!
 
 ఎప్పుడూ ‘నేనున్నాను... నీకేంటే?’ అనే బావ ఈరోజు నన్ను ఇలా వదిలేసి వెళ్లినందుకు చాలా కోపంగా ఉంది!

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement