శ్రీకాకుళం జిల్లాకు చెందిన శ్రీహరి తన బాల్యంలోనే కృష్ణా జిల్లా పెదపారుపూడి మండలం యలమర్రు గ్రామానికి వలస వచ్చారు. అక్కడే అతని పాఠశాల విద్యను పూర్తిచేసుకున్నారు. యలమర్రులో రోడ్డు పక్కన చిన్న పాక వేసుకొని సైకిలు షాపు, సోడాలు అమ్మి అక్కడే జీవనం సాగించారు. అక్కడి నుంచి ఆయన సినిమాలపై మక్కువతో అరెకరం భూమి అమ్మి హైదరాబాద్ వచ్చారు. సినీ ఇండస్ట్రీలో శ్రీహరి మంచి వ్యక్తిత్వం కలిగిన నటుడు, సాయం కోసం తన దగ్గరకు వెళ్లిన వారికి లేదు అనకుండా సాయం చేసే గుణం కలిగిన మనిషి అని పేరు ఉంది.
డిస్కో శాంతిని ఆయన ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ప్రభుదేవా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఓ సినిమా షూటింగ్ నిమిత్తం ముంబై వెళ్లిన శ్రీహరి అక్కడ తీవ్ర అస్వస్థతకు గురవడంతో వెంటనే అతన్ని లీలావతి ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో అక్టోబరు 9, 2013న కాలేయ సంబంధ వ్యాధివలన ముంబై లో కన్నుమూశారు.
రాంగ్ ట్రీట్‌మెంట్ ఇచ్చారు
శ్రీహరి మరణం జరిగిన సమయంలో ఏం జరిగిందో తాజాగ ఓ ఇంటర్వ్యూలో డిస్కో శాంతి తెలిపింది. సినిమా షూటింగ్ మధ్యలో అనారోగ్యానికి గురైన శ్రీహరిని ముంబైలోని లీలావతి ఆస్పత్రిలో జాయిన్ చేసి ఐసీయూలో పెట్టారని ఆమె ఇలా చెప్పింది. 'శ్రీహరి చనిపోయే కొన్ని గంటల ముందు వైద్యులు చెకప్‌కు వచ్చారు. ఆ సమయంలో నన్ను బయటకు పంపించారు. అప్పుడు వాళ్లు కొన్ని మందులతో పాటు ఇంజక్షన్స్ సూచించారు.
(ఇదీ చదవండి: Bigg Boss Telugu 7: బిగ్‌బాస్‌లో గ్లామర్ డోస్ పెంచేందుకు హాట్ బ్యూటీస్ ఎంట్రీ )
కొంత సమయం తర్వాత ఒక నర్సు వచ్చి ఆ ఇంజక్షన్ వేసింది. కొన్ని నిమిషాల్లోనే శ్రీహరి కళ్లు,ముక్కు,చెవులు నుంచి మొత్తం బ్లడ్ వచ్చింది. నాకు హిందీ రాదు.. వాళ్లకు ఏం చెప్పాలో అర్థం కావడం లేదు. వాళ్లు బ్లడ్ మొత్తం క్లీన్ చేసి ఆయన్ను మరోగదిలోకి తీసుకుపోయారు. నేను ఎంత మొత్తుకున్నా శ్రీహరి దగ్గరకు కూడా పోనియలేదు.. వంద శాతం ఆ డాక్టర్లు రాంగ్ ట్రీట్‌మెంట్ ఇచ్చారు. ఇదే హైదరాబాద్‌లో అయింటే ఆయన ఖచ్చితంగా బతికేవాడు.' అని ఆమె తెలిపింది.
ఆస్పత్రిలో ఠాగూర్ సినిమా చూపించారు
శ్రీహరి చాలా గంటల ముందే చనిపోయినా తమకు ఆస్పత్రి సిబ్బంది చెప్పలేదని డిస్కో శాంతి పేర్కొన్నారు. వైద్యం అందిస్తున్నామని చాలా డబ్బు కట్టించుకున్నారని తెలిపింది. వాళ్లు చేసిన పని తలచుకుంటే చిరంజీవి ఠాగూర్ సినిమానే గుర్తుకొస్తుందని ఆమె పేర్కొంది. ఆస్పత్రి మీద కేసు వేయమని చాలామంది సలహాలిచ్చారు. ఆయన చనిపోతేనే మన అనుకునే వాళ్లు ఎవరూ రాలేదు. మళ్లీ ఈ కేసుల విషయంలో పిల్లలను పట్టుకుని తాను తిరగలేనని భావించి విరమించుకున్నానని శాంతి ఎమోషనల్ అయింది.
చాలా మంది మోసం చేశారు
శ్రీహరి మరణం తర్వాత సినీ పరిశ్రమ, స్నేహితులు ఏ ఒక్కరూ తమ ఇంటికి రాలేదని శాంతి తెలిపింది. కనీసం తాము ఉన్నామో లేమో కూడా వాళ్లకు తెలియదని గుర్తుచేసుకుంది. శ్రీహరి గతంలో ఎవరికి డబ్బు ఇచ్చారు. ఎవరిదగ్గర దాచారు అనేది తెలియదు. కానీ కొంతమంది ఆర్థిక విషయాల్లో తమను మోసం చేశారని శాంతి వాపోయింది.
చుట్టుముట్టిన ఆర్థిక సమస్యలు.. తాళి తప్పా నగలన్నీ తాకట్టలో
శ్రీహరి మరణం తర్వాత ఒక్కసారిగా తమకు ఆర్థిక సమస్యలు చుట్టుముట్టాయని శాంతి గుర్తుచేసుకుంది. శ్రీహరి లేరనే బాధ ఒకవైపు ఉండగానే కొంతమంది మోసం వల్ల డబ్బు కోల్పోయాను.. అదే డబ్బు ఉండిఉంటే తన కుమారుడు చదవుకునేందుకు ఫారిన్ వెళ్లేవాడని శాంతి తెలిపింది. తమకు రావాల్సిన డబ్బు అయితే తిరిగిరాలేదు కానీ తాము తీసుకున్న అప్పువాళ్లు మాత్రం ఇంటికి వచ్చారని చెప్పింది. అప్పుడు చేసేదిమి లేకపోవడంతో తమ వద్ద ఉన్న కార్లు, భూమి, బంగారం అన్నీ అమ్మేసి బాకీలు కట్టేశానని శాంతి తెలిపింది.
(ఇదీ చదవండి: 'జైలర్' చూసి రజనీకాంత్ ఎలాంటి కామెంట్ చేశారంటే: నెల్సన్)
చివరకు ఎంతో ఇష్టంగా కొనుకున్న ఒక కారు ఈఎంఐ కూడా కట్టలేకపోతే బ్యాంకు వారు తీసుకుపోయారని చెప్పింది. తాళి మాత్రమే ఉంచుకుని మిగిలిన బంగారాన్ని మొత్తం కోల్పోయానని శాంతి గుర్తుచేసుకుంది. ప్రస్తుతం జీవనోపాధికి తమ రెండు ఇళ్ల నుంచి అద్దె వస్తుందని తెలిపింది. అంతేకాకుండా ప్రస్తుతం తాము ఉంటున్న ఇళ్లు నుంచి కొంత భాగం రోడ్డు డివైడింగ్ కోసం పోయింది. అందుకు సంబంధించి వచ్చిన డబ్బు బ్యాంకులో డిపాజిట్ చేశామని శాంతి తెలిపింది. సినీ ఇండస్ట్రీ నుంచి ఏమైనా మంచి అవకాశాలు వస్తే తప్పకుండా చేస్తానని శాంతి పేర్కొంది.
డిస్కో శాంతికి పేరు తెచ్చిన పాట 'బంగారు కోడిపెట్ట' ( ఘరానామొగుడు)
Comments
Please login to add a commentAdd a comment