అప్పా పేరు నిలబెడతాం..! | father's day special srihari family | Sakshi
Sakshi News home page

అప్పా పేరు నిలబెడతాం..!

Published Sat, Jun 14 2014 11:22 PM | Last Updated on Sat, Sep 2 2017 8:48 AM

father's day special srihari family

అది.. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ రోడ్ నం. 45. ఆ దారిలో వెళ్లే ప్రతి ఒక్కరి చూపూ ఒక ఇంటిపై పడకుండా ఉండదు. అది నటుడు ‘శ్రీహరి’ ఇల్లు అని అందరికీ తెలుసు. ఎనిమిది నెలల క్రితం ఆ ఇంటి సందడి వేరు. ఎప్పుడూ వచ్చేపోయేవాళ్లతో కళకళలాడుతుండేది. ఇప్పుడా కళ లేదు. లంకంత ఆ ఇంట్లో తన ఇద్దరు కొడుకులు శశాంక్, మేఘాంశ్‌లతో మాత్రమే ఉంటున్నారు శాంతీ శ్రీహరి. ఆమెలో పూర్వపు ఉత్సాహం కానీ.. కళ కానీ లేదు. చాలా చిక్కిపోయారు. జీవితంలో హఠాత్తుగా వచ్చిన మార్పుని ఆహ్వానించడానికి ఆమె ఇంకా అలవాటుపడలేదనిపించింది. మరి.. పిల్లల సంగతేంటి...?
 
ఇంతలో శశాంక్, మేఘాంశ్ వచ్చారు. చూడచక్కగా ఉన్నారు.  ఇద్దరూ ‘హీరో మెటీరియల్’ అనిపించింది. ఏం చదువుతున్నారని అడిగితే... ఇంటర్ సెకండ్ ఇయర్ అని శశాంక్, టెన్త్ అని మేఘాంశ్ చెప్పారు. దర్శకుడు కావాలన్నది శశాంక్ ఆశయమైతే, హీరో కావాలన్నది మేఘాంశ్ లక్ష్యం.
 
మరి.. వారి ఆశయాల గురించి శ్రీహరికి తెలుసా? ‘‘దర్శకత్వం సులువు కాదనీ, శ్రద్ధపెట్టి చేయాలనీ అప్పా  (తమిళంలో నాన్న అని అర్థం) అన్నారు. నేను రెండు షార్ట్ ఫిలిమ్స్ తీసి, యూ ట్యూబ్‌లో పెట్టాను. అవి చూసి అందరూ మెచ్చుకున్నారు’’ అని శశాంక్ చెప్పాడు. ‘‘నాన్న నటించిన ‘భైరవ’లో చేశాను. ‘పెద్దయిన తర్వాత హీరో అవుతా’నంటే, శరీరం ఫిట్‌గా ఉండాలనీ, అంకితభావం అవసరమనీ అప్పా చెప్పారు’’ అని మేఘాంశ్ అన్నాడు. అప్పా లేని లోటు మాటేమిటి? ‘‘మనకేంటిలే.. అప్పా ఉన్నారు.. అన్నీ చూసుకుంటారనే ధైర్యం ఉండేది. ఇప్పుడు మాత్రం అభద్రతాభావం ఉంది’’ అన్నారు అన్నదమ్ములిద్దరూ.
 
ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. భర్త చనిపోయిన తర్వాత ఇంటి బాధ్యతలన్నీ పెద్ద కొడుక్కి అప్పజెప్పేశారు శాంతి. పదిహేడేళ్ల వయసులో ఇంటి బాధ్యతా? ‘‘అప్పా ఉన్నంతవరకూ ఏమైనా కావాలంటే, క్రెడిట్ కార్డ్ ఇచ్చి.. కొనుక్కోమనేవారు. అవసరమైనవి ఎంత ఖరీదు అయినా కొనుక్కోమనేవారు. అనవసరమైన వాటికి ఖర్చు చేయొద్దనేవారు. తమ్ముడికి చాక్లెట్లంటే చాలా ఇష్టం. ఒకసారి అప్పా క్రెడిట్ కార్డ్ తీసుకెళ్లి, పదివేల రూపాయలకు చాక్లెట్లు కొనుక్కుని, ఫ్రిజ్‌లో దాచుకుని తిన్నాడు. నేనైతే నెలకో వాచ్ కొనుక్కునేవాణ్ణి. అది కూడా చాలా ఖరీదుగలది. ఇప్పుడు నేను వాచ్‌లు కొనడం మానేశాను.  తమ్ముడు కూడా పెద్దగా చాక్లెట్లు కొనుక్కోవడం లేదు. ఇంటికి కావాల్సినవి కొంటుంటే, ‘ఇంత ఖర్చా?’ అనిపించింది. ఆదాయం కూడా లేదు కాబట్టి, అప్పా ఉన్నప్పటిలా విచ్చలవిడిగా ఖర్చుపెట్టకూడదనుకుంటున్నాను’’ అని వచ్చిపడ్డ పెద్దరికం నేర్పిన బాధ్యతతో శశాంక్ అన్నాడు.
 
‘‘నేనూ, అన్నయ్య బాగా అల్లరి చేసేవాళ్లం. చిన్న చిన్న గొడవలకే కొట్టేసుకునేవాళ్లం. అవుట్‌డోర్ షూటింగ్‌కి వెళ్లినప్పుడు, నాన్న ఫోన్ చేసి ‘తమ్ముణ్ణి కొట్టొద్దురా..’ అని అన్నయ్యకు ప్రత్యేకంగా చెప్పేవారు’’ అంటున్నప్పుడు, నాన్న లేని బాధ మేఘాంశ్ కళ్లల్లో స్పష్టంగా కనిపించింది.
 
చనిపోయేవరకూ బిజీగా సినిమాలు చేశారు శ్రీహరి. ఎంత బిజీగా ఉన్నా కుటుంబాన్ని విస్మరించలేదాయన. షూటింగ్ నుంచి ఇంటికి రాగానే భార్యాపిల్లలతో గడిపేవారు. ‘‘దాదాపు మూడు నాలుగు గంటలు లాన్‌లో కూర్చుని కబుర్లు చెప్పుకునేవాళ్లం. ఎంత కష్టపడి పైకొచ్చిందీ అప్పా చెప్పేవారు’’ అని మేఘాంశ్ అన్నాడు. అది మాత్రమే కాదు.. దాదాపు రోజూ బ్రేక్‌ఫాస్ట్‌కు మినర్వా కాఫీ షాప్‌కి వెళ్లేవాళ్లమని అన్నాడు శశాంక్. మరి.. ఇప్పుడూ? ‘‘అప్పా చనిపోయిన ఈ ఎనిమిది నెలల్లో ఈ మధ్యే అమ్మ ఒకసారి తీసుకెళ్లింది’’ అన్నాడు మేఘాంశ్.
 
భార్య శాంతి అంటే శ్రీహరికి ప్రాణం. పిల్లలు అల్లరి చేసినప్పుడు, ఆమె కోప్పడితే ‘పిల్లలు చేయకపోతే పెద్దాళ్లు అల్లరి చేస్తారా’ అని భార్యను మందలించేవారు కానీ.. పిల్లలను ఏమీ అనేవారు కాదట. ‘‘కానీ, ‘అమ్మ తిట్టింది.. అప్పా’ అని కంప్లయింట్ చేసినప్పుడు మాత్రం ‘మీ మంచికే తిట్టి ఉంటుంది. మీకు అమ్మ కాక ముందు తను నా భార్య. నా భార్య గురించి నాకే కంప్లయింట్ చేస్తారా’ అని అమ్మని వెనకేసుకొచ్చేవారు’’ అని మేఘాంశ్ చెప్పాడు. అసలు శ్రీహరి ఇంత హఠాత్తుగా తిరిగి రాని లోకాలకు వెళ్లిపోతారని ఎవరూ ఊహించలేదు. ఆయన ముంబయ్ షూటింగ్‌కి వెళ్లినప్పుడు..

ఇంట్లోవాళ్లకి జాగ్రత్తలు చెప్పి వెళ్లారట. చివరిసారిగా పిల్లలతో శ్రీహరి ఎప్పుడు మాట్లాడారు? ‘‘ముంబయ్ నుంచి ఫోన్ చేసి, ‘‘జిమ్ చేస్తున్న చోట అద్దం బిగించడానికి మనుషులొస్తున్నారు. దగ్గరుండి చూస్కో. తమ్ముడు మేఘాంశ్ కొట్టొద్దు’’ అన్నారని చెప్పేటప్పుడు శశాంక్ ఉద్వేగానికి గురయ్యాడు. కష్టపడి పైకొచ్చిన వ్యక్తి కాబట్టి, పిల్లలకు తన కష్టాలు చెప్పడంతో పాటు కొన్ని సలహాలు కూడా శ్రీహరి ఇచ్చే ఉంటారు. ఆ మాటే శశాంక్, మేఘాంశ్‌లతో అంటే.. ‘‘అటు నావైపు బంధువులను కానీ, ఇటు మీ అమ్మవైపు బంధువులను కానీ, స్నేహితులను కానీ ఈజీగా నమ్మొద్దు. డబ్బు విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. తెలివిగా ఉండాలి’’ అని చెప్పేవారన్నారు.
 
నా భార్యా పిల్లలే నా ప్రపంచం అనేవారు శ్రీహరి. దాదాపు ప్రతి ఏడాదీ తన కుటుంబాన్ని విదేశాలకు తీసుకెళ్లేవారట. దాని గురించి చెబుతూ -‘‘యూఎస్, మలేసియా, సింగపూర్, దుబాయ్.. ఇలా చాలా దేశాలకు మమ్మల్ని తీసుకెళ్లారు. అక్కడ ఏం అడిగినా కొనిచ్చేవారు’’ అన్నాడు మేఘాంశ్.
 
మరి.. ఈ ఏడాది సంగతేంటి.. ఎక్కడికైనా వెళ్లారా? ‘‘ఆస్ట్రేలియా తీసుకెళ్లనా అని అమ్మ అడిగింది. కానీ, లెక్కలేసుకుని చూస్తే, బాగా ఖర్చయ్యేట్లు ఉంది. దాంతో, ఇప్పుడు అవసరమా అని మాకే అనిపించింది. నాన్న లేకుండా టూర్ వెళ్లడానికి అమ్మకి ఇష్టం లేకపోయినప్పటికీ మా కోసం అడిగింది. కానీ, మేమే వద్దన్నాం. చెన్నైలో మా పిన్ని ఇంటికెళ్లి ఓ పదిహేను రోజులు ఉండొచ్చాం’’ అని చెప్పాడు శశాంక్.
 
ప్రతి ఏడాదీ తన పుట్టినరోజును అభిమానుల సమక్షంలో చేసుకునేవారు శ్రీహరి. పిల్లల పుట్టినరోజు వేడుకలను చాలా ఘనంగా జరిపేవారు. మరి.. ‘ఫాదర్స్ డే’ నాడు మీరు బహుమతులిచ్చేవారా? ‘‘తప్పనిసరిగా ఇచ్చేవాళ్లం. నాన్న సింపుల్‌గానే ఉండేవారు. మాకేం కొనాలో కూడా తెలిసేది కాదు. షోరూమ్‌కి వెళ్లి, కంటికి ఏది నచ్చితే అది కొనిచ్చేవాళ్లం. అవి చూసి నవ్వుకునేవారు’’ అని పిల్లలిద్దరూ చెప్పారు. ‘‘ఈ ఫాదర్స్ డేకి మా నుంచి దూరం అవుతారని ఊహించలేదు. చాలా షాకింగ్‌గా ఉంది. మా అప్పా ఎక్కడున్నా మమ్మల్ని చూస్తూ ఉంటారని మా నమ్మకం. ఆయన చాలా మంచి పేరు తెచ్చుకున్నారు. అప్పా పేరు నిలబెడతాం. ఆయన స్థాయికి తగ్గట్టుగా స్థిరపడాలన్నదే మా లక్ష్యం’’ అన్నారు మేఘాంశ్, శశాంక్. ఏ తండ్రి అయినా పిల్లల గురించి కోరుకొనేది అదేగా!
 
-  డి.జి. భవాని
 
మా లాన్‌లో జిమ్నాస్టిక్ బెడ్ ఉంది. అప్పా మాతో జిమ్నాస్టిక్స్ చేయించేవారు. ఎక్కువ సోమర్‌సాల్ట్స్ చేసేవాళ్లం. అప్పా ఉన్నప్పుడు ఎలా వర్కవుట్ చేసేవాళ్లమో  ఇప్పుడూ అలానే చేస్తున్నాం. అప్పుడు సలహాలిచ్చే అప్పా లేకపోవడమే ఇప్పుడు పెద్ద లోటు.          
 - శశాంక్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement