కోదాడతో వేణుమాధవ్‌కు విడదీయలేని బంధం | Nalgonda People Condoles Actor Venu Madhavs Death | Sakshi
Sakshi News home page

కోదాడతో వేణుమాధవ్‌కు విడదీయలేని బంధం

Published Thu, Sep 26 2019 12:15 PM | Last Updated on Thu, Sep 26 2019 2:54 PM

Nalgonda People Condoles Actor Venu Madhavs Death - Sakshi

వినాయక చవితి ఉత్సవాల్లో మిత్రులతో వేణుమాధవ్‌

సాక్షి, కోదాడ : ప్రముఖ హాస్యనటుడు వేణుమాధవ్‌కు కోదాడతో ప్రత్యేక అనుబంధం ఉంది. కర్ణాటకకు చెందిన వేణుమాధవ్‌ తండ్రి ప్రభాకర్‌ (నాయర్‌)  50 సంవత్సరాల క్రితం కోదాడకు వచ్చి స్థిరపడ్డారు. ఆయన టెలిఫోన్‌ డిపార్టుమెంట్‌లో పనిచేసేవారు. తల్లి సావిత్రమ్మ కోదాడలో ఆర్‌ఎంపీగా పని చేసిది. వేణుమాధవ్‌కు ఇద్దరు అన్నలు, అక్క, చెల్లి ఉన్నారు. కోదాడ బాలుర ఉన్నత పాఠశాలలో 10వ తరగతి వరకు చదివిన ఆయన ఆ తరువాత ఇంటర్, డిగ్రీ బీకాం కోర్సులను కోదాడలోని కేఆర్‌ఆర్‌ కళాశాలలో పూర్తి చేశారు. చదువుకునే సమయంలో మిమిక్రీ, వెంట్రిలాక్విజంలో మంచి పట్టు సంపాదించారు.

మాధవరెడ్డితో పరిచయం...
కోదాడ ఎమ్మెల్యేగా వేనేపల్లి చందర్‌రావు ఉన్న సమయంలో పార్టీ ప్రచార కార్యక్రమాల్లో వేణుమాధవ్‌ పాల్గొని వేదికలపై నవ్వించేవాడు. ఈ క్రమంలో నాటి హోంశాఖమంత్రి మాధవరెడ్డి వద్దకు వేణుమాధవ్‌ను  ఎమ్మెల్యే చందర్‌రావు తీసుకెళ్లి పరిచయం చేయడంతో ఆయన కోదాడ నుంచి హైదరాబాద్‌కు వెళ్లాడు. కొంత కాలం పాటు టీడీపీ కార్యాలయంలో లైబ్రేరియన్‌గా పని చేశారు. ఆ తర్వాత వివిధ వేదికలపై ప్రదర్శనలు ఇస్తున్న క్రమంలో చిత్ర దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి దృష్టిలో పడడంతో ఆయన తన సినిమా ‘ సంప్రదాయం’లో అవకాశం ఇచ్చారు.  

ఈ సినిమా 1996 జనవరి 14న విడుదలైంది. అప్పటి నుంచి 2016 వరకు  ఆయన దాదాపు 500 సినిమాళ్లో నటించారు. హం గామా, భూకైలాస్, ప్రేమాభిషేకం సినిమాళ్లో ఆయన హీరోగా కూడా నటించారు. ఈ మూడు సినిమాలకు ఆయనే నిర్మాత కూడా. ఆయనకు భార్య వాణి, ఇద్దరు కుమారులు ఉన్నారు.

స్వచ్ఛంద కార్యక్రమాల్లో
సినీ నటుడిగా ఎంతో బిజీగా ఉండే వేణుమాధవ్‌ కోదాడలో జరిగే పలు స్వచ్ఛంద కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేవాడు. 2009వ సంవత్సరంలో కృష్ణానదికి వరదలు వచ్చిన సమయంలో జోలె పట్టి విరా ళాలు సేకరించి నాటి ముఖ్యమంత్రి రోశయ్యకు అందజేశారు. 2016లో కోదాడలో జరిగిన హరితహారం కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు. 2018లో కోదాడలో జరిగిన బొడ్రాయి ప్రతిష్టకు ఆయన వచ్చి రెండు రోజులపాటు కోదాడలో సందడి చేశారు.

ఎన్నికల సమయంలో హడావుడి
2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో కోదాడ అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి ఆయన కోదాడ వచ్చారు. రిటర్నింగ్‌ అధికారి వద్దకు నామినేషన్‌ వేయడానికి వెళ్లి ఎలాంటి పత్రాలు తీసుకురాలేదు. దీంతో నామినేషన్‌ తీసుకోవడానికి అధికారులు తిరస్కరించడంతో వెళ్లిన ఆయన మళ్లీ రెండవసారి వచ్చినామినేషన్‌ వేశారు. నాటకీయ పరిణామాల మధ్య చివరి రోజు తన నామినేషన్‌ ఉపసంహరించుకున్నారు.

వేణుమాధవ్‌ మృతికి సంతాపం
పట్టణానికి చెందిన ప్రముఖ సినీ నటుడు వేణుమాధవ్‌ అకాల మృతికి పలువురు తమ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు.  తెలంగాణ రాష్ట్రం మంచి కళాకారుడిని కోల్పోయిందని రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి జి. జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. ఆయన కుటుంబానికి తెలంగాణ సమాజం అండగా ఉంటుందని అన్నారు. టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్, మాజీ ఎమ్మెల్యేలు వేనేపల్లి చందర్‌రావు, ఎన్‌.పద్మావతి, కోదాడ మాజీ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ వంటిపులి అనితలు వేణుమాధవ్‌ మృతికి సంతాపం తెలిపారు. ఆయన కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.

మాకు వెన్నుదన్నుగా ఉండేవాడు
కోదాడ బాలుర పాఠశాల నుంచే వేణుమాధవ్‌ నాకు మంచి మిత్రుడు. ఆ తర్వాత కేఆర్‌ఆర్‌ కళాశాలలో చదువుకున్నాం. కోదాడలో మేము ఏర్పాటు చేసిన తెర సాంస్కృతిక కళామండలికి ఆయన చేదోడుగా ఉండేవాడు. కోదాడ వస్తే మా ఇంటికి రాకుండా వెళ్లడు. సంవత్సరం క్రితం భార్యభర్తలు, పిల్లలు వచ్చి వెళ్లారు. ఆయన మరణం తీవ్రమైన బాధ కలిగించింది. – వేముల వెంకటేశ్వర్లు 

సొంత తమ్ముడి కన్నా ఎక్కువ 
వేణుమాధవ్‌ నాకు సొంత తమ్ముడి కన్నా ఎక్కువగా అన్యోన్యంగా ఉండే వాడు. ప్రతి ఎన్నికల్లో కోదాడకు వచ్చి నాకు ప్రచారం చేసేవాడు. కోదాడకు వస్తే మా ఇంట్లోనే ఉండేవాడు. ఆయనతో 20 సంవత్సరాల అనుబంధం ఇలా అర్ధంతరంగా ముగియడం బాధగా ఉంది.– పారా సీతయ్య, మాజీ సర్పంచ్‌ 

ఎంతో సరదాగా ఉండేవాడు
వేణుమాధవ్‌ ఇంటర్, డిగ్రీలో నా క్లాస్‌మేట్‌. గత సంవత్సరం కోదాడలో జరి గిన వినా యక చవితి,  హరితహారం కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చి మాతో రెండు రోజులు గడిపాడు. కళాశాల రోజుల్లో సరదాగా ఉండేవాడు. పేదరికం నుంచి కష్టపడి పైకి వచ్చాడు. ఇలా అకాల మరణం చెందడం బాధ కలిగించింది. –పాలూరి సత్యనారాయణ, క్లాస్‌మేట్‌  

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/1

నాటి ముఖ్యమంత్రికి చెక్కుఅందజేస్తూ..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement