ఎవడ్రా సచ్చినోడు..!?
వేణుమాధవ్‌కి కోపం వచ్చింది! ఆయనకే ఫోన్ చేసి మూడో రోజెప్పుడు, పదకొండో రోజెప్పుడు అని అడిగారట! కాలదూ మరి! వెంటనే పోలీస్ స్టేషన్‌కి, గవర్నర్ దగ్గరికి కంప్లైంట్ చెయ్యడానికి వెళ్లారు. వాడెవడో సచ్చినోడు ఫేస్‌బుక్‌లో, వాట్సప్పుల్లో.. వేణు మాధవ్ కాలం చేశాడని రాస్తే... నచ్చనోళ్లు దాన్ని ఫార్వర్డ్‌లు చేస్తే.. దాన్ని మీడియోళ్లు మోసేస్తే... మనిషేం కావాలి? కుటుంబాలేం కావాలి? స్నేహితులేం కావాలి? ఇండస్ట్రీ ఏం కావాలి? బీపీ.. బీపీ.. బీపీ.. బీపీ.. రైజయ్యి.. ఇంకెవ్వరికీ ఇలా జరక్కూడదని సాక్షి ‘ఫ్యామిలీ’తో మాట్లాడారు.
♦ ఫిలిం నగర్‌కి ఇంత దూరంగా.. మౌలాలీలో ఉన్నా మీరెప్పుడూ వార్తల్లో నిలుస్తుంటారు.. ఈసారైతే ప్రచారం డోస్ కూడా పెరిగింది..?
వేణుమాధవ్: అవునండి. నాకు రెండు రకాలు ఫ్యాన్స్ ఉన్నారు. రెండో రకం ఫ్యాన్స్‌కి ఎక్కువ అభిమానం అనుకుంటా. అందుకే ఏదో ఒకటి ప్రచారం చేసి, వార్తల్లో నిలిచేలా చేస్తున్నారు.
♦ అలా పనిగట్టుకుని ప్రచారం చేస్తున్నవాళ్లెవరో మీకు తెలుసా?
వేణుమాధవ్: తెలియదు. అది తెలుసుకోమనే లోకల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశా. మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్‌గారికి, గవర్నర్‌గారికి వినతి పత్రం ఇచ్చాను. ఇంకా తెలంగాణా, ఆంధ్ర రాష్ట్రాల సీఎంలను కలిసి, వినతి పత్రం సమర్పించబోతున్నా. ఈ ప్రచారం చేసినవారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నా.
♦ అంతకుముందు కూడా మీ గురించి చాలా ప్రచారాలు వచ్చాయి. కానీ, ఈసారి సీరియస్‌గా తీసుకోవడానికి కారణం?
వేణుమాధవ్:: వేణుమాధవ్‌కి తలనొప్పి వచ్చిందనీ, కాళ్లు చచ్చుపడిపోయాయనీ, క్యాన్సర్ వచ్చిందనీ ప్రచారం చేశారు. సరేలే అని ఊరుకున్నాను. కానీ, ఈసారి ఏకంగా చచ్చిపోయానని ప్రచారం మొదలుపెట్టారు. అందుకే చాలా చాలా హర్ట్ అయ్యాను. ఊరికే వదలదల్చుకోలేదు.
♦ ఈ ప్రచారం మొదలైనప్పుడు మీరు ఇంట్లోనే ఉన్నారా?
వేణుమాధవ్: ఉన్నాను. మా అమ్మ, నా భార్య, పిల్లలు మామూలుగా బాధపడలేదు. నా అన్నయ్యలు, అక్కాచెల్లెళ్లు పడిన బాధ కూడా మాటల్లో చెప్పలేను. ‘ఏమైంది?’ అంటూ కొన్ని వేల ఫోన్లు వచ్చాయి. పోనీ ఫోన్ ఆఫ్ చేద్దామా అంటే, ఆ వార్త నిజమనుకుంటారేమోనని భయం. మరీ ఘోరం ఏంటంటే... ఫోన్ చేసినవాళ్లల్లో కొంతమంది థర్డ్ డే ఎప్పుడు? లెవెన్త్ డే ఎప్పుడు? అని అడిగారు. అప్పుడు మా పరిస్థితి ఎలా ఉండి ఉంటుందో ఊహించవచ్చు. అందుకే గట్టిగా రియాక్ట్ అయ్యాను.
♦ ఓకే.. ఇప్పుడు మీ హెల్త్ ఎలా ఉంది?
వేణుమాధవ్: ఐయామ్ సో ఫైన్. చూస్తున్నారుగా.. ఎంత హుషారుగా ఉన్నానో.
♦ అప్పుడు రామ్‌చరణ్ ‘రచ్చ’ సినిమా షూటింగ్‌లో కళ్లు తిరిగి పడిపోవడం వల్ల మీకు అవకాశాలు ఇవ్వడానికి చాలామంది వెనకడుగు వేశారేమో..?
వేణుమాధవ్: నేను కళ్లు తిరిగి పడిపోవడం అబద్ధం కాదు. ఆ సినిమా చేస్తున్నప్పుడు మార్నింగ్ చరణ్, మధ్యాహ్నం ఇంకొకరి సినిమా, రాత్రి ఇంకో సినిమా.. ఇలా మూడు సినిమాల షూటింగ్స్ చేశాను. అది ఎండా కాలం. విపరీతమైన ఎండలు. దాంతో పాటు సరిగ్గా భోజనం చేయడానికి కూడా తీరిక చిక్కలేదు. ఒత్తిడి తట్టుకోలేక కళ్లు తిరిగి పడిపోయాను. అప్పటికప్పుడు ఆస్పత్రికి తీసుకెళ్లారు. సెలైన్ ఎక్కించారు. ఆ తర్వాత షూటింగ్‌కి వచ్చేశాను. ఈలోపు దాని గురించి కథలు అల్లేశారు. నాకేం ప్రాబ్లమ్ లేదు. ఐయామ్ హ్యాపీ.
♦ ఒకప్పుడు బిజీ బిజీగా సినిమాలు చేశారు.. ఇప్పుడెందుకు చేయడంలేదు?
వేణుమాధవ్: సినిమాలు చేయనంత మాత్రాన నేను ఫీల్డ్‌కి దూరంగా ఉన్నట్లు కాదు. ఈ మధ్య కావాలనే నేను సినిమాలు చేయడం లేదు. ఎక్కువగా డబుల్ మీనింగ్ ఉన్నవే వస్తున్నాయి. అందుకే సెలక్టివ్‌గా ఉంటున్నాను. నేనూ, నా భార్య, నా బంధువులు కలిసి చూడదగ్గ సినిమాలే చేయాలనుకుంటున్నాను. లేకపోతే ఖాళీగా ఉంటా. నాకేం ప్రాబ్లమ్ లేదు.
♦ అంటే.. హీరోగా హంగామా, భూకైలాస్, ‘ప్రేమాభిషేకం’ వంటి చిత్రాలు చేశారు కదా.. ఆ తర్వాత కమెడియన్‌గా చేయాలని లేదా?
వేణుమాధవ్: అస్సలు లేదు. కమెడియన్‌గా చేయడానికి నాకేం అభ్యంతరం ఉంటుంది? ఆ మాటకొస్తే ఏ పాత్రైనా చేయడానికి నేను రెడీ. విలన్ పాత్రలివ్వమనండి. చేసేస్తాను. అవకాశం వస్తే హీరోగా చేస్తాను. అవకాశం వస్తే చేయడం వేరు... ప్రయత్నించి దక్కించుకోవడం వేరు.. నేను ప్రయత్నం చేయను. నాకు అడుక్కోవాల్సిన అవసరం లేదు. 1996 జనవరి 14న నా మొదటి సినిమా ‘సంప్రదాయం’ రిలీజ్ అయ్యింది. ఆ సినిమా విడుదలకు ముందే రెండు సినిమాలకు అవకాశం వచ్చింది. ఆ దేవుడి దయ వల్ల అప్పట్నుంచీ ఇప్పటివరకూ ఎవర్నీ అడుక్కునే దుస్తితి నాకు రాలేదు.
♦ ప్రస్తుతం సినిమాలేమైనా చేస్తున్నారా?
వేణుమాధవ్: కల్యాణ్ బాబు (పవన్ కల్యాణ్‌బాబు) సినిమా, చిరంజీవిగారి 150వ సినిమా, బాలకృష్ణగారి నూరవ సినిమా చేస్తున్నాను. వీళ్లంతా నాకు కొత్తవాళ్లేం కాదు. ఎన్టీ రామారావుగారిని తీసుకుందాం. ఆయన దగ్గర పని చేశాను. బాలకృష్ణగారు, హరికృష్ణగారితో సినిమాలు చేశాను. అక్కినేని నాగేశ్వరరావుగారితో, నాగార్జునగారితో, నాగచైతన్య.. ఇలా ఆ కుటుంబం హీరోలతో చేశాను. చిరంజీవిగారిని తీసుకుందాం. ఆయనతో, కల్యాణ్‌బాబుతో, రామ్‌చరణ్‌తో, బన్నీతో.. ఇలా అందరితో చేశాను. ఫ్యామిలీలో మూడు తరాల నటుల కాంబినేషన్‌లో సినిమాలు చేశాను. అందుకే కెరీర్ బ్రహ్మాండంగా సాగింది.
♦ఇప్పుడు మీరు చెప్పిన ఈ మూడు చిత్రాల అవకాశాలు అడక్కుండానే వచ్చాయంటారు..?
వేణుమాధవ్: ప్రమాణ పూర్తిగా, దైవ సాక్షిగా, ‘సాక్షి’ పేపర్ సాక్షిగా (నవ్వుతూ) అడక్కుండానే వచ్చాయి. అన్నింట్లోనూ నావి మంచి పాత్రలే.
♦ ఏదో అంటున్నారు కానీ.. ఎప్పుడైనా ఒక్క మంచి అవకాశం కోసం ఎవరి దగ్గరైనా బెండ్ అయిన సందర్భం ఉందేమో గుర్తు చేసుకోండి?
వేణుమాధవ్: చీ.. చీ.. దటీజ్ నాట్ వేణుమాధవ్. నేనా? బెండ్ అవ్వడమా? నాకా అవసరం రాలేదు. ఎప్పటికీ రాదు. నన్ను వెతుక్కుంటూ అవకాశాలొచ్చాయి కానీ, నేను అవకాశాలను వెతుక్కుంటూ వెళ్లలేదు.
♦ఇలా మాట్లాడతారు కాబట్టే.. మీకు నోటి దురుసు అంటుంటారు..?
వేణుమాధవ్: నాకా పదం అంటే చాలా ఇష్టం అండి. వేణుమాధవ్‌కి బలుపు ఎక్కువ.. నోటి దురుసు అనే మాటలు వింటున్నప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంటుంది.
కుమారులు సావికర్, ప్రభాకర్, భార్య శ్రీవాణితో వేణుమాధవ్
♦అదేంటీ.. ఎవరైనా తిడితే ఆనందంగా ఉంటుందా?
వేణుమాధవ్: ఒక్క కృష్ణారెడ్డిగారు, అచ్చిరెడ్డిగారంటే భయం.. గౌరవం. ఎందుకంటే వాళ్లే నాకు ఫస్ట్ అవకాశం ఇచ్చారు. మిగతావాళ్లను గౌరవిస్తాను. నాకన్నా పెద్దవాళ్లయితే కాళ్లకు నమస్కరిస్తా. ఎవరి దగ్గరా చెయ్యి చాపను.
♦ఇప్పుడు మీరు సినిమాలు తగ్గించేసిన నేపథ్యంలో మీ ప్లేస్‌ని రీప్లేస్ చేసిన ప్రస్తుత కమెడియన్ ఎవరనుకుంటున్నారు?
అబ్బే.. నాకు రీప్లేస్‌మెంటా? చాన్సే లేదు. వేణుమాధవ్ పోజిషన్‌ని రీప్లేస్ చేయగలవాళ్లు ఇప్పటివరకూ రాలేదు... రాలేరు కూడా.. వచ్చినా చేయలేరు.
♦ఏంటా కాన్ఫిడెన్స్?
వేణుమాధవ్: బేసిక్‌గా నేను మిమిక్రీ ఆర్టిస్ట్. నాకు ఎక్స్‌ప్రెషన్స్ బాగా ఇవ్వడం తెలుసు. టైమింగ్ తెలుసు. నాకు తెలిసి నన్ను రీప్లేస్ చేయగలవాళ్లు లేరు. ఇప్పుడు మీరు గమనించారో లేదో కానీ, మీతో మాట్లాడుతూనే కెమెరా మ్యాన్‌కి కావాల్సిన ఎక్స్‌ప్రెషన్స్ కూడా ఇస్తున్నాను. ఐదువందలకు పైగా సినిమాలు చేశాను.
♦మీరు చనిపోయారని వచ్చిన వార్తకు గవర్నర్, సీఎంలను కలవడం పబ్లిసిటీలో భాగం అనుకుంటున్నారు.. మీదాకా వచ్చిందా?
వేణుమాధవ్: నాదాకానా? రాదు. వేణుమాధవ్ రెబల్ అండి. చెప్పడానికి కూడా భయపడతారు. అయినా వేణుమాధవ్‌కి పబ్లిసిటీ అవసరమా? నేనెవర్నో ఎవరికీ తెలియదా? ఇప్పుడు గుండు చేయించుకున్న వేణుమాధవ్ బయటికెళ్లినా గుర్తుపడతారు. అలాంటిది పబ్లిసిటీ కోసం నేను పాకులాడతానా? పబ్లిసిటీ నాకెందుకండి బాబూ.
♦అవునూ.. గుండు చేయించుకున్నారెందుకని?
వేణుమాధవ్: పెద్ద కారణం ఏదీ లేదు. నెల్లూరులో ఓ ప్రోగ్రామ్‌కి వెళ్లాను. అట్నుంచి తిరుపతి వెళ్లాను. బాలకృష్ణగారి నూరవ సినిమా, చిరంజీవిగారి 150వ సినిమా హిట్ అవ్వాలని ఆ దేవుణ్ణి కోరుకున్నా. తిరుమల వెళ్లాం కదా అని గుండు చేయించుకున్నా.
♦మీ పిల్లల్లో ఎవర్ని హీరో చేయాలనుకుంటున్నారు..?
వేణుమాధవ్:: మా పిల్లలెవరూ సినిమా ఇండస్ట్రీలోకి రారు. నాకు ఇంట్రస్ట్ లేదు.
♦ఇండస్ట్రీకి వస్తే.. మీ పిల్లలు కూడా మీ స్థాయిలో సంపాదించుకుంటారు కదా?
వేణుమాధవ్: సంపాదన గురించి ఆలోచించలేదు. మా పిల్లలకు మంచి జీవితం ఇచ్చేంత నేను సంపాదించాను. వాళ్లు ఏం చదువుకుంటామంటే అది చదివిస్తాను. ఇంటర్మీడియేట్ వరకే నేను గైడ్ చేస్తాను. ఆ తర్వాత వాళ్ల ఇష్టం. వాళ్లు ఏం కావాలనుకుంటే అది అవుతారు.
♦వాళ్లు హీరో అవుతానంటే...?
వేణుమాధవ్: అది వాళ్లిష్టం. కాదనను.
♦ఫైనల్లీ మీ మీద దుష్ర్పచారం చేస్తున్న వాళ్లకు ఏదైనా చెప్పాలనిపిస్తోందా?
వేణుమాధవ్: వాళ్లకి చాలా థ్యాంక్స్. అయితే, ప్రచారం చేసేటప్పుడు కాస్త వెనకా ముందూ ఆలోచిస్తే బాగుంటుంది. మొన్నా మధ్య నా గురించి వార్త వచ్చినప్పుడు నేను ఇంట్లోనే ఉన్నాను కాబట్టి, సరిపోయింది. నేనేదైనా ఊరెళ్లి, ఊహించని విధంగా నా సెల్‌కి సిగ్నల్ అందలేదనుకోండి అప్పుడు మా ఇంట్లో వాళ్ల పరిస్థితి ఏంటి? ఏదో జరిగే ఉంటుందని నమ్మేవాళ్లు కదా. అంతెందుకు? ఆ వార్త వచ్చినప్పుడు నేను వాళ్ల కళ్లెదుటే ఉన్నా నా భార్య, అమ్మ ఒకటే ఏడుపులు. ‘నేను బతికే ఉన్నాను’ అని ఎంతమందికి చెప్పాలి? గవర్నర్ వరకూ ఎందుకు వెళ్లానంటే... నన్ను అభిమానించే స్నేహితులకూ, నా వేరే టైప్ ఫ్యాన్స్‌కీ.. ఇలా అందరికీ నేను బతికే ఉన్నానని తెలియజెప్పడానికే. - డి.జి. భవాని