వేణుమాధవ్ చెప్పిన జోకులు
కామెడీ క్లాస్: వేణు మాధవ్
ఆకలి - ఆధ్యాత్మికత
ఊళ్లోని మతపెద్ద నసీరుద్దీన్‌ను ఒకరోజు విందుకు ఆహ్వానించాడు. కుశల ప్రశ్నలు పూర్తయ్యాక మతపెద్ద బాతాఖానీ ప్రారంభించాడు. క్రమంగా బాతాఖానీ ఆధ్యాత్మిక ప్రసంగంగా మారింది. ఆకలితో నకనకలాడుతున్న నసీరుద్దీన్‌కు సహనం నశించి, ‘మిమ్మల్ని ఒక ప్రశ్న అడగవచ్చా?’ అని సాధ్యమైనంత వినయంగా అడిగాడు.
‘తప్పకుండా’ అని బదులిచ్చాడు పెద్దాయన.
‘మీ కథల్లోని మనుషులు ఎన్నడూ భోజనం చేయరా?’ ప్రశ్నించాడు నసీరుద్దీన్.
నాలుక్కరుచుకుని ‘ఇక భోజనానికి లేద్దాం’ అంటూ తన వాగ్ధాటికి స్వస్తి చెప్పాడాయన.
సెలూన్ - హాస్పిటల్
పేషెంట్‌ను తరుముతూ డాక్టర్ వీధిలో పరుగు తీస్తుంటాడు. దారినపోయే దానయ్య అతడిని ఆపి ఇలా అడుగుతాడు: ‘దొంగనా తరుముతున్నారు?’
డాక్టర్: కాదయ్యా! నా పేషెంట్.. ప్రతిసారీ ఇలాగే చేస్తున్నాడు. ఈసారి వాణ్ణి వదలను గాక వదలను.
దారినపోయే దానయ్య: ఏం చేశాడేంటి?
డాక్టర్: బ్రెయిన్ సర్జరీ కోసమంటూ ఇప్పటికే నాలుగుసార్లు నా దగ్గరకు వచ్చాడు. సర్జరీకి సిద్ధం చేసి, తలగొరిగిన తర్వాత తుర్రుమంటాడు. ప్రతిసారీ ఇదే తంతు.
నాకొద్దీ మొగుడు
రమ: మీ ఆయన నెలరోజుల్నుండీ కనిపించడం లేదంటున్నావ్, మరి పోలీస్ కంప్లెయింట్ ఇవ్వలేదా?
సుమ: పోయినసారి ఇస్తే, వెతికి వెతికి తెచ్చారే... అందుకే ఇవ్వలేదు...
నో తగ్గుదల
‘‘ఈ క్లాత్ పదిమీటర్లు తీసుకుంటే మీటరు ఎంతకిస్తావ్?’’
‘‘నాలుగొందలండి’’
‘‘కాస్త తగ్గించవయ్యా’’
‘‘ఎన్ని మీటర్లు తగ్గించమంటారు?’’
అదీ జన్మస్థానమే!
టీటీ: ఎక్కడకు వెళుతున్నారు?
రంగా: రాముడు పుట్టిన చోటుకు
టీటీ: టికెట్టు ఉందా?
రంగా లేదు
టీటీ: అయితే, పదండి..
రంగా: ఎక్కడికి?
టీటీ: శ్రీకృష్ణుడు పుట్టిన చోటుకు
వేణుమాధవ్ ఎంపిక చేసిన కార్టూన్స్