Comedy Class
-
అప్పుడు ధైర్యంగా భోంచేశా..!
కామెడీ క్లాస్: వేణు మాధవ్ ‘సంప్రదాయం’ షూటింగ్లో తొలిరోజు నుంచే నటన విషయంలో ఎలాంటి బెరుకూ లేకుండా అల్లుకుపోయాను కానీ.. షూటింగ్ స్పాట్లో కొన్ని భయాలు వెంటాడాయి. అది కూడా భోజనంతో ముడిపడినవి. మధ్యాహ్నం లంచ్ సమాయానికి ‘బ్రేక్’ అనే మాట వినిపించింది.. అలా ఎవరన్నారో కానీ, అందరూ భోజనాల మీదపడ్డారు. నాకూ ఆకలేస్తోంది. అయితే అందరిలాగా చొరవగా వెళ్లలేకపోయా... ఎందుకంటే అక్కడ భోంచేస్తే చార్జ్ చేస్తారేమో అనే సందేహం నన్ను ఆపేసింది. రేటు ఎక్కువ ఉంటుందేమో.. మనకు ఇవ్వాల్సిన డబ్బులోంచి ఈ అన్నం బిల్లు అంతా కట్ చేస్తారేమో అనే సందేహం మనసులో పెరిగిపెద్దదైంది. దీంతో అక్కడ తినలె.. నాకు అకౌంట్ ఉన్న మెస్ దగ్గరకెళ్లి తినొచ్చా. మొదటి రోజు.. రెండో రోజు.. మూడో రోజు... లంచ్‌కు బ్రేక్ ఇవ్వగానే అక్కడ నుంచి మాయం అయ్యేవాడిని. ఎవరితోనూ కమ్యూనికేట్ అయ్యి.. నా డౌట్‌ను క్లారిఫై చేసుకోలేదు. ప్రొడక్షన్ మేనేజర్ ఒకరు మాత్రం ఈ విషయంలో నన్ను గమనించినట్టున్నారు. బయటకు వెళ్లి తినొస్తున్నాననే విషయాన్ని అర్థం చేసుకున్నారాయన. నా మనసులో భావాన్ని కూడా ఆయన ఎలా పసిగట్టారో కానీ.. నాలుగోరోజు లంచ్కని బైక్ తీస్తుంటే ‘వేణూ.. ఇక్కడే తిను, ఏం చార్జ్ చెయ్యరులే...’ అన్నారు. అప్పటికి అసలు విషయం అర్థమై, ధైర్యంగా భోజనం చేశా! వద్దంటే... వద్దన్నా 1995లో రవీంద్రభారతిలో రచయిత దివాకర్‌బాబుకు సన్మానం. ఆకృతి అనే సంస్థ నిర్వహించిన ఆ కార్యక్రమంలో నా మిమిక్రీ ప్రదర్శనను కూడా ఏర్పాటు చేశారు. అది నా జీవితాన్నే మలుపుతిప్పే ప్రదర్శన అవుతుందని నేను అనుకోలేదు. ముందు వరసలోనే దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి గారు, నిర్మాత అచ్చిరెడ్డిగారు కూర్చున్నారు. నేను కొన్ని స్కిట్స్ చేశాను. ప్రోగ్రామ్ అయిపోయాకా.. ఉదయ్‌భాస్కర్ అని ఒకాయన వచ్చి కలిశాడు. ‘నేను ఎస్వీ కృష్ణారెడ్డి గారికి మేనేజర్‌ను,రేపు ఒకసారి మా ఆఫీస్‌కు రాగలరా...’ అని అడిగారు. మిమిక్రీ ప్రోగ్రామ్ కోసమే అయ్యుంటుందిలే అని.. ‘సరే’ అన్నాను. మరుసటి రోజు ఆఫీస్‌కు వెళ్లాక కృష్ణారెడ్డి గారు అడిగారు.. ‘సినిమాల్లో చేస్తావా..’ అని. నాకేం అర్థం కాలేదు.. ఎందుకంటే, అప్పటికి సినిమాల్లో చేయాలన్న ఆలోచనే లేదాయె! మిమిక్రీ ప్రోగ్రామ్ అనుకొంటే సినిమాల్లో నటిస్తావా.. అని అడుగుతున్నారేంటి అనుకొని, ఔననకుండా, కాదూ అని చెప్పకుండా ఇంటికెళ్లిపోయా. సాయంత్రం ఊర్లో ఉన్న అమ్మకు ఫోన్ చేసి... ఈ విషయాన్ని చెప్పాను. ఆమె సంబరపడి.. చెయ్యమంది. నేనేమో వద్దనుకొంటున్నానమ్మా అంటే... ఆమె సహజమైన శైలిలో కొంచెం గట్టిగా చెప్పింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ అవకాశాన్ని వదులుకోవద్దని సూచించింది. అయితే అప్పటికీ నేను కుదురుకోలేదు. మనం సినిమాల్లో చేయడం ఏమిటనే భావనతోనే ఉండిపోయా. ఎలాగైనా ఈ అవకాశాన్ని వదిలేసుకోవడానికి మెదడులో ఒక మాస్టర్‌ప్లాన్ వేసుకొని మరుసటి రోజు కృష్ణారెడ్డి గారి ఆఫీసుకు వెళ్లాను. ‘నాకు ఒక్కో మిమిక్రీ ప్రోగ్రామ్‌కు వెయ్యి రూపాయలు ఇస్తారు. మీరు 70 రోజుల షూటింగ్ అంటున్నారు కాబట్టి డెబ్బై వేలు ఇస్తే.. చేస్తా, లేకపోతే లేదు..’ అని ఉదయ్‌భాస్కర్‌కు స్పష్టంగా చెప్పేశా. ఎందుకంటే ఎలాగూ అంత డబ్బు ఇవ్వరు, మనల్ని వదిలేస్తారు అని నా ధీమా. నిజం చెప్పాలంటే అప్పటికి నాకు ఒక్కో మిమిక్రీ ప్రోగ్రామ్‌కి ఇచ్చేది 150 రూపాయలే! సినిమాలో నటించాలనే ఆసక్తి ఏ మాత్రం లేకపోవడం వల్ల ఎక్కువ డబ్బు డిమాండ్ చేయడమనే అస్త్రాన్ని ఉపయోగించుకొన్నా. సాయంత్రం అమ్మకు ఫోన్ చేస్తే ‘ఏరా.. వాళ్ల ఆఫీసుకు వెళ్లావా’ అంది. ‘హా.. వెళ్లానమ్మా.. వాళ్లు చెప్పినట్టే చేస్తానని చెప్పొచ్చాను’ అని అమ్మకు చెప్పి ఇక సినిమా గొడవ వదిలిపోయిందనుకొని గుండెల మీద చేతులేసుకొని ఆ రోజు రాత్రి ధైర్యంగా నిద్రపోయాను. మరుసటి రోజు ఇంటి దగ్గరకు ఉదయ్‌భాస్కర్ వచ్చారు. ఇంట్లోకి రమ్మంటుండగానే చేతిలో పదివేల రూపాయలు పెట్టారు. ఒక్కసారి షాక్. అస్సలు ఊహించని పరిణామం అది. అది కేవలం అడ్వాన్స్ అని, మిగతా డబ్బు సినిమా పూర్తయ్యేలోపు ఇస్తామని చెప్పే సరికి... ఏం మాట్లాడాలో కూడా అర్థం కాని స్థితి. అలా ‘సంప్రదాయం’ సినిమాతో సినీపరిశ్రమకు పరిచయం అయ్యాను. కృష్ణగారికి అసిస్టెంట్‌గా, బ్రహ్మానందం గారితో హాస్యసన్నివేశాల్లో నటించాను. తొలి సినిమాలోనే అలా ప్రముఖులతో కలసి నటించే అవకాశం రావడం నిజంగా నా అదృష్టం. రిపోర్టింగ్: బి. జీవన్ రెడ్డి -
వేణుమాధవ్ చెప్పిన జోకులు
కామెడీ క్లాస్: వేణు మాధవ్ ఆకలి - ఆధ్యాత్మికత ఊళ్లోని మతపెద్ద నసీరుద్దీన్‌ను ఒకరోజు విందుకు ఆహ్వానించాడు. కుశల ప్రశ్నలు పూర్తయ్యాక మతపెద్ద బాతాఖానీ ప్రారంభించాడు. క్రమంగా బాతాఖానీ ఆధ్యాత్మిక ప్రసంగంగా మారింది. ఆకలితో నకనకలాడుతున్న నసీరుద్దీన్‌కు సహనం నశించి, ‘మిమ్మల్ని ఒక ప్రశ్న అడగవచ్చా?’ అని సాధ్యమైనంత వినయంగా అడిగాడు. ‘తప్పకుండా’ అని బదులిచ్చాడు పెద్దాయన. ‘మీ కథల్లోని మనుషులు ఎన్నడూ భోజనం చేయరా?’ ప్రశ్నించాడు నసీరుద్దీన్. నాలుక్కరుచుకుని ‘ఇక భోజనానికి లేద్దాం’ అంటూ తన వాగ్ధాటికి స్వస్తి చెప్పాడాయన. సెలూన్ - హాస్పిటల్ పేషెంట్‌ను తరుముతూ డాక్టర్ వీధిలో పరుగు తీస్తుంటాడు. దారినపోయే దానయ్య అతడిని ఆపి ఇలా అడుగుతాడు: ‘దొంగనా తరుముతున్నారు?’ డాక్టర్: కాదయ్యా! నా పేషెంట్.. ప్రతిసారీ ఇలాగే చేస్తున్నాడు. ఈసారి వాణ్ణి వదలను గాక వదలను. దారినపోయే దానయ్య: ఏం చేశాడేంటి? డాక్టర్: బ్రెయిన్ సర్జరీ కోసమంటూ ఇప్పటికే నాలుగుసార్లు నా దగ్గరకు వచ్చాడు. సర్జరీకి సిద్ధం చేసి, తలగొరిగిన తర్వాత తుర్రుమంటాడు. ప్రతిసారీ ఇదే తంతు. నాకొద్దీ మొగుడు రమ: మీ ఆయన నెలరోజుల్నుండీ కనిపించడం లేదంటున్నావ్, మరి పోలీస్ కంప్లెయింట్ ఇవ్వలేదా? సుమ: పోయినసారి ఇస్తే, వెతికి వెతికి తెచ్చారే... అందుకే ఇవ్వలేదు... నో తగ్గుదల ‘‘ఈ క్లాత్ పదిమీటర్లు తీసుకుంటే మీటరు ఎంతకిస్తావ్?’’ ‘‘నాలుగొందలండి’’ ‘‘కాస్త తగ్గించవయ్యా’’ ‘‘ఎన్ని మీటర్లు తగ్గించమంటారు?’’ అదీ జన్మస్థానమే! టీటీ: ఎక్కడకు వెళుతున్నారు? రంగా: రాముడు పుట్టిన చోటుకు టీటీ: టికెట్టు ఉందా? రంగా లేదు టీటీ: అయితే, పదండి.. రంగా: ఎక్కడికి? టీటీ: శ్రీకృష్ణుడు పుట్టిన చోటుకు వేణుమాధవ్ ఎంపిక చేసిన కార్టూన్స్ -
సీతన్న ‘కిస్సులు’
కామెడీ క్లాస్: వేణు మాధవ్ ప్రపంచంలో ఎవడైనా ఇంటర్ రెండేళ్లు జదువుతడు, డిగ్రీ మూడేళ్లు జదువుతడు. కానీ నేను స్పెషల్గదా... టెన్తు గూడా రెండేళ్లు జదివిన. ఫ్రెండ్సుతోటి తిరుగుడే తిరుగుడు... అదీ కథ! టెన్తు కోదాడలోనే చదివిన. చైతన్యకుమార్ సార్ అని వుండె. ‘‘నువ్వు చదువొద్దు, హాఫ్ అన్ అవర్ అట్ల క్లాసులో గూర్చోరా’’ అనేటోడు. కదలకుండా కూర్చుంటేనైనా రెండు ఒక్కట్లు రెండు, రెండు నాళ్లు ఐదు అని చెప్పచ్చని చూసేటోడు. మనకు ఐదు నిమిషాలు సీటు నిలుస్తదా! అట్లనో ఇట్లనో టెన్తు పాసై, ఇంటర్లో చేరితి. ‘కెఆర్ఆర్ జూనియర్ అండ్ డిగ్రీ కాలేజీ’. కెఆర్ఆర్ అంటే కొండపల్లి రాఘవమ్మ, రంగారావు. అది బాలాజీనగర్ తండాలో ఉండేది. కాలేజీలో ఏమన్న సక్కగయిన్నా... ఆడపిల్లల్ని ఏడిపిచ్చుడు, జడలు ముడేసుడు... చేరిన వారంలనే నా మీద పదమూడు కంప్లెయింట్స్! అక్కడ్నే మా సీనియర్ ఒకాయినుండె. తారా సీతయ్య... మాకు బాగా కావాల్సినోడే... సీతన్నా సీతన్నా అని పిలిచేది.. కొద్దిగ మావాని మంచిచెడ్డలు జూసుకొమ్మని మా అమ్మ చెప్పినట్టుంది... ఒకరోజు కాలేజీ అయిపోయినంక ఇంటికొస్తుంటే నా ఎనుకే వచ్చిండు. దగ్గర్ల ఒక రైసుమిల్లు ఉంటది... ఎనుకకు తీసుకపోయిండు... కిస్సులే కిస్సులు... ఇంకోమో అనుకునేరు, విపరీతమైన కొట్టుడు! మళ్లీ ఆడపిల్లల జోలికి పోలేదు! రైళ్లు ధడ ధడ ధడ పూరీ జగన్నాథ్ ‘నేనింతే’ తీస్తున్నడని నాకు తెల్సింది. అది సినిమా బేస్డ్ సినిమా. జగనన్నకు ఫోన్ చేసిన. ‘‘అన్నా, నా దగ్గర ఒక స్టోరీ ఉంది, చెప్త...’’ అంటే, ‘‘ఓకే’’ అన్నడు. అప్పుడు నేను వేరే షూటింగులుంటి. ఫోన్లనే ఆయనకు ఆ కథ చెప్పిన. ‘‘సూపర్ ఉంది వేణు’’ అన్నడు. తమిళ్ డెరైక్టర్స్‌కు ఎట్ల ప్రిఫరెన్స్ ఇస్తరు మనవాళ్లు! అందుకే బ్రహ్మానందం నాకు అసిస్టెంట్ ఛాన్స్ ఇవ్వడు... కట్ చేస్తే- రవితేజ దగ్గరికి వెళ్త. అప్పుడాయన హోటల్లో కూర్చుంటడు. ‘‘చాయ్ చెప్పన్నా, కథ జెప్త’’ అంటా. వచ్చిన చాయ్ తాక్కుంట, కథ మొదలుపెడుత. ‘‘హీరోకు ఎయిడ్సు, హీరోయిన్‌కు ఎయిడ్సు... ఇద్దరు లవ్‌లో పడ్డరు...’’ ‘‘క్లైమాక్సులైన తగ్గుద్దా’’ అంటాడు రవితేజ, ‘సంకనాకిపోద్దని’. ‘‘ఇదే సినిమాను గీతాంజలి అని పేరుపెట్టి మణిరత్నం తీస్తే మీరంతా హిట్ చేసిన్రు గదా’’ అని నేనంటే అందరూ నవ్వి నన్ను ఎంకరేజ్ చేస్తరు. కట్ చేస్తే- ఒక హీరో(సుబ్బరాజు) దగ్గరికి వెళ్త. వెళ్లేముందు సిగరెట్ నుషితో బొట్టు పెట్టుకుంట. పేరు కూడా సెంథిల్ అని మార్చుకుంట. సెట్లోకి వెళ్లగానే, ‘‘సెంథిల్ అంటే మీరేనా?’’ అని హీరో అడుగుతడు. ‘‘నాన్ దా’’(నేనే) అంట. కుర్చీల్లో కూర్చుంటం. హీరో సెల్ ఆఫ్ చేయిస్త. ‘‘పవన్‌కళ్యాన్, ఎన్టీయార్ ఎల్లామ్ అడిగారు... నాన్ నోస్ అన్నా...’’ అని బిల్డప్పు ఇచ్చి, కథ మొదలుపెడుత. కన్నులెందు ఒరు జూమ్ బ్యాక్ వన్ దా ఫస్ట్ షాట్ (కంట్లో నుంచి జూమ్ బ్యాక్ చేస్తే ఫస్ట్ షాట్)... హీరో సెప్పుకుట్టువాడి మాదిరి... బాబు సైకిల్ మీద వరువార్ వరువార్ (సైకిల్ మీద వస్తుంటాడు)... పాతిక రైళ్లు గాల్లో ధడ ధడ ధడ, అది దా హీరో ఇంట్రడక్షన్... ‘బాబు సైకిల్ మీదా?’ అని అడుగుతాడు పక్కనున్న హీరో అసిస్టెంట్. ‘ఓ మీ ఇమేజ్ కదా... బెంజ్ కారులో వరువార్ వరువార్’... అని వెటకారం చేస్త. హీరోయిన్ ఎవరు? త్రిషతో ఆల్రెడీ సినిమా చేశానంటాడు హీరో. ఇలియానాతో కూడా ఈమధ్యే అయిపోయిందంటాడు. దీపికా పడుకోనే పేరు చెబుతాడు. ‘పడుకోనే’కు దీర్ఘం తీసి- మళ్లీ స్టోరీ షురు... హీరోయిన్ కోవెలలో నడుచుకుంటూ వస్తుంటే దేవత మాదిరి ఇరుప్పా... అటు హీరో ఇటు హీరోయిన్... కట్ పన్నా (కట్ చేస్తే)... తీన్మార్ మాదిరి ఒరు సాంగ్... ఎలాంగే ఎలాంగే... సింగపూర్‌లో పల్లవి... ఒరు చరణం వందు అమెరికా(ఒక చరణం అమెరికాలో)... ఇన్నొరు చరణం వందు హైద్రాబాద్‌లో సముద్రం సెట్టు... హైద్రాబాద్‌లో సముద్రం అనగానే, ‘‘నువ్వెక్కడినుంచి వచ్చినవ్రా’’ అంటడు. ‘‘మణిరత్నం, శంకర్, ఎస్ జె సూర్య ఎల్లారుమ్ నా రూమ్మేట్స్’’ అని చెప్త. వీళ్లు నీ రూమ్మేట్సారా అని యమకొట్టుడు కొడుతడు! ఇదీ నా స్టోరీ! -
నల్లబాలు... నవ్వుల బాలు!
కామెడీ క్లాస్,వేణు మాధవ్ సై సినిమాలో మొదట ‘నల్లబాలు’ ది చిన్న పాత్రే. సినిమా స్టార్టింగ్‌లో కాలేజీ గోడ మీద పొలిటికల్ లీడర్ పేరు రాస్తూ నల్లబాలు ప్రత్యక్షం అవుతాడు. అక్కడికీ మొదట్లోనే తన మనిషి ఒకరు వచ్చి హెచ్చరిస్తాడు. ‘అన్నా గోడ మీద రాయడానికి పర్మిషన్ కావాలంటనే..’ అని. వింటేగా! ‘నల్లబాలు.. నల్లతాచు లెక్క..’ అంటూ రెచ్చిపోతాడు. ఇదే ఊపులో ‘దేతడి... పోచమ్మ గుడి..’ అనగానే స్పాట్లో దర్శకుడు రాజమౌళి గారితో సహా అందరూ ఒక్కటే నవ్వు. కట్ చె ప్పగానే ‘ఈ దేతడి.. పోచమ్మ గుడి.. అంటే ఏంటి వేణు?’ రాజమౌళి అడిగారు. ‘ఏం లేదండీ, ఏదో ఫ్లోలో వచ్చేసింది చెప్పేశానంతే..’ అన్నాను. అది మొదట రాజమౌళి గారికి, ఆ తర్వాత ప్రేక్షకులకు బాగా నచ్చేసింది. పదిహేను రోజుల తర్వాత రాజమౌళిగారి నుంచి ఫోన్. ‘వేణూ.. నల్లబాలును చూసి ఎడిటింగ్ రూమ్‌లో ఒక్కటే నవ్వులు... ఆ రోల్‌తో మరిన్ని సీన్లు చేద్దాం...’ అని చెప్పారు. నేను కూడా ఉత్సాహంగా ‘ఓకే’ అన్నాను. రెండోసీన్లో పోలీస్ ముందు‘సక్కమ్మక్కలేసుకొని కొడతా..’ అని బిల్డప్ ఇస్తాడు. భాసింపట్టు వేసుకొని కూర్చోవడాన్నే సక్కమ్మక్కలేసుకోవడం అంటారు. ‘అలా కూర్చొని ఎలా కొడతావయ్యా..’ అంటూ రాజమౌళిగారు నవ్వేశారు! ముచ్చటగా మూడో సీన్లో భిక్షూయాదవ్ ఇంటి ముందు. స్టూడెంటూ, పోలీసూ గాని బండోడొకడు గోడమీద రాయడాన్ని అడ్డుకొంటే ‘నల్లబాలు.. నాకి చంపేస్తా..’ అంటూ హెచ్చరిస్తాడు... నల్లబాలుకి కట్ చెప్పి ‘నాకి ఎలా చంపేస్తావు..వేణూ’అంటూ రాజమౌళి నవ్వులు స్టార్ట్ చేశారు! కొసమెరుపు ఏమిటంటే... ఫస్ట్సీన్లో ‘అన్నా గోడ మీద రాయడానికి పర్మిషన్ కావాలంటనే..’ అంటూ కనిపించే నల్లబాలు అనుచరుడు రాజమౌళి గారే. ఆయన స్క్రీన్ మీద కనిపించిన తొలి సినిమా కూడా ఇదే! దరువెయ్యబోతే... నాకు దరువేశారు! చిన్నప్పటి నుంచి డప్పు కొట్టడం అంటే ఇష్టం. అన్నం ప్లేట్ ముందుపెట్టినా దాంతో దరువేసేవాడిని. పప్పన్నం తిన్న తర్వాత, పెరుగన్నం వడ్డించేంతలో కూడా ప్లేట్ నా చేతిలోకి వచ్చేసేది. నా దరువు పిచ్చిని చూసి అమ్మ తిట్టేది, కొట్టేది. అయినా మారలా! ఇలా నేను ఆరోక్లాసులో ఉన్నప్పుడు ఒకసారి మా కోదాడకు గద్దర్‌గారు వచ్చారు. ఊళ్లో ఆయన పాట అందుకొంటున్నంతలో ఎవరో అన్నారు.. ‘వేణూ డప్పు బాగా కొడతాడు’ అని. అంతే, అప్పటికప్పుడు ఒక డప్పు తెప్పించారు. పిల్లాడినైనా నా కోసం డ ప్పును ప్రత్యేకంగా సెట్‌చేసి కొట్టమన్నారు. అలా గద్దరన్న పాటకు దరువేసి నా ప్రతిభను ప్రదర్శిస్తున్నాను. ఇంతలో వెనక నుంచి ఎవరో పిలుస్తూ తడుతున్నారు. చిరాగ్గా వెనక్కుచూస్తే...అన్నయ్య! అక్కడ నుంచి ఇంటి వరకూ నా వీపున దరువేసుకొంటూ తీసుకెళ్లాడు. ఇంటికెళ్లాక అన్నయ్య కొట్టాడని అమ్మకు చెబితే ‘చదువుకోకుండా ఈ డప్పు పిచ్చి ఏంట్రా... పెద్దయ్యాకా శవాల ముందు డప్పుకొట్టుకొని బతుకుతావా...’ అంటూ అమ్మ మరో నాలుగు తగిలించింది. మా ఫ్యామిలీలో నన్ను కొట్టనోళ్లు ఎవ్వరూ లేరేమో! ఫ్రేమింగే కామెడీకి టైమింగ్ నవ్వించడం కోసం ప్రత్యేకంగా స్క్రిప్ట్, డైలాగుల అవసరం లేదు. ఒక్కోసారి కెమెరా ఫ్రేమింగే సీన్‌ను పండిస్తుంది. ఇది కూడా ‘సై’ సినిమా సమయంలోనే జరిగింది. విలన్ ప్రదీప్‌రావత్‌తో నాకు సీన్లుంటాయి. ‘భిక్షూ యాదవ్ అంటే వాడు నా శిష్యుడే...’ అంటూ, భిక్షూ ఎవరో తెలియక, అతడి ముందే బిల్డప్ ఇస్తాను. అసలు విషయం తెలిశాకా ‘అన్నా నీ గురువంట... నమస్తే పెట్టూ’ అంటూ భిక్షూ గ్యాంగ్‌లోని వాళ్లు అంటుంటారు. ఈ సీన్ చిత్రీకరణ కోసం మొదట ఒక స్టూల్ లాంటిది ఏర్పాటు చేసి నన్ను నిలబడమన్నారు. ఎందుకంటే ప్రదీప్‌రావత్ భారీ కాయం. ఆయన హైట్‌తో నేను మ్యాచ్ కావడానికి అలాంటి ఏర్పాటు చేశారు. అయితే అలా కాదు.. నేను మామూలుగానే నిలబడతాను, అప్పుడే ఫన్ పండుతుంది అని చెప్పాను. ఇలా షూట్ చేస్తున్నప్పుడు ప్రదీప్ నాతో కిందకి చూస్తూ మాట్లాడుతుంటాడు, నేనేమో ఫస్ట్ ఫ్లోర్‌లోని మనిషిని చూస్తున్నట్టుగా చూస్తుంటా. ఆ సీన్‌కు ఈ ఫ్రేమింగ్ భలే సెట్ అయ్యింది. మా హైట్లలో వేరియేషన్‌ను గమనించిన రాజమౌళి గారి పకపకలు నాకు ఇప్పటికీ గుర్తే! -
కామెడీ క్లాస్-వేణు మాధవ్
*కామెడీ క్లాస్ : వేణు మాధవ్ *ఆ సీన్ గుర్తొస్తే... దిల్ షూటింగ్... వినాయక్ లాంటి పెద్ద దర్శకుడితో పనిచేయడం... ఆ సినిమాలో నాది ఫుల్‌లెంగ్త్ క్యారెక్టర్ కావడంతో మంచి ఊపు మీదున్నా. పల్లెటూర్లో సీన్. విలన్ ఇంటికి నేను, నితిన్ వెళతాం. నితిన్ దొంగతనంగా అటకెక్కేస్తాడు. ఇంట్లోకి వెళితే విలన్ చంపేస్తాడని గ్యారంటీగా తెలుసు కాబట్టి... ఎక్కడ దాక్కోవాలో తెలీక రోడ్లు పట్టుకుని తిరుగుతుంటా. ఓ పిల్లగ్యాంగ్ పేకాడుతూ కనపడితే... వాళ్ల చేత ‘పైసల్తియ్యి బే’ అని మర్యాదగా పిలిపించుకుని నేనూ కార్డ్స్ పట్టుకుంటా. ఆడాలంటే గేదెను కదలకుండా పట్టుకోవాలనేది కండిషన్. కార్డ్స్ చేతిలో ఉన్నాయి కాబట్టి... తాడును నడుముకి చుట్టుకుంటా. అది అటూ ఇటూ కదులుతూంటుంది. చిర్రెత్తి ‘నీ తల్లి...’ అని తిడతా. అసలే బర్రె. మనకి పాలు ఇచ్చి పోషించేది... తిడుతుంటే ఊరుకుంటదా... కుప్పలు, వరికుప్పలు తేడా లేకుండా అది రన్నింగ్... దాని తాడు మన నడుముకు ఉంది కాబట్టి వెనుకే నేను దొర్లింగ్.. ఈ సీన్ గుర్తొస్తే మీరంతా లాఫింగ్ కదా. షూటింగ్ అయిపోయాక ఇంటికెళ్లిన దగ్గర్నుంచి నాకు వామిటింగే. అప్పటికీ వినయ్ అన్న (వినాయక్) చెప్పాడు కూడా... వేణూ... డూప్‌ని పెడదాం అని. నేను వింటే కదా... బ్యాడ్‌టైమ్... సారీ బర్రె టైమ్. చిన్నతనంలోని సరదాలు మా ఊరు కోదాడ. టూరింగ్ టాకీస్ లాంటి చిన్న థియేటర్లలో ఏఎన్నార్, ఎన్టీయార్... సినిమాలు ఆడుతుండేవి. కొత్త బొమ్మ వచ్చిందని రిక్షాకు మైక్ పెట్టి ఎనౌన్స్ చేస్తూండేవారు. మైక్రిక్షా కనపడితే ఎక్కడలేని సంతోషం! దాని మీదకి ఒక్క ఎగురు ఎగిరి నేను మైక్ పట్టుకునేవాడ్ని. మన గొంతు ఊరంతా వింటుంటే గొప్పగా ఉండేది. ఇందులో చిన్న ఇబ్బంది ఏమిటంటే... ఈ గొంతు మా అన్నయ్యలిద్దరికీ వినపడేది. దీంతో నన్ను వెతుక్కుంటూ వచ్చి, నిక్కరు విప్పి మరీ ఉతుక్కుంటా తీసుకుపోయేవారు. అమ్మా అన్నలు ‘కొట్టిన్రు చూడే’ అంటే అమ్మ అయ్యో అనకుండా... పాత చీపురు తీసుకుని తన వాటా తను పూర్తి చేసేది. హు... ఆ రోజులే వేరులెండి. బ్రేక్ తర్వాత... బ్రహ్మానందం అంటే పాతకక్షలున్నాయి. అందుకే ఫస్ట్ మారుతి కారు కొన్నప్పుడు ఎమ్మెస్ అన్ననొక్కడ్నే ఎక్కన్నా అని పిలిచా. ఆయనింటే కదా. ‘‘బ్రహ్మానందాన్ని కూడా పిలవరా, బాగోదు’’ అంటూ పోజు కొట్టి నేను బ్రహ్మానందాన్ని కూడా పిలిచేలా చేశాడు. ఓ శుభముహూర్తాన ఊరి శివార్లలో షూటింగైపోయాక ఇద్దర్నీ కారెక్కించుకున్నా. కాసేపు మంచిగానే నడిపి... తర్వాత సూపర్‌స్పీడ్‌లో మెలికలు తిప్పేశా. ఎమ్మెస్సన్న కంగారు. ‘అరేయ్ ఆపరా’ అంటూ అరుపులు. నేనేమో కారు నడుపుతూ సీలింగ్ వంక కంగారుగా చూడడం... దీంతో ఎమ్మెస్ అన్న ‘ఏరా ఏంటి వెతుకుతున్నావ్?’ అని కంగారుగా అడిగితే, ‘‘బ్రేక్ అన్నా, పైన ఎక్కడో ఉండాలి కనపడట్లే’’ అన్నా. ఇగ చూస్కోండి... కారాపాక బ్రహ్మానందం గంటన్నర పాటు నవ్వీ నవ్వీ... రిపోర్టింగ్ : ఎస్.సత్యబాబు