కామెడీ క్లాస్-వేణు మాధవ్
*కామెడీ క్లాస్ : వేణు మాధవ్
*ఆ సీన్ గుర్తొస్తే...
దిల్ షూటింగ్... వినాయక్ లాంటి పెద్ద దర్శకుడితో పనిచేయడం... ఆ సినిమాలో నాది ఫుల్‌లెంగ్త్ క్యారెక్టర్ కావడంతో మంచి ఊపు మీదున్నా. పల్లెటూర్లో సీన్. విలన్ ఇంటికి నేను, నితిన్ వెళతాం. నితిన్ దొంగతనంగా అటకెక్కేస్తాడు. ఇంట్లోకి వెళితే విలన్ చంపేస్తాడని గ్యారంటీగా తెలుసు కాబట్టి... ఎక్కడ దాక్కోవాలో తెలీక రోడ్లు పట్టుకుని తిరుగుతుంటా. ఓ పిల్లగ్యాంగ్ పేకాడుతూ కనపడితే... వాళ్ల చేత ‘పైసల్తియ్యి బే’ అని మర్యాదగా పిలిపించుకుని నేనూ కార్డ్స్ పట్టుకుంటా.
ఆడాలంటే గేదెను కదలకుండా పట్టుకోవాలనేది కండిషన్. కార్డ్స్ చేతిలో ఉన్నాయి కాబట్టి... తాడును నడుముకి చుట్టుకుంటా. అది అటూ ఇటూ కదులుతూంటుంది. చిర్రెత్తి ‘నీ తల్లి...’ అని తిడతా. అసలే బర్రె. మనకి పాలు ఇచ్చి పోషించేది... తిడుతుంటే ఊరుకుంటదా... కుప్పలు, వరికుప్పలు తేడా లేకుండా అది రన్నింగ్... దాని తాడు మన నడుముకు ఉంది కాబట్టి వెనుకే నేను దొర్లింగ్.. ఈ సీన్ గుర్తొస్తే మీరంతా లాఫింగ్ కదా. షూటింగ్ అయిపోయాక ఇంటికెళ్లిన దగ్గర్నుంచి నాకు వామిటింగే. అప్పటికీ వినయ్ అన్న (వినాయక్) చెప్పాడు కూడా... వేణూ... డూప్‌ని పెడదాం అని. నేను వింటే కదా... బ్యాడ్‌టైమ్... సారీ బర్రె టైమ్.
చిన్నతనంలోని సరదాలు
మా ఊరు కోదాడ. టూరింగ్ టాకీస్ లాంటి చిన్న థియేటర్లలో ఏఎన్నార్, ఎన్టీయార్... సినిమాలు ఆడుతుండేవి. కొత్త బొమ్మ వచ్చిందని రిక్షాకు మైక్ పెట్టి ఎనౌన్స్ చేస్తూండేవారు. మైక్‌రిక్షా కనపడితే ఎక్కడలేని సంతోషం! దాని మీదకి ఒక్క ఎగురు ఎగిరి నేను మైక్ పట్టుకునేవాడ్ని. మన గొంతు ఊరంతా వింటుంటే గొప్పగా ఉండేది. ఇందులో చిన్న ఇబ్బంది ఏమిటంటే... ఈ గొంతు మా అన్నయ్యలిద్దరికీ వినపడేది. దీంతో నన్ను వెతుక్కుంటూ వచ్చి, నిక్కరు విప్పి మరీ ఉతుక్కుంటా తీసుకుపోయేవారు. అమ్మా అన్నలు ‘కొట్టిన్రు చూడే’ అంటే అమ్మ అయ్యో అనకుండా... పాత చీపురు తీసుకుని తన వాటా తను పూర్తి చేసేది. హు... ఆ రోజులే వేరులెండి.
బ్రేక్ తర్వాత...
బ్రహ్మానందం అంటే పాతకక్షలున్నాయి. అందుకే ఫస్ట్ మారుతి కారు కొన్నప్పుడు ఎమ్మెస్ అన్ననొక్కడ్నే ఎక్కన్నా అని పిలిచా. ఆయనింటే కదా. ‘‘బ్రహ్మానందాన్ని కూడా పిలవరా, బాగోదు’’ అంటూ పోజు కొట్టి నేను బ్రహ్మానందాన్ని కూడా పిలిచేలా చేశాడు. ఓ శుభముహూర్తాన ఊరి శివార్లలో షూటింగైపోయాక ఇద్దర్నీ కారెక్కించుకున్నా.
కాసేపు మంచిగానే నడిపి... తర్వాత సూపర్‌స్పీడ్‌లో మెలికలు తిప్పేశా. ఎమ్మెస్సన్న కంగారు. ‘అరేయ్ ఆపరా’ అంటూ అరుపులు. నేనేమో కారు నడుపుతూ సీలింగ్ వంక కంగారుగా చూడడం... దీంతో ఎమ్మెస్ అన్న ‘ఏరా ఏంటి వెతుకుతున్నావ్?’ అని కంగారుగా అడిగితే, ‘‘బ్రేక్ అన్నా, పైన ఎక్కడో ఉండాలి కనపడట్లే’’ అన్నా. ఇగ చూస్కోండి... కారాపాక బ్రహ్మానందం గంటన్నర పాటు నవ్వీ నవ్వీ...
రిపోర్టింగ్ : ఎస్.సత్యబాబు