సినిమా రివ్యూ: హార్ట్ ఎటాక్
సినిమా రివ్యూ: హార్ట్ ఎటాక్
Published Sat, Feb 1 2014 12:04 AM | Last Updated on Sat, Sep 2 2017 3:13 AM
వరుస విజయాలతో దూసుకుపోతున్న నితిన్...సరియైన హిట్ కోసం ఎదురు చూస్తున్న దర్శకుడు పూరి జగన్నాథ్ క్రేజీ కాంబినేషన్ తో రూపొందిన 'హార్ట్ ఎటాక్' చిత్రం ప్రారంభం నుంచి ఓ పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఆ తర్వాత ఫస్ట్ లుక్, ఆడియో ప్రేక్షకుల్లో మరింత అంచనాలను పెంచింది. గత వైభవాన్ని నిలబెట్టుకునేందుకు పూరి చేసిన ప్రయత్నంలో భాగంగా వచ్చిన 'హార్ట్ ఎటాక్' చిత్రం ప్రేక్షకుల సంతృప్తి పరిచిందా? బాక్సాఫీస్ వద్ద ఎలాంటి టాక్ ను సంపాదించుకుందనే విషయాన్ని తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సింది.
అమెరికాలో ఓ యాక్సిడెంట్ లో తల్లి తండ్రులను కోల్పోయిన వరుణ్ (నితిన్) స్పెయిన్ లో ఎదో ఒక జాబ్ చేసేస్తూ కాలం వెళ్లదీస్తుంటాడు. అమ్మాయిలతో ప్రేమలో పడటం వేస్ట్ అనే భావనలో వరుణ్ ఉంటాడు. తన స్నేహితురాలు, కృష్ణ భక్తుడు రమణ (బ్రహ్మనందం) కూతురు ప్రియ (కేశ ఖంబటి) కు సహాయం చేసేందుకు స్పెయిన్ కు చేరుకున్న హయతి (అదా శర్మ)ని చూసి ఇష్టపడుతాడు. కాని హయతిపై ప్రేమ లేదని.. కేవలం ఓ ముద్దు మాత్రమే ఇవ్వాలని వరుణ్ వెంటపడి వేధిస్తుంటాడు. వరుణ్ సహాయం తీసుకుని తన స్నేహితురాలి సమస్యను పరిష్కరించడంలో హయతి సక్సెస్ అవుతుంది. ఈ క్రమంలో వరుణ్ తో ప్రేమలో హయతి ప్రేమలో పడుతుంది. వరుణ్ కోరినట్లే హయతి ముద్దు ఇస్తుంది. కాని ఓ కారణంతో వరుణ్ ను స్పెయిన్ లో వదిలేసి.. చెప్పపెట్టకుండా గోవాకు హయతి చేరుకుంటుంది. అయితే తన కుటుంబాన్ని ఓ ప్రాబ్లం నుంచి గట్టేక్కించడానికి డ్రగ్ మాఫియా కార్యకలాపాలను, అమ్మాయిల అక్రమ రవాణా చేసే మఖాన్ కమర్తి (విక్రమ్ జిత్) తో పెళ్లికి ఒప్పుకుంటుంది. హయతిని ప్రేమిస్తున్నాని రియలైజ్ అయిన వరుణ్ గోవాకు చేరుకుంటాడు. గోవాకు చేరుకున్నవరుణ్.. హయతి ప్రేమను పొందడంలో ఎలా సఫలమవుతాడు? ప్రియకు వచ్చిన సమస్య ఏంటి? ప్రేమిస్తున్న వరుణ్ కు దూరంగా హయతి ఎందుకు ఉండాలనుకుంది? మాఫియా డాన్ తో హయతి పెళ్లికి ఎందుకు ఒప్పుకుంది లాంటి ప్రశ్నలకు తెరపైనే సమాధానం దొరుకుతాయి.
విశ్లేషణ:
దర్శకుడు పూరి జగన్నాథ్ కథలో రెగ్యులర్ కనిపించే హీరో పాత్రనే నితిన్ పోషించాడు. నితిన్ ను ఓ కొత్త లుక్ లో చూడటానికి అవకాశం కలిగినా.. కథ పరంగా నితిన్ క్యారెక్టరైజేషన్ లో కొత్తదనం ఎక్కడా కనిపించదు. హీరోయిజాన్ని తెరకెక్కించే విషయంలో కూడా అదే పూరి మార్క్ పాత వాసన కనిపించింది. గతంలో హీరో పాత్ర పరంగానూ, కారెక్టరైజేషన్ విషయంలోనూ పక్కాగా లాజిక్ లుండేవి. అయితే ఈ చిత్రంలో మాత్రం లాజిక్ లను..హీరో క్యారెక్టరైజేషన్ ను పూర్తిగా పూరి గాలికి వెదిలేశాడేంటబ్బా అనే ఫీలింగ్ సినిమా చూసినంత సేపు వెంటాడుతునే ఉంటుంది. గత చిత్రాల్లో రక్షిత, ఇలియానా, తమన్నా, అమలాపాల్ లాంటి హీరోయిన్ల క్యారెక్టరైజన్ ఫర్ ఫెక్ట్ గా ఉండేది. అయితే ఈచిత్రంలో ఆదా శర్మకు పూరి అన్యాయం చేశాడనే చెప్పవచ్చు. కథలో బలమైన విలన్ లేకపోవడం ఈ చిత్రానికి మరో మైనస్ పాయింట్. పూరి సినిమాలలో బ్రహ్మనందం, ఆలీలతో కూడిన బ్రహ్మండమైన కామెడీ ట్రాక్ ఉంటుంది. అయితే ఈ చిత్రంలో కృష్ణ భక్తుడిగా రమణ పాత్రలో బ్రహ్మనందం, రజనీ పాత్రలో ఆలీ కనిపించినా.. అంతగా గొప్పగా ఆకట్టుకోలేకపోయారు. దేవన్, ప్రకాశ్ రాజ్ లను పూర్తి స్థాయిలో వాడుకోవడంలో కొంత విఫలమయ్యారు.
ఇక ఈ చిత్రంలో గొప్పగా చెప్పుకోవాల్సింది అమోల్ రాథోడ్ ఫోటోగ్రఫి. స్పెయిన్, గోవా ప్రదేశాల్లో లోకేషన్లను అమోల్ రాథోడ్ అద్బుతంగా చిత్రీకరించారు. ప్రేక్షకులకు విజువల్ ట్రీట్ ను అందించారు. స్క్రీన్ ప్లే రోటిన్.. పూరి మార్క్ డైలాగ్స్ అక్కడక్కడా ఓకే అనిపించినా.. పూర్తిస్థాయిలో పేలలేదనే చెప్పవచ్చు. ఒకటి రెండు పాటలు ఆకట్టుకునే పాటల్ని అనూప్ రూబెన్ అందించారు. బ్యాక్ గ్రౌండ్ స్కోరు పేలవంగానే ఉంది. సాధారణంగా పూరి రూపొందించిన ప్రతి ప్రేమ కథలోనూ గొప్ప ఫీల్ ఉంటుంది. ఈ చిత్ర లవ్ స్టోరిలో ఫీల్ లేకపోవడం 'హార్ట్ ఎటాక్' చిత్రంలో ప్రధాన లోపం. తెలుగు ప్రేక్షకుల నేటివిటికి సుదూరంగా ఉన్న ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడంలో వెనకపడిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. తెలుగు ప్రేక్షకుల అభిరుచికి దగ్గరగా ఉండే విధంగా పూరి జాగ్రత్తలు తీసుకునేవారు. ఈ మధ్య కాలంలో ప్రేక్షకుల టేస్ట్ ను పట్టించుకోవడం లేదనే వాదన కు బలం చేకూర్చేలా ఈ చిత్రం ఉందని చెప్పవచ్చు.. ఏది ఏమైనా దర్శకుడు పూరి జగన్నాథ్ నుంచి విభిన్న చిత్రాన్ని ఆశించిన ప్రేక్షకులకు, అభిమానులను నిరాశ పరిచారనే చెప్పవచ్చు. పూర్తిగా యూత్ ను లక్ష్యంగా చేసుకుని నిర్మించిన ఈ చిత్రం ఎలాంటి ఫలితాన్ని నమోదు చేసుకుందోననే విషయాన్ని తెలుసుకోవడానికి మరికొంత సమయం వేచి చూడాల్సిందే.
Advertisement