ప్రముఖ నటుడు వేణుమాధవ్‌ కన్నుమూత | comedian venu madhav passed away | Sakshi
Sakshi News home page

ప్రముఖ నటుడు వేణుమాధవ్‌ కన్నుమూత

Published Thu, Sep 26 2019 12:40 AM | Last Updated on Thu, Sep 26 2019 12:52 PM

comedian venu madhav passed away - Sakshi

వేణుమాధవ్‌

‘పంతులమ్మని చేసుకుని పలక మీద అఆలు రాసుకోవాలా? పదిమంది చూపూ నా మీదే ఉండాలి.. వందమందిలో ఉన్నా నన్ను స్పెషల్‌గా గుర్తించాలి’ (ఛత్రపతి), ‘నేనెవరో ఎరుకనా.. నల్లబాలు నల్లతాచు లెక్క.. నేనంటే ట్విన్‌ సిటీస్‌ మొత్తం దడ’ (సై), ‘ఒసేయ్‌ శకుంతల.. రేపు మార్నింగ్‌ 9గంటలకు నీకు అపాయింట్‌మెంట్‌ ఇస్తున్నా.. రూమ్‌కి వచ్చి నన్ను పికప్‌ చేసుకుని వెళ్లి 10 గంటలకు క్యాష్‌ తీసుకెళ్లు.. ఒసేయ్‌ ఒసేయ్‌ ఒసేయ్‌ నడిరోడ్డు మీద ఓ ఆడదాన్ని కొట్టాననే బ్యాడ్‌ నేమ్‌ నాకు రానివ్వొద్దు (లక్ష్మీ)’’ అంటూ ఎన్నో పంచ్‌ డైలాగులతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన వేణుమాధవ్‌ (51) ఇకలేరు.

హాస్యనటుడిగా తనకంటూ ప్రత్యేక ముద్ర వేయించుకుని, ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకున్న ఆయన అనారోగ్యంతో బుధవారం హైదరాబాద్‌లో మృతి చెందారు. కొన్ని రోజులుగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారాయన. అయితే ఇటీవల వ్యాధి సమస్య తీవ్రం కావడంతో సికింద్రాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో చేరారు. ఆయన రెండు కిడ్నీలు పూర్తిగా దెబ్బతినడంతో మంగళవారం ఆరోగ్యం క్షీణించి పరిస్థితి విషమంగా తయారైంది.

దీంతో వెంటిలేటర్‌ సాయంతో చికిత్స అందించినా ఫలితం లేకపోవడంతో బుధవారం మధ్యాహ్నం 12:21 గంటలకు ఆయన తుది శ్వాస విడిచారు. ఆయనకు భార్య శ్రీవాణి, కొడుకులు మాధవ్‌ సావికర్, మాధవ్‌ ప్రభాకర్‌ ఉన్నారు. ఆయన మృతితో చిత్రపరిశ్రమలో విషాదం నెలకొంది. వేణుమాధవ్‌ మృతదేహాన్ని కాప్రా హెచ్‌పీ కాలనీలోని ఆయన స్వగృహానికి తీసుకెళ్లారు. అంత్యక్రియలు నేడు జరగనున్నాయి. కాగా అభిమానుల సందర్శనార్థం వేణుమాధవ్‌ పార్థివ దేహాన్ని ఈ రోజు మధ్యాహ్నం 1 గంట నుంచి 2:30గంటల వరకూ ఫిల్మ్‌నగర్‌లోని ‘మా’ కార్యాలయ ఆవరణలో ఉంచనున్నారు.

మిమిక్రీ ఆర్టిసుగా...
నల్గొండ జిల్లాలోని కోదాడలో 1969 డిసెంబర్‌ 30న ప్రభాకర్‌–సావిత్రి దంపతులకు జన్మించారు వేణుమాధవ్‌. తండ్రి టెలిఫోన్‌ డిపార్ట్‌మెంట్‌లో లైన్‌ ఇన్‌స్పెక్టర్‌. తల్లి ప్రైవేట్‌ మెడికల్‌ ప్రాక్టీషనర్‌. వేణుకి అక్క, ఇద్దరు అన్నయ్యలు, ఓ చెల్లి ఉన్నారు. చిన్నప్పట్నుంచి టీచర్లనీ, స్నేహితుల్నీ, తల్లి సావిత్రి దగ్గరకు వైద్యానికి వచ్చే పేషెంట్లనీ అనుకరిస్తుండేవాడు వేణుమాధవ్‌. వేణు సెవెన్త్‌ క్లాస్‌ చదువుతున్నప్పుడు ఫేమస్‌ మిమిక్రీ ఆర్టిస్ట్‌ నేరెళ్ల వేణుమాధవ్‌ కోదాడలో ఓ మ్యారేజ్‌ ఫంక్షన్‌లో మిమిక్రీ చేశారు.

అప్పట్నుంచి ఆయన్ను ఆదర్శంగా తీసుకుని మిమిక్రీ చేసేవారు. అయితే మిమిక్రీని ఓ వృత్తిగా తీసుకున్నది మాత్రం ఇంటర్‌లోనే. హైదరాబాద్‌లో గణేష్‌ ఉత్సవాల్లో మిమిక్రీ చేసేవారు. బీకాం తర్వాత సీఏ చదవాలని బలమైన కోరిక ఉన్నా ఆర్థిక ఇబ్బందుల వల్ల చదవలేకపోయారు వేణు. డిగ్రీ తర్వాత ముంబయ్‌ వెళ్లి ‘టాకింగ్‌ డాల్‌’ తెచ్చుకుని, ప్రోగ్రామ్స్‌ చేయడం మొదలుపెట్టారు. రచయిత దివాకర్‌బాబుకి రవీంద్రభారతిలో జరిగిన సన్మానంలో వేణు ప్రతిభ చూసిన డైరెక్టర్‌ ఎస్వీ కృష్ణారెడ్డి, నిర్మాత అచ్చిరెడ్డి ‘సంప్రదాయం’ (1996) సినిమాలో అవకాశం ఇచ్చారు.

సినిమా పూర్తయ్యాక డబ్బింగ్‌ చెప్పేందుకు థియేటర్‌కి వెళ్లిన వేణుమాధవ్‌ తొలిసారి తెరపై తన బొమ్మ చూసుకోవడంతో ఎగ్జయిట్‌ అయిపోయి డబ్బింగ్‌ చెప్పలేకపోయారట. చివరికి ఆయన పాత్రకి కాదంబరి కిరణ్‌తో చెప్పించారు. మొదటి సినిమా రిలీజ్‌ కాకముందే వేణుమాధవ్‌కి అవకాశాలు వచ్చాయి. రోజుకి లెక్కలేనన్ని లొకేషన్స్‌లో షూటింగ్‌ చేస్తూ, కారులోనే టిఫిను, భోజనం చేసేవారు. అప్పుడు కొంచెం అలసటగా అనిపించినా మళ్లీ ఇలాంటి అవకాశం రాదేమో అని కష్టపడేవాడినని పలు సందర్భాల్లో వేణుమాధవ్‌ చెప్పారు.

హైట్‌ విషయంలో ఎప్పుడూ బాధపడలేదాయన. ‘ఎత్తున్న హీరోలు వినోదం పండిస్తే ప్రేక్షకులు చూస్తారా? వాళ్లు హీరోగానే చేయాలి. హీరోగా అయితే ఏడాదికి మూడు, నాలుగు చిత్రాలు చేస్తారేమో. కానీ, నేను దాదాపు 10–15ఏళ్లు ఏడాదికి 40– 50 సినిమాలు చేశా’ అని పలు ఇంటర్వ్యూల్లో చెప్పారాయన. దాదాపు 600 సినిమాలు చేశారు. ఆయన్ని నటుడిగా పరిచయం చేసిన ఎస్వీ కృష్ణారెడ్డి ‘హంగామా’ సినిమాతో హీరోని కూడా చేశారు. ఆ తర్వాత ‘భూ కైలాస్, ప్రేమాభిషేకం’ చిత్రాల్లో సోలో హీరోగా నటించారు వేణుమాధవ్‌.

‘ప్రేమాభిషేకం’ సినిమాని ఆయనే నిర్మించడం విశేషం. వినాయక్‌ దర్శకత్వంలో 2006లో వచ్చిన ‘లక్ష్మి’ చిత్రానికి ఉత్తమ హాస్యనటుడిగా నంది అవార్డును అందుకున్నారు వేణుమాధవ్‌. సీమాంధ్ర ఉద్యమం సమయంలో తనకు కొంచెం అవకాశాలు తగ్గాయని ఆ మధ్య చెప్పారు. వేణుమాధవ్‌ సేవా కార్యక్రమాలు కూడా చేసేవారు. కరీంనగర్‌ జిల్లా జమ్మికుంటలో తండ్రి ప్రభాకర్‌ జ్ఞాపకార్థం, తల్లి సావిత్రి పేరుతో కళ్యాణ మండపం, కళా వేదిక కట్టించారు. ‘వేణుమాధవ్‌ చారిటబుల్‌ ట్రస్ట్, వేణుమాధవ్‌ ఫ్రెండ్స్‌ సర్కిల్‌’ పేర్లతో సేవాకార్యక్రమాలు చేసేవారాయన. గుణశేఖర్‌ దర్శకత్వంలో 2015లో వచ్చిన ‘రుద్రమదేవి’ తర్వాత వేణుమాధవ్‌ సినిమాలకు దూరంగా ఉంటున్నారు.

సినీ ప్రముఖుల సంతాపం
వేణుమాధవ్‌ మృతిపట్ల తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్, హీరోలు చిరంజీవి, పవన్‌ కల్యాణ్, మహేశ్‌బాబు, రాజశేఖర్, శ్రీకాంత్, దర్శకుల సంఘం అధ్యక్షుడు ఎన్‌.శంకర్, డైరెక్టర్‌ ఎస్వీ కృష్ణారెడ్డి, నిర్మాత అచ్చిరెడ్డి, ‘మా’ జనరల్‌ సెక్రటరీ జీవితా రాజశేఖర్, నటులు అలీ, శివాజీరాజా, ఉత్తేజ్, మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌తో పాటు పలువురు సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేయడంతో పాటు ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement