28లో 22 హిట్‌... గ్రేట్‌ గ్రాఫ్‌ | Producer Dil Raju Birthday Special Interview | Sakshi
Sakshi News home page

28లో 22 హిట్‌... గ్రేట్‌ గ్రాఫ్‌

Published Mon, Dec 18 2017 12:16 AM | Last Updated on Mon, Aug 20 2018 7:19 PM

Producer Dil Raju Birthday Special Interview - Sakshi

‘‘ఒక ప్రాజెక్ట్‌ ప్రాఫిట్‌లో ఉంటేనే నా దృష్టిలో అది సక్సెస్‌ఫుల్‌ సినిమా. ఎందుకంటే ఇది వ్యాపారం. డబ్బు పోగొట్టుకుని సినిమాలు తీయడానికి ఎవరూ సిద్ధంగా ఉండరు. డబ్బు పోతే ఇండస్ట్రీలో ఎవరూ ఉండరు. అల్టిమేట్‌గా డబ్బు కావాల్సిందే. సినిమా తీయడానికి ఎంత? కరెక్ట్‌ కలెక్షన్‌ ఎంత? ఈ రెండే ‘దిల్‌’ రాజుగా నాకు అవసరం. డిస్ట్రిబ్యూటర్‌గా, నిర్మాతగా నాది డబుల్‌ రోల్‌.

నిర్మాతగా నా డిస్ట్రిబ్యూటర్స్‌ను కాపాడుకోవడానికే ట్రై చేస్తాను. సినిమా తీస్తున్నప్పుడు కథ ఎంత ముఖ్యమో, బడ్జెట్‌ కూడా అంతే ముఖ్యం’’ అన్నారు నిర్మాత ‘దిల్‌’ రాజు. డిస్ట్రిబ్యూటర్‌గా కెరీర్‌ను స్టార్ట్‌ చేసిన ఆయన సక్సెస్‌ఫుల్‌ నిర్మాతగా పాతిక పైగా సినిమాలు తీశారు. ఈ ఏడాది ‘శతమానం భవతి’కి నేషనల్‌ అవార్డు కూడా సాధించారు. నేడు ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆదివారం ‘దిల్‌’ రాజు మీడియాతో పలు విశేషాలు పంచుకున్నారు.

► నిర్మాతగా పద్నాలుగేళ్ల కెరీర్‌లో 28 సినిమాలు చేశా. డిస్ట్రిబ్యూటర్‌గా 22 ఏళ్ల కెరీర్‌. ఈ జర్నీలో ఎత్తుపల్లాలు ఉన్నాయి. నేను ప్రొడ్యూస్‌ చేసిన 28 సినిమాల్లో 22 చిత్రాలు సక్సెస్‌ టాక్‌ తెచ్చుకోవడం గ్రేట్‌ గ్రాఫ్‌. హ్యాపీగా ఉంది. ఈ ఏడాది ప్రొడ్యూసర్‌గా సక్సెస్‌ అయ్యాను కానీ డిస్ట్రిబ్యూటర్‌గా బ్యాడ్‌ ఇయర్‌. శ్రీ వెంకటేశ్యర క్రియేషన్స్‌ను 1999లో స్టార్ట్‌ చేశాం. డిస్ట్రిబ్యూటర్‌గా ఇంతటి బ్యాడ్‌ ఇయర్‌ ఇప్పటివరకు చూడలేదు. సినిమా హిట్‌ అయితే సక్సెస్‌ను తీసుకున్నప్పుడు, బ్యాడ్‌ రిజల్ట్‌ వచ్చినప్పుడు వేరే వారిని కారణంగా చూపను. ఫెయిల్యూర్‌ను కూడా తీసుకుంటాను. అయితే ఫెయిల్యూర్‌ వచ్చినప్పుడు ఎందుకు ఇలా జరిగిందని విశ్లేషించుకుంటా. ఈ ఏడాది ‘శతమానం భవతి, నేను లోకల్, డీజే, ఫిదా, రాజా ది గ్రేట్‌’ తర్వాత వస్తున్న సిక్త్‌ బాల్‌ ‘ఎంసీఏ’ కూడా సక్సెస్‌ అవ్వాలని కోరుకుంటున్నాను.   

► ఒక సినిమా కలెక్షన్‌ స్టామినా ఏంటో తెలియాలంటే వన్‌ వీక్‌ పడుతుంది. బాలీవుడ్‌లో ఉన్నట్లు ఏ సినిమాకైనా గ్రాస్‌ కలెక్షన్‌ చెప్పాలి. హైర్‌లు, షేర్‌ గ్యారెంటీలు కలుపుకుని ఫస్డ్‌ డే కలెక్షన్‌ ఫిగర్స్‌ చెప్పుకోకూడదు. వీటి వల్ల అంతగా ఉపయోగం లేదు. ఈ మార్పు ఇండస్ట్రీలో రావాలని కోరుకుంటున్నాను.

► సినిమా డిజిటల్‌ రైట్స్‌ను అమ్మడానికి టైమ్‌ లిమిట్‌ సెట్‌ చేయాలనుకుంటున్న కొందరి నిర్మాతల నిర్ణయం సరైనదే. కానీ సినిమా రిలీజైన రోజునే పైరసీ వస్తోంది. అలా కాకుండా ఆడియన్స్‌ డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌లో సినిమాను కొనుక్కుని చూడటంలో తప్పులేదనిపిస్తోంది. పైరసీ రూపంలో సినిమాను అన్‌ అఫీషియల్‌గా చూస్తున్నారు. కాంట్రవర్సీ చేయడం కాదు. నిర్మాతగా డిజిటల్‌ రైట్స్‌ను అమ్మడం ఆపుదామని కాదు. మేజర్‌ డ్యామేజ్‌ జరిగేది పైరసీ వల్లే అన్నది నా అభిప్రాయం. డిస్ట్రిబ్యూటర్స్, ప్రొడ్యూసర్స్‌ కలసికట్టుగా ఫైట్‌ చేసి పైరసీ భూతాన్ని ఇండస్ట్రీ నుంచి తరిమేయాలి.

► ఇండస్ట్రీకి వచ్చే కొత్త నిర్మాతలు సక్సెస్‌ అయిన సినిమాలను కాదు.. ఫెయిల్‌ అయిన సినిమాలు తీసుకుని విశ్లేషించుకోవాలి. ఆడని సినిమాల లిస్ట్‌ తీసుకుని ఎందుకు ఆడలేదని చెక్‌ చేసుకుంటే బెటర్‌. కొంత వరకు డబ్బు సేవ్‌ అవుతుంది.

► వచ్చే ఏడాది మా బ్యానర్‌ నుంచి ఇద్దరు కొత్త డైరెక్టర్లు వస్తున్నారు. కొత్త  డైరెక్టర్‌ శశి ‘అదే నువ్వు అదే నేను’ చేస్తున్నాడు. హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో శర్వానంద్, నితిన్‌ హీరోలుగా ‘దాగుడు మూతలు’ సినిమా నిర్మించబోతున్నా. అనుకోని కారణాల వల్ల కమల్‌హాసన్‌గారు, శంకర్‌ల కాంబినేషన్‌ ‘ఇండియన్‌ 2’ ప్రాజెక్ట్‌ నుంచి తప్పుకున్నాను.

► మహేశ్‌బాబుకి నిర్మాత అశ్వినీదత్‌గారితో కమిట్‌మెంట్‌ ఉంది. డైరెక్టర్‌ వంశీతో నాకు కమిట్‌మెంట్‌ ఉంది. అలా అశ్వినీదత్‌గారు, నేను కలసి ఈ సినిమా నిర్మించబోతున్నాం. ఏప్రిల్‌లో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లొచ్చు. పవన్‌ కల్యాణ్‌తో సినిమా అంటే.. చేయాలని నాకూ ఉంది. టైమ్, కథ కుదిరితే సెట్స్‌పైకి వెళతాం.

► నితిన్‌ హీరోగా మేం చేయబోతున్న ‘శ్రీనివాస కల్యాణం’ సినిమాకి అడిగితే, హీరోయిన్‌ సాయిపల్లవి రిజెక్ట్‌ చేసిందన్న వార్తలు వచ్చాయి. అందులో నిజం లేదు. అసలు సాయి పల్లవికి ఈ సినిమా కథ కూడా తెలియదు. అంతేకాదు సాయి పల్లవి షూటింగ్‌ స్పాట్‌కు లేట్‌గా వస్తుందన్న రూమర్లు వచ్చాయి. ‘ఫిదా’ చూశాను. ‘ఎంసీ ఏ’ చుశాను. తను కరెక్ట్‌గా ఉంటుంది. నా బ్యానర్‌లో మరో సినిమా చేయబోతోంది. బిజీగా ఉండి కూడా సాయిపల్లవి ‘ఎంసీఏ’ సినిమాకి డేట్స్‌ సర్దుబాటు చేసింది. నిర్మాతగా ఇన్ని సినిమాలు చేస్తున్నారు. డైరెక్షన్‌ చేసే ఉద్దేశం ఉందా? అన్న ప్రశ్నకు – ‘నో యాక్టింగ్‌.. నో డైరెక్షన్‌’ అన్నారు.


ఒకే డేట్‌లో రెండు సినిమాలను రిలీజ్‌ చేయడం కరెక్ట్‌ కాదు. కానీ వేరే డేట్‌ లేనప్పుడు, హాలీడేస్‌ వచ్చి కుదరనప్పుడు తప్పని పరిస్థితి ఇది. ఆల్టర్‌నేట్‌ డేట్స్‌పై అందరికీ ప్రాబ్లమ్‌ ఉంది. డిజిటల్‌ సర్వీస్‌ ప్రొవైడర్స్‌ రేట్స్‌ వల్ల మార్చి ఫస్ట్‌ నుంచి థియేటర్ల మూసివేత అన్న విషయం పూర్తి స్థాయిలో నా వరకు రాలేదు. ఒకవేళ డిజిటల్‌ సర్వీస్‌ ప్రొవైడర్లు ఎక్కువ వసూలు చేస్తే మార్చి ఫస్ట్‌ నుంచి ఎలా ఉండబోతుందన్న విషయం నిర్మాతలందరూ కలసి మీటింగ్స్‌లో తేలుస్తారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement