పండగ చేసుకుంటున్నాడు!
పుట్టినరోజు పండగే... ఇంట్లోవాళ్లకీ ఆప్తులకీ పండగే... వెండితెర మీద, టీవీలో ధ్వనితో సంపాదించుకున్న పెద్ద తెలుగు కుటుంబానికి ఇంకా పెద్ద పండగే... సాయికుమార్‌తో ‘బర్త్‌డే’ ఎక్స్‌క్లూజివ్...
పుట్టినరోజు విశేషాలేంటి సాయిగారు?
ఈ ఏడాది బాగుందండి. అదే విశేషం. తెలుగులో ‘పటాస్’, ‘పండగ చేస్కో’, కన్నడంలో ‘రంగి తరంగ’ విజయాలతో చాలా ఆనందంగా ఉన్నాను. నటుడిగా నాలో మరో కోణాన్ని చూపించిన చిత్రం ‘పండగ చేస్కో’. ఇలాంటి అన్నయ్య ఉంటే బాగుంటుందని ఈ చిత్రంలో నా పాత్ర చూసిన ఆడవాళ్లు అంటున్నారు. అలాగే, ‘రంగి తరంగ’లో చేసిన పోస్ట్ మాస్టర్ క్యారెక్టర్ నటుడిగా చాలా ఆనందాన్నిచ్చింది. ఎక్కువ చెబుతున్నానని అనుకోకుంటే ఓ మాట చెబుతా. ఈ చిత్రానికి ‘జాతీయ అవార్డు’ అందుకుంటాననే నమ్మకం ఉంది.
ప్రస్తుతం ఏమేం సినిమాలు చేస్తున్నారు?
అల్లు అర్జున్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం చేస్తున్నా. అల్లు అర్జున్ కాంబినేషన్లో చేయడం ఇదే మొదటిసారి. ఇంకా సుధీర్‌బాబు సినిమా, ‘పటాస్’ కన్నడ రీమేక్ ‘పటాకీ’లో నటిస్తున్నా. ఇంకొన్ని సినిమాలు ఉన్నాయి.
వరుసగా సినిమాలు చేస్తున్నప్పటికీ తెలుగు పరిశ్రమ మీలోని నటుణ్ణ్ణి పూర్తిగా వాడుకోవడంలేదనిపిస్తోంది?
ఆ ఫీలింగ్ నాకూ ఉంది. నటుడిగా నాకింకా సంతృప్తి లభించలేదు. నా అదృష్టం ఏంటంటే ఇటు తెలుగుతో పాటు అటు కన్నడంలో కూడా సినిమాలు చేస్తున్నాను కాబట్టి, నా ఎనర్జీ లెవల్స్ తగ్గడంలేదు. బిజీగా ఉంటున్నాను కాబట్టి, డిప్రెషన్‌లోకి వెళ్లే అవసరంలేకుండా పోతోంది (నవ్వుతూ). ఈ ఏడాది మలయాళ సినిమా కూడా చేయబోతున్నా.
మీ ఏజ్‌లో ఉన్న క్యారెక్టర్ నటులు మనకు చాలా తక్కువ ఉన్నారు. జగపతిబాబు కథకు కీలకంగా నిలిచే మంచి పాత్రలు చేస్తున్నారు. మీరూ ఆ రూట్‌లో వెళ్లాలనుకోవడంలేదా?
రియాల్టీని అంగీకరించకపోతే హాస్యాస్పదంగా ఉంటుంది. నా కొడుకు హీరో అయిన తర్వాత కూడా ఇంకా నేనూ హీరోగా కొనసాగాలనుకుంటే ఎలా? నాకు చాలెంజింగ్ రోల్స్ చేయాలని ఉంది. వాస్తవానికి హీరోగా నేను పెద్ద డెరైక్టర్స్‌తో చేయలేదు. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా అప్పుడప్పుడూ పెద్ద సినిమాలు చేస్తున్నాను. ఏం చేసినా కమర్షియల్‌గా బాగా సక్సెస్ అయ్యే సినిమా చేయడం ముఖ్యం. అప్పుడు బ్రేక్ వస్తుంది. అలాంటి ఓ కొత్త బ్రేక్ వస్తుందని నమ్ముతున్నాను.
మీకని మాత్రమే కాదు.. మీ తమ్ముళ్లు రవిశంకర్, అయ్యప్ప శర్మలకు కూడా తెలుగులో పెద్ద బ్రేక్ రాకపోవడానికి కారణం ఏంటి?
ఆ దేవుడి దయవల్ల రవిశంకర్ చేతిలో ప్రస్తుతం 18 సినిమాలున్నాయి. కన్నడ రంగంలో నెగటివ్, పాజిటివ్ ఏ రోల్‌కైనా రవిశంకర్‌ని తీసుకుంటారు. తెలుగులో మాత్రం డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా బిజీగా ఉన్నాడు. తెలుగులో ఎందుకు అవకాశాలు రావడంలేదనే విషయానికి ఎవర్నీ నిందించలేం. కమర్షియల్ సక్సెస్ ఉండాలి కదా. ఏది ఏమైనా కన్నడ రంగం ఆశీర్వాదం రవిశంకర్‌కి ఉంది. అయ్యప్ప విషయానికి వస్తే, ఈ మధ్య తన దర్శకత్వంలో కన్నడంలో రూపొందిన ‘వరదనాయక’ పెద్ద హిట్. రవిని ఆదరించినట్లుగానే అయ్యప్పను కూడా కన్నడ రంగం ఆదరిస్తోంది. విచిత్రం ఏంటంటే.. ఇంట గెలిచి రచ్చ గెలవమంటారు. మేం రచ్చ గెలుస్తున్నాం.
మీ తనయుడు ఆది విషయానికొస్తే.. తను ఎంతవరకు సక్సెస్ అయ్యాడనుకుంటున్నారు? ఆది కెరీర్‌పట్ల మీరు సంతృప్తిగానే ఉన్నారా?
ఏ ఆర్టిస్ట్‌ని అయినా ముందు ప్రేక్షకులు అంగీకరించాలి. ఆ విధంగా చూస్తే, ఆదిని ప్రేక్షకులు ఆమోదించారు. ఇవాళ తన సినిమా విడుదలైందంటే, మొదటి షో హౌస్‌ఫుల్ అవుతోంది. ప్రేక్షకుల నుంచి వాడు పొందిన అభిమానం అది. హీరోగా పెద్ద కమర్షియల్ బ్రేక్ రావాల్సిన అవసరం ఉంది. త్వరలో అది జరుగుతుందని నమ్ముతున్నా.
ఆది చేసే సినిమాల విషయంలో మీ జోక్యం ఎంతవరకూ ఉంటుంది?
ముందు వాడే కథ వింటాడు. ఎందుకంటే, ఈ జనరేషన్ ఆలోచనలు వేరే విధంగా ఉంటాయి. ఆదికి నచ్చితే ఆ తర్వాత నేను వింటాను. ఏమైనా సలహాలివ్వాలనిపిస్తే, ఇస్తాను. అది కూడా ఫ్రెండ్లీగానే. జడ్జిమెంట్ ఎంత కష్టం అనేది వాడికి తెలుస్తోంది. రెండు కథల విషయంలో దెబ్బ తిన్నాడు. ఇప్పుడిపు్పుడే నేర్చుకుంటున్నాడు.
మీ పిల్లల దగ్గర మీరు చాలా ఫ్రెండ్లీగా ఉంటారనిపిస్తోంది?
అవును. తండ్రిగా ఆజ్ఞాపించడంకన్నా ఓ మంచి స్నేహితుడిలా ఏం చేయాలి? ఏం చేయకూడదో వివరించి చెబుతాను. మా అమ్మాయి జ్యోతి, అబ్బాయి అది.. ఇద్దరూ నాతో ఫ్రెండ్లీగా ఉంటారు.
మామగారిగా మీరెలా ఉంటారు?
మా ఇద్దరి పిల్లల్ని జీవితాంతం ప్రేమించే మరో ఇద్దరు పిల్లలు (అల్లుడు, కోడలు) మా ఇంటికి వచ్చారని భావిస్తాను. మేం మా నాన్నగారి మాట వినేవాళ్లం. ఇప్పుడు నా పిల్లలు కూడా అంతే. నేను నాన్న చూసిన అమ్మాయినే చేసుకున్నాను. నా పిల్లలు కూడా మేం చూసిన సంబంధాలను కాదనలేదు. లవ్ మ్యారేజ్ తప్పని చెప్పడంలేదు కాదు కానీ, నేను మా అమ్మా నాన్నల అభిప్రాయాలను అంగీకరించినట్లుగానే ఇప్పుడు నా పిల్లలు కూడా నా అభిప్రాయాలను గౌరవిస్తుంటారు.
ఓ కోడలికి, అల్లుడికి మామగారు అని మిమ్మల్ని సంబోధిస్తుంటే.. మీ వయసు చాలా పెద్దదిగా అనిపిస్తోంది.. ఇంతకీ మీ వయసు?
54 నిండాయి. మా నాన్నగారు (పి.జె.శర్మ) ఎప్పుడూ ఏమనేవారంటే, మనకు యాభైఏళ్లు వచ్చేసరికి మన పిల్లలు చేతికి అంది రావాలని. మా నాన్నగారికి మేం అలానే. 24ఏళ్ల వయసులోనే నాన్నగారు నాకు పెళ్లి చేసేశారు. దాంతో నాకు యాభైఏళ్లు వచ్చేసరికి మా పిల్లలు చేతికంది వచ్చారు. నటుడిగా కొంత అసంతృప్తి ఉన్నప్పటికీ కుటుంబపరంగా ఫుల్ హ్యాపీ.
అఫ్‌కోర్స్ వ్యక్తిగత జీవితం బాగుంటేనే కెరీర్‌పరమైన ఆనందాన్ని ఆస్వాదించే వీలు ఉంటుంది.. అసంతృప్తిని కూడా అధిగమించేయొచ్చు కదా?
అది వంద శాతం నిజం. ముందు వ్యక్తిగత జీవితం బాగుండాలండి. ఆ పరంగా చూస్తే, నాది సంపూర్ణమైన జీవితం. ఆ విషయంలో నేను చాలా లక్కీ.
డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా, నటుడిగా, ఫ్యామిలీ మ్యాన్‌గా మీరు పొందిన సంతృప్తికి మార్కులు వేసుకోమంటే?
డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా పదికి తొమ్మిది, నటుడిగా ఏడు, ఫ్యామిలీ మ్యాన్‌గా పదికి పది మార్కులు వేసుకుంటాను.
సినిమాలతో పాటు టీవీ షోస్ చేస్తున్నారు. ఎందులో ఆనందం లభిస్తోంది?
నా గొంతు నన్ను అందరికీ దగ్గర చేసింది. సినిమాల్లో నేను చేసే పాత్రలు నన్ను మాస్‌కి దగ్గర చేశాయి. టీవీ నన్ను మొత్తం ఫ్యామిలీకి దగ్గర చేసింది. ఓవరాల్‌గా చెప్పాలంటే నేను అందరికీ దగ్గరయ్యాను. 1972లో నాటక రంగంలోకి అడుగుపెట్టాను. 1974లో డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా ఎంటరయ్యా. 1975లో ‘దేవుడు చేసిన మనుషులు’ ద్వారా నటుణ్ణయ్యాను. ఆర్టిస్ట్‌గా నాది 40 ఏళ్ల కెరీర్. బాలనటుడిగా, నాయకుడిగా, ప్రతినాయకుడిగా, సహాయ నటుడిగా.. చేయని పాత్రలు లేవు. కానీ, నటుడిగా ఇంకా నా దాహం తీరలేదు. అదొక్కటే కొరత.
అప్పుడెప్పుడో ‘సీతాపతి’ అనే టీవీ సీరియల్‌కి దర్శకత్వం వహించారు. సినిమాలకు చేయాలని లేదా?
నాకు డెరైక్టర్ కావాలనే ఆలోచన ఉంది. జనరల్‌గా నేను షూటింగ్ లొకేషన్లో షాట్ గ్యాప్‌లో కార్‌వ్యాన్‌లోకి వెళ్లిపోయి రెస్ట్ తీసుకోను. ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉంటా. భవిష్యత్తులో ఓ సినిమాకి దర్శకత్వం వహిస్తా.
- డి.జి. భవాని