ఐశ్వర్య రాయ్ చెప్పిన కబుర్లు..
అందాల రాశి ఐశ్వర్య రాయ్ ఆదివారం 42వ పడిలో అడుగుపెట్టారు. ఓ పాపకు తల్లయ్యాక ఐదేళ్ల విరామం అనంతరం ఇటీవలే 'జబ్బా' మూవీతో తిరిగి తన కెరీర్ స్టార్ట్ చేసిన ఐశ్వర్య హిట్ కొట్టి ఉత్సాహంగా ఉన్నారు. నలభై ఏళ్లు దాటినా వన్నె తరగని అందంతో అభిమానులను అలరిస్తున్న ఐశ్వర్య పుట్టినరోజు సందర్భంగా ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలోని కొన్ని ఆసక్తికర విషయాలు మీ కోసం..
వంట విషయానికొస్తే..
'నా పెళ్లయిన తర్వాత నేను ఎలా వంట చేస్తానో తెలుసుకోవాలని చాలామంది ఆసక్తి చూపించారు. అత్తగారింట్లో అడుగుపెట్టిన తొలినాళ్లలో హల్వా చేశాను, ఆ తర్వాత ఎప్పుడో ఒకసారి బెండకాయ, పరాటా వండాను. నిజానికి నేను వంట గదిలో గడిపేది చాలా తక్కువ సమయం. కానీ ఆరాధ్య పుట్టాక చాలా మారిపోయాను. తనకు తినిపించడానికి గంట గంటలు వంటింట్లో స్పెండ్ చేశాను. ప్రొటీన్స్ అందేలా.. తనకు నచ్చేలా ఫుడ్ తయారు చేయడానికి బోలెడు ప్రయోగాలు చేశాను. ఫైనల్లీ.. ఇప్పుడు ఆరాధ్య మారాం చేయకుండా మేమంతా తినే ఆహారమే తింటుంది.'
అవే నా బెస్ట్ రోల్స్..
'ప్రపంచ సుందరి, నటీమణి, భార్య, తల్లి.. ఇవే నా బెస్ట్ రోల్స్. మిస్ వరల్డ్ టైలిల్ గెలుచుకునే ముందురోజు వరకు నేనొక సాధారణ విద్యార్థిని. కానీ ప్రపంచ సుందరి కిరీటం వరించడంతో ఒకే ఒక్క రాత్రిలో నా జీవితం మారిపోయింది. ఆ కిరీటం కీర్తితోపాటు బాధ్యతలను కూడా తెచ్చిపెట్టింది. కేవలం అందాల రాశిగా ఉండటం కాదు, ఎంతో నేర్చుకోవాలి, ఎన్నో సాధించాలి అని అర్థమైంది. అనుకోకుండా సినిమాల్లో అవకాశం.. ఆ తర్వాత కథ మీకు తెలిసిందే.
తల్లిగా నా బాధ్యతలు..
'ఆరాధ్య విషయంలో మొదటి నుంచి నేను ఓ క్లారిటీతో ఉన్నాను. తనను కేర్ టేకర్స్ వద్ద గానీ, మరే ఇతర బంధువుల వద్ద గానీ వదలడం నాకు ఇష్టం లేదు. ఓ తల్లి తన పిల్లలకు ఎలాంటి సంరక్షణ అందించాలనుకుంటుందో అవన్నీ నేను ఆరాధ్యకు ఇవ్వాలనుకున్నాను.. ఇస్తున్నాను. ఎప్పుడూ భగవంతుడికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉంటాను.. ఇటువంటి మధురమైన అనుభూతులు నాకు ప్రసాదించినందుకు'.
అభిషేక్ గురించి చెప్పాలంటే...
మంచి సహచరుడు, మంచి భర్త, .. అన్నిటికీ మించి నా బెస్ట్ ఫ్రెండ్. మేం చాలా సాధారణ దంపతులం. సరదాగా మాట్లాడుకుంటాం.. ప్రతి విషయం షేర్ చేసుకుంటాం. ముందు నేను మాట్లాడాలి అంటే.. కాదు నేను మాట్లాడాలి అంటూ పోట్లాడుకుంటాం. అన్ని మాటలుంటాయి మరి మా దగ్గర. మాట్లాడ్డమే కాదండోయ్.. మేమిద్దరం మంచి శ్రోతలం కూడా.