ఈ రోజు నాకు రెండు పండగలు: సింగీతం
‘‘సింగీతం శ్రీనివాసరావు అందరికన్నా భిన్నంగా ఆలోచిస్తారు. ఆయన ఆలోచనలెప్పుడూ పది, పదిహేనేళ్లు ముందుంటాయి. అంత ఫార్వార్డ్‌గా ఆలోచించడం ఆయన గొప్పదనం. ఈ చిత్రానికి దర్శకత్వం వహించడంతో పాటు పాటలు కూడా స్వరపరచడం గొప్ప విషయం’’ అన్నారు డా.దాసరి నారాయణరావు. శాండల్‌వుడ్ మీడియా పతాకంపై సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో భారతి, భారతీకృష్ణ నిర్మించిన చిత్రం ‘వెల్‌కమ్ ఒబామా’.
ఊర్మిళ, రేచల్, ఎస్తబన్, సంజీవ్, భువనచంద్ర, అనంతశ్రీరామ్, నిరంజని, ఆర్జే బాషా ముఖ్య తారలు. ఇటీవల హైదరాబాద్‌లో పలువురు చిత్రరంగ ప్రముఖుల కోసం ఈ చిత్రం ప్రీమియర్ షోను ఏర్పాటు చేశారు. ఈ చిత్రాన్ని తిలకించిన దాసరి పై విధంగా స్పందించారు. వాణిజ్య అంశాలతో పాటు మంచి విలువలున్న చిత్రమని పరుచూరి గోపాలకృష్ణ చెప్పారు. సింగీతం మాట్లాడుతూ - ‘‘ఈ రోజు నాకు రెండు పండగలు.
ఒకటి వినాయక చవితి అయితే మరొకటి ‘వెల్‌కమ్ ఒబామా’కు దక్కుతున్న ప్రశంసలు. ఇటీవల విడుదల చేసిన ఈ చిత్రం పాటలకు మంచి స్పందన రావడం ఆనందంగా ఉంది’’ అన్నారు. నిర్మాతలు మాట్లాడుతూ - ‘‘త్వరలో సెన్సార్ కార్యక్రమాలు పూర్తవుతాయి. ఆ తర్వాత విడుదల తేదీ ప్రకటిస్తాం. ఈ సినిమా శాటిలైట్ హక్కులను ఓ టీవీ చానల్ ఫ్యాన్సీ రేట్‌కు సొంతం చేసుకుంది. సింగీతంగారి దర్శకత్వం, ఆయన స్వరపరచిన పాటలు, కథ, నిర్మాణ విలువలు.. ఇవన్నీ ప్రేక్షకులను మెప్పిస్తాయనే నమ్మకం ఉంది’’ అన్నారు. ఈ చిత్రానికి: కెమెరా: ఎస్.ఎస్. ధర్మన్, ఎడిటింగ్: సూర్య, ఆర్ట్: వర్మ, మాటలు: రోహిణి, కథ-సంగీతం-పాటలు-దర్శకత్వం: సింగీతం శ్రీనివాసరావు.