Ananta Sriram
-
ఆయనతో పని చేయడం నా అదృష్టంగా భావిస్తున్న: అనంత శ్రీరామ్
-
వివాదంలో చిక్కుకున్న ప్రముఖ రచయిత.. ఎస్పీకి ఫిర్యాదు
సినీ రచయిత అనంత శ్రీరామ్ మరో వివాదంలో చిక్కుకున్నాడు. ఇటీవలె పాలకొల్లులో జరిగిన సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ “భట్రాజు పొగడ్తలు” అనే పదాన్ని వాడాడు. దీంతో ఆయన వ్యాఖ్యలపై సదరు కులస్తులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఆ పదం ఇప్పటికే నిషేదించగా భట్రాజులను కించపరిచే విధంగా అనంత శ్రీరామ్ వ్యాఖ్యలు చేశారంటూ ఆ కులస్తులు మండిపడుతున్నారు. నిషేధిత పదాన్ని ఉపయోగించినందున అనంత శ్రీరామ్‌పై చర్యలు తీసుకోవాలంటూ అనంతపురం ఎస్పీకి భట్రాజు కులసంఘాలు ఫిర్యాదు చేశారు. అయితే ఇప్పటికే అనంత శ్రీరామ్ సదరు వర్గానికి క్షమాపణలు చెప్పినట్లు తెలుస్తుంది. మరి ఈ వివాదం ఎంతవరకు వెళ్తుందో చూడాలి. -
అనంత శ్రీరామ్‌పై బ్రాహ్మణ సంఘాల ఆగ్రహం
నెల్లూరు: ప్రముఖ రచయిత అనంత శ్రీరామ్ చిక్కుల్లో పడ్డారు. ఇటీవలె వరుడు కావలెను సినిమాలో అనంత శ్రీరామ్ రాసిన ‘దిగు దిగు నాగ’ పాటపై తీవ్ర దుమారం చెలరేగుతోంది. దేవతలను కించపరిచేలా లిరిక్స్ ఉన్నాయంటూ అనంత శ్రీరామ్‌పై బ్రాహ్మణ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ మేరకు చిల్లకూరు పీఎస్‌లో అనంత శ్రీరామ్‌పై బ్రాహ్మణ సంఘాలు ఫిర్యాదు చేశాయి. ఒరిజినల్ పాటలో ఉన్న అద్భుతమైన భావాన్ని పాడు చేశారని, డబ్బు కోసం దేవతలకు కించపరుస్తున్నరంటూ మండిపడ్డాయి. నాగ ప్రతిమలకు ప్రత్యేక పూజలు నిర్వహించిన బ్రాహ్మణ సంఘాలు అనంత శ్రీరామ్‌కు ఉన్న మంద బుద్ది పోవాలంటూ చురకలంటించారు. వెంటనే చిత్రం నుంచి ఈ పాటను తొలగించాలని డిమాండ్ చేస్తూ వెంకటగిరిలో నిరసనకు దిగారు. ఇప్పటికే అనంత శ్రీరామ్‌పై బీజేపీ మహిళా మోర్చా నాయకురాలు నెల్లూరులోని చిల్లకూరు పోలీస్ స్టేషన్లో పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. కాగా నాగశౌర్య, రీతూ వర్మలు హీరో హీరోయిన్లుగా నటించిన వరుడు కావలెను చిత్రానికి లక్ష్మి సౌజన్య దర్శకత్వం వహించగా, సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. -
మోదీకి ప్రముఖుల లేఖ.. అనంత శ్రీరామ్ కౌంటర్
హైదరాబాద్: దేశంలో గత ఐదేళ్లుగా మూక హత్యలు పెరిగాయంటూ ప్రధాని నరేంద్ర మోదీకి 49 మంది ప్రముఖులు లేఖ రాయడం తీవ్ర దుమారం రేపుతోంది. ‘జై శ్రీరామ్’ రెచ్చగొట్టే యుద్ధ నినాదంగా మారిపోయిందని, ఆయన పేరుతో హత్యలు పెరుగుతున్నాయని, ప్రధానిగా ఈ దుశ్చర్యలను నిలువరించాలని ఆ లేఖలో పేర్కొన్నారు. అంతేకాకుండా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైనా ఒక అభిప్రాయం వ్యక్తం చేస్తే, వారిపై 'యాంటీ నేషనల్', 'అర్బన్ నక్సల్' అనే ముద్ర వేస్తున్నారని వారు ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. అయితే ప్రముఖులు లేఖలో పేర్కొన్న పలు అంశాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మూక హత్యలు ఒక మతానికే కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారని హిందుత్వ సంఘాలు మండిపడుతున్నాయి. తాజాగా పాటల రచయిత అనంత శ్రీరామ్ కూడా 49 మంది ప్రముఖులను తప్పుబట్టారు. దీనికి సంబంధించి తన అధికారిక ఫేస్బుక్ పేజిలో ‘నకిలీ మేథావులు మళ్లీ సకిలించారు’పేరిట ఓ పోస్ట్ పెట్టారు. (చదవండి: మతవిద్వేష దాడుల్ని ఆపండి!) ‘జై శ్రీరాం’ పదం నిషేధించమంటారా? ‘నకిలీ మేధావులు మళ్ళీ సకిలించారు. కుహనా లౌకికవాదులంతా కుమ్మక్కై ప్రధాన మంత్రికి ఉత్తరం రాశారట. అందులో ఏముందయ్యా అంటే "జై శ్రీరాం" అన్న పదం వల్ల ఎన్నో దారుణ మారణ కాండలు జరిగిపోతున్నాయంట. అందువల్ల ఆ పదం వల్ల జరిగే దుష్పరిణామాలు ఆపాల్సిన బాధ్యత ప్రధానమంత్రిదేనట. అంటే ఆ మహాశయులు ఇప్పుడేమంటారు "జై" అన్న పదాన్ని , "శ్రీరాం" అన్న పదాన్ని నిఘంటువుల్లోనించి నిషేధించమంటారా? ఏమో అన్నా అంటారు. మేథావులుకదా. వాళ్ళు అనేవారలు, మేము వినే వారలము. ఉరుమురిమి ఎక్కడో పడ్డట్టు చిక్కంతా వచ్చి ఇప్పుడు క్రిష్ణా రామా అనుకుంటూ శేష జీవితం ఆనందంగా గడుపుతున్న తల్లిదండ్రులని వచ్చి చుట్టుకుంటుంది. ఎందుకంటే నాపేరు "అనంత శ్రీరాం" ఈ మేధావుల మేధస్సుని అంచనా వెయ్యలేక మా తల్లిదండ్రుల్లానే ఎంతోమంది తమ పిల్లల పేర్లలో రామశబ్ధాన్ని ప్రయోగించారు. (సీతారాం ఏచూరి గారి నాన్నగారితో సహా ). ఇప్పుడు వాళ్ళంతా మా జనన ధృవీకరణ పత్రాలు మొదలుకుని ఆధార్ల వరకూ మాపేర్లు మార్చే బృహత్తర బాధ్యతని నెత్తినేసుకోవడం ఎలారా నాయనా అని నెత్తీ , నోరు బాదుకోవలసిన పరిస్థితి. అది మరి మేధావి దెబ్బంటే’అంటూ అనంత శ్రీరామ్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. -
పదములు లేని మౌనలేఖ...
పాటతత్వం చిన్నప్పటి నుంచి పుస్తకాలు బాగా చదివేవాడిని. ఈ అలవాటుతోనే కథలు రాయడం మొదలుపెట్టా. నటుడిగా ‘అష్టా చెమ్మా’ సినిమాతో తెరకు పరిచయమైనా... నా ఆలోచనలన్నీ రచన, దర్శకత్వం వైపే ఉండేవి. ఇలా కొంత హాస్యాన్ని మేళవించి... ఒక అందమైన ప్రేమకథను చూపించాలనుకుని ‘ఊహలు గుసగుసలాడే’ స్క్రిప్ట్ తయారు చేసుకున్నా. అమ్మాయిలతో ఎలా వ్యవహరించాలో బొత్తిగా తెలీని తన బాస్‌కు వాళ్లకు నచ్చేలా ఎలా ఉండాలో నేర్పుతుంటాడు కథానాయకుడు వెంకీ. వైజాగ్‌లో తన ప్రేమ గతాన్ని తల్చుకుంటూ... బాస్‌కు ప్రేమ పాఠాలు చెబుతుంటాడు. అయితే తను ప్రేమించిన అమ్మాయి ప్రభావతి... బాస్‌కు వచ్చిన పెళ్లి సంబంధంలో అమ్మాయి శిరీష ఒక్కరే అని వెంకీకి తెలీదు. ఈ సందర్భంలో వస్తుందీ పాట... మ్యూజిక్ సిట్టింగ్‌లో కూర్చోగానే... అప్పటికే తన దగ్గర ఉన్న ట్యూన్ వినిపించారు కళ్యాణ్ కోడూరి. బాగా నచ్చింది. అనంత్ శ్రీరామ్ అద్భుతంగా పాట రాశారు... చరణాలు లేకుండా మూడు పల్లవులు ఉండటం ఈ పాట ప్రత్యేకత. ఏం సందేహం లేదు... ఆ అందాల నవ్వే ఈ సందళ్లు తెచ్చింది... ఏం సందేహం లేదు.. ఆ కందేటి సిగ్గే ఈ తొందర్లు తెచ్చింది.. ఏం సందేహం లేదు.. ఆ గంధాల గొంతే ఆనందాలు పెంచింది.. ప్రేమికుడికి సందళ్లు, తొందర్లు, ఆనందాలు తెచ్చేది చెలే కదా. ఆ అందాల నవ్వులు, కందేటి సిగ్గులు, గంధాల గొంతులు... అన్నీ చెలికాడికి అపురూపమే అని తొలి పల్లవి రాశారు అనంత్ శ్రీరామ్. వెన్నెల్లో ఉన్నా వెచ్చంగా ఉంది నిన్నే ఊహిస్తుంటే... ఎందరిలో ఉన్నా ఏదోలా ఉంది నువ్వే గుర్తొస్తుంటే... నాకళ్లల్లోకొచ్చి నీ కల్లాపి జల్లి ఓ ముగ్గేసి వెళ్లావే... నిదురిక రాదు అన్న నిజమును మోసుకుంటు... మది నిను చేరుతుందె చిలకా... తనకొక తోడు లాగ వెనకనే సాగుతుంది... హృదయము రాసుకున్న లేఖా... ప్రేమలోని విరహం వెన్నెల్లో వేడిని... ఎండల్లో హాయినీ పుట్టిస్తుంది... ఎందరిలో ఉన్నా... తన మోమునే చూడాలని తహతహలాడుతుంది మనసు. ఇక ఈ తపనలో నిద్ర అనే మాటే గుర్తుకురాదు. ఈ భావాలనే అక్షరాల్లో చూపించాడు అనంత్ శ్రీరామ్. కళ్లల్లోకి వచ్చి కల్లాపి జల్లి ముగ్గేసి వెళ్లావే అనే వ్యక్తీకరణ మా అందరినీ బాగా ఆకట్టుకుంది. నీ కొమ్మల్లో గువ్వ... ఆ గుమ్మంలోకెల్లి కూ అంటుంది విన్నావా... నీ మబ్బుల్లో జల్లు... ఆ ముంగిట్లో పూలు పూయిస్తే చాలన్నావా... ఏమవుతున్నా గానీ... ఏమైనా అయిపోనీ ఏం ఫర్వాలేదన్నావా... ఈ పల్లవి కథను వివరిస్తుంది. ఇంట్లో పోరు పడలేక పెళ్లి చూపులకు వస్తుంది నాయిక ప్రభావతి. ఆ విషయం తెలీని కథానాయకుడు... బాస్‌కు సాయం చేద్దామని ప్రేమ పాఠాలు చెబుతుంటాడు... తను ప్రేమించిన గువ్వ మరో గుమ్మంలో కూయ నుంది విన్నావా అంటాడు గీత రచయిత. నీ మబ్బుల్లో జల్లులాంటి ప్రేమ మరో ముంగిట్లో పూలు పూయిస్తే చాలా అని అడిగాడు... ఇలా చిన్న చిన్న పదాల్లో కథానాయకుడి పాత్రను ప్రశ్నించాడు అనంత్ శ్రీరామ్. సాహిత్యంలో తనకున్న పట్టుకు ఈ పాట మరో నిదర్శనం. సాధ్యమైనంత తెలుగు పదాలతోనే పాటలు రాసే అనంత్ శ్రీరామ్ అంటే నాకు ప్రత్యేక అభిమానం. చిన్న వయసులోనే అపార ప్రజ్ఞను సంపాదించుకున్నారాయన. దర్శకుల ఆలోచనలను, సన్నివేశాల నేపథ్యాన్ని మనసును చదివినట్లుగా అర్థం చేసుకోగలరు. కథతో పాటే ప్రయాణించేలా ఈ పాట రాశారు. సినిమాలో చాలా ముఖ్యమైన సందర్భంలో వచ్చే ఈ పాట ఇంత హిట్ అయిందంటే... అనంత్ శ్రీరామ్ పనితనమే కారణం. ఇక సంగీత దర్శకుడు కళ్యాణ్ కోడూరి ఈ ట్యూన్ నా కోసమే ఉంచారేమో అనిపించింది. వేరే దర్శకులకు ఈ స్వరం వినిపించినా... వాళ్ల సినిమాలో సందర్భానికి సరిపోలేదట. నాయిక హృదయాన్ని ఆవిష్కరిస్తూ... చివరి పల్లవి ఇలా సాగుతుంది... అడుగులు వేయ్యలేక అటు ఇటు తేల్చుకోక సతమతమైన గుండె గనుకా.. అడిగిన దానికింక బదులిక పంపుతుంది పదములు లేని మౌన లేఖా... వైజాగ్ పరిసరాల్లో రాత్రి పూట ఈ పాట చిత్రీకరించాం. మంచి లొకేషన్లు ఎంచుకుని వారం రోజుల పాటు షూటింగ్ చేశాం. ఈ పాటకు నేనే కొరియోగ్రఫీ చేయడం మరో అనుభూతి. సినిమాలో ఈ పాట ఎంత కీలకమని మేము భావించామో... అంతే పర్ఫెక్ట్గా పాట వచ్చింది. కష్టే ఫలి అన్నట్లు సినిమాలో ఈ పాట సూపర్ హిట్. ‘ఊహలు గుసగుసలాడే’ సినిమా అంటే ‘ఏం సందేహం’ లేదు పాటే అంటుం టారు శ్రోతలు. అంతగా ఆకట్టుకుందీ పాట. సేకరణ: రమేష్ గోపిశెట్టి వారాహీ చలన చిత్రం సంస్థ పై నిర్మాత సాయి కొర్రపాటి నిర్మించిన ’ఊహలు గుసగుసలాడే’ చిన్న చిత్రాల్లో పెద్ద విజయంగా నిలిచింది. ఈ సినిమాతో నాగశౌర్య, రాశీ ఖన్నా హీరో హీరోయిన్లుగా అరంగేట్రం చేశారు. నాగశౌర్య, రాశీ ఖన్నా ఇద్దరికీ ఈ సినిమా మంచి పునాది అయ్యింది. రాశీ ఖన్నా పెద్ద హీరోల సరసన నటిస్తుండగా...నాగశౌర్య హీరోగా నిలదొక్కుకున్నాడు. దర్శకుడిగా అవసరాల శ్రీనివాస్‌కు మొదటి చిత్రమిదే. తొలి సినిమా అయినా... కథను స్పష్టంగా తెరకెక్కించాడు. పాటల చిత్రీకరణలో దర్శకుడు వంశీ శైలిని ప్రదర్శించాడు. దర్శకత్వం వహిస్తూనే అవసరాల శ్రీనివాస్ ఓ ముఖ్య పాత్రలో నటించారు. అమాయకత్వం, హాస్యం, కొంత స్వార్థం కలిసిన ఆ క్యారెక్టర్లో అంతే బాగా నటించారు. - అనంత శ్రీరామ్, గేయ రచయిత - అవసరాల శ్రీనివాస్, నటుడు, దర్శకుడు -
స్టార్ రిపోర్టర్ అనంత శ్రీరాం
టీవీలో ఇంట్రెస్టింగ్ సీరియల్ వస్తున్నసమయంలో కరెంట్ పోతే.. ‘ఈ కరెంటోళ్ల కడుపుకాలా...’ అని తిట్టుకుంటాం. మెగా క్రికెట్ సీజన్ మొదలైంది. ఆట మధ్యలో టీవీ ఆఫ్ అయ్యిందా.. కరెంటు వారిని నోటికొచ్చినట్టు తిట్టుకుంటాం. మన తిట్లు విద్యుత్‌శాఖ అధికారులకు తగులుతున్నాయో లేదో తెలియదు కానీ ఇరవై నాలుగు గంటలూ కరెంట్ స్తంభాలపై పనిచేస్తున్న విద్యుత్ కాంట్రాక్టు కార్మికులపాలిట శాపాలుగా మారుతున్నాయి. ప్రాణాన్ని అరచేతిలో పెట్టుకుని విద్యుత్ తీగలను పట్టుకునే ఈ కార్మికులను సాక్షి సిటీప్లస్ తరఫున స్టార్ రిపోర్టర్‌గా పలకరిస్తున్నందుకు హ్యాపీగా ఉందంటూ సినీగేయ రచయిత అనంతశ్రీరాం తన ఇంటర్వ్యూ మొదలుపెట్టారు.. అనంతశ్రీరాం: భయ్యా నీ పేరేంటి? నీ చేయి ఒకటి లేదు.. ఏం జరిగింది..? నా పేరు బాలస్వామి సార్. 13 ఏళ్ల కిందట ఈ పనిలోకి వచ్చాను. 2009లో కరెంట్ షాక్ తగిలి ఇదిగో ఇలా వికలాంగుడిని అయ్యాను. అనంతశ్రీరాం: ప్రమాదం ఎలా జరిగింది..? బాలస్వామి: నర్సాపల్లిలో జరిగింది. ఓ రోజు రాత్రి 11 గంటలకు కరెంట్ పోయిందని కంప్లైంట్ వచ్చింది. సింగిల్ ఫేజ్ లైనది. జంపర్ మారిస్తే సరిపోతుంది. ఆ పనిలో ఉండగా, ఒక్కసారిగా షాక్ కొట్టింది. చేయి పూర్తిగా మాడిపోయింది. కిందపడిపోయి స్పృహ కోల్పోయాను. ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కడుపు మీద కూడా గాయమైంది. షాక్ తీవ్రతకు పొట్టలోపలి పేగులు కూడా పాడైపోయాయి. కోలుకోవడానికి రెండేళ్లు పట్టింది. అనంతశ్రీరాం: మీకు ఇన్సూరెన్స్, ఉచిత వైద్యం వంటివి ఏమీ ఉండవా..? బాలస్వామి: ఏమీ ఉండవు సార్. నెల నెల ఇన్సూరెన్స్ కోసమని జీతంలో కొంత కట్ చేస్తారు. కౌష్: మా జీతాలు రూ.6 వేల నుంచి రూ.8 వేల వరకూ ఉంటాయి. అందులో పీఎఫ్, ఇన్సూరెన్స్ పేరుతో వెయ్యో, పదిహేను వందలో కట్ చేస్తారు. కానీ ఆపద వచ్చినప్పుడు మాత్రం ఏ సాయమూ అందదు. రాములు: కొందరు కాంట్రాక్టర్లు మా జీతాల్లో డబ్బులు కట్ చేస్తున్నారు. కానీ, మా పేరిట ఎలాంటి ఇన్సూరెన్స్ కట్టడం లేదు. అదేంటని గట్టిగా అడిగితే ఉద్యోగం నుంచి తీసేస్తున్నారు. అనంతశ్రీరాం: ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు వివరించారా..? బాలస్వామి: కొందరు అధికారులదీ ఇదే తంతు సార్. వాళ్లు కూడా కాంట్రాక్టర్లకే వత్తాసు పలుకుతారు. అనంతశ్రీరాం: మీక్కూడా గాయాలయినట్టున్నాయి. పొట్టంతా కాలిపోయింది. కౌష్: ఓ రోజు భారీ వర్షం. ఇరవై, ముప్పై కంప్లయింట్స్ వ చ్చాయి. కరెంట్ సప్లయ్ ఆపేసి స్తంభం ఎక్కాను. రిపేర్ చేస్తుంటే ఏం జరిగిందో తెలియదు.. రెండు రోజుల తర్వాత కళ్లు తెరిచి చూసే సరికి కేర్ ఆస్పత్రిలో బెడ్ మీద పడున్నాను. వైరు నేరుగా పొట్టకు తగలడంతో బాగా కాలిపోయింది. ఆ గాయాల నొప్పి భరించలేక ఆస్పత్రిలో రెండుసార్లు ఆత్మహత్యకు ప్రయత్నించాను. నన్ను బెడ్‌కు కట్టేసి వైద్యం అందించారు. ఆ దెబ్బతో ఉద్యోగం పోయింది. మళ్లీ ఇప్పుడు ఇదే పని చేస్తున్నాను. అనంతశ్రీరాం: ఇలాంటి వృత్తినే ఎందుకు ఎంచుకున్నారు? రవి: ఎందుకంటే మేమేమన్నా డిగ్రీలు చే శామా సార్ ? ఏదో ఈ పని నేర్చుకున్నం. పేదోడికి దొరికిందే పని అనుకున్నం. అనంతశ్రీరాం: అసలు మీ పని గంటలు ఎలా ఉంటాయి? ఖాదర్: 24 గంటలూ ఆన్ డ్యూటీయే. ఎప్పుడు పిలిస్తే అప్పుడు పరుగెత్తాలి. రాత్రి పూట కరెంట్ పోతే మీరు క్యాండిల్ వెలిగించుకుంటారు. మేం మాత్రం ఫోన్ ఎక్కడి నుంచి వస్తుందా అని ఎదురు చూస్తం. ఫోన్‌రాగానే ఆ ఏరియాకు వె ళ్లిపోతాం. మల్లేష్: మేం అక్కడికి చేరుకునే లోపే.. ఫోన్ల మీద ఫోన్లు చేస్తరు. ఇంత లేటేందని తిడుతుంటరు. ఒక్కోసారి కొట్టడానికి మీదికి వస్తరు. అనంతశ్రీరాం: అది చాలా తప్పు. చేసే పని ఆగిపోయిందనో, చూసే సినిమా మిస్ అయిందనో మనమంతా కరెంట్ వాళ్లను తిట్టుకుంటాం. వారి పరిస్థితి ఇలా ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో మీరు త్వరగా స్పందిస్తారని మెచ్చుకుంటారు. ఇంకొన్ని ఏరియాల్లో ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందించరని అంటుంటారు. వెంకటేష్: ఏముంది సార్. వీఐపీ ఏరియాల్లో కంప్లయింట్ వచ్చిన పది నిమిషాల్లో పనైపోతుంది. మామూలు ఏరియాల్లో కాస్త టైం పడుతుంది. అనంతశ్రీరాం: అన్ని ప్రాంతాల్లో ఒకేలా పని చేయాలి కదా..! వెంకటేష్: కార్మికుల సంఖ్య పెంచాలి సార్. కాంట్రాక్టర్లు డబ్బుల కోసం ఒక్కరితో నలుగురి పని చేయించుకుంటున్నారు. అనంతశ్రీరాం: మరి ఈ సమస్యకు పరిష్కారం ఏంటి? వీరస్వామి: మమ్మల్ని రెగ్యులరైజ్ చేయాలి సార్. అనంతశ్రీరాం: ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారా? బాలస్వామి: దీనిపై ఏళ్లుగా పోరాడుతున్నాం. అధికారులను కలవని రోజు లేదు. నాగరాజు: సార్ నేను తెలంగాణ విద్యుత్ కాంట్రాక్టర్ల అధ్యక్షుణ్ని. అన్ని రకాల వృత్తుల వారూ సమ్మెలకు దిగుతారు. మేం అలా చేస్తే ఎవరింట్లో లైట్ వెలగదు. అందుకే ధర్నాల ద్వారా మా నిరసన వ్యక్తం చేస్తుంటాం. అనంతశ్రీరాం: అమ్మా మీ గురించి చెప్పండి? సుగుణ: నా భర్త పేరు గోపాల్‌రెడ్డి. కాంట్రాక్ట కార్మికునిగా పని చేసేవాడు. కరెంట్ వైర్లే మా వారి పాలిట చితిగా మారాయి. షాక్ తగిలి పోల్ మీదే ప్రాణాలు విడిచాడు. షాక్ తీవ్రతకు మా ఆయన శరీరం మాడిపోయింది సార్. ఆయన్ని స్తంభం నుంచి దించడానికి ఐదుగంటలు పట్టింది (కళ్ల నీళ్లతో...). అనంతశ్రీరాం: పిల్లలుఉన్నారామ్మా? సుగుణ: ఇద్దరు సార్. నేను పదో తరగతి తర్వాత ఐటీఐ ఎలక్ట్రానిక్స్ చదువుకున్నాను. ఈ శాఖలోనే ఏదైనా చిన్న ఉద్యోగం ఇవ్వమని అడిగితే ఎవరూ కనికరించలేదు. స్వీపర్‌గా పని చేసుకుంటూ పిల్లల్ని పెంచుకుంటున్నాను. ఆయన పోయి పదేళ్లవుతుంది. అనంతశ్రీరాం: అయ్యో ! చెప్పండి మీరంతా ప్రభుత్వం నుంచి, ప్రజల నుంచి ఆశిస్తున్నది ఏంటి? రాములు: మా కాంట్రాక్టు కార్మికుల్ని రెగ్యులరైజ్ చేయాలి సార్. మమ్మల్ని కూడా ఉద్యోగులుగా గుర్తించాలి. కౌష్: పొద్దున ఇంటి నుంచి బయల్దేరేటప్పుడు భార్యపిల్లల్ని క ళ్లారా చూసుకుంటాం. మళ్లీ సాయంత్రం వారిని చూస్తామో లేదో తెలియని బతుకులు సార్ మావి. ఈ విషయాన్ని ప్రజలు అర్థం చేసుకుంటే చాలు. అనంతశ్రీరాం: మా ఇంట్లో వెలుగులు నింపే మీ జీవితాల్లో వెలుగులు నిండాలని కోరుకుంటున్నాను. హ్యాపీ లైఫ్. లైన్మెన్ లైన్స్ విద్యుత్‌ని అడిగావు - విజ్ఞతను మరిచావు వెలుగుల్ని అడిగావు - మా వ్యథలను విస్మరించావు నువ్వు ప్రజవైతేనేమీ నువ్వు ప్రభుతవైతేనేమీ ఎవరివైతే నాకేమీ.. నాకూ ప్రాణముందని గుర్తించు నన్ను కూడా ప్రాణప్రదంగా భావించు - అనంతశ్రీరాం ప్రజెంటేషన్: భువనేశ్వరి -
పాట వెనుక కథ - అనంతశ్రీరామ్
-
'సీతమ్మ వాకిట్లో..' పాట పుట్టిందిలా..
-
ఈ రోజు నాకు రెండు పండగలు: సింగీతం
‘‘సింగీతం శ్రీనివాసరావు అందరికన్నా భిన్నంగా ఆలోచిస్తారు. ఆయన ఆలోచనలెప్పుడూ పది, పదిహేనేళ్లు ముందుంటాయి. అంత ఫార్వార్డ్‌గా ఆలోచించడం ఆయన గొప్పదనం. ఈ చిత్రానికి దర్శకత్వం వహించడంతో పాటు పాటలు కూడా స్వరపరచడం గొప్ప విషయం’’ అన్నారు డా.దాసరి నారాయణరావు. శాండల్‌వుడ్ మీడియా పతాకంపై సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో భారతి, భారతీకృష్ణ నిర్మించిన చిత్రం ‘వెల్కమ్ ఒబామా’. ఊర్మిళ, రేచల్, ఎస్తబన్, సంజీవ్, భువనచంద్ర, అనంతశ్రీరామ్, నిరంజని, ఆర్జే బాషా ముఖ్య తారలు. ఇటీవల హైదరాబాద్‌లో పలువురు చిత్రరంగ ప్రముఖుల కోసం ఈ చిత్రం ప్రీమియర్ షోను ఏర్పాటు చేశారు. ఈ చిత్రాన్ని తిలకించిన దాసరి పై విధంగా స్పందించారు. వాణిజ్య అంశాలతో పాటు మంచి విలువలున్న చిత్రమని పరుచూరి గోపాలకృష్ణ చెప్పారు. సింగీతం మాట్లాడుతూ - ‘‘ఈ రోజు నాకు రెండు పండగలు. ఒకటి వినాయక చవితి అయితే మరొకటి ‘వెల్కమ్ ఒబామా’కు దక్కుతున్న ప్రశంసలు. ఇటీవల విడుదల చేసిన ఈ చిత్రం పాటలకు మంచి స్పందన రావడం ఆనందంగా ఉంది’’ అన్నారు. నిర్మాతలు మాట్లాడుతూ - ‘‘త్వరలో సెన్సార్ కార్యక్రమాలు పూర్తవుతాయి. ఆ తర్వాత విడుదల తేదీ ప్రకటిస్తాం. ఈ సినిమా శాటిలైట్ హక్కులను ఓ టీవీ చానల్ ఫ్యాన్సీ రేట్‌కు సొంతం చేసుకుంది. సింగీతంగారి దర్శకత్వం, ఆయన స్వరపరచిన పాటలు, కథ, నిర్మాణ విలువలు.. ఇవన్నీ ప్రేక్షకులను మెప్పిస్తాయనే నమ్మకం ఉంది’’ అన్నారు. ఈ చిత్రానికి: కెమెరా: ఎస్.ఎస్. ధర్మన్, ఎడిటింగ్: సూర్య, ఆర్ట్: వర్మ, మాటలు: రోహిణి, కథ-సంగీతం-పాటలు-దర్శకత్వం: సింగీతం శ్రీనివాసరావు.