స్టార్ రిపోర్టర్ అనంత శ్రీరాం | Star Reporter Anantha Sriram | Sakshi
Sakshi News home page

స్టార్ రిపోర్టర్ అనంత శ్రీరాం

Published Sun, Feb 15 2015 1:00 AM | Last Updated on Sat, Sep 2 2017 9:19 PM

Star Reporter Anantha Sriram

టీవీలో ఇంట్రెస్టింగ్ సీరియల్ వస్తున్నసమయంలో కరెంట్ పోతే.. ‘ఈ కరెంటోళ్ల కడుపుకాలా...’ అని తిట్టుకుంటాం. మెగా క్రికెట్ సీజన్ మొదలైంది. ఆట మధ్యలో టీవీ ఆఫ్ అయ్యిందా.. కరెంటు వారిని నోటికొచ్చినట్టు తిట్టుకుంటాం. మన తిట్లు విద్యుత్‌శాఖ అధికారులకు తగులుతున్నాయో లేదో తెలియదు కానీ ఇరవై నాలుగు గంటలూ కరెంట్ స్తంభాలపై పనిచేస్తున్న విద్యుత్ కాంట్రాక్టు కార్మికులపాలిట శాపాలుగా మారుతున్నాయి. ప్రాణాన్ని అరచేతిలో పెట్టుకుని విద్యుత్ తీగలను పట్టుకునే ఈ కార్మికులను సాక్షి సిటీప్లస్ తరఫున స్టార్ రిపోర్టర్‌గా పలకరిస్తున్నందుకు హ్యాపీగా ఉందంటూ సినీగేయ రచయిత అనంతశ్రీరాం తన ఇంటర్వ్యూ మొదలుపెట్టారు..

అనంతశ్రీరాం: భయ్యా నీ పేరేంటి? నీ చేయి ఒకటి లేదు.. ఏం జరిగింది..?
నా పేరు బాలస్వామి సార్. 13 ఏళ్ల కిందట ఈ పనిలోకి వచ్చాను. 2009లో కరెంట్ షాక్ తగిలి ఇదిగో ఇలా వికలాంగుడిని అయ్యాను.
 
అనంతశ్రీరాం: ప్రమాదం ఎలా జరిగింది..?
బాలస్వామి: నర్సాపల్లిలో జరిగింది. ఓ రోజు రాత్రి 11 గంటలకు కరెంట్ పోయిందని కంప్లైంట్ వచ్చింది. సింగిల్ ఫేజ్ లైనది. జంపర్ మారిస్తే సరిపోతుంది. ఆ పనిలో ఉండగా, ఒక్కసారిగా షాక్ కొట్టింది. చేయి పూర్తిగా మాడిపోయింది. కిందపడిపోయి స్పృహ కోల్పోయాను. ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కడుపు మీద కూడా గాయమైంది. షాక్ తీవ్రతకు పొట్టలోపలి పేగులు కూడా పాడైపోయాయి. కోలుకోవడానికి రెండేళ్లు పట్టింది.
 
అనంతశ్రీరాం: మీకు ఇన్సూరెన్స్, ఉచిత వైద్యం వంటివి ఏమీ ఉండవా..?
బాలస్వామి: ఏమీ ఉండవు సార్. నెల నెల ఇన్సూరెన్స్ కోసమని జీతంలో కొంత కట్ చేస్తారు.
కౌష్: మా జీతాలు రూ.6 వేల నుంచి రూ.8 వేల వరకూ ఉంటాయి. అందులో పీఎఫ్, ఇన్సూరెన్స్ పేరుతో వెయ్యో, పదిహేను వందలో కట్ చేస్తారు. కానీ ఆపద వచ్చినప్పుడు మాత్రం ఏ సాయమూ అందదు.
రాములు: కొందరు కాంట్రాక్టర్లు మా జీతాల్లో డబ్బులు కట్ చేస్తున్నారు. కానీ, మా పేరిట ఎలాంటి ఇన్సూరెన్స్ కట్టడం లేదు. అదేంటని గట్టిగా అడిగితే ఉద్యోగం నుంచి తీసేస్తున్నారు.
 
అనంతశ్రీరాం: ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు వివరించారా..?
బాలస్వామి: కొందరు అధికారులదీ ఇదే తంతు సార్. వాళ్లు కూడా కాంట్రాక్టర్లకే వత్తాసు పలుకుతారు.
 
అనంతశ్రీరాం: మీక్కూడా గాయాలయినట్టున్నాయి. పొట్టంతా కాలిపోయింది.
కౌష్: ఓ రోజు భారీ వర్షం. ఇరవై, ముప్పై కంప్లయింట్స్ వ చ్చాయి. కరెంట్ సప్లయ్ ఆపేసి స్తంభం ఎక్కాను. రిపేర్ చేస్తుంటే ఏం జరిగిందో తెలియదు.. రెండు రోజుల తర్వాత కళ్లు తెరిచి చూసే సరికి కేర్ ఆస్పత్రిలో బెడ్ మీద పడున్నాను. వైరు నేరుగా పొట్టకు తగలడంతో బాగా కాలిపోయింది. ఆ గాయాల నొప్పి భరించలేక ఆస్పత్రిలో రెండుసార్లు ఆత్మహత్యకు ప్రయత్నించాను. నన్ను బెడ్‌కు కట్టేసి వైద్యం అందించారు. ఆ దెబ్బతో ఉద్యోగం పోయింది. మళ్లీ ఇప్పుడు ఇదే పని చేస్తున్నాను.
 
అనంతశ్రీరాం: ఇలాంటి వృత్తినే ఎందుకు ఎంచుకున్నారు?
రవి: ఎందుకంటే మేమేమన్నా డిగ్రీలు చే శామా సార్ ? ఏదో ఈ పని నేర్చుకున్నం. పేదోడికి దొరికిందే పని అనుకున్నం.
 
అనంతశ్రీరాం: అసలు మీ పని గంటలు ఎలా ఉంటాయి?
ఖాదర్: 24 గంటలూ ఆన్ డ్యూటీయే. ఎప్పుడు పిలిస్తే అప్పుడు పరుగెత్తాలి. రాత్రి పూట కరెంట్ పోతే మీరు క్యాండిల్ వెలిగించుకుంటారు. మేం మాత్రం ఫోన్ ఎక్కడి నుంచి వస్తుందా అని ఎదురు చూస్తం. ఫోన్‌రాగానే  ఆ ఏరియాకు వె ళ్లిపోతాం.
మల్లేష్: మేం అక్కడికి చేరుకునే లోపే.. ఫోన్ల మీద ఫోన్లు చేస్తరు. ఇంత లేటేందని తిడుతుంటరు. ఒక్కోసారి కొట్టడానికి మీదికి వస్తరు.
 
అనంతశ్రీరాం: అది చాలా తప్పు. చేసే పని ఆగిపోయిందనో, చూసే సినిమా మిస్ అయిందనో మనమంతా కరెంట్ వాళ్లను తిట్టుకుంటాం. వారి పరిస్థితి ఇలా ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో మీరు త్వరగా స్పందిస్తారని మెచ్చుకుంటారు. ఇంకొన్ని ఏరియాల్లో ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందించరని అంటుంటారు.
వెంకటేష్: ఏముంది సార్. వీఐపీ ఏరియాల్లో కంప్లయింట్ వచ్చిన పది నిమిషాల్లో పనైపోతుంది. మామూలు ఏరియాల్లో కాస్త టైం పడుతుంది.
 
అనంతశ్రీరాం: అన్ని ప్రాంతాల్లో ఒకేలా పని చేయాలి కదా..!
వెంకటేష్: కార్మికుల సంఖ్య పెంచాలి సార్. కాంట్రాక్టర్లు డబ్బుల కోసం ఒక్కరితో నలుగురి పని చేయించుకుంటున్నారు.
 
అనంతశ్రీరాం:
మరి ఈ సమస్యకు పరిష్కారం ఏంటి?
వీరస్వామి: మమ్మల్ని రెగ్యులరైజ్ చేయాలి సార్.
 
అనంతశ్రీరాం:
ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారా?
బాలస్వామి: దీనిపై ఏళ్లుగా పోరాడుతున్నాం. అధికారులను కలవని రోజు లేదు.
నాగరాజు: సార్ నేను తెలంగాణ విద్యుత్ కాంట్రాక్టర్ల అధ్యక్షుణ్ని. అన్ని రకాల వృత్తుల వారూ సమ్మెలకు దిగుతారు. మేం అలా చేస్తే ఎవరింట్లో లైట్ వెలగదు. అందుకే ధర్నాల ద్వారా మా నిరసన వ్యక్తం చేస్తుంటాం.
 
అనంతశ్రీరాం: అమ్మా మీ గురించి చెప్పండి?
సుగుణ: నా భర్త పేరు గోపాల్‌రెడ్డి. కాంట్రాక్ట కార్మికునిగా పని చేసేవాడు. కరెంట్ వైర్లే మా వారి పాలిట చితిగా మారాయి. షాక్ తగిలి పోల్ మీదే ప్రాణాలు విడిచాడు. షాక్ తీవ్రతకు మా ఆయన శరీరం మాడిపోయింది సార్. ఆయన్ని స్తంభం నుంచి దించడానికి ఐదుగంటలు పట్టింది (కళ్ల నీళ్లతో...).
 
అనంతశ్రీరాం: పిల్లలుఉన్నారామ్మా?
సుగుణ: ఇద్దరు సార్. నేను పదో తరగతి తర్వాత ఐటీఐ ఎలక్ట్రానిక్స్ చదువుకున్నాను. ఈ శాఖలోనే ఏదైనా చిన్న ఉద్యోగం ఇవ్వమని అడిగితే ఎవరూ కనికరించలేదు. స్వీపర్‌గా పని చేసుకుంటూ పిల్లల్ని పెంచుకుంటున్నాను. ఆయన పోయి పదేళ్లవుతుంది.
 
అనంతశ్రీరాం: అయ్యో ! చెప్పండి మీరంతా ప్రభుత్వం నుంచి, ప్రజల నుంచి ఆశిస్తున్నది ఏంటి?
రాములు: మా కాంట్రాక్టు కార్మికుల్ని రెగ్యులరైజ్ చేయాలి సార్. మమ్మల్ని కూడా ఉద్యోగులుగా గుర్తించాలి.
కౌష్:  పొద్దున ఇంటి నుంచి బయల్దేరేటప్పుడు భార్యపిల్లల్ని క ళ్లారా చూసుకుంటాం. మళ్లీ సాయంత్రం వారిని చూస్తామో లేదో తెలియని బతుకులు సార్ మావి. ఈ విషయాన్ని ప్రజలు అర్థం చేసుకుంటే చాలు.

అనంతశ్రీరాం: మా ఇంట్లో వెలుగులు నింపే మీ జీవితాల్లో వెలుగులు నిండాలని కోరుకుంటున్నాను. హ్యాపీ లైఫ్.
 
 లైన్‌మెన్ లైన్స్

 విద్యుత్‌ని అడిగావు - విజ్ఞతను మరిచావు
 వెలుగుల్ని అడిగావు - మా వ్యథలను విస్మరించావు
 నువ్వు ప్రజవైతేనేమీ  
నువ్వు ప్రభుతవైతేనేమీ
ఎవరివైతే నాకేమీ..
నాకూ ప్రాణముందని గుర్తించు
నన్ను కూడా    ప్రాణప్రదంగా భావించు

 - అనంతశ్రీరాం
 
ప్రజెంటేషన్: భువనేశ్వరి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement