ఫైర్ ఫైటర్స్ | Fire Fighters with Actor Brahmaji chit chat | Sakshi
Sakshi News home page

ఫైర్ ఫైటర్స్

Published Sat, Dec 6 2014 10:30 PM | Last Updated on Thu, Sep 13 2018 5:04 PM

ఫైర్ ఫైటర్స్ - Sakshi

ఫైర్ ఫైటర్స్

నిప్పురవ్వ తాకితేనే ఒళ్లు చురుక్కుమంటుంది. అలాంటిది ఎగిసిపడుతున్న అగ్నికీలలను ఎదురొడ్డి నిలబడతారు వాళ్లు. జలఖడ్గంతో అగ్గిబరాటాలపై విరుచుకుపడతారు. మంటల్లో చిక్కుకున్న ప్రాణాలను తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి రక్షిస్తారు. అగ్గిలో బుగ్గిపాలవుతున్న ఆస్తిని కాపాడతారు. తరచూ రెస్క్యూ ఆపరేషన్స్‌తో రిస్క్ చేస్తున్న అగ్నిమాపక సిబ్బంది అంటే మనపాలిట ఆపద్బాంధవులు. ఈ ఫైర్ ఫైటర్స్‌ను సాక్షిసిటీప్లస్ తరఫున నటుడు బ్రహ్మాజీ స్టార్ రిపోర్టర్‌గా పలకరించారు.
 
బ్రహ్మాజీ: మీరు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి చెప్పండి..?
వెంకన్న: రోజు వందకుపైగా ఫేక్ కాల్స్ వస్తుంటాయి సార్. కొందరు ఆకతాయిలు పదే పదే ఫోన్ చేస్తుంటారు.
 
బ్రహ్మాజీ: ఇంతకన్నా సిగ్గుచేటు విషయం ఇంకోటి లేదండి. ఫేక్ కాల్ చేయడానికి ఇంతకన్నా గొప్ప నంబర్ దొరకడం లేదా జనాలకి. మన ప్రాణాలతో మనమే చెలగాటం ఆడుతున్నాం. దయచేసి ఇలాంటి పనులు చేయొద్దు.
గురుమూర్తి: మాకు ఇంకో ఇబ్బంది ట్రాఫిక్ సార్. అంబులెన్స్‌కి ఇచ్చినంత సులువుగా మాకు దారి చూపరు.
 
బ్రహ్మాజీ: ట్రాఫిక్ వారికి సమాచారం ఉంటుంది కదా! వారు క్లియర్ చేయొచ్చు కదా!
గురుమూర్తి: అంబులెన్స్ వరకూ వారికి సమాచారం ఉంటుంది కానీ మా కోసం ట్రాఫిక్ సిబ్బంది ప్రత్యేకంగా ఏమీ చేయరు. మేం కూడా వేగంగా దూసుకుపోడానికి లేదు.
 
బ్రహ్మాజీ: మీరు పరిగెత్తేది కూడా ప్రాణాలు కాపాడటానికే కదా.. మీకు అలాంటి వెసులుబాటు లేకపోవడం ఏంటి ?
గురుమూర్తి: ట్రాఫిక్ సంగతి పక్కన పెట్టండి సార్. ప్రజల నుంచి కూడా ఎలాంటి సపోర్ట్ ఉండదు. మాదాపూర్ ప్రాంతంలో అయితే కుర్రాళ్లు మా వెహికల్స్ ముందు కట్‌లు కొట్టుకుంటూ వెళ్తుంటారు.
 
బ్రహ్మాజీ: చదువుకున్న వాళ్లు ఇలా వ్యవహరించడం దురదృష్టకరం.
బ్రహ్మాజీ: నాకు చిన్నప్పటి నుంచి పోలీస్ అంటే చాలా ఇష్టం. ఈ డిపార్ట్‌మెంట్‌లో ఫైర్ సర్వీసంటే మరింత మక్కువ. ఈ రోజు ఇలా పలకరించే అవకాశం వచ్చినందుకు  హ్యాపీగా ఉంది. వి.నాగార్జునరెడ్డి: మీరు ఎంతో ఇష్టంగా మమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చినందుకు మేం కూడా హ్యాపీగా ఫీలవుతున్నాం.
 
బ్రహ్మాజీ: చిన్న డౌట్.. మీ యూనిఫాం, పోలీసుల యూనిఫాం ఒకేలా ఉంటాయి. తేడా ఎలా తెలుసుకోవాలి?
వి.నాగార్జునరెడ్డి: మామూలు పోలీసులకు షోల్డర్‌కప్స్‌పై స్టార్లు ఉంటాయి. మాకు ఇంప్లాంట్స్ ఉంటాయి. బోరులో నుంచి నీళ్లు తోడేటప్పుడు పైపులో ఉండే ఇంప్లాంట్స్ సింబల్సే మా భుజాలపై కనిపిస్తాయి.
 
బ్రహ్మాజీ: ఓ.. నాకే కాదు చాలామందికి ఈ విషయం తెలియదు. ఫైర్‌వ్యాన్‌లో మొత్తం ఎంతమంది సిబ్బంది ఉంటారు సార్?
వెంకన్న: ఐదుగురు వరకూ ఉంటారు. ఒకరు లీడింగ్ ఫైర్‌మెన్ మరో ముగ్గురు ఫైర్‌మెన్లు, డ్రైవర్ ఉంటారు. ప్రమాద తీవ్రత ఎక్కువున్నప్పుడు రెండు మూడు వాహనాలు వెళ్తాయి.
 
బ్రహ్మాజీ:  మీరు డిపార్ట్‌మెంట్‌కి వచ్చి ఎన్నాళ్లయింది?
యాదగిరి: నేను లీడింగ్ ఫైర్‌మెన్‌గా పనిచేస్తున్నాను. ఇష్టంతో వచ్చినవాళ్లే ఇక్కడ ఎక్కువ రోజులు పనిచేయగలుగుతారు. ప్రాణాలను రక్షించే అవకాశం రావడం అదృష్టంగా భావించాలి. నేను ఇప్పటి వరకూ 200 ఫైర్ ఫైటింగ్స్ చేసి ఉంటాను.
 
బ్రహ్మాజీ: ఫీల్డ్‌లో మీకెదురైన చేదు అనుభవం గురించి చెబుతారా?
యాదగిరి: కొన్నాళ్ల క్రితం జీడిమెట్లలో ఒక కంపెనీలో రియాక్టర్ బ్లాస్ట్ అయింది సార్. మేం చేరుకునే సరికి చాలా నష్టం జరిగింది. ఒక గదిలో ముగ్గురు మృతిచెందారు. రియాక్టర్ సమీపంలో ఉండటంతో శరీరాలు ముక్కలు ముక్కలుగా తెగిపడ్డాయి. ఆ దృశ్యం చూడలేకపోయాను. ఆ రక్తపుముద్దలను తీసి అంబులెన్స్‌లో మార్చురీకి చేర్చాం.

 బ్రహ్మాజీ: ప్రాణాలు కాపాడిన సందర్భాలు..
పి.నాగభూషణమ్: మొన్నీమధ్యే మాదాపూర్ పరిధిలో ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. అక్కడికి సమయానికి చేరుకుని మా ప్రాణాలకు తెగించి పన్నెండు మందిని కాపాడాం.
వి.నాగార్జునరెడ్డి: నేను జిల్లా ఫైర్ ఆఫీసర్‌గా చేస్తున్నాను. 2005లో పంజగుట్టలోని ఒక జ్యువెలరీ షాపులో అర్ధరాత్రి మంటలు చెలరేగాయి. నాలుగు ఫైర్‌వ్యాన్లతో హుటాహుటిన అక్కడకు చేరుకున్నాం. ఐదంతస్తుల బిల్డింగ్. ఒక వైపునే ఓపెన్ ప్లేస్ ఉంది. మిగతా మూడు వైపులా చీమ దూరే సందు కూడా లేదు. ఒకవైపు ఉన్న డోర్స్ బ్రేక్ చేసి నీళ్లు చిమ్ముతున్నాం. ఎన్ని నీళ్లు పోసినా మంటలు అదుపులోకి రావడం లేదు. తెల్లవారే వరకూ నీళ్లు పోస్తూనే ఉన్నాం. తెల్లారాక ఐదో అంతస్తులో ఐదుగురు చనిపోయి కనిపించారు. దగ్గరగా ఉండి కూడా వారి ప్రాణాలు కాపాడలేకపోయామని  ఆ క్షణం చాలా బాధపడ్డాం.
 
బ్రహ్మాజీ: అడుగుల దూరంలో మీరు ఉండి కూడా ఏమీ చేయలేకపోడానికి మొదటి కారణం?
వి.నాగార్జునరెడ్డి: ఫస్ట్ థింగ్. ఆ బిల్డింగ్ చుట్టూ మా వెహికిల్ తిరిగే ప్లేస్ లేదు. కొద్ది ప్లేస్ ఉన్నా అన్ని కిటికీలు పగలగొట్టేవాళ్లం. లోపల ఉన్నవారి కేకలు వినిపించేవి. కమర్షియల్ కాంప్లెక్స్‌లు కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు భారీ మూల్యం చెల్లించాల్సి వస్తోంది.
 
బ్రహ్మాజీ: పొగ వస్తుంటే మీరు లోపలికి వెళ్లి రెస్క్యూ చేసే అవకాశం ఉండదంటారా?
వెంకన్న:
ఏ చిన్న అవకాశం ఉన్నా.. వెనుకంజ వేసే ప్రసక్తే ఉండదు. మనిషి ప్రాణాలకు మంట వల్ల ఎంత ప్రమాదమో.. పొగ కూడా అంతే ప్రమాదకారి.
 
బ్రహ్మాజీ: ఇలాంటి సమయాల్లో ఎలా వ్యవహరించాలో.. ఏమైనా చిట్కాలు చెప్తారా?
వి.నాగార్జునరెడ్డి: ముందుగా ఇంట్లో పొగ వస్తే ఎవరూ కూడా నిలబడి ఉండకూడదు. నేలపై పడుకోవాలి. వీలైతే తడిబట్టని ముక్కు దగ్గర పెట్టుకుంటే కార ్బన్ డై ఆక్సైడ్ ఊపిరితిత్తుల్లోకి వెళ్లకుండా ఉంటుంది. లేదంటే ఐదు నిమిషాల్లో స్పృహ కోల్పోతారు.
 
బ్రహ్మాజీ: అలాగా.. ఇరుకు సందుల్లోకి మీరు వెళ్లాల్సి వచ్చినపుడు.. ఎలాంటి ఇబ్బందులు పడుతుంటారు?
ఆర్.ఎ.కురేష్:
మామూలుగా ఉండవు సర్ మా పాట్లు. మా వెహికిల్స్ చాలా పెద్దగా ఉంటాయి. వెళ్లే మార్గాలు నాలుగైదు అడుగుల వెడల్పు కూడా ఉండవు. అలాంటప్పుడు వాటర్ పైపులను జాయింట్ చేసుకుంటాం.
 
బ్రహ్మాజీ: హైదరాబాద్‌లో ఎన్ని ఫైర్ స్టేషన్లు ఉన్నాయండి ?
ఆర్.ఎ కురేష్: మొత్తం 20 స్టేషన్లు ఉన్నాయి.
 
బ్రహ్మాజీ: అసలు ఎన్ని ఉండాలి?
తగరం వెంకన్న:
లెక్క ప్రకారం 100 ఉండాలి. నిజాం జమానాలో ఆరు స్టేషన్లు ఉండేవి. ఇప్పుడవి 15కు చేరింది. ఈ మధ్యే మరో ఐదింటిని మంజూరు చేశారు. ఇక వెహికిల్స్ 20 వరకూ ఉన్నాయి. పెద్ద వెహికిల్స్ అంటే బ్రాంటో స్కైలిఫ్ట్ వెహికిల్స్ రెండు ఉన్నాయి. వాటి ప్రత్యేకత పాతిక అంతస్తుల బిల్డింగ్‌ని మొత్తం కవర్ చేయగలవు.
 
బ్రహ్మాజీ: నేను కూడా ఎవరో చెబితే  విన్నాను. యాభైవేల మంది జనాభాకి ఒక ఫైర్‌స్టేషన్ ఉండాలట!
వెంకన్న:
నిజమే.
 
బ్రహ్మాజీ: మరి ప్రమాదం జరిగినప్పుడు జనాలు ఎలా స్పందిస్తుంటారు?  
గురుమూర్తి:
ఇదేముంది సార్, ఫైర్ యాక్సిడెంట్ అయిందని మాకు ఫోన్ చేస్తారా..! మళ్లీ మేం అడ్రస్ తెలుసుకుందామనుకుంటే.. ఆ ఫోన్ ఎంగేజ్ వస్తుంటుంది. మేం ఘటనాస్థలికి చేరుకునే సరికి కనీసం అక్కడ అడ్డంగా ఉన్న కార్లు, బైకులు అయినా తీసి కాస్త దూరంగా పెట్టరు.
 
బ్రహ్మాజీ: నిజమే.. చాలామంది బాధ్యతారహితంగా వ్యవహరిస్తుంటారు. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు మారాలని కోరుకుందాం. మన ఫైర్ డిపార్ట్‌మెంట్‌కి ప్రజల సహకారం, ప్రభుత్వం అండ పూర్తి స్థాయిలో ఉంటుందని ఆశిద్దాం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement