బడికి వేళాయె.. తొలిరోజు జ్ఞాపకం
బడికి వేసవి సెలవులు ఇచ్చే చివరి రోజు ప్రతి ఒక్కరికీ ఆనందం.. రేపటి నుంచి సెలవులని. సెలవులు ముగిశాక తొలిరోజు బడికి వెళ్లడం మహానందం.. కొత్త పుస్తకాలు, కొత్త తరగతిలోకి అడుగు పెడుతున్నామని. ఇప్పుడు వేసవి సెలవులు ముగిశాయి. నేటి నుంచి బడికి వెళ్లాలి. బడి గంట మోగుతున్నా సెలవుల మత్తు వీడని వాళ్లు కొందరైతే.. పాఠశాలలు ఎప్పుడు తెరుస్తారా.. అని చూసే వారు మరికొందరు. ఇటువంటి అనుభవాలు స్కూలుకు వెళ్లిన ప్రతి ఒక్కరికీ ఉంటాయి. తొలిరోజు బడికి వెళ్తే సమయం ఎలా గడిచిందో కొందరు ఉన్నతాధికారులు తమ బాల్యపు మధుర జ్ఞాపకాలను ‘సాక్షి’తో పంచుకున్నారు.
- సాక్షి, సిటీబ్యూరో
ఎంతో హుషారు వచ్చేది
బడి గడప తొక్కే తొలిరోజు పూజ చేయడం, గుడికి వెళ్లడం అలాంటివేవీ చేయకున్నా ఎక్కడా లేని, ఆనందం, హుషారు ఉండేది. ముఖ్యంగా ఆరు, ఏడు తరగతుల్లో ఆ తీరు బాగా కనిపించింది. ఐదు వరకు సొంతూరు నల్లగొండ జిల్లా లక్ష్మీదేవిగూడెంలోనే చదువుకున్నా. ఆరు, ఏడు తరగతుల కోసం మా పక్క ఊరు అమన్‌గల్‌కు వెళ్లేవాడిని. ఇది మా ఊరికి రెండు కిలోమీటర్ల దూరం. రోజూ స్నేహితులతో కలిసి నడుస్తుంటే అలసట తెలిసేది కాదు. పదో తరగతి వరకు నడకనే. పై తరగతుల పుస్తకాల కోసం వేసవి సెలవుల్లోనే వేట మొదలయ్యేది. జీవితాంతం సరిపడ ఆనందాన్ని బడికెళ్లే వయసులో పొందాను.
- సోమిరెడ్డి, హైదరాబాద్ డీఈఓ
కొంచెం బాధగా...
సెలవుల్లో మహబూబ్ నగర్ లో ఉండే నాన్నమ్మ, అమ్మమ్మ ఊళ్లలో గడిపేవాళ్లం. పాఠశాలలు తెరుస్తున్నారంటే కొంచెంగా బాధగా అనిపించేది. కొత్త పుస్తకాలు, నోట్ బుక్స్, బ్యాగ్.. ఇవన్నీ కొంటుంటే ఉత్సాహం వచ్చేది. స్కూల్‌కు అప్పుడే వెళ్లాలన్న కుతూహలం కనిపించేది. అప్పట్లో బుక్స్ స్కూళ్లలో ఇచ్చేవారు కాదు. మా సోదరులు, అక్క చెల్లళ్ల నుంచి పాత పుస్తకాలు తీసుకునే దాన్ని. అప్పట్లో మా నివాసం బడీచౌడి. రాంకోఠిలోని అలెన్ స్కూల్‌లో, గన్‌ఫౌండ్రీలోని స్టాన్లీ స్కూల్‌లో చదువుకున్నా.
- నిర్మల, హైదరాబాద్ జిల్లా కలెక్టర్
తొలి రోజే నిర్ణయం..
వేసవి సెలవులు ప్రారంభం కాగానే చిలుకలూరిపేట నుంచి నందిపాడుకు వెళ్లేవాడిని. రెండు నెలల పాటు ఊళ్లోని స్నేహితులతో ఎంజాయ్ చేసి సెలవులు ముగిశాక సంతోషంగా స్కూలుకు వెళ్లే వాళ్లం. కొత్త క్లాసు, కొత్త పుస్తకాలు, కొత్త టీచర్స్ ఇలా అంతా కొత్తగా అనిపించేది. ఎప్పుడు చెప్పిన పాఠం అప్పుడే చదవాలని, హోం వర్క్ పూర్తి చేయాలని పాఠశాలకు వెళ్లిన తొలి రోజే ఓ నిర్ణయం తీసుకునే వాడిని. ఆ మేరకు అమలు చేసే వాడిని. - డాక్టర్ నరేంద్రనాథ్, నిమ్స్ డెరైక్టర్
సెలవులు ముగిసి పాఠశాలలు తెరుస్తున్నారంటే.. ఎప్పుడు తరగతులు ప్రారంభమవుతాయా.. అని ఆబగా ఎదరు చేసేవాడిని. ముఖ్యంగా బడి తెరిచిన రోజు చాలా ఉల్లాసంగా, ఉత్సాహంగా సమయం గడిచిపోయేది. చాలా రోజుల తరువాత ఫ్రెండ్స్‌ని కలుస్తున్నాన్న సంబరం. ప్రతి ఉపాధ్యాయునికి దగ్గరికి వెళ్లి పలకరించేవాడిని. పై తరగతికి వె ళ్తున్నానన్న ఆనందం మాటల్లో చెప్పలే నిది. తరగతి మారుతుండడంతో ముందుగా వెళ్లి బెంచీపై మంచి స్థలాన్ని వెతుక్కోవడం మొదలయ్యేది. పరిసరాలు శుభ్రంగా చేసుకునే వాళ్లం. అలా మొదటి రోజు చూస్తుండగానే ముగిసేది. - రమేష్, రంగారెడ్డి జిల్లా డీఈఓ
కొన్ని రోజులే సెలవుల ధ్యాస..
వార్షిక పరీక్షలు రాసేటపుడు సెలవుల్లో చాలా పనులు చేయాలని అనుకునేవాడిని. ముఖ్యంగా పుస్తకాలు చదవడం, స్నేహితులను కలవడం, చుట్టాల ఇంటికి వెళ్లడం వంటివి చేయాలనుకునేవాడిని. అన్నీ జరగవు కదా! మూడు నుంచి పదో తరగతి వరకు రాయదుర్గంలోని ఒయాసిస్ స్కూల్‌లో చదువుకున్నా. పాఠశాలలు పునఃప్రారంభించే సమయంలో ఇంకొన్ని రోజులు ప్రకటిస్తే బాగుండేదనిపించేది. మరోపక్క స్కూల్‌కు వెళితే పాత మిత్రులను కలుసుకోవచ్చు.. పై తరగతిలో కొత్త విషయాలు నేర్చుకోవచ్చనే ఆతృత ఉండేది. చదువుపై దృష్టి సారించగానే సెలవుల ధ్యాస పోయేది. - రఘనందన్,
రంగారెడ్డి జిల్లా కలెక్టర్