'ఆయనే బతికుంటే ప్రధాని అయ్యేవారు'
- ‘సాక్షి’ ప్రత్యేక ఇంటర్వ్యూలో సినీనటుడు కైకాల సత్యనారాయణ
అనంతపురం ఎడ్యుకేషన్ / కల్చరల్ : మూడు తరాల అగ్రహీరోలతో కలిసి నటించినా.. యముడి పాత్రధారి భూలోకంలో సందడి చేసినా.. సాక్షాత్తు ఎస్వీ రంగారావుకు వారసుడని ప్రేక్షక లోకం భావించినా.. అది ఒక్క కైకాల సత్యనారాయణ విషయంలోనే. దీన్ని సగటు ప్రేక్షకుడు కూడా అంగీకరిస్తాడు. మహానటుడిగా అన్ని రకాల పాత్రలతో తెలుగు వారి హృదయాలలో చిరస్థాయిగా నిలచిపోయిన నవరస నట సార్వభౌముడు సత్యనారాయణ. ఆయన సోమవారం బంధువుల వివాహం కోసం అనంతపురం వచ్చారు. ఈ సందర్భంగా ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.
సాక్షి : ఎన్నో పాత్రలను సజీవంగా నిలిపిన మీరు ఇటీవల చిత్రరంగానికి దూరంగా ఉన్నట్టున్నారు?
సత్యనారాయణ : నిజమే. ఇప్పుడొస్తున్న చిత్రాలలో బొత్తిగా నేటివిటీ ఉండడం లేదు. అంతా రణగొణధ్వనులుగా మారిపోయింది. మాలాంటి వాళ్లు ఇమడడం కాస్త కష్టమే.
సాక్షి : అంటే ఇక నటనకు దూరంగా ఉంటారా?
సత్యనారాయణ : అలాంటిదేమీ లేదు. సుమారు 774 సినిమాలలో నటించా. ‘సిపాయి కూతురు’ సినిమాతో హీరోగా వచ్చినా, తర్వాత అన్ని పాత్రలలో నటించి మెప్పించా. ఇప్పుడు కూడా మంచి పాత్రంటూ వస్తే మనసుకు నచ్చితే తప్పకుండా చేస్తా. కొన ఊపిరి ఉన్నంత వరకు కళామతల్లి సేవలోనే తరించాలన్నదే ఆకాంక్ష.
సాక్షి : ఎన్టీఆర్, ఎస్వీఆర్‌లతో సమానంగా రాణించారు. ఆ రోజులు ఎలా ఉండేవి ?
సత్యనారాయణ : పాత తరం రోజులు తెలుగు చిత్రసీమకు స్వర్ణయుగమనే చెప్పాలి. మహానటులతో కలసి నటిస్తుంటే సమయన్నదే తెలిసేది కాదు. అంతా క్రమశిక్షణతోనే సాగేది. ఇప్పటి గురించి ఎంత తక్కువగా చెప్పుకుంటే అంత మంచిది.
సాక్షి : సొంత బ్యానర్‌పై ఎన్నో మంచి సినిమాలు తీశారు. ఇప్పుడు కూడా విలువలున్న సినిమా తీయొ చ్చు కదా?
సత్యనారాయణ : లేదు.. లేదు.. ఇప్పటి సినిమా నిర్మాణం జూదంగా మారిపోయింది. పైరసీ పెరిగిపోయి నిర్మాత కుదేలవుతున్నాడు. దానికి తోడు విచ్చలవిడితనం విలువలను కాపాడలేదు. కాబట్టే దూరంగా ఉంటున్నా. మా సొంత సంస్థ ‘రమా ఫిలిమ్స్’ బ్యానర్‌పై దాదాపు అందరి హీరోలతో మంచి చిత్రాలు నిర్మించా. ఇప్పుడా పరిస్థితులు లేవు.
సాక్షి : అన్ని రంగాలలో వారసత్వం సందడి చేస్తోంది. కానీ మీరు భిన్నంగా ఉన్నట్టున్నారు?
సత్యనారాయణ : అలాంటిదేమీ లేదు. నా ఇద్దరు కొడుకులు నిర్మాతలుగా కొనసాగుతున్నారు. కాకపోతే నటనపై ఆసక్తి లేకపోతే బలవంతంగా ప్రేక్షకులపై రుద్దడం ఇష్టం లేదు.
సాక్షి : కొన్నేళ్ల కిందట రాజకీయాల్లో చురుగ్గా ఉన్నారు. ఇప్పుడెందుకని దూరంగా ఉంటున్నారు?
సత్యనారాయణ : అది చెప్పాలంటే కాస్త కష్టమే. ఇప్పటి సినిమాలే కాదు..రాజకీయాలు కూడా రొచ్చగా మారిపోయాయి. అబద్దాలు చెపితే మినహా రాణించలేని పరిస్థితి. తెలుగుదేశం ఫౌండర్ మెంబర్లలో నేనొక్కణ్ని. ఎన్టీఆర్, నాదెండ్ల భాస్కరరావుతో కలసి తెలుగుదేశం స్థాపనలో నా పాత్ర ఎంతో ఉంది.
సాక్షి :: అంటే ఎన్టీఆర్‌తో అనుబంధం చాలా ఉందన్నమాట?
సత్యనారాయణ : మరి. ఎన్టీఆర్ లాంటి నటుడే కాదు..ప్రజా నాయకుడు కూడా మళ్లీ పుట్టరు. రాష్ట్రంలోనే కాదు..కేంద్రంలోనే చక్రం తిప్పిన ఘనత ఆయనది. అంతటి వ్యక్తితో సారూప్యం కల్గి ఉండడం నా అదృష్టమే. ఆయనే బతికుంటే తప్పకుండా ప్రధాన మంత్రి అయ్యేవారు.
సాక్షి : పద్మశ్రీ విషయంలో మీ అభిమానులు చాలా బాధ పడుతున్నారు..
సత్యనారాయణ : నిజమే. ఇక్కడా రాజకీయాలే అనర్హులను అందలాలు ఎక్కిస్తున్నాయి. చాలా మార్లు నా పేరును ప్రతిపాదించినా ఏదో ఒక కారణంగా రిజెక్ట్ కావడంతో అర్హులకు అన్యాయం జరుగుతోందన్న భావన సర్వత్రా వ్యాప్తి అయింది.
సాక్షి : ఈసారి పద్మశ్రీ తప్పకుండా రావచ్చని ప్రతి అభిమాని అనుకుంటున్నాడు..
సత్యనారాయణ : ఆ ఆశలేమీ లేవు. ఎందుకంటే మహానటులు ఎస్వీ రంగారావుకు, సావిత్రికి, శోభన్‌బాబుకు ఇవ్వలేని గౌరవం నా విషయంలో ఇస్తారంటే నమ్మశక్యం కాదు. బిరుదులు మఖ్యం కాదు.. కోట్లాది మంది అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా ఉండడమే పెద్ద ఆనందం. అయినా పద్మశ్రీలనేవి కొనుక్కోవాలి.. అవి నడచిరావన్న విమర్శ అతికినట్టు సరిపోయింది.
సాక్షి : నిజమే.. బాలీవుడ్ అగ్రహీరోలే మిమ్మల్ని ప్రశంసించారు కదా..
సత్యనారాయణ : అవును. అశోక్‌ఘాయ్ లాంటి వ్యక్తులు ఒక పృథ్వీరాజ్ కపూర్, ఒక షమ్మీ కపూర్, ఒక శివాజీ గణేషన్ కలిపితే కైకాల సత్యనారాయణ అవుతారని సభా ముఖంగా ప్రకటించారు. ఇంతకన్నా ఏం కావాలి ఒక కళాకారుడికి!
సాక్షి : చివరగా అభిమానులకు మీరిచ్చే సందేశం?
సత్యనారాయణ : సందేశమనేంత పదం కాదు కానీ సినిమాకు మళ్లీ మంచి రోజులొస్తే మంచి సంగీతం, నిబద్ధత ఉంటే నేను తప్పకుండా అభిమానులను అలరించే పాత్రలను పోషిం చాలనుకుంటున్నా. అలాంటి రోజులు రావాలనే మీతో పాటు నేనూ కోరుకుంటున్నా.