రఘుపతి వెంకయ్యనాయుడు విషయంలో ప్రభుత్వానికి ఎందుకీ వివక్ష - దాసరి
రఘుపతి వెంకయ్యనాయుడు విషయంలో ప్రభుత్వానికి ఎందుకీ వివక్ష - దాసరి
Published Sat, Sep 14 2013 12:22 AM | Last Updated on Fri, Sep 1 2017 10:41 PM
‘‘అల్లూరి సీతారామరాజు’ పేరులో ‘రాజు’ అనే రెండక్షరాలు తీసేసి చూడలేం. ‘భగత్‌సింగ్’లో సింగ్ అనే అక్షరాలను తీసేసి పలకలేం. అలాగే ‘రఘుపతి వెంకయ్యనాయుడు’ పేరు కూడా. ప్రారంభంలో ‘రఘుపతివెంకయ్య నాయుడు’ పేరిట పురస్కారాన్ని ప్రారంభించిన మన రాష్ట్ర ప్రభుత్వం.. ఇప్పుడు ‘రఘుపతి వెంకయ్య పురస్కారం’గా అందజేస్తున్నారు.
ఆయన పేరులో నాయుడు అనే అక్షరాలను ఎందుకు తొలగించారు. బీఎన్‌రెడ్డి పురస్కారం మాత్రం అదే పేరుతో కొనసాగుతోంది. ఎందుకీ వివక్ష? అని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను’’ అని దాసరి నారాయణరావు అన్నారు. దక్షిణాది సినిమా పితామహుడు రఘుపతి వెంకయ్యనాయుడు చరిత్ర ఆధారంగా తెరకెక్కుతోన్న చిత్రం ‘రఘుపతి వెంకయ్యనాయుడు’. సీనియర్ నటుడు నరేష్ టైటిల్‌రోల్ చేసిన ఈ చిత్రానికి బాబ్జీ దర్శకుడు. మండవ సతీష్‌బాబు నిర్మాత. శ్రీవెంకట్ స్వరాలందించిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు.
దాసరి ఆడియో సీడీని ఆవిష్కరించి, సీనియర్ గాయని రావు బాలసరస్వతికి అందించారు. దాసరి మాట్లాడుతూ -‘‘నిజానికి దాదాసాహెబ్‌ఫాల్కేకు సమానమైన గౌరవం రఘుపతి వెంకయ్య నాయుడుకు దక్కాలి. ఫాల్కే కంటే ముందే ఫొటోలతో సినిమా తయారు చేసి ప్రదర్శించిన ఘనత ఆయన సొంతం. కేంద్రం నుంచి వెంకయ్యనాయుడుకు గౌరవం దక్కలేదు. చివరకు మన రాష్ట్రం కూడా ఆయన్ను ఆలస్యంగానే గుర్తించింది. ఇది నిజంగా బాధాకరం’’ అని దాసరి చెప్పారు. కృష్ణవేణి, కృష్ణ, విజయనిర్మల తదితరులు మాట్లాడారు.
Advertisement
Advertisement