శ్రీనివాస కల్యాణం | Sakshi Exclusive Interview With Singeetham Film Director Srinivasa Rao | Sakshi
Sakshi News home page

శ్రీనివాస కల్యాణం

Published Sun, Mar 15 2020 5:13 AM | Last Updated on Sun, Mar 15 2020 5:13 AM

Sakshi Exclusive Interview With Singeetham Film Director Srinivasa Rao

సింగీతం శ్రీనివాసరావు, కల్యాణి

చక్కగా డిగ్రీ చదివిన అమ్మాయిని సినిమావాళ్లకిచ్చి చేస్తున్నారేమిటో..! చుట్టు పక్కలవాళ్ల గుసగుసలు. లోపల పెళ్లిచూపుల సీన్‌ మాత్రం వేరుగా ఉంది. ‘ఇంతాకన్నా ఆనందమేమి, ఓ రామ రామ’ అని రాగం తీస్తోంది అమ్మాయి. ఇకనేం.. అబ్బాయి అమ్మాయికి నచ్చేశాడు. పెళ్లయింది. పెళ్లయి అరవై ఏళ్లూ అయింది.

ఈ అరవై ఏళ్లలో సింగీతంగారు.. ఎక్కువసార్లు పలికిన పేరు.. కల్యాణి. ఈ అరవై ఏళ్లలో కల్యాణి గారు.. చెప్పకోడానికి ఇష్టపడిన మాట.. ‘సింగీతం గారి భార్యని’ అరవై ఉగాదులు..! అరవై ఉషస్సులు..! ఎలా గడిచాయని ఇంటర్వ్యూలో అడిగాం. వాళ్లు చెప్పిన ప్రతి మాటా ఏడడుగుల బంధం విలువను చాటింది. రండి... శ్రీనివాస కల్యాణం చూతము రారండి
     
► ఈ నెల 20తో మీ పెళ్లయి 60 ఏళ్లవుతోంది. సుదీర్ఘ వైవాహిక జీవితం కాబట్టి ప్రత్యేకంగా జరుపుకోవడానికి ప్లాన్‌ చేస్తున్నారా?
సింగీతం: మేమెప్పుడూ పెళ్లి రోజు అంటూ ఆర్భాటాలు చేయలేదు. పిల్లలు వచ్చి మా దంపతులకు నమస్కరించుకుని ఆశీర్వాదాలు తీసుకుంటారు.  
కల్యాణి: అయితే మా 50 సంవత్సరాల పెళ్లిరోజుని మాత్రం అందరినీ పిలిచి చేసుకున్నాం. మా చిన్నమ్మాయి లండన్‌లో ఉంటోంది. పోయిన నెల తను ఇక్కడే ఉంది. లండన్‌ వెళ్లిపోయే లోపు 60 ఏళ్ల పెళ్లి రోజుని ముందే సెలబ్రేట్‌ చేద్దామని ఫిబ్రవరి 25న చేసుకున్నాం. ఆ వేడుక తర్వాత మా ఆమ్మాయి లండన్‌ వెళ్లిపోయింది. మా పిల్లల అవకాశాన్ని బట్టి ఎప్పుడు కుదిరితే అప్పుడే మేం వేడుక చేసుకుంటాం. మాకు అదే మంచి రోజు అనుకుంటాం.  
సింగీతం: వాళ్లకి ఎప్పుడు కుదిరితే అప్పుడే మా మ్యారేజ్‌ డే అన్నమాట (నవ్వుతూ).

► మీ పెళ్లి ఎలా ఖాయం అయింది?
సింగీతం: నేను టీచర్‌గా కొంతకాలం పనిచేశాక  అక్కడక్కడా పని చేస్తూ దర్శక–నిర్మాత కేవీ రెడ్డి గారి దగ్గర చేరాను. సినిమా ఇండస్ట్రీలోకి రాగానే పెళ్లి సంబంధం వచ్చింది. చూసుకోవటం, వెంటనే ఓకే అనుకోవటం.. అలా క్విక్‌గా జరిగిపోయింది.  
కల్యాణి: నేను ఇంటర్మీడియేట్‌ చదువుతున్నప్పుడే మా నాన్నగారు సంబంధాలు చూడటం మొదలు పెట్టారు.  మా నాన్నగారికి ముగ్గురం ఆడపిల్లలమే. నాది ‘ఆశ్లేషా నక్షత్రం’. జాతక రీత్యా నేను చేసుకోబోయే అబ్బాయికి వాళ్ల అమ్మ బతికి ఉండకూడదు.  
సింగీతం: ఆశ్లేషా నక్షత్రం వారికి తాను చేసుకోబోయే అబ్బాయికి తల్లి ఉంటే ప్రమాదం. అది ఆ జాతకం వారితో ఉన్న లిటికేషన్‌ అన్నమాట (నవ్వులు).
కల్యాణి: అంతకుముందు నాకో సంబంధం వచ్చింది. అబ్బాయికి తల్లి ఉన్నారు. మా నాన్న నా జాతకం విషయం చెబితే వాళ్లు ఫర్వాలేదన్నారు. మంచి సంబంధం అయినప్పటికీ నాన్న ఒప్పుకోలేదు. ఆ సంబంధం గురించి ఆ నోటా ఈ నోటా వైజాగ్‌లో ఉన్న సింగీతంగారి బాబాయ్‌ వరకూ వెళ్లింది. ఆయన మా నాన్నగారితో ‘మా అన్నయ్యకి తెలిసిన సింగీతం రామచంద్రరావుగారి అబ్బాయి సినిమా ఇండస్ట్రీలో అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పని చేస్తున్నాడట. మీకు అభ్యంతరం లేదంటే నేను మా అన్నయ్యకు లెటర్‌ రాస్తాను’ అన్నారు.
సింగీతం: ఆ రోజుల్లో సినిమా వాళ్లకు పిల్లనివ్వాలంటే అంత తొందరగా ఒప్పుకునేవారు కాదు.  
కల్యాణి: ‘మావాడు సినిమా ఇండస్ట్రీలో పని చేస్తున్నాడు. మీకు ఇష్టం ఉంటే మీ అమ్మాయి ఫోటో పంపగలరు’ అని మా నాన్నగారికి వీళ్ల నాన్నగారు ఉత్తరం రాశారు. మా నాన్న తన అభిప్రాయం చెప్పకుండా ‘అమ్మడూ.. నీ ఇష్టం’ అని ఆ లెటర్‌ నాకు ఇచ్చారు. నేను ఆలోచిస్తుంటే మా అమ్మమ్మగారు ‘వాళ్ల కుటుంబం గురించి నాకు తెలుసు. కంగారు పడకుండా ఒప్పుకో. ఆ అబ్బాయి డిగ్రీ, నువ్వు డిగ్రీ చదువుకున్నావు. అంతా మంచే జరుగుతుంది’ అన్నారు. నేను ‘సరే’ అన్నాను.  

కల్యాణి, సింగీతం

► 60 ఏళ్ల క్రితం పెళ్లంటే అమ్మాయి ఇష్టంతో సంబంధం లేకుండా పెద్దలు పెళ్లి ఖాయం చేసేవారు. అయితే మీ నాన్నగారు మీ అభిప్రాయాన్ని అడిగారంటే, ఆయన ఎంత గొప్పగా ఆలోచించారో అర్థమవుతోంది..  
సింగీతం: మా మామగారు ఫార్వార్డ్‌ థింకింగ్‌. పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఏది నిర్ణయించుకుంటే అదే ఫైనల్‌ అనుకునేవారు. మా పెళ్లికి అంతా ఓకే అనుకున్నారు కానీ, కట్నం ఎంత అడుగుతారో అనేది అందరి మనసులోనూ ఉంది. అది గ్రహించి మా నాన్నగారు ‘మా వంశంలో కట్న, కానుకల ప్రసక్తే లేదు. నో డిమాండ్స్, నథింగ్‌’ అన్నారు.  

► ఈ సందర్భంగా కట్న, కానుకలు తీసుకునే వారి గురించి నాలుగు మాటలు?
సింగీతం: కట్నం తీసుకోకూడదు, నేరం.. ఈ పరిస్థితిలో మార్పు రావాలని ఏదో నాలుగు మాటలు చెప్పేస్తే సరిపోదు. దీనికి ఒకే ఒక్క సొల్యూషన్‌ ఏంటంటే ఆడవాళ్లు చదువుకోవాలి. స్త్రీలందరికీ మంచి ఎడ్యుకేషన్‌ ఇప్పించాలి. ఒకప్పుడు వాళ్ల అమ్మమ్మకు జరిగింది, తర్వాత వాళ్ల అమ్మకు జరిగింది..  ఇప్పుడు కూతురికి జరగకుండా చూసుకుంటే చాలు. మార్పు అదే వస్తుంది.

► అప్పట్లో పెళ్లి చూపుల్లో అమ్మాయిని పాడమనేవారు..  
కల్యాణి: ‘ఇంతాకన్నా ఆనందమేమి, ఓ రామ రామ..’ అని పాడాను (నవ్వుతూ). ‘అబ్బాయి నచ్చాడని ఇంతకన్నా అమ్మాయి ఎలా చెబుతుంది’ అని పెద్దవాళ్లు అన్నారు. మా పెళ్లి కుదిరింది. కానీ అమ్మలక్కలు చక్కగా డిగ్రీ చదువుకున్న అమ్మాయిని సినిమా వాళ్లకి ఎందుకిస్తున్నారో అని గుసగుసలాడుకున్నారు. అప్పుడు వాళ్లు అలా అన్నారు. ‘సింగీతంగారి భార్యని’ అని నేను ఇప్పటికీ గర్వంగా చెప్పుకుంటాను. అప్పటికీ ఇప్పటికీ నాది ఒకటే మాట...  ఆయన్ని పెళ్లి చేసుకున్నందుకు నేను ధన్యురాలిని.
 
► పెళ్లి చూపుల్లో ‘ఇంతాకన్నా ఆనందం ఏముంది..’  అని పాడినట్లుగానే మీ లైఫ్‌ ఆనందంగా సాగుతోందన్న మాట...

కల్యాణి: రెండొందల శాతం నా లైఫ్‌ అలానే ఉంది. పెళ్లికి ముందు నేను పక్కింట్లో పేరంటానికి కూడా వెళ్లేదాన్ని కాదు. మేం మా పుట్టింట్లో అలా పెరిగాం. ఓ సారి చెల్లెలు మద్రాసులో మా ఇంటికి వచ్చింది. నేను అందరితో మాట్లాడటం చూసి ‘అదేంటే... అందరితో అంత బాగా మాట్లాడుతున్నావు! బావగారు నిన్ను భలే మార్చేశారే’ అంది.  
సింగీతం: కాలేజీ డేస్‌లోనే మోడ్రన్‌గా ఉండేవాణ్ణి. మోడ్రన్‌గా డ్రెస్‌ చేసుకోవడం మాత్రమే కాదు.. నా ఆలోచనలు కూడా అలానే ఉండేవి. నేను కేవీ రెడ్డిగారి దగ్గర పని చేసేటప్పుడు మద్రాసులో రెండు లైబ్రరీలు ఉండేవి. ఇద్దరం పుస్తకాలు తెచ్చుకుని, చదివేవాళ్లం. ‘నేను ఏది చెబితే అది ఫైనల్‌ కాదు, నీకు ఈక్వల్‌ రైట్స్‌ ఉన్నాయి. మీరు ఎంత చెబితే అంతే అనే తత్వం నుంచి నీకున్న హక్కుతో నువ్వు డిమాండ్‌ చెయ్‌’ అని పెళ్లయిన కొత్తలోనే తనకు చెప్పాను.

► ఇప్పుడు కూడా భార్యకి ఈక్వల్‌ రైట్స్‌ ఇవ్వడానికి చాలామంది భర్తలు ఇష్టపడటంలేదు. 60 ఏళ్ల క్రితం ‘ఈక్వల్‌ రైట్స్‌’ అన్నారంటే సూçపర్బ్‌. మేల్‌ డామినేషన్‌ అంటూ స్త్రీని చిన్నచూపు చూసేవారికి చిన్న సలహా ఏమైనా?  
సింగీతం: అప్పట్లో మగవాళ్లు ఆఫీసుకు వెళ్లి, తర్వాత క్లబ్‌లకు వెళ్లి, పేకాట ఆడి ఇలా ఎంతో ఎంటర్‌టైన్‌మెంట్‌ ఉండేది. ఎవరైనా ఇంటికి వచ్చి మాట్లాడితే తప్ప ఆడవాళ్లకు వేరే ఏమీ ఉండేది కాదు. టీవి వచ్చాక కొంత ఎంటర్‌టైన్‌మెంట్‌ వచ్చింది. అయితే మగవాడు ఇంటికి వచ్చినా కూడా ఆడవాళ్లు టీవి చూస్తూనే ఉంటారనే అర్థంతో కార్టూన్లు వేసేవారు. అవి వేసేది కూడా మగవాళ్లే. అన్నిరోజులూ మగవాళ్లు పేకాట ఆడినా ఒక్క కార్టూన్‌ రాలేదు. ఆడవాళ్ల మీద ‘తిరగబడే ఆడది’, ‘భయపడే మొగుడు’ లాంటి టైటిల్స్‌తో కార్టూన్లు వచ్చేవి. ఇదంతా మేల్‌ డామినేషన్‌. ఇది తరతరాలుగా వస్తోంది. ఈ పరిస్థితి పోవాలంటే ఎడ్యుకేషన్‌ ఆఫ్‌ ఉమెన్‌ ఒక్కటే పరిష్కారం. ప్రతి స్త్రీ తన హక్కుల కోసం డిమాండ్‌ చేయాలి. ఈ రోజుకీ ఇంట్లో అందరూ ఉన్నప్పుడు మగవాడు ఫస్ట్‌ అన్నట్లు చూస్తారు. 60 ఏళ్ల మా వైవాహిక జీవితం తర్వాత కూడా ఇప్పుడూ ఈమె కొన్ని విషయాల్లో ‘మేల్‌ ప్రయారిటీ’ ఇస్తుంది. అలా వద్దంటాను. స్త్రీ బతికినంతకాలం పురుషుడి మీద ఆధారపడాలనే ధోరణి మంచిది కాదు. ఆవిడకూ ఒక లైఫ్‌ ఉంటుంది. ఈక్వల్‌ రైట్స్‌ ఇవ్వాలి.
కల్యాణి: అప్పట్లో మా నాన్నగారు ఓ పత్రికకు నాతో కరస్పాండెంట్‌గా పని చేయించారు. చుట్టుపక్కల గ్రామాల్లో ఏం జరుగుతుందో రాసి ఇచ్చేదాన్ని. అక్కడ లేడీస్‌ క్లబ్‌ మెంబర్‌గా ఉండేదాన్ని. అక్కడే పాఠాలు, టైప్‌ రైటింగ్‌ నేర్చుకున్నా. అలా మా నాన్న బాగా ఎంకరేజ్‌ చేసేవారు. పెళ్లయ్యాక ఈయన ఇంకా బాగా ఎంకరేజ్‌ చేశారు.

► మీరు డైరెక్షన్‌ చేసిన సినిమాల్లో కొన్నింటి కథా చర్చల్లో మీ ఆవిడ కూడా భాగం పంచుకున్నారట... ఆ విషయం గురించి?
సింగీతం: ప్రతి సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్‌ మొత్తం ముందుగా ఆమెకు వినిపించేవాణ్ణి. ఆమెతో డిస్కస్‌ చేసేవాణ్ణి. ఓసారి ఆమెకు ఒక ఫిలిం ఫెస్టివల్‌లో చూసిన ఓ అర్జెంటీనా సినిమా నచ్చింది. ఆ మాట నాతో అంటే.. అయితే తెలుగుకి తగ్గట్టుగా ఆ కథ రాయమన్నాను. దాన్నే ‘సొమ్మొకడిది–సోకొకడిది’గా తెలుగులో తీశాను.  
కల్యాణి: ఏ ఫిలిం ఫెస్టివల్‌కు వెళ్లినా సినిమా చూస్తూ టక టకా నోట్‌ చేసేదాన్ని. తర్వాత ఆయనతో డిస్కస్‌ చేసేదాన్ని.

కుమార్తెలు సుధా కార్తీక్, శకుంతలా సతీష్‌తో....

► మీ 60 ఏళ్ల వైవాహిక బంధం గురించి అందరికీ స్ఫూర్తిగా ఉండే ఓ కొన్ని పాయింట్లు చెప్పండి...
కల్యాణి: ఎంత అన్యోన్యంగా ఉండే దంపతుల మధ్య అయినా వాదనలు లేకుండా ఉండవు. వాదించుకున్నా కూడా ఆ తర్వాత కలిసిపోవాలి. సమస్యలు ఉన్నా విడాకులవరకూ వెళ్లకూడదు. పెళ్లికి ముందు నాకు కొంచెం కోపం ఎక్కువ. పిల్లలు పుట్టాక ఆ కోపం ఇంకా పెరిగింది. వాళ్ల అల్లరి తట్టుకోలేకపోయేదాన్ని. దాంతో పిల్లలను తిట్టి, కొట్టేదాన్ని. అలాంటి సమయాల్లో ఆయనే ఎక్కువగా సర్దుకుపోయేవారు. నాకు కోపం వచ్చింది కదా అని ఆయన ఇంకా కోపం తెచ్చుకుని సమస్యని పెద్దది చేసేవారు కాదు. మా ఇద్దరి మధ్య మంచి అండర్‌సాండింగ్‌ ఉంది.
సింగీతం: నాది ఆబ్సెంట్‌ మైండ్‌. అది నిజంగా పెద్ద సమస్యే అయినా తను సర్దుకుంది. నేను చిన్నçప్పటి నుంచీ నాస్తికుడిని. కానీ ఆమె పూజలు చేస్తుంది. నేను దేవుణ్ణి నమ్మను కదా అని తనని మానేయమనలేదు. తనకోసం నేను అష్టోత్తరాలు చదువుతాను. ఎందుకంటే ఆవిడ అభిప్రాయానికి విలువ ఇవ్వాలి కదా. నేను అష్టోత్తరాలు చదవడంవల్ల దేవుడు నన్ను ఇష్టపడతాడని కాదు... ఈమె ఇష్టపడుతుంది కదా (నవ్వుతూ). మనం ఎవరమూ పర్‌ఫెక్ట్‌ పీపుల్‌ కాదు. ప్రపంచంలో అందరం ‘ఇన్‌పర్‌ఫెక్ట్‌ పీపులే’. ఆ ఇన్‌పర్‌ఫెక్ట్‌ని యాక్సెప్ట్‌ చేస్తే అప్పుడు అందరం హ్యాపీగా ఉంటాం.

► ‘ఆదిత్య 369’ చిత్రంలో టైమ్‌ మెషీన్‌ని వెనక్కి తిప్పి ప్రేక్షకులందర్నీ వెనక్కి తీసుకెళ్లిపోయారు.. ఇప్పుడు టైమ్‌ మెషీన్‌ వెనక్కి వెళితే మీకు ఏమేం చేయాలని ఉంది?
సింగీతం: ఏవీ లేవమ్మా.. నిన్నటికన్నా రేపు బెటర్‌ అంటాను. అప్పట్లో అన్నీ అద్భుతాలే అంటుంటారు. కానీ ఇవాళ కూడా అద్భుతాలు జరుగుతున్నాయి. ఆ రోజు నేను చేయనివి ఎన్నో ఇప్పుడు ఇండస్ట్రీలో చేస్తున్నారు. వాళ్లను చూసి నేను అప్‌డేట్‌ అవుతుంటాను.

► ఫైనల్లీ.. మళ్లీ దర్శకత్వం ఎప్పుడు?  
సింగీతం: రెండు మూడు సినిమాలు చర్చల దశలో ఉన్నాయి.. స్క్రిప్ట్‌ విషయంలో కల్యాణికి గతంలో చెప్పినట్లు పెద్దగా చెప్పడంలేదు. కాకపోతే ఇలా చేయబోతున్నానని తనకి చెబుతుంటాను. అన్నీ తనకి చెప్పే చేస్తుంటాను.

► చెప్పకుండా చేసినది ఏదైనా మీ జీవితంలో ఉందా?  
కల్యాణి: అలాంటిది ఏదీ లేదు (నవ్వులు).

► మీరు ‘శ్రీ కల్యాణం’ పుస్తకం రాయడానికి స్ఫూర్తి ఎవరు?
కల్యాణి:  నీ చిన్నప్పటి విషయాలు, నువ్వు నాన్నని పెళ్లి చేసుకున్న తర్వాత నీ అనుభవాలతో ఓ పుస్తకం రాయొచ్చు కదా? అని మా చిన్నమ్మాయి అంది. నా ఆటోబయోగ్రఫీ రాయడానికి ముఖ్య కారణం తనే. ఎలా ప్రారంభించాలా అనుకునేదాన్ని.. ‘నువ్వు అనుకున్నవన్నీ రఫ్‌గా రాస్తుండు. ఫైనల్‌ వెర్షన్‌ ఒకటి రాయొచ్చు’ అని ఆయన అన్నారు. ఓ డైరీలో రాసుకునేదాన్ని. రఫ్‌ రాయడానికే ఆర్నెల్లు పట్టింది.
సింగీతం: మాకు పెళ్లైన కొత్తలో మాకు పెద్దగా వస్తువులు లేవు. రచయిత పింగళి నాగేంద్రగారు ఒక టేబుల్, నాలుగు కుర్చీలు బహుమతిగా ఇచ్చారు. ఆ టేబుల్‌ ఇప్పటికీ మా ఇంట్లోనే ఉంది. అది మాకు ప్రత్యేకం. దానిపై కాగితాలు పెట్టుకుని ఆ పుస్తకం రాసింది తను. అది నాకు సంతోషం.

► ఇప్పుడు మీ రోజువారి జీవితం ఎలా సాగుతోంది?  
సింగీతం: నేను ఉదయం 6:30 గంటలకు నిద్ర లేచి కాసేపు వాకింగ్, శ్వాసకి సంబంధించిన వ్యాయామం చేస్తాను. సాయంత్రం కూడా వాక్‌ చేస్తాను. ఆహారం అంతా టైమ్‌ టు టైమ్‌ జరిగిపోతుంది. రాత్రి కళ్లు మూసుకోగానే నిద్రపట్టేస్తుంది. పాపం తనకి నిద్రపట్టదు.
కల్యాణి: నాకు రాత్రి 12 తర్వాత నిద్రపడుతుంది. అందుకని త్వరగా నిద్ర లేవలేను. నా 55వ సంవత్సరం నుంచే చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు మొదలయ్యాయి. డాక్టర్ల సలహా మేరకు ఫిజియోథెరపీ చేయించుకున్నాను. డాక్టర్‌ చెప్పినట్లు కాసేపు చేతులు, కాళ్లకు సంబంధించిన ఎక్సర్‌సైజ్‌లు చేస్తాను. నాకు 83 ఏళ్లొచ్చినా ఇప్పటికీ మా ఇద్దరికీ చపాతీలు చేయడం, దోసెలు వేయడం చేస్తాను.. వంట చేయడానికి మనుషులు ఉన్నారనుకోండి.  
సింగీతం: మేం చెన్నైలో ఉంటున్నాం. నేను డైరెక్షన్‌ చేస్తున్నప్పుడు నా తమ్ముడు అసిస్టెంట్‌గా చేసేవాడు. తన అబ్బాయి పూర్ణ ప్రగ్యా, కోడలు, వాళ్ల పిల్లలు మా వద్దే ఉంటూ బాగా చూసుకుంటున్నారు.  
కల్యాణి: ఆ అమ్మాయి మా సొంత కోడలిలా మమ్మల్ని చూసుకుంటుంది. అందుకని మాకేం ఇబ్బంది లేదు.

► ‘నా జీవితంలో నేను ఎక్కువగా పలికిన పేరు కల్యాణి’ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు..
సింగీతం: అవును. నేను ఎక్కువసార్లు పలికిన పేరు కల్యాణి. మాది చాలా సింపుల్‌ లైఫ్‌. నాకు డైరెక్షన్‌ తప్ప వేరే ఏదీ తెలియదు. షూటింగ్‌ కాగానే నేరుగా ఇంటికి వచ్చేవాణ్ణి. మాకు క్లోజ్‌ ఫ్రెండ్స్‌ ఆరుగురు మాత్రమే ఉండేవారు. సినిమాలు, ఇల్లు, ఆ ఫ్రెండ్స్‌.. అంతే.  

– డి.జి. భవాని

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement