‘‘నేను, మా ఇద్దరు అబ్బాయిలు కలిపి నా భార్యకు ముగ్గురు కొడుకులు’’ అంటారు పోసాని. ఆ మాట నిజం కావచ్చు. అంతకంటే పచ్చి నిజం.. అతడికామె ‘అమ్మాయి!’ పెళ్లయి దగ్గర దగ్గర ముప్పై ఏళ్లవుతున్నా.. ఆమె ఒక్కర్నీ ఈయన ఏనాడూ బయటికి పంపింది లేదు. పక్కన తనుండాలి.. లేదంటే పిల్లలలు, ఎవరో ఒకరు తోడుండాలి. పోసానిలో ఇంకో యాంగిల్ కూడా ఉంది! ‘నీకు నేనున్నాను’ అని ధైర్యమిచ్చే భర్త కాదు ఆయన. ‘నీకు నువ్వే ఉండాలి’ అని ధైర్యం తెప్పించే భర్త! ఇద్దరితో చాలాసేపు మాట్లాడాం. ఒక్కరితో మాట్లాడినట్లే ఉంది! పోసాని, కుసుమ పైకి ఇద్దరు.. లోపల ఒక్కరు. ‘‘ఎలా సాధ్యం.. ఇద్దరూ ఒకేలా’’ అని అడిగాం. ‘‘మాది ఫ్రెండ్‌షిప్ రాజా’’ అని నవ్వేశారు పోసాని.
ఈ ఏడాదితో మీ పెళ్లయి 29 ఏళ్లు నిండుతాయి. 30వ వార్షికోత్సవంలోకి అడుగుపెడతారు...
పోసాని: అప్పుడే 29ఏళ్లు అయ్యాయా అని బాధగా ఉంది. ఇంకా జీవితం చాలా ఉందనే ఫీలింగ్. అయితే వయసు పెరుగుతోంది కదా. అందుకే పెళ్లయి ఇన్నేళ్లు కాకుండా కొన్నేళ్లు తగ్గితే బాగుంటుందనిపిస్తోంది.
జీవితం ఆనందంగా ఉంటే ‘అప్పుడే ఇన్నేళ్లు అయ్యాయా’ అనిపిస్తుందేమో.. ఏమంటారు?
పోసాని: మా ఆవిడకు మేం మొత్తం ముగ్గురు పిల్లలం. నేను పెద్ద కొడుకుని, మా ఇద్దరబ్బాయిలు చిన్న కొడుకులు. మేం పెళ్లయిన నాలుగేళ్ల తర్వాత నుంచి భార్యాభర్తల్లా కాకుండా ఫ్రెండ్స్‌లా ఉంటున్నాం. అయితే మొదట్లో చాలా కోపంగా, తనతో సీరియస్‌గా ఉండేవాణ్ణి. నేను వెళ్లిపోతా అనేది. వెళ్లిపో అనేవాణ్ణి. చనిపోతాను అని లెటర్ రాసి ఇచ్చింది. మీ అమ్మా నాన్నలకు చెప్పి చచ్చిపో అని నేను లెటర్ రాసి, అందులో లైఫ్ ఏంటో కూడా రాశాను. ఆమె కన్విన్స్ అయింది.
మీ ఆవిడతో ఎందుకంత కఠినంగా వ్యవహరించారు?
పోసాని: తను బీయస్సీ, బీఎల్ చదువుకుంది. చదువు విషయంలో మంచి జ్ఞానం ఉంది కానీ సొసైటీ నాలెడ్జ్ లేదు. ఎదుటివాళ్ల మెంటాలిటీని కనిపెట్టేంత జ్ఞానం తనకి లేదు. వాళ్ల నాన్న హెడ్‌మాస్టర్. చదువు, ఇల్లు.. ఇవి తప్ప ఆమెకు ఏమీ తెలియదు. బయటకు వెళ్లి అందరితో తిరిగిన మనిషి కాదు. అందువల్ల ఎవరు గుడ్, ఎవరు బ్యాడ్ అనేది తెలియక ఎవరేం చెప్పినా నిజం అనుకునేది. ఆ మెంటాలిటీ మార్చాలనుకున్నాను. ఆ క్రమంలో ఓ మూడేళ్లు, నాలుగేళ్లు చాలా సఫర్ అయ్యింది. ఎప్పుడైతే ఆమె మంచి, చెడుకి వ్యత్యాసం తెలుసుకుందో అప్పుడు సమాజం పట్ల, సాటి మనుషుల పట్ల అవగాహన వచ్చిందిలే అనుకొని ఆ రోజు నుండి మామూలుగా ఉండటం మొదలుపెట్టాను. అప్పుడు ఇద్దరం ఫ్రెండ్స్ అయిపోయాం. ఇక తను భార్య కాదు, నేను భర్త కాదు. మంచి స్నేహితులం.
ఏ కారణాల చేత చనిపోతానని లెటర్ రాశారు?
కుసుమ: పెళ్లయిన కొత్తలో చిన్న చిన్నవాటికి కూడా చాలా కోప్పడేవారు. మా అమ్మా, నాన్న ఒక్క మాట కూడా అనేవారు కాదు. ఇక్కడేమో ఇలా. పైగా నేను ఎవరైనా ఏదైనా చెబితే అది నమ్మేసి వెంటనే అడిగేదాన్ని. దానికి ఆయన చాలా కోపంగా సమాధానం చెప్పేవారు. అయితే రాను రాను ఈయన చెబుతున్నవే నిజమనే నమ్మకం కుదిరింది.
భర్త అడుగుజాడల్లో భార్య నడవాలని అలా చేసేవారా?
పోసాని: అస్సలు కాదు. తనకేమీ తెలియకపోతే అది తనకూ ప్రాబ్లమ్.. నాకూ ప్రాబ్లమ్. ఒంటరిగా వెళ్లి ఏదైనా జరగకూడనిది జరిగితే మా ఇద్దరి జీవితాలూ నాశనమవుతాయి. అందుకే నాతోనో, పిల్లలతోనో లేకపోతే ఫ్రెండ్‌తోనో బయటికి వెళ్లమంటాను.
ఈ అతి జాగ్రత్త మీకు ఇబ్బందిగా ఉండేదా?
కుసుమ: కొన్నిసార్లు ఇబ్బందిగానే ఉండేది. కానీ, ఇప్పుడు లేదు. ఆయన ఎందుకు చెప్పేవారో అర్థమయ్యింది.
పోసాని: మా ఇద్దరబ్బాయిలకు ‘రాత్రి 7కల్లా ఇంటికి వచ్చేయండి. తొమ్మిది దాటాక తిరగొద్దు’ అని చెబుతుంటాను. మనం కరెక్ట్‌గా వెళ్లినా వేరేవాళ్లు తాగేసి రోడ్ల మీద బండి నడిపి, ఢీ కొట్టొచ్చు. అందుకని 9 దాటాక బయట ఉండొద్దని పిల్లలకు చెబుతాను.
కుసుమ: మగపిల్లలే కదా.. వాళ్లకు కూడా రిస్ట్రిక్షన్ ఏంటి? అని నా ఫ్రెండ్స్ అంటారు. ఆడపిల్లలయితే మురళీగారు బురఖా వేసి పంపేవారేమో అంటారు.
మీకు ఇన్‌క్యూరిటీ, అనుమానం ఉంటాయా?
పోసాని: అలా ఏం కాదు.. నేను చాలా విషయాలను ముందే గ్రహించగలుగుతాను. ఈ అమ్మాయి (భార్యను పోసాని అలానే పిలుస్తారు)కి ఆ తెలివి ఉండేది కాదు. ఉదాహరణ చెప్పాలంటే.. మా పెళ్లయిన కొత్తలో మా ఇంట్లో పదేళ్ల అమ్మాయి ఉండేది. నాకెందుకో అనుమానంగా ఉంది, ఆ అమ్మాయిని మీ ఊరు పంపించెయ్ అన్నాను. ‘నిండా పదేళ్లు లేవు. తప్పెలా చేస్తుంది’ అంది. ఆ తర్వాత పది రోజులకు ఆ అమ్మాయి ఎవరితోనే వెళ్లిపోయింది.
పోలీస్ కేసు పెడితే, బొంబాయి వెళ్లే రైలు ఎక్కటానికి రెడీగా ఉందట. తీసుకొచ్చి అప్పజెప్పారు. ఆ తర్వాత ఆ అమ్మాయిని పంపించేశాం. మా ఆవిడకి ఎవరేంటి అనేది తెలిసేది కాదు. ఓసారి మావైపు బంధువుల ఇంటికి పెళ్లికి వెళతానంది. వాళ్లు మా బంధువులే అయినప్పటికీ కరెక్ట్ మనుషులు కాదన్నాను. వెళతానని వెళ్లింది. ఇంటికొచ్చాక బాధపడింది. ఈమె బాధపడిందని మా బంధువులైనా వాళ్లను తిట్టి, పదేళ్లు వాళ్లతో మాట్లాడలేదు. మా డబ్బుల బాధను, ఆరోగ్య బాధను... ఏదీ వాళ్లు తీసుకోలేరు, అండగా ఉండరు. ఆమెకు నేను, నాకు ఆమె. నాకేం జరిగినా తను, తనకేం జరిగినా నేను సఫర్ అవుతాం. అందుకే ఇలా ఉండు.. మనకు మంచి జరుగుతుందని చెప్పాను. అలానే ఉంది. హ్యాపీగా ఉన్నాం.
∙మీ చిన్నప్పుడు జరిగిన సంఘటనలేమైనా మీరు ఇలా ముందే అనుమానించడానికి కారణం అయ్యాయా?
పోసాని: నిజానికి నేను డిస్టర్బ్‌డ్ చైల్డ్‌ని. అందుకే నాకు గుడ్, బ్యాడ్ వెంటనే తెలుస్తాయి. ఇలాగే ఒకామెని ఉద్దేశించి దూరంగా ఉండు అన్నాను. ఆమె మా బంధువే. ఆమె ఈమెను ఎంత చెడగొట్టిందంటే మీ ఆయన రౌడీ, చాలా చెడ్డవాడు అని చెప్పేది. ఈవిడేమో నా వెల్‌విషర్ కాబట్టే చెప్పింది అనుకునేది. నా మాటలేమో గొడ్డుకారం లాగా ఉండేవి. అవిడ మాటలు తియ్యగా ఉండేవి. మా ఇంటికి వెళిపోతాను అంటే వెళ్లిపో అన్నాను. ఆ తర్వాత నిజాలు తెలుసుకుని అప్పటì నుండి తనే మారింది.
పెళ్లయిన కొన్నాళ్లు మా లైఫ్‌లో డిస్టర్బెన్స్ తప్ప ఆ తర్వాత ఎప్పటికీ మా జీవితంలో డిస్టర్బెన్స్ లేదు.. ఎప్పటికీ రాదు.. ఉండదు. బాగా చదువుకున్నారు కదా. ఇలా ఇంటిపట్టున కాకుండా జాబ్ చేయాలని ఉండేదా?
కుసుమ: పెళ్లికి ముందు జాబ్ చేయాలని ఉండేది. ఆ తర్వాత ఈయన చాలా బిజీగా ఉండేవారు. ఎప్పుడూ రాసుకుంటూ ఉండేవారు. ఇంటిని చూసుకుంటూ ఉండటంతో ఎప్పుడూ జాబ్ చేయాలనిపించలేదు. ఈయనకు అసిస్టెంట్స్ కూడా ఎక్కువమంది ఉండేవారు. వాళ్లు కూడా ఇంటికి వచ్చేవారు. అందుకే టైమ్ తెలియలేదు.
పోసాని: నా దగ్గర దాదాపు 30 మంది దాకా ఉండేవాళ్లు. అందరూ వచ్చేవారు. ఎవర్నీ ఒక్క మాట అనేది కాదు.
∙ఆర్థిక స్వేచ్ఛ గురించి ఏం చెబుతారు.. సంపాదించిన డబ్బు మీకిస్తారా?
కుసుమ: ఎంతైనా ఖర్చు పెట్టుకోమంటారు. ఎంత సంపాదించినా తీసుకొచ్చి నాకే ఇస్తారు. అయితే వాటి గురించి మళ్లీ అడగరు. అంత స్వేచ్ఛ.
పోసాని: నేను ఏం కొన్నా తన పేరే పెడతా. ఎందుకంటే తనకిప్పుడు అన్నీ తెలుసు.. డబ్బు విలువ, భర్త విలువ అన్నీ తెలిసినప్పుడు ఇక నాకు సెక్యూరిటీ ఎందుకు? ఆమే నా సెక్యూరిటీ. నాకేమీ వద్దనుకున్నాను. ఒంటì æమీద ఈ బట్టలు తప్ప (నవ్వులు). డబ్బు విషయంలో తనని రిస్ట్రిక్ట్ చేయను. ఎంతైనా వాడుకోమంటాను. తను కారు నేర్చుకుంది. పిల్లలని స్కూల్‌కి కారులో దిగబెట్టడం, తీసుకురావడం అంతా తనే.
అలాంటి ఫ్రీడమ్‌లన్నీ ఉండేవా?
పోసాని: అలాంటి వాటికేమీ ఇబ్బంది లేదు. ఓ సారి ట్రాఫిక్‌లో కారు ఢీ కొట్టింది. కంగారు పడిపోయింది. దానికేముంది? కారు రిపేర్ చేయించుకుంటే సరిపోతుంది. కారు ఢీ కొట్టావు కదా, నీకు డ్రైవింగ్ వద్దు అనలేదు. అలానే పిల్లల్ని కూడా ‘ఎక్కడికన్నా వెళితే పొద్దున పూట వెళ్లండి. నైట్ సినిమాకెళితే తాగి వచ్చేవాళ్లు ఉంటారు, డ్రగ్స్ తీసుకునేవాళ్లు ఉంటారు. వెళ్లొద్దు’ అని చెబుతాను. ఇలాంటివి భార్యకు చెబితే అనుమానం అంటారు. పిల్లలకు చెబితే జాగ్రత్త చెబుతున్నాడు అంటారు.
మీ పిల్లలు ఏమంటారు?
పోసాని: మా అబ్బాయిలు ఉజ్వల్, ప్రజ్వల్.. పిల్లలు పుట్టక ముందే ఈ పేర్లే పెట్టాలని ఫిక్స్ అయ్యాం. మా చిన్నోడు నైట్ వెళితే ఏం? అంటాడు, ఏమోరా నాకు అట్లా అనిపించింది. నీ ఇష్టం.. నేనైతే వెళ్లను అంటాను. నేను తాగి వాళ్లను తాగొద్దు అంటే క్వశ్చన్ చేస్తారు. నేను అలా చేయను కాబట్టి నన్ను ఫాలో అవ్వమంటాను.
కుసుమ: మాకు ఆయన బెస్ట్ లైఫ్ ఇచ్చారు. చదువుకోవడానికి పిల్లలు విదేశాలు వెళతానంటే సరే అన్నారు. ఒకడు అమెరికా వెళ్లి చదువుకుంటానంటే, క్రెడిట్ కార్డు ఇచ్చి పంపారు. ఇంకొకడు హాంకాంగ్ వెళ్లి ఫిలిమ్ కోర్స్ చేస్తాను అన్నాడు. వెళ్లమన్నారు. ఓ ఐదేళ్ల క్రితం కుసుమగారి ఆరోగ్యం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు మీరు బాగా చూసుకున్నారని విన్నాం..
కుసుమ: ఆ టైమ్‌లో ఆయన అన్నం, స్నానం మానేసి ఓ పది రోజులపాటు హాస్పిటల్‌లోనే ఉన్నారు. ఇక ప్రాణానికి ఏమీ ప్రమాదం లేదని తెలిశాక, హాస్పిటల్లోనే స్నానం చేశారు. అక్కడినుండే రెండు రోజులు షూటింగ్‌కి వెళ్లారు.
పోసాని: బ్లడ్ కాట్ అయింది. ఆమెను ఐసీయులో ఉంచారు. ఆ ఎదురు గదిలో నేను ఉన్నాను. రాత్రి మీకు ఫోన్ వచ్చిందంటే.. ఇక కష్టం అనుకోండి అన్నారు. ఆ రోజు తెల్లారేదాకా ఫోన్ రింగ్ అవ్వకూడదని కోరుకుంటూ నిద్రపోలేదు. లక్కీగా తెల్లారేసరికి బ్లడ్ క్లాట్ కరగటం స్టార్టయ్యింది. త్వరగా రికవర్ అయ్యింది. అయితే బెడ్ మీద ఉన్నప్పుడు నాకు చాలా జాగ్రత్తలు చెప్పింది. ఏ నగలు ఎవరికి ఇవ్వాలో కూడా చెప్పింది (నవ్వుతూ). ఆమె పోతే ఏముంది? అంతా గోవిందా. భార్యాభర్త స్నేహితుల్లా ఉన్నాక ఎవరు పోయినా ఏముంది ‘విగ్రహం లేని గుడిలా ఉంటుంది’.
హాలిడేస్‌కి వెళతారా?
కుసుమ: మొదట్లో ఓ పదిహేనేళ్లు వెళ్లలేదు. మా ఫ్రెండ్స్ ‘మేం అక్కడికెళ్లాం.. ఇక్కడికెళ్లాం’ అని నా మీద సానుభూతి చూపేవాళ్లు. నేను ఆయనతో ఆ విషయం చెప్పేదాన్ని. సంపాదించిన డబ్బు ఖర్చు పెట్టుకుంటే తర్వాత ఏం తింటాం అనేవారు. ఇప్పుడు పదేళ్లుగా బాగా తిరుగుతున్నాం.
పోసాని: ఎక్కడికీ వెళ్లలేదని ఆ రోజు సానుభూతి చూపించిన వాళ్లందరూ ఇక్కడిక్కడే ఏ మూలో తిరిగి, తిరుగుతున్నాం అని చెప్పుకున్నారు. వాళ్లు అక్కడే ఉన్నారు. ఈవిడ దేశంలో అన్నీ చూసింది. విదేశాలు వెళుతోంది (నవ్వులు). మేం ఎక్కడికెళ్లినా ఫ్లయిట్‌లో బిజినెస్ క్లాస్ టికెట్స్, ఫైవ్‌స్టార్ హోటల్స్ బుక్ చేసుకుంటాం. హడావిడిగా వెళ్లడం.. రావడం అలా ఉండదు మా జర్నీ. రోజు మొత్తంలో ఒకసారి బయటకు వెళతాం. మళ్లీ హోటల్‌కి వచ్చి రెస్ట్ తీసుకుంటాం.
కుసుమ: డబ్బుల విషయంలో ఆయన వెనకాడరు. నేను ఏం కావాలంటే అది కొనుక్కుంటాను. ఇక ఇతరులకు సహాయం చేసే విషయంలో ఆయనది పెద్ద చెయ్యే. ఈయన ఫొటోని దేవుడి గదిలో పెట్టుకుని పూజించేవాళ్లు కూడా ఉన్నారు. అవునా.. ఆ విషయాల గురించి చెబుతారా?
పోసాని: జగిత్యాలలో రాములు అనే 28 ఏళ్ల కుర్రాడి గుండెకు ప్రాబ్లెం వచ్చి పొట్టంతా పెరిగింది. లక్షా యాభైవేలు అవసరం అన్నారు. మొత్తం డబ్బు ఇచ్చి, ఆపరేషన్ చేయించాను. ఆ తర్వాత అతను వాడుకోటానికి మందులు, వాళ్ల ఆవిడకి, పిల్లలకి బట్టలు కొనిచ్చి ఊరికి పంపించాను. నా ఫోటోను ఇంట్లో దేవుని దగ్గర పెట్టుకుంటే ఆ ప్రాంతంలో ఉండే జర్నలిస్ట్ చూసి, దాన్ని స్టోరీ చేశాడు.
కుసుమ: ఇలా ఓ 15 మంది దాకా సాయం చేశారాయన. బీహార్‌లో ఓ పాపకి హార్ట్‌లో హోల్ ఉంది, ఆపరేషన్ చేస్తే బతుకుద్ది అని చెప్పారు. లక్షన్నర ఖర్చు అవుతుందని తెలిసి, పంపించారు. పాప బతికింది. ఆ పాపను తీసుకొని హైదరాబాద్ వచ్చి, మాకు చూపిస్తానని వాళ్ల నాన్న ఒకటే గోల. ఆపరేషన్ జరిగి 4 రోజులే అయ్యింది. బీహార్ వచ్చినప్పుడు నేనే కలుస్తానని ఆయన అన్నారు. ఫోటో అయినా ఇవ్వమని అడిగారు. పంపిస్తే, దేవుని గదిలో పెట్టుకున్నాడట.
ఇవన్నీ వింటుంటే పోసానిగారిది మంచి మనసు అనిపిస్తోంది. కానీ మీ ఆయన్ని మెంటల్‌కృష్ణ అని కొందరు అంటుంటారు. మీకు బాధగా ఉంటుందా?
కుసుమ: బాధ అనిపిస్తుంది. అయినా అది సినిమా. మా ఆయన బయట అలా కాదు కదా (నవ్వుతూ).
సో.. మీ ఆయన బంగారం అంటారా?
కుసుమ: అవును బంగారమే..
మరి.. మీ ఆవిడ?
పోసాని: అదే అంటాను. మా అమ్మాయి బంగారం.
పోసానిగారు రైటర్‌గా ఉండటం బావుందా? ఆర్టిస్ట్‌గా బావుందా?
కుసుమ: రెండూ బాగానే ఉన్నాయి. కానీ, రైటర్‌గా ఉన్నప్పుడు ఇంట్లో ఉండి రాసుకునేవారు. ఇప్పుడు షూటింగ్‌లకు వెళుతున్నారు కాబట్టి కొంచెం బోర్ అంతే. ఇప్పుడు పిల్లలు కూడా పెద్దవాళ్లయ్యారు కదా. వాళ్లూ విదేశాల్లో చదువుకుంటున్నారు. అయినా సాయంత్రం ఆరు కాగానే ఆయన ఇంటికొచ్చేస్తారుగా.
ఎప్పుడన్నా అనుకున్నారా? కొంచెం లేట్‌గా వస్తే బావుండని?
కుసుమ: అలా ఏం లేదు, నేనే ఫోన్ చేస్తాను. అయిపోయిందా, వస్తున్నారా అని.
పోసాని: నా ఫోన్‌లో రోజుకు 100 కాల్స్ ఉంటే అందులో 95 కాల్స్ ఆమెవే ఉంటాయి.
పోసానిగారి మీద రెబల్ ఇమేజ్ ఉంది. భార్యను కొడతారేమో, హింస పెడతారేమో అనే ఫీలింగ్ ఉంటుంది...
కుసుమ: లేదు. కోపం వచ్చినప్పుడు గొంతు పెంచి మాట్లాడేవారే తప్ప చెయ్యి చేసుకున్నది, హింస పెట్టినదీ లేదు (నవ్వు).
పోసాని: మా ఆయన ఎప్పుడూ ప్రేమగా ఉండడు, రూడ్‌గా ఉంటాడనుకునేది. అప్పుడు చెప్పాను. జీవితమంటే ఏంటి? సంసారం అంటే ఏంటి? అని. రియలైజ్ అవ్వటం మొదలైంది.
మీరు గట్టిగా మాట్లాడిన సందర్భం ఉందా?
పోసాని: ఓ రోజు నేను గట్టిగా తిడితే, నేను ఏ మాట అయితే అంటూ తిట్టానో అదే మాట నన్ను తిట్టింది. నేను నోరు మూసేసుకున్నా.
Comments
Please login to add a commentAdd a comment