అల.. విజయోత్సాహంలో... | Allu Arjun and Trivikram Srinivas Sakshi Exclusive Interview | Sakshi
Sakshi News home page

అల.. విజయోత్సాహంలో...

Published Sun, Feb 2 2020 12:10 AM | Last Updated on Sun, Feb 2 2020 5:32 AM

Allu Arjun and Trivikram Srinivas Sakshi Exclusive Interview

అల్లు అర్జున్‌, త్రివిక్రమ్

అలవోకగా మాటలు రాయడం త్రివిక్రమ్‌కి వచ్చుఅలవోకగా డైలాగులు చెప్పడం బన్నీ (అల్లు అర్జున్‌)కి వచ్చు అలవోకగా సినిమా తీయడం త్రివిక్రమ్‌కి వచ్చు అలవోకగా నటించడం బన్నీకి వచ్చు. అల.. ఈ ఇద్దరి కాంబినేషన్‌ హిట్‌. బన్నీని త్రివిక్రమ్‌ ‘జులాయి’ని చేస్తే ప్రేక్షకులు ‘సూపర్‌ హిట్టోయి’ అన్నారు. బన్నీని త్రివిక్రమ్‌ ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’ అంటే.. ‘సూపర్‌ సక్సెస్‌’ ఇచ్చారు. ఇప్పుడు ‘అల.. వైకుంఠపురములో..’ అన్నారు. ఆడియన్స్‌ అదిరిపోయే హిట్‌ ఇచ్చారు. ఈ విజయోత్సాహంలో త్రివిక్రమ్, బన్నీ ‘సాక్షి’కి ఇచ్చిన ఎక్స్‌క్లూజివ్‌ ఇంటర్వ్యూ.

► ఇంతకుముందూ మీరు హిట్స్‌ ఇచ్చారు...  వాటికీ ‘అల వైకుంఠపురములో’ చిత్రానికి దక్కిన ఆనందంలో తేడా ఉందా?
బన్నీ: కచ్చితంగా తేడా ఉంది. హిట్‌ సినిమాలు చేశాను. అయితే ‘ఆల్‌టైమ్‌ రికార్డ్‌ హిట్‌’ అనేదాంట్లో వైబ్రేషన్‌ వేరేలా ఉంటుంది. కేవలం హిట్‌ సినిమా అయితే ఇంతమంది ఫోన్‌ చేయరు. ఇన్ని అభినందనలు ఉండవు. ఇండస్ట్రీలో అందరూ పర్సనల్‌గా ఫోన్‌ చేసి అభినందించారు. అంటే.. అంత గొప్ప హిట్‌.

త్రివిక్రమ్‌: ఈ ప్రయాణాన్ని బాగా ఎంజాయ్‌ చేశాను. నేను చేసిన సినిమా ప్రయాణాల్లో టాప్‌ లిస్ట్‌లో ఇది కచ్చితంగా ఉంటుంది. ఈ సినిమా షూటింగ్‌లో ప్రతిరోజూ చాలా విలువైనదిగా ఉండేది. ఔట్‌పుట్‌ బాగా వచ్చేది. ఏం చేసినా, ఎలా చేసినా ఔట్‌పుట్‌ ముఖ్యం కదా. అనుకున్నట్టుగా రావట్లేదు అనిపించినప్పుడు షూటింగ్‌ ఆపేసేవాళ్లం. ఏ రోజూ సర్ది చెప్పుకొని చేయలేదు. రాకపోతే ఇంటికి వెళ్లిపోయేవాళ్లం.

► బన్నీకి హిట్‌ పడాల్సిందే అనే పరిస్థితిలో ఈ సినిమా కమిట్‌ అయ్యారు. ఒత్తిడి ఏమైనా?
త్రివిక్రమ్‌: హిట్‌ ఇవ్వడం, హిట్‌ చేయడం అనేది ఎవ్వరి చేతుల్లోనూ ఉండదు. నిజాయితీగా చెబుతున్న మాట ఇది. ఒక కథ అనుకుని చేయగలం. ప్రతిరోజూ చెక్‌ చేసుకుంటూ వెళ్లగలం. అయినా తప్పు జరగొచ్చు. ఫ్లాప్‌ అవ్వొచ్చు. అలాగని ఒత్తిడి లేదు అని చెప్పినా అబద్ధమే. ఒత్తిడి ఉంటుంది. దాన్ని దాటి, పనిలో ఫన్‌ వెతుక్కుంటూ వెళ్లడమే.

► ‘రేసుగుర్రం’లా దూసుకెళ్లే ఓ హీరో గ్యాప్‌ ఇవ్వడం ఆ హీరోకు, ఆయన ఫ్యాన్స్‌కు బాధగానే ఉంటుంది. హిట్‌ విషయంలో మీకు ఒత్తిడి?
బన్నీ: హిట్‌ సినిమా చేయాలి అనే ఆలోచనతో గ్యాప్‌ తీసుకోలేదు. గ్యాప్‌ కేవలం అనుకోకుండా వచ్చింది. ఒక సినిమా అయిన వెంటనే 2–3 నెలల్లో ప్రారంభిస్తాం. కానీ 2–3 నెలల్లో మంచి ఆప్షన్స్‌ తగల్లేదు. 6–7 నెలలు ఎదురుచూశాను. ఆ తర్వాత త్రివిక్రమ్‌గారు నేను, కలిసి సినిమా చేయాలనుకున్నాం. కథ రెడీ చేసి సినిమా చేయడానికి ఇంత టైమ్‌ పట్టింది.

► దర్శకుడు వక్కంతం వంశీతో మాట్లాడుతున్నప్పుడే త్రివిక్రమ్‌గారితో సినిమా చేస్తే బాగుంటుందనుకున్నాం అన్నారు. ఆయనతో మీరు చేసిన ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ ఆశించిన ఫలితం ఇవ్వలేదు కదా..
బన్నీ: ఫ్లాప్‌ అనేది అందరిదీ. దర్శకుడు ఒక్కడే చేసేది కాదు. ఆ కథ ఒప్పుకున్న నాదీ.. అందరిదీ తప్పే. ఆ తర్వాత ఏం చేయాలి? ముందుకు వెళ్లిపోవాలి. నేను, ‘బన్నీ’ వాస్, వక్కంతం వంశీ కలసి మాట్లాడుకున్నప్పుడు త్రివిక్రమ్‌గారితో సినిమా చేస్తే బావుంటుందనుకున్నాం. అప్పుడు త్రివిక్రమ్‌గారు ‘అరవింద సమేత’ సినిమాతో బిజీగా ఉన్నారు. ఆ సినిమా తర్వాత మాది మొదలుపెట్టాలనుకున్నాం.

► ‘అల... వైకుంఠ...’ లో మీ పాత్రకు అసౌకర్యాలు మీ చెల్లెలి పాత్రకు సౌకర్యాలు. రియల్‌ లైఫ్‌లో మీరు ముగ్గురు అన్నదమ్ములు. మీ ఇంట్లో ఒకరిని తక్కువ చూడటం ఒకరిని ఎక్కువగా చూడటం ఉంటుందా?
బన్నీ: (నవ్వుతూ). ముగ్గురు పిల్లలుంటే ఏదో విషయంలో ఒకరిని తక్కువ చేయడం ఉంటుంది. ఒకరిని ఎక్కువ, ఒకరిని తక్కువ ప్రేమిస్తారు. ఒకడికి ఎక్కువ కొనిస్తారు. ఒకడికి తక్కువ కొనిస్తారు.

త్రివిక్రమ్‌: సాధారణంగా పెద్దవాళ్లంటే తండ్రికి ఇష్టం. చిన్నవాళ్లంటే తల్లికి ఇష్టం. మధ్యలో వాళ్లంటే జనానికి ఇష్టం (నవ్వుతూ). మీకు (బన్నీ) సామాజిక న్యాయం జరిగింది అనుకోవచ్చు.

► ఈ మధ్య మీ కథలను పరిశీలిస్తే ధనికులు, మధ్య తరగతి వాళ్ల చుట్టూ తిరుగుతున్నాయేమో?
బన్నీ: ఉన్నవే మూడు క్లాస్‌లు. పేద, మధ్య తరగతి, ధనిక. ఇవి కాకుండా ఇంకేం ఉంటుంది.

త్రివిక్రమ్‌: నిజానికి పేద అనేదానికి అర్థం మారిపోయింది. 1960 నుంచి 1980 వరకూ కథలన్నీ పేద–ధనిక మధ్య ఉండేవి. తర్వాత పేద, మధ్యతరగతి ఒకటైపోయాయి. వాటి మధ్య గీత చెరిగిపోయి ఏది ఏదో తెలియనటువంటి పరిస్థితి. రిచ్‌ పోయి సూపర్‌ రిచ్‌ అనేది ఒకటి వచ్చింది. ధనిక వర్గంలోనే మరో క్లాస్‌ వచ్చింది. పేద అనేది పోయి మధ్యతరగతి అయిపోయింది. ప్రస్తుత పరిస్థితుల్లో సినిమాలు చేస్తున్నాను కాబట్టి నా కథలన్నీ మిడిల్‌ క్లాస్‌కి, ధనిక వర్గానికి మధ్య జరుగుతుంటాయి. నాకు కనిపిస్తున్న రెండు క్లాస్‌లు అవే కాబట్టి. ఒకవేళ సూపర్‌ రిచ్‌ మీద తీయాలంటే మన బడ్జెట్‌లు సరిపోవు.

► ‘అల.. వైకుంఠపురములో..’ సుశాంత్‌ పాత్ర చూపించిన తీరు మధ్య తరగతి కుటుంబాల్లో పుట్టినవాళ్లకు తెలివి తేటలు తక్కువుంటాయనే ఫీల్‌ని కలగజేస్తోందనే అభిప్రాయం వినిపిస్తోంది..
త్రివిక్రమ్‌: సినిమాను మనం సూక్ష్మంగా విశ్లేషిస్తే అలా అనిపిస్తుంది. అది కేవలం ఒక కేస్‌.. అంతే. మధ్యతరగతి వాళ్లు తెలివితక్కువ వాళ్లు అని చెప్పాలనుకోలేదు. నాకు తెలిసిన మేధావులందరూ పేద, మధ్యతరగతి నుంచి వచ్చినవాళ్లే. వాళ్లే గొప్ప గొప్ప విషయాలు కనుగొన్నారు. ఇది కేవలం కథ. దీన్ని జనరలైజ్‌ చేయడం తప్పు. సుశాంత్‌ పాత్ర కూడా సక్సెస్‌ అయితే సంతృప్తి పడతారా? పడరు. అందుకే ఆ పాత్రను అలా డీల్‌ చేశాం.

బన్నీ: తెలివిగలవాళ్లు, తెలివి తక్కువవాళ్లు అన్ని తరగతుల్లోనే ఉన్నారు. ఈ క్లాస్‌వారికి ఇన్ని తెలివితేటలుంటాయి, వీళ్లకు ఉండవు అనలేం.

త్రివిక్రమ్‌: వాళ్లు వాదించే కేస్‌కి సమాధానం చెప్పాలంటే ఈ సినిమాలో రామచంద్ర (జయరామ్‌), మురళీ శర్మ (వాల్మీకి) మధ్యతరగతివాళ్లే. కానీ రామచంద్రకు ఐక్యూ ఉంటుంది. ధనవంతుడిగా ఎదిగిన మధ్యతరగతి వ్యక్తే కదా అతను. కాబట్టి మధ్యతరగతి వాళ్లను తెలివితక్కువవాళ్లుగా చూపిస్తాననే వాదనకి ఈ పాత్రను ఉదహరించి కౌంటర్‌ ఇవ్వొచ్చు.

► మీ సినిమాల్లో హీరోయిన్లని కొంచెం తెలివితక్కువగా చూపిస్తారనే వాదన కూడా ఉంది?
త్రివిక్రమ్‌: ‘అరవింద సమేత, అల వైకుంఠపురములో’ అలా చూపించలేదు కదా. ఆ రెండు సినిమాల్లోనూ హీరోయిన్‌ చాలా తెలివితేటలు ఉన్న అమ్మాయే. మనం ‘ఇకపై అంతా సుఖాంతం’ అనే వాక్యంతో కథలను ముగిస్తాం. కానీ వాళ్లు ఉంటారో ఉండరో మనకు తెలియదు నిజంగా. నేను నిజాయితీగా నమ్మేది ఏంటంటే.. మన తెలివితేటలన్నీ మన పనుల్లో పెట్టి మనుషులతో మాట్లాడేటప్పుడు ఎంత అమాయకంగా, ఎంత సింపుల్‌గా ఉంటే అంత సుఖం. నేను అది పాటించడానికి నిరంతరం ప్రయతిస్తుంటా. మగవాళ్ల కంటే ఆడవాళ్లు చాలా సింపుల్‌గా ఉంటారని నా ఫీలింగ్‌. చాలామంది అంటారు ఆడవాళ్లు చాలా లోతు అయినవాళ్లు, క్లిష్టంగా ఉంటారని. అయితే వాళ్ల సింప్లిసిటీని కొంతమంది తప్పుగా చూశారేమో? అని నా ఫీలింగ్‌. ఆ నిరాడంబరత్వాన్ని చూపిస్తున్నాను. అంతే.

► మీ సినిమా టైటిల్స్‌కి ‘అ’ అక్షరం మీద ఎక్కువ ఆధారపడుతుంటారు కాబట్టి మీ జీవితంలో అ (అమ్మ) ఆ (ఆలి) గురించి కొన్ని విషయాలు..
త్రివిక్రమ్‌: మా అమ్మ నా సినిమాలు ఏవీ చూడలేదు. ఎప్పుడైనా టీవీలో వస్తే చూస్తారు. చూశాక   ఏరా నువ్వే తీశావా? అని ఫోన్‌ చేస్తారు. ఆమె థియేటర్‌కి వెళ్లి సినిమాలు చూడటం మానేసిన తర్వాత నా సినిమా ప్రయాణం మొదలయింది. అందుకే ఆవిడ సినిమాలు పెద్దగా పట్టించుకోరు. వాటి గురించి మాట్లాడి నేనూ పెద్ద ఇబ్బంది పెట్టను. నా భార్య అన్ని సినిమాలూ చూస్తుంది. తెలుగు ప్రేక్షకులందరూ తనలా ఉండాలని కోరుకుంటాను. ఎందుకంటే తనకి ఏ సినిమా అయినా నచ్చుతుంది. ప్రేక్షకులు కూడా తనలా ఉంటే మా (సినిమా పరిశ్రమవారి) జీవితాలన్నీ ఆనందంగా ఉంటాయి. సినిమాల పరంగా చెప్పాలంటే అది. గౌరవంగా చెప్పాలంటే వాళ్లను గౌరవించకపోతే జీవితం ముందుకు నడవదు. వాళ్ల మీద ఉన్న గౌరవం, ప్రేమని బాహాటంగా పంచుకోవడం అనవసరం అని వాళ్ల గురించి మాట్లాడను. వాళ్లు ఇబ్బంది పడతారని వాళ్ల గురించి మాట్లాడను.

► ఈ మధ్య మీ నాన్నగారి (అల్లు అరవింద్‌) గురించి ‘అల....’ ఫంక్షన్‌లో మాట్లాడుతూ భావోద్వేగానికి లోనయ్యారు. మీరు తండ్రి అయిన తర్వాత తండ్రి విలువ ఇంకా బాగా అర్థం అయిందా?
బన్నీ: అది ఒక కారణం. ఆయన నా తండ్రి అని మాత్రమే ఆ వేదిక మీద మాట్లాడలేదు. ఒక వ్యక్తిగా ఆయనేంటో చెప్పాలని కూడా మాట్లాడాను. నాన్నగారి గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే. నేను చూసిన వ్యక్తుల్లో అద్భుతమైన మనిషి అయ్యారు. మా అదృష్టం కొద్దీ ఆ వ్యక్తి మా తండ్రి అయ్యారు. ఆ మంచి వ్యక్తి గురించి చెబుతున్నప్పుడు నేను అందుకే ఎమోషనల్‌ అయ్యాను.

► మీతో సినిమాలు చేసిన హీరోలు ఆ«ధ్యాత్మిక బాటలో వెళతారేమోననే ఫీలింగ్‌ కలుగుతోంది...
బన్నీ: ప్రశ్న మిమ్మల్ని (త్రివిక్రమ్‌) అడిగినా నన్ను చూస్తూ అడుగుతున్నారు (నవ్వుతూ).

త్రివిక్రమ్‌: నాకైతే అలాంటిదేమీ అనిపించదు. అయితే నాతో నేను ఏం ప్రయత్నిస్తానంటే... నిజాయితీగా ఉండటం. చిన్న చిన్న విషయాలకు అబద్ధాలు చెప్పకు, ఎవ్వరినీ ఇబ్బంది పెట్టకు, పడకు. ఇంతకుమించి పెద్ద రూల్స్‌ ఏం ఉండవు. ఇది పాటించడం వల్ల మనం, మన చుట్టూ ఉండేవాళ్లు అందరూ సుఖంగా జీవించొచ్చు. నాకు ఫోన్‌ చేయడానికి ఎవ్వరూ ఇబ్బందిపడరు. నేను ఫోన్‌ చేస్తే తీయడానికి ఇబ్బంది పడరు. మనుషులు అంతిమంగా కోరుకునేది సుఖమే కదా. డబ్బు, పేరు, ప్రతిష్ట కంటే కూడా సుఖమే ఎక్కువ కోరుకుంటారు.

► బయటవాళ్లకు ఎలా అనిపిస్తుంటుందంటే మీ నుంచి బోధనలు ఎక్కువ ఉంటాయేమో అని..
త్రివిక్రమ్‌: అస్సలు ఉండవు.

బన్నీ: మిమ్మల్ని గురూజీ అని పిలిస్తే... అందరూ మీరు గురుకులం నడుపుతున్నారనుకుంటున్నారేమో (నవ్వు).

త్రివిక్రమ్‌: గురువు అనేది చాలా పెద్ద మాట. దానికి నేను అర్హుడిని కాదు. నిజానికి ఈ తరంలోనే గురువులు లేరని నా అభిప్రాయం. నేను మహానుభావులు అనుకునేవాళ్లే.. వాళ్లు గురువులో కాదో అనే సందేహం వ్యక్తం చేసినప్పుడు ఇక అసలు మనమెంత? గురూజీ అనే పదం అసంబద్ధం. మాటల మాంత్రికుడు అనేది కూడా అంతే అసంబద్ధం. అలా అనొద్దని అందరికీ చెప్పి ఆపించలేను. మాటల మాంత్రికుడు అనేదాన్ని భరించడమే తప్ప ఆనందించడమైతే ఏమీ ఉండదు.

► న్యూ ఏజ్‌ సినిమాలు వస్తున్నాయి. కొత్త ఆలోచనలతో కొత్త దర్శకులు వస్తున్నారు. దానివల్ల స్టార్‌ డైరెక్టర్‌లందరూ జాగ్రత్తగా సినిమాలు తీయాలంటారా?
త్రివిక్రమ్‌: కరప్ట్‌ అవ్వనంత వరకూ మనం ఎవ్వర్ని మెచ్చుకున్నా ఏ సమస్యా లేదు. అవతలి వాడి విజయం వల్ల మనం కరెప్ట్‌ అవ్వకూడదు. ఆలోచనా విధానంలో కరెప్ట్‌ అవ్వకూడదు. అది ఆలోచనా విధానంలో అయినా, ఫాలో అవ్వడం అయినా, ప్రభావితం అయినా సరే. ఇవన్నీ కరెప్షన్‌ కిందకే వస్తాయి. ప్రేక్షకులు మనం చేసేది నచ్చే ఇక్కడి వరకూ తీసుకొచ్చారు. ఇప్పుడు ఇంకొకళ్లు నచ్చారంటే మనం నచ్చలేదు అని అర్థం కాదు. వాళ్లు కూడా నచ్చారని. దాన్ని అర్థం చేసుకునే పరిపక్వత మనకు ఉండాలి. వాళ్లే నచ్చారు నేను నచ్చడం లేదేమో? అని వాళ్లు తీసినట్లు సినిమాలు తీయకూడదు. వాళ్లు తీసే ఒక్క సినిమాయే నచ్చి రెండో సినిమా నచ్చకపోతే నాది ఆ ఒక్క సినిమాయే నచ్చిందేమో అని వాళ్లూ బాధపడకూడదు. ఇది ప్రతివాళ్లకూ ఉండే సమస్య.

► మీరు చేసిన హీరోలందరితో క్లోజ్‌గా ఉంటారు. కానీ వాళ్ల మధ్య మార్కెట్‌ పరంగా పోటీ ఉంటుంది. దాన్ని ఎలా బ్యాలెన్స్‌ చేస్తారు?
త్రివిక్రమ్‌: వ్యక్తిగత ఈక్వేషన్లు వేరు. వ్యక్తిగతంగా మాట్లాడుకునేప్పుడు వ్యక్తిగతంగానే ఉండాలి. సినిమాకి పని చేస్తున్నపుడు మన సమయాన్ని, శక్తిని మొత్తం దానికే కేటాయించాలి.

► జనరల్‌గా ఒక సినిమా రిలీజయ్యాక ఓ వారం దాని గురించి మాట్లాడతారేమో. మీరేమో రెండు వారాలైనా ఇంకా మాట్లాడుతున్నారు. రీజన్‌ ఏంటి?
త్రివిక్రమ్‌: ఈ సినిమా మా నుంచి ఎక్కువ పనిని కోరుకుంది. ఎప్పుడూ చేయనన్ని గంటల ఎడిటింగ్‌ ఈ సినిమా కోసం చేశాం. కథ రాసినంతవరకే మనం రాజులం. పూర్తయ్యాక దానికి బానిసలం. ఈ సినిమా ఇంకా డబ్బులు తెస్తున్నాను.. మీరు మాట్లాడండి అంటోంది. మాట్లాడుతున్నాం. మా అమ్మగారు ఫోన్‌ చేసి, ఎప్పుడొస్తావ్‌ రా అన్నారు. ఊరెళ్లాలని ఉంది కానీ అవ్వడం లేదు.

బన్నీ: మామూలుగా విడుదలైన రెండు వారాల తర్వాత సినిమాతోపాటు మా పని కూడా అయిపోతుంది. కానీ ఈ సినిమా బాగా నడుస్తోంది. అందుకే మాట్లాడుతున్నాం.

త్రివిక్రమ్‌: అంతమంది జనం థియేటర్స్‌కి వచ్చి చూస్తున్నారంటే దాన్ని మనం గౌరవించాలి కదా. మాట్లాడాలి కదా.

► మీ కాంబినేషన్‌లో మళ్లీ సినిమా ఎప్పుడు?
బన్నీ: పెద్ద ఎక్కువ ఉండకపోవచ్చు.

► ‘అల.. వైకుంఠపురములో..’ రిలీజ్‌ అయిన రోజే ‘సంక్రాంతి విన్నర్‌’ అని పోస్టర్‌ వేశారు. మరో సినిమా రిలీజ్‌ కాకముందే వేయడానికి కారణం?
త్రివిక్రమ్‌: అర్థమయిన తర్వాతే పెట్టాం.
 

బన్నీ: ఇండస్ట్రీ హిట్‌ పోస్టర్‌ కూడా అర్థం అయిన తర్వాతే వేశాం.

త్రివిక్రమ్‌: అల్లు అరవింద్‌గారు వసూళ్ల గురించి ఒక రూపాయి తక్కువ చెప్పినా ఒప్పుకుంటారు కానీ రూపాయి ఎక్కువ చెబితే తాట తీస్తారు.

బన్నీ: మూడో వారంలో తెలిసింది మాకు ఈ సినిమా ఇండస్ట్రీ హిట్‌ అని.

త్రివిక్రమ్‌:  క్లారిటీ వచ్చిన 10–12 రోజుల  తర్వాతే ఇండస్ట్రీ హిట్‌ అని అనౌన్స్‌ చేశాం.

► ఈ సినిమా సక్సెస్‌ కేవలం త్రివిక్రమ్‌గారిదే అని ఇటీవల సక్సెస్‌ మీట్‌లో బన్నీ అన్నారు?
త్రివిక్రమ్‌: హిట్‌ కూడా అందరిదే.

బన్నీ: అందరి కృషి ఉంది.. అందులో డౌట్‌ లేదు. అయితే సినిమా సక్సెస్‌కి ఒక్క కారణం చెప్పాలంటే మాత్రం కచ్చితంగా దర్శకుడే అని చెబుతాను.

► మీ ఇద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘జులాయి, సన్నాఫ్‌ సత్యమూర్తి’ ఎమోషనల్‌గా ఉంటాయి. అందుకే మూడోసినిమా వినోద ప్రధానంగా చేయాలనుకున్నారా?
బన్నీ: సన్నాఫ్‌ సత్యమూర్తి కథలోనే కొంచెం బరువుంది. కథ ఎక్కువుంటే వినోదానికి స్కోప్‌ తగ్గిపోతుంది. ఎక్కువ వినోదం ఉండే సినిమా చేయాలని ముందే అనుకున్నాం. అలాంటి సినిమా చేయాలంటే మనం కూడా ఎక్కువ ఆలోచించకూడదు. ఎక్కువ ఆలోచిస్తే కచ్చితంగా పాడు చేస్తాం (నవ్వుతూ). అందుకే ఎక్కువ ఆలోచించకుండా లైట్‌ మైండ్‌తో ఈ సినిమా చేశాం.

► త్రివిక్రమ్‌తో సినిమా చేసే హీరోలందరూ ఆయన్ను పొగడ్తలతో ముంచెత్తుతారు. ఆయనతో మూడు సినిమాలు చేశారు.. ఏం మాయ చేస్తారో చెప్పండి?
త్రివిక్రమ్‌: మాయలేవీ లేవండీ..

బన్నీ: త్రివిక్రమ్‌గారితో పని చేసే యాక్టర్స్‌ అందరూ సుఖంగా ఉంటారు. షూటింగ్‌ ప్రయాణాన్ని ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేస్తారాయన. కొన్నిసార్లు షూటింగ్‌ ప్రాసెస్‌ను ఆనందించకపోవచ్చు, కానీ సినిమా పెద్ద హిట్‌ అవ్వొచ్చు. త్రివిక్రమ్‌గారితో రిజల్ట్‌తో సంబంధం లేకుండా ప్రాసెస్‌ను బాగా ఎంజాయ్‌ చేయొచ్చు. సినిమా కథలన్నీ నిజం కాదు. కానీ చిత్రీకరణ సమయంలో జరిగిన ప్రయాణం మాత్రం నిజం. ఆ వంద రోజుల ప్రయాణం నాకు నిజం.

► ఈ సినిమాలో హ్యాండ్‌సమ్‌గా ఉన్నారు.. హెయిర్‌ స్టయిల్‌ కూడా కొత్తగా ఉంది..
బన్నీ: నేను, త్రివిక్రమ్‌గారు మా ఆఫీస్‌లో కలిసినప్పుడు సినిమాలో ఉన్నట్టు జుట్టు పెంచాను. త్రివిక్రమ్‌గారు ‘ఈ హెయిర్‌ స్టయిల్‌ బావుంది, సినిమాలో వాడదాం’ అన్నారు. ఇప్పటివరకూ చేసిన సినిమాల్లో ఏదో హెయిర్‌ స్టయిల్‌లో కనిపించాను. ఫస్ట్‌ టైమ్‌ న్యాచురల్‌ స్టయిల్‌లో కనిపించాను. ఇది బాగుందంటున్నారు.
 
మీ ముందు వరకూ ఏ రైటరూ అంత రెమ్యూనరేషన్‌ తీసుకోలేదు. దాని గురించి?

త్రివిక్రమ్‌: మన సినిమాకి రైటర్‌ అవసరం ఉంది, కానీ వాడికి కావాల్సినంత గౌరవం ఇవ్వం. గొప్ప గొప్ప రచయితలను దగ్గర నుంచి చూశాను కాబట్టి అలా అనిపించింది. నాకు నేను చెప్పుకున్నది ఏంటంటే.. నువ్వైతే ఇలాంటి పరిస్థితులను మార్చేలా పనిచెయ్‌. దర్శకుడిని కూడా అవ్వాలని ముందే అనుకున్నాను. రచయితగా కొనసాగాలనుకోలేదు. బహుశా దాని వల్ల కూడా రచయితగా వచ్చిన అవకాశాలకు నో చెప్పేవాణ్ణి. పరిగెత్తుకెళ్లి ప్రతిదీ రాయాలనుకోలేదు. మీ మీద మీకు గౌరవం ఉంటే ఎదుటివాళ్లు కూడా గౌరవిస్తారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement