త్రివిక్రమ్
‘‘సంక్రాంతికి పెద్ద చిత్రాలు పోటీపడటం మామూలే. ఈ సమయంలో అన్ని సినిమాలకు డిమాండ్ ఉంటుంది. మా ‘అల.. వైకుంఠపురములో..’ చిత్రం, ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాల ట్రైలర్స్ చూశాను.. రెండూ విభిన్నమైన జోనర్స్‌లో తెరకెక్కాయని తెలుస్తోంది.. అందుకే ఒకదానికొకటి పోటీ కాదు’’ అన్నారు త్రివిక్రమ్. అల్లు అర్జున్, పూజా హెగ్డే జంటగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అల.. వైకుంఠపురములో...’. మమత ఆర్ట్స్ సమర్పణలో గీతా ఆర్ట్స్, హారిక అండ్ హాసినీ క్రియేషన్స్ పతాకాలపై ఎస్.రాధాకృష్ణ (చినబాబు), అల్లు అరవింద్ నిర్మించిన ఈ సినిమా రేపు (ఆదివారం) విడుదలవుతోంది. ఈ సందర్భంగా విలేకరులతో త్రివిక్రమ్ చెప్పిన విశేషాలు.
► కెరీర్ స్టార్టింగ్‌లో కొత్తవాళ్లు వాళ్ల ఆలోచనలను అందరికీ చెప్పాలని, ప్రశంసలు పొందాలని అనుకుంటారు. అనుభవం వచ్చాక వారిపై అంచనాలు పెరిగి చెప్పాలనుకున్న విషయాన్ని చెప్పలేకపోతారు. సినిమా రంగం అనే కాదు.. ఏ రంగంలో అయినా సేఫ్ రూట్‌లో వెళ్లడానికే ప్రయత్నిస్తారు. నా ‘అజ్ఞాతవాసి’ పరాజయం తర్వాత నా సన్నిహితులు ఓ సలహా ఇచ్చారు.. ‘మీకు బాగా తెలిసిన ఎమోషనల్ అండ్ కామెడీ ఎంటర్‌టైనర్ చేయడం మంచిది’ అని.కానీ, నన్ను నేను నిరూపించుకోవాలి. భయాన్ని గెలవాలంటే ఇదే సరైన స్టెప్ అనుకుని నా కంఫర్ట్ జోన్ నుండి బయటికి వచ్చి సీరియస్ డ్రామాగా ‘అరవింద సమేత వీరరాఘవ’తో హిట్ సాధించాను. జీవితంలో భయాన్ని గెలవగలగాలి.. జీవితమనేది ఆట. మనల్ని మనం సీరియస్‌గా తీసుకోకూడదు. ప్రేక్షకులు నా పనిని అభిమానిస్తారు.. నన్ను కాదు. ‘అజ్ఞాతవాసి’ ఆ క్షణానికి ప్రేక్షక దేవుళ్లకి నచ్చలేదు.
► రచన అంటే ఏదయినా ఒక్కటే. కానీ, దాన్ని ప్రెజెంట్ చేసే విధానాలు వేరుగా ఉంటాయి. నేను రాసే మాటలు ఎంతో ప్రత్యేకంగా ఉంటాయని అందరూ అంటుంటారు. ఓ సినిమా కథ రాయడానికో, మాటలు రాయడానికో గోవా లేదంటే ఏ ప్రదేశానికో వెళ్లను.. మా ఇంట్లోనే భార్యా పిల్లల మధ్య ఉంటూనే రాసుకుంటాను. కథలో భాగంగానే సహజంగా అలాంటి మాటలు రాస్తాను.
► కామెడీ, యాక్షన్, ఎమోషన్స్.. ఇలా అన్ని రకాల వాణిజ్య అంశాలున్న చిత్రం ‘అల.. వైకుంఠపురములో..’. ఓ మంచి సినిమా చూసిన అనుభూతి ప్రేక్షకులకు కలుగుతుంది. కథ రాసే వరకే మనం రాజు.. ఆ తర్వాత కథకి మనం బానిస.. అవసరానికి తగ్గట్టు అప్పటికప్పుడు కొన్ని మారుస్తుండాలి. ఈ సినిమాలోని పాటలు బాగా వచ్చాయంటే ఆ క్రెడిట్ రచయితలు, సంగీత దర్శకుడు తమన్‌లదే.
► ‘జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి’ చిత్రాల తర్వాత బన్నీతో (అల్లు అర్జున్) నా మూడో చిత్రం ‘అల.. వైకుంఠపురములో...’. ఈ సినిమాతో తప్పకుండా హ్యాట్రిక్ సాధించబోతున్నామనే నమ్మకం ఉంది. బన్నీ తొలి సినిమాకు, ఇప్పటికీ పోల్చితే నటనలో ఇంకా పరిపక్వత వచ్చింది.
► ‘ఖలేజా’ టైమ్‌లో హీరోయిన్ పాత్ర విషయంలో కొందరు విమర్శించారు.. దాన్ని దృష్టిలో పెట్టుకునే ఈ చిత్రంలో ‘దేన్నయినా పుట్టించగల శక్తి నేలకి, మహిళలకు మాత్రమే ఉంది’ అనే డైలాగ్ రాశాననడం కరెక్ట్ కాదు.. అందులో వాస్తవం ఉంది కాబట్టే రాశా. ఏదైనా ఆయా పాత్రకి తగ్గట్టు రాస్తానంతే కానీ, దేన్నీ ప్రత్యేకంగా దృష్టిలో పెట్టుకోను. కొన్ని సినిమాల్లో అత్త–అల్లుడి పాత్రలను వెకిలిగా చూపిస్తుంటారు.. కానీ, నా ‘అత్తారింటికి దారేది’ చిత్రంలో అత్త పాత్ర బాగా రాయడానికి కారణం మా అత్తగారు. అల్లుళ్లు ఎప్పుడూ అత్తగార్లకు గౌరవం ఇవ్వాలి.
► ప్రతి కుటుంబంలో ఉండే సమస్యలు సామాజిక సమస్యలకు తక్కువేం కాదు. మనం ప్రపంచమంతా తిరిగినా ఇంటికి వెళ్లగానే తెలియని ఆనందం. మన సంస్కృతిలో ఇల్లు అనేది ఒక భాగం. పలకరించే కుటుంబ సభ్యులు, వారితో గడిపే క్షణాలు మంచి అనుభూతిని ఇస్తాయి. అందుకే నేను కుటుంబంతో ముడిపడిన కథా చిత్రాలు చేస్తున్నాను. ఎవరి రచనా శైలి వాళ్లది.. ఒకరి రచనా శైలి బాగుంటే సంతోషిస్తా. నేను ఎందుకు ఇలా తీయలేదు? ఆ ఆలోచన నాకెందుకు రాలేదు? అని ఒక్కోసారి అసూయ పడుతుంటా.
► నేను కథలు రాయడానికి ప్రస్తుత పరిస్థితులే స్ఫూర్తినిస్తాయి. ఓ రచయితగా నాపై ఎవరి ప్రభావం లేదు. నేను పుస్తకాలన్నీ చదివేశానని చాలా మంది అనుకుంటారు. కానీ చదివింది కొన్ని పుస్తకాలే. ఇప్పుడు పతంజలిగారి రచనలు చదువుతున్నా.
► ప్యాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కించే కథ దొరికినప్పుడు తెలుగుతో పాటు ఇతర భాషల్లో ఆ సినిమాని తెరకెక్కిస్తాను. చిరంజీవిగారు హీరోగా డీవీవీ దానయ్య సినిమాకి కథ పూర్తి కాలేదు. చిరంజీవిగారికి ఓ లైన్ చెప్పాను. ‘పింక్’ తెలుగు రీమేక్‌కి నేను మాటలు రాయడం లేదు. కాకుంటే వాళ్లిద్దర్నీ (పవన్ కళ్యాణ్, ‘దిల్’ రాజు) కలిపి, ‘పింక్’ షో వేయించానంతే.
Comments
Please login to add a commentAdd a comment