మళ్లీ గ్యాప్‌ రాకుండా ఈ గ్యాప్‌ ఉపయోగపడింది | Allu Arjun Interview about Ala Vaikunta Puram Lo Movie | Sakshi
Sakshi News home page

మళ్లీ గ్యాప్‌ రాకుండా ఈ గ్యాప్‌ ఉపయోగపడింది

Published Sun, Jan 12 2020 1:00 AM | Last Updated on Sun, Jan 12 2020 8:17 AM

Allu Arjun Interview about Ala Vaikunta Puram Lo Movie - Sakshi

అల్లు అర్జున్‌

‘‘ఒక మనిషి గ్యాప్‌ తీసుకున్నప్పడు చిన్నవైనా, పెద్దవైనా చాలా కొత్త విషయాలు తెలుసుకుంటాడు. నేనూ తెలుసుకున్నాను. గొప్ప విషయాలు తెలుసుకున్నాను. నన్ను ప్రేమించేవారు ఇంతమంది ఉన్నారని కూడా ఈ గ్యాపే తెలిసేలా చేసింది. ఇక నా జీవితంలో ఎప్పుడూ గ్యాప్‌ తీసుకోకుండా ఈ గ్యాప్‌ ఉపయోగపడింది’’ అన్నారు అల్లు అర్జున్‌. త్రివిక్రమ్‌ దర్శకత్వంలో అల్లు అర్జున్‌ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘అల..వైకుంఠపురములో..’. ఇందులో పూజాహెగ్డే కథానాయికగా నటించారు. ఈ చిత్రం నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా అల్లు అర్జున్‌ చెప్పిన విశేషాలు.

ఈ చిత్రంలో ఓ ఆఫీసులో పని చేసే మధ్యతరగతి యువకుడి పాత్రలో నటించాను. ఇందులో పూజా హెగ్డే నా బాస్‌గా నటించారు. నా తండ్రి పాత్రలో మురళీ శర్మగారు కనిపిస్తారు. కథ వైకుంఠపురము అనే ఇంట్లో ఉండేవారి పాత్రల నేపథ్యంలో ఉంటుంది. మా మధ్యతరగతి కుటుంబానికి, ఆ వైకుంఠపురము ఇంటికి ఉన్న సంబంధం ఏంటి? అన్నదే ఈ సినిమా కథ. ఒక మనిషికి ఒక స్థానాన్ని ఇవ్వొచ్చు కానీ స్థాయిని మాత్రం అతనే సంపాదించుకోవాలన్నది ఈ సినిమాలోని కీలక అంశం.
     

► ఇదివరకు త్రివిక్రమ్‌గారితో నేను ‘జులాయి, సన్నాఫ్‌ సత్యమూర్తి’ సినిమాలు చేశాను. ‘జులాయి’ మంచి వినోదాత్మక చిత్రం. ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’లో భావోద్వేగాలు ఎక్కువై, వినోదం తగ్గిందనిపించింది. భవిష్యత్‌లో ఎప్పుడైనా సినిమా చేస్తే ఓ పూర్తి వినోదాత్మక చిత్రం చేయాలని అప్పట్లోనే మేం అనుకున్నాం. నేను కూడా ‘సరైనోడు, డీజే: దువ్వాడ జగన్నాథమ్, నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ ఇలా వరుసగా సీరియస్‌ పాత్రలు ఉన్న సినిమాలు చేశాను. ‘రేసుగుర్రం’లాంటి వినోదాత్మక చిత్రం చేయాలనే ఆలోచనలోఉన్నాను. అదే సమయంలో త్రివిక్రమ్‌గారు ‘అరవిందసమేత వీరరాఘవ’ వంటి సీరియస్‌ సినిమా చేసి, ఓ వినోదాత్మక చిత్రం చేయాలనే ఆలోచనలో ఉన్నారు. అలా ఈ ‘అల..వైకుంఠపురములో..’ ఆరంభం అయింది.
     

► ఈ ఏడాదిన్నర గ్యాప్‌లో హిందీ సినిమా ‘సోనూ కే టిట్టూ కీ స్వీటీ’ తెలుగు రీమేక్‌లో నేను నటించబోతున్నా అనే వార్తలు వచ్చాయి. గీతా ఆర్ట్స్‌లో  రీమేక్‌ చేద్దాం అనుకున్నారు. అప్పుడు ఈ హిందీ చిత్రాన్ని ఓ ఆప్షన్‌లాగానే పెట్టుకున్నాం. నిజానికి త్రివిక్రమ్‌గారు ఈ స్టోరీ లైన్‌ నాకు ఎప్పుడో చెప్పారు. స్క్రిప్ట్‌ను మరింత మెరుగుపరచి చేద్దాం అని అప్పట్లోనే అనుకున్నాం. అలాగే త్రివిక్రమ్‌గారితో చేస్తే సేఫ్‌ అని నేను ఈ సినిమా చేయలేదు. అసలు.. సినిమా అంటేనే సేఫ్‌ కాదు. ఎవరితో చేస్తే ఏంటీ?
     

► ఇప్పటివరకు నేను చేసిన సినిమాల్లో కుటుంబ నేపథ్యం ఉన్న సినిమాలు ఉన్నాయి కానీ నేను పూర్తి స్థాయి కుటుంబ కథా చిత్రం చేయలేదు. ఇది నాకు కొత్త జానర్‌. సాధారణంగా ఇలాంటి సినిమాల్లో యాక్షన్‌కు అంత పెద్ద అవకాశం ఉండదు. కానీ ఈ సినిమాలో యాక్షన్‌తో పాటు మంచి పాటలు కూడా కుదిరాయి.
     

► కొన్నిసార్లు కొంతమంది హీరోలు, దర్శకులకు ఓ రిథమ్‌ కుదురుతుంది. అప్పట్లో చిరంజీవిగారు, కొదండరామిరెడ్డిగార్లలా. విశేషం ఏంటంటే... నా చివరి పది సినిమాల్లో మూడింటికి త్రివిక్రమ్‌గారే దర్శకులు. అలాగే ‘నేను దర్శకత్వం వహించిన పది సినిమాల్లో మూడు నీతోనే చేశాను’ అని త్రివిక్రమ్‌గారు అన్నారు. ఆయనతో నా వర్కింగ్‌ కెమిస్ట్రీ బాగా వర్కౌట్‌ అయ్యిందనిపిస్తోంది. ఒకరినొకరం బాగా అర్థం చేసుకున్నాం. మా కాంబినేషన్‌లో మరిన్ని  సినిమాలు వస్తాయేమో. నిజ జీవితంలో ఉన్నదే త్రివిక్రమ్‌గారి సినిమాలోనూ ఉంటుంది. సీరియస్‌ విషయాన్ని కూడా చాలా సరదాగా, ఫిలాసఫికల్‌గా,  సింపుల్‌గా చెబుతారు. అది త్రివిక్రమ్‌గారి శైలి.
     

► మనం మెరుగుపడటానికి మనం చేసే ప్రతి సినిమా ఓ అవకాశం. కొంతమంది ఫిల్మ్‌మేకర్స్‌తో ట్రావెల్‌ అవుతున్నప్పడు, వారి ఆలోచనా ప్రభావంతో మనలో కూడా ఎంతో కొంత మార్పు వస్తుంది. ఒక నటుడు నటన మారింది అంటే అతని వ్యక్తిగత జీవితం కూడా మారినట్లేనని నా అభిప్రాయం. త్రివిక్రమ్‌గారితో అది నేను ఫీలయ్యాను. ‘జులాయి’ తర్వాత నా యాక్టింగ్‌ లెవల్‌ పెరిగిందన్నారు. వ్యక్తిగా కూడా నా ఆలోచనా పరిణతి మెరుగుపడింది. ఇద్దరు పిల్లలకు తండ్రిని అయ్యాక కూడా నాకు మెచ్యూరిటీ రాకపోతే ఇంకెప్పుడు వస్తుంది (నవ్వుతూ).
 

► బాక్సాఫీస్‌ వద్ద సంక్రాంతి పోటీ దశాబ్దాలుగా  ఉంది. కోట్లు పెట్టి సినిమా తీసే ఏ నిర్మాత అయిన సోలో రిలీజే కోరుకుంటాడు. అలా చేస్తే చాలా డబ్బులొస్తాయి. మామూలు సమయంలో సోలో రిలీజ్‌కు వచ్చినప్పడు కన్నా సంక్రాంతి  సమయంలో వస్తే 20 –30శాతం వరకు ఎక్కువ వస్తాయనుకుంటారు. అందుకే ఈ సీజన్‌ను మిస్‌ చేసుకోరు.
     

► ఓసారి మా అబ్బాయి (అల్లు అయాన్‌) షూటింగ్‌కు వస్తానని మారాం చేశాడు. నేను వద్దు అన్నాను. వెళ్లి మా నాన్న (నిర్మాత అల్లు అరవింద్‌)తో చెప్పాడు. ‘ఇది నా సినిమా అని చెప్పు’ అని మా నాన్నగారు వాడితో అన్నారు. ‘మా తాతగారు ఈ సినిమాకు నిర్మాత. ఇది నా సినిమా అందుకే వచ్చాను’ అని సెట్‌లో అన్నాడు (నవ్వుతూ). అప్పుడు కెమెరా పట్టుకున్నాడు. మా పిల్లలను అప్పుడప్పుడు సెట్‌కు తీసుకుని వెళతాను. ఇంతకుముందటి తరం వాళ్ల పిల్లలను సెట్‌కు తీసుకుని వెళితే చెడిపోతారని దూరం పెట్టేవారు. అది నాకు డబుల్‌స్టాండర్డ్‌లా అనిపిస్తుంది. అందుకే నా పిల్లలను సెట్స్‌కు తీసుకెళ్తుంటాను. మా తాతగారు (అల్లు రామలింగయ్య) ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేశారు. మా నాన్న నిర్మాతగా చేస్తున్నారు. నేను హీరోగా ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేస్తున్నాను. నా జీవితంలో నన్ను ఈ స్థాయికి తెచ్చింది సినిమాయే. మా నాన్న ఏం చేస్తున్నారు? ఇంతమంది మా నాన్నను ఎందుకు అభిమానిస్తున్నారు? అని నా పిల్లలు కూడా తెలుసుకోవాలనుకుంటున్నాను. వారిది చిన్న వయసే అయినప్పటికీ మా పిల్లలకు కూడా అలవాటు పడాలి. వారసత్వం కూడా ఎందుకు తీసుకోకూడదు.
     

► దర్శకుడు వేణు శ్రీరామ్‌తో నేను చేయాల్సిన ‘ఐకాన్‌’ చిత్రం ఆగిపోలేదు. సుకుమార్‌గారి సినిమా,  ‘ఐకాన్‌’... రెండు రోజుల గ్యాప్‌లో చర్చలు జరిగాయి. ‘మనం చాలా రోజులుగా సినిమా చేయలేదు. చేద్దాం’ అని సకుమార్‌గారు అన్నారు. ఈలోపు వేణు కూడా కల్యాణ్‌గారితో ఓ సినిమా చేస్తారు.
     

► మలయాళంలో నాకు ఉన్న క్రేజ్‌కు సంతోషిస్తున్నాను. ఇప్పటివరకు ఏ తెలుగు హీరోకూ దక్కని గౌరవం నాకు దక్కింది. కేరళలో బోట్‌ రేస్‌ ఫెస్టివల్‌ జరిగింది. దానికి అక్కడి గవర్నర్‌గారితో పాటు నన్ను కూడా అతిథిగా పిలిచారు. ఈ గౌరవం అందుకున్న తొలి తెలుగు వ్యక్తిని నేనే. ఇది నా ఒక్కడిదే కాదు. మన తెలుగువారందరికీ దక్కిన గౌరవం. అలాగే దుబాయ్‌ తీసుకువెళ్లి నాకో గొప్ప పురస్కారాన్ని ఇచ్చారు. దాన్ని అందుకున్న తొలి మలయాళేతర వ్యక్తిని నేనే.
     

► తెలుగు సినిమాకు క్రాస్‌ ఓవర్‌ ఆడియన్స్‌ పెరిగారు. దాని వల్ల తెలుగు సినిమా రీచ్‌ కూడా పెరిగిపోయింది. మలయాళ ప్రేక్షకులకు నా సినిమాలంటే చాలా ఇష్టం. తెలుగు కమర్షియల్‌ సినిమాలు హిందీలో డబ్‌ అయినప్పుడు కూడా మంచి స్పందన వస్తోంది. నా ‘సరైనోడు, డీజే’ చిత్రాల హిందీ  డబ్బింగ్‌కు మిలియన్‌ వ్యూస్‌ వచ్చాయి. ఇలా గూగుల్‌ మోస్ట్‌ సెర్చ్‌డ్‌ తెలుగు యాక్టర్స్‌ లిస్ట్‌లో నా పేరు ముందు వరుసలో ఉండొచ్చు.
     

► మా నాన్నగారికి ‘ఛాంపియన్స్‌ ఆఫ్‌ చేంజ్‌ 2019’ అవార్డు వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. జ్యూరీకి థ్యాంక్స్‌. నేను ఇప్పటివరకు 19 సినిమాలు చేశాను. వాటిలో దాదాపు 9 సినిమాలు మా నాన్నగారే నిర్మించారు. అయినా నేను ఎప్పుడూ ఆయనకు థ్యాంక్స్‌ చెప్పలేదు. సేమ్‌ మా నాన్నగారు కూడా నా సినిమా బాగుంటే ఆ విషయాన్ని ఆయన స్ట్రయిట్‌గా చెప్పలేరు. ‘సినిమా బాగుందంట్రా’ అని పైపైన అంటారు. (నవ్వుతూ). అలాగే మా నాన్నగారు నిర్మించిన వేరే సినిమాలు హిట్‌ అయినప్పుడు డాడీ ‘గుడ్‌ గుడ్‌’ అంటాను.  
     

► ‘రాములో రాములో’ సాంగ్‌ చిత్రీకరణ సమయంలో మా అమ్మాయి (అల్లు అర్హా) సెట్‌కు వచ్చింది. మేం అందులో హాఫ్‌కోట్‌ స్టెప్‌ అని ఒకటి పెట్టుకున్నాం. అది చూసి మా అమ్మాయి దోసె స్టెప్‌ అనేసింది. ఇంటికి వచ్చి నాన్న దోసెలు వేస్తున్నారని నా భార్యకు (అల్లు స్నేహ) చెప్పింది. అలా దోసెలు వేస్తేనే డబ్బులొస్తాయమ్మా! అని నేను చెప్పాను. అయితే బాగా వేయి నాన్న అని చెప్పింది (నవ్వుతూ).

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement