తారాగణం: ఊర్మిళ, రేచల్, ఎస్తాబన్, సంజీవ్...
దర్శకత్వం: సింగీతం శ్రీనివాసరావు
నిర్మాతలు: భారతీ, కృష్ణ
మాతృమూర్తులు రెండు రకాలు. కన్నతల్లి, పెంచిన తల్లి. ఇతిహాసాలు సైతం ఈ ఇద్దరు తల్లుల గురించే ప్రస్తావించాయి. అమ్మ అనే భావన... బిడ్డల మూలకణాలు, జీన్స్ వంటి సాంకేతిక అంశాలకు అతీతం. తన శరీరాన్ని చీల్చుకొని బయటకొచ్చిన బిడ్డ జాతి గురించి, మతం, జీన్స్ గురించి అమ్మ ఆలోచించదు. శాస్త్ర, సాంకేతిక పరంగా అమెరికా లాంటి దేశాలు ఎంతైనా అభివృద్ధి చెందనీ, మనిషి జన్మకు సంబంధించినంతవరకూ ఎన్ని దారులైనా వెతకనీ.. కానీ అమ్మ మాత్రం అమ్మే. నవ మాసాలూ మోసి, కని... తన రక్తాన్ని పాలుగా మార్చి బిడ్డను సాకే తల్లికి ప్రత్యామ్నాయాన్ని మాత్రం ఎవరూ కనిపెట్టలేరు. శాస్త్రాలకు అందని మాయ అమ్మ. అందుకే ‘మాతృదేవోభవ’ అంది మన దేశం. ‘వెల్‌కమ్ ఒబామా’ సినిమాలో సింగీతం చెప్పింది అదే.
సింగీతం శ్రీనివాసరావు నుంచి సినిమా వస్తుందంటే... కచ్చితంగా అందులో ఏదో కొత్తదనం ఉంటుందనేది ప్రేక్షకుల నమ్మకం. ఆ నమ్మకాన్ని వమ్ము చేయలేదు సింగీతం. ఇప్పటివరకూ తెలుగు తెరపై రాని ఓ కొత్త ప్రయోగంతోనే మళ్లీ ప్రేక్షకులను పలకరించారు. ఆ ప్రయోగం ఏంటో తెలుసుకోవాలనుందా? అయితే ముందు కథలోకెళదాం.
లూసీ అనే విదేశీయురాలికి అద్దె గర్భం(సరోగసి) ద్వారా తన బిడ్డకు జన్మనిచ్చే ఓ అద్దె తల్లి అవసరం అవుతుంది. దాంతో ఇండియాలోని కొందరు దళారుల్ని ఆశ్రయిస్తుంది. వారి ద్వారానే యశోద గురించి తెలుసుకుంటుంది. యశోదకు డబ్బు చాలా అవసరం. తన పెంపుడు కూతురు ఆపరేషన్ నిమిత్తం ఆమెకు అర్జంట్‌గా లక్ష రూపాయిలు కావాలి. దాంతో తన గర్భం ద్వారా లూసీ బిడ్డకు జన్మనీయడానికి యశోద అంగీకరిస్తుంది. అన్నీ సక్రమంగా జరుగుతాయి. లూసీ దంపతుల బిడ్డ యశోద కడుపులో పడుతుంది. నెలలు నిండుతాయి. యశోదను మెడికల్ చెకప్‌కి తీసుకెళుతుంది లూసీ. యశోద కడుపులోని బిడ్డ వైకల్యంతో పుట్టే అవకాశం ఉందని వైద్యులు చెప్పడంతో షాక్‌కు గురవుతుంది.
అలాంటి బిడ్డ తనకొద్దంటుంది. ప్రసవానంతరం బిడ్డను ఆనాథ శరణాలయంలో పడేయమని యశోదకు డబ్బు కూడా ఇవ్వబోతుంది. కానీ యశోద మాత్రం ఒప్పుకోదు. అందరూ ఉన్న తన బిడ్డ అనాథ ఎలా అవుతాడని లూసీని నిలదీస్తుంది. కానీ లూసీ మాత్రం ఆ బిడ్డ తనకొద్దంటూ అక్కడ్నుంచీ వెళ్లిపోతుంది. తీరా యశోదకు ఎలాంటి లోపం లేని చక్కని మగబిడ్డ పుడతాడు. ఆ తెల్లజాతి బిడ్డకు ‘కృష్ణ’ అని పేరు పెట్టుకొని ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటుంది యశోద. కొన్నేళ్లు గడుస్తాయి. ఓ రోజు లూసీ మళ్లీ యశోద ముందు ప్రత్యక్షమవుతుంది. తన బిడ్డను తనకిచ్చేయమంటుంది. యశోద గుండె బద్దలైనంత పనవుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? అనేది మిగిలిన కథ.
అమ్మ గొప్పదనాన్ని చూపిస్తూ, అంతర్లీనంగా దేశం గొప్పతనాన్ని వివరిస్తూ నవ్యరీతిలో సింగీతం ఈ కథను నడిపించిన తీరు అభినందనీయం. భావోద్వేగాలు కూడా కథానుగుణంగా సాగాయి. కొన్ని సన్నివేశాల్లో అయితే... కళ్లు చెమర్చాయి. భారతమాతకు మరోరూపంలా యశోద పాత్రను, అమెరికాకు ప్రతిరూపంగా లూసీ పాత్రను మలిచారు సింగీతం. యశోద పాత్రలో మరాఠి నటి ఉర్మిళ చూపిన నటన అమోఘం. లూసీ క్యారెక్టర్‌లో రేచెల్(యూకే) ఫర్వాలేదనిపించింది. కృష్ణ పాత్రలో బాలనటుడు ఎస్తాబాన్ ఆకట్టుకున్నాడు. ఈ చిత్రంతో రచయితలు భువనచంద్ర, అనంత శ్రీరామ్, బలభద్రపాత్రుని రమణి నటులుగా మారారు. అసహజమైన వారి హావభావాలు ప్రేక్షకుల సహనానికి పెద్ద పరీక్ష. తెల్లని కాగితంపై నల్లని మచ్చలా ఉంది వారి ఎపిసోడ్. సింగీతం స్క్రీన్‌ప్లే, సంగీతం రెండూ బావున్నాయి. దర్శన్ కెమెరా, రోహిణి మాటలు సినిమాకు అదనపు ఆకర్షణలు. భారతీకృష్ణ నిర్మాణాత్మక విలువలు బాగున్నాయి. హైబ్రిడ్ చిత్రాలు రాజ్యమేలుతున్న ప్రస్తుత సమయంలో వచ్చినఈ మంచి ప్రయత్నాన్ని ప్రేక్షకులు ఏ మేర ఆదరిస్తారో తెలుసుకోవాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.
ప్లస్: దర్శకత్వం, కథ, మాటలు, ఛాయా గ్రహణం, ఊర్మిళ నటన
మైనస్: ముగ్గురు రచయితల ఎపిసోడ్