Bhuvana Chandra
-
Jamuna: కళాభారతికి నీరాజనం
'వంశీ ఇంటర్నేషనల్ అండ్ శ్రీ సాంస్కృతిక కళాసారథి' సింగపూర్ సంస్ధల సంయుక్త ఆధ్వర్యంలో ప్రజానటి కళాభారతి డాక్టర్ జమున రమణారావు నటించిన సినిమాలలో ఆమె నటనా వైదుష్యంపై విశ్లేషణా ప్రసంగాలతో ‘‘మీరజాలగలడా నా యానతి’’ కార్యక్రమం అంతర్జాల వేదికపై శనివారం ఘనంగా నిర్వహించబడింది. భారత్, సింగపూర్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, మలేషియా, హాంకాంగ్, ఖతార్, యుగాండా, కెనడా, అమెరికా దేశాల నుండి 35 మంది ప్రఖ్యాత రచయితలు ఈ కార్యక్రమంలో పాల్గొని జమున నటించిన చిత్రరాజాల నుండి 35 ఆణిముత్యాలు అయిన సినిమాలను ఎంపిక చేసుకొని, వాటిలో ఆమె కనబరిచిన నటనా ప్రావీణ్యం, వివిధ రకాల పాత్రలలో ఆమె ఇమిడిపోయిన తీరు గురించి విశ్లేషిస్తూ అద్భుతమైన ప్రసంగాలను చేశారు. ముఖ్యఅతిథిగా చెన్నై నుండి ప్రముఖ సినీ రచయిత భువనచంద్ర పాల్గొని జమున నటనా ప్రభావ విశేషాలను గూర్చి, నిజ జీవితంలో ఆమె కనబరిచిన ఉన్నతమైన వ్యక్తిత్వాన్ని గూర్చి ప్రసంగించారు. జమున కుమారులు, అమెరికా వాస్తవ్యులైన డా. వంశీ కృష్ణ ఈ కార్యక్రమంలో ప్రత్యేక అతిధిగా పాల్గొని తన మాతృమూర్తి చిత్రపటం ముందు జ్యోతిని వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. సుమారు 7 గంటల పాటు జరిగిన ఈ కార్యక్రమాన్ని ఆసాంతం వీక్షించి, అందరి ప్రసంగాలను విని ఇంతటి బృహత్ కార్యక్రమాన్ని చేపట్టినందుకు వంశీ -సింగపూర్ సంస్థలకు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. విదేశాల వారితోపాటు హైదరాబాద్ నుండి ప్రముఖ రచయితలైన ఆచార్య టీ గౌరీ శంకర్, హాస్యబ్రహ్మ శంకరనారాయణ, డాక్టర్ కె వి కృష్ణకుమారి, డాక్టర్ తిరునగిరి దేవకీదేవి లు ప్రసంగవ్యాసాలను అందించడం విశేషం. "తాము కార్యక్రమం ఉద్దేశాన్ని తెలియపరచగానే పది దేశాల నుంచి స్పందించి 35మంది రచయితలు ముందుకొచ్చి విశ్లేషణ వ్యాసాలను అందించడం చాలా సంతోషకరంగా ఉందని, త్వరలో ఈ వ్యాసాలు అన్నింటితో వంశీ ప్రచురణగా, పుస్తకాన్ని ప్రచురిస్తామని" కార్యక్రమ ముఖ్య నిర్వాహకులు, వంశీ వ్యవస్థాపకులు డాక్టర్ వంశీ రామరాజు, శ్రీ సాంస్కృతిక కళాసారథి వ్యవస్థాపకులు కవుటూరు రత్నకుమార్ తెలియజేశారు. రచయిత్రి రాధిక మంగిపుడి సభా నిర్వహణ గావించగా అలనాటి మేటి చిత్రాలైన మిస్సమ్మ, శ్రీకృష్ణతులాభారం, గుండమ్మ కథ, అప్పుచేసి పప్పుకూడు, యశోదా కృష్ణ, మంగమ్మ శపథం, మూగమనసులు, చిరంజీవులు, బంగారు తల్లి.. వంటి చిత్రాలలో జమున నటించిన వైవిధ్యభరితమైన పాత్రల ఔచిత్యాన్ని చక్కగా రచయితలు అభివర్ణించారు. సినిమాలతో పాటు జమున గారితో వీరందరికీ ఉన్న ప్రత్యక్ష అనుబంధాన్ని గూర్చి కూడా తలచుకుంటూ ఆమెకు నివాళులు అర్పించారు. వంశీ అధ్యక్షురాలు డా తెన్నేటి సుధా దేవి, మేనేజింగ్ ట్రస్టీ శైలజా సుంకరపల్లి నిర్వహణా సహకారం అందించారు. ఇవి చదవండి: అను వైద్యనాథన్: సాహసాల నుంచి నవ్వుల వరకు -
రచయితలో మానవత్వం, మాతృత్వం రెండూ ఉండాలి
ప్రకృతి నుంచి మనం అన్నీ తీసుకుంటున్నామని, కానీ తిరిగి ఏమీ ఇవ్వడంలేదని ప్రముఖ రచయిత భువనచంద్ర అన్నారు. కొత్త (కరోనా) కథలు - 4 కథా సంకలనానికి ఆర్థిక సహకారం అందించిన డాక్టర్ ఆళ్ల శ్రీనివాసరెడ్డి (డల్లాస్)కి ధన్యవాదాలు తెలిపేందుకు 7 దేశాలకు చెందిన 80 మంది రచయితలు, ఇతర ప్రముఖులు జులై 17న సోషల్ మీడియా వేదికగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా భువనచంద్ర మాట్లాడుతూ రచయితలో మానవత్వంతో పాటు మాతృత్వం ఉండాలన్నారు. 80 మంది రచయితల కథలను ఒకే పుస్తకంలో ముద్రించడం గొప్ప విషయమన్నారు. ఈ పుస్తకాన్ని తీసుకొచ్చేందుకు కృషి చేసిన శ్రీనివాస్ రెడ్డి, రామరాజులకు భువన చంద్ర ధన్యవాదాలు తెలియచేశారు. ఆరోగ్యం సహకరించకపోయినా యండమూరి వీరేంద్రనాథ్ ఈ కార్యక్రమంలో పాల్గొని రచయితలందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కామేశ్వరి, డాక్టర్ కేవీ కృష్ణకుమారి, డాక్టర్ డా తెన్నేటి సుధా దేవి, అత్తలూరి విజయలక్ష్మి, ముక్తేవి భారతి, పొత్తూరి విజయలక్ష్మి తదితర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ వర్చువల్ సమావేశాన్ని డాక్టర్ వంశీ రామరాజు నిర్వహించారు. -
రికార్డ్ నెలకొల్పిన ‘ప్రపంచ మహిళా తెలుగు కవితా మహోత్సవం’
హైదరాబాద్: "డాక్టర్ సి.నారాయణరెడ్డి వంశీ విజ్ఞాన పీఠం" "శ్రీ సాంస్కృతిక కళాసారథి" సింగపూర్, "సాహితీ కిరణం" మాసపత్రిక సంయుక్త ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా మూడు రోజుల పాటు, అంతర్జాల వేదిక పై 17 దేశాల నుండి పాల్గొన్న 250మంది కవయిత్రులతో అద్వితీయంగా నిర్వహించబడిన "ప్రపంచ మహిళ తెలుగు కవితా మహోత్సవం" ప్రపంచ స్థాయిలో రికార్డ్ నెలకొల్పింది. కార్యక్రమం ముఖ్య నిర్వాహకులు డాక్టర్ వంశీ రామరాజు మాట్లాడుతూ.. "అంతర్జాలం ద్వారా ఎన్నో సాహిత్య కార్యక్రమాలు నిర్వహింపబడుతున్నా కూడా, కేవలం మహిళల కోసం ప్రత్యేకంగా ఒక కార్యక్రమం నిర్వహించాలనే ఉద్దేశంతో మహిళా కవయిత్రులకు ప్రోత్సాహాన్ని ఇచ్చే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగిందని, అనూహ్యమైన స్పందన వచ్చి 17 దేశాలనుండి 250 మంది కవయిత్రులు కేవలం వారం రోజుల్లో ముందుకొచ్చి కార్యక్రమంలో పాల్గొన్నారని, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ వారు తమ ప్రయత్నానికి ప్రత్యేక అభినందనలు తెలిపారని, తమ ప్రయత్నానికి మరింత తృప్తిని ఇస్తూ ఈ కార్యక్రమం "తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్" వారిచే రికార్డు చేయబడిందని" తెలియజేస్తూ తన ఆనందాన్ని, కృతజ్ఞత వ్యక్తం చేశారు. 23, 24, 25 తేదీలలో జరిగిన ఈ అంతర్జాల కార్యక్రమంలో మొదటిరోజు భువనచంద్ర, డాక్టర్ నందివాడ అనంతలక్ష్మి; రెండవ రోజు డాక్టర్ నందిని సిధారెడ్డి, డాక్టర్ ముదిగంటి సుజాత రెడ్డి; మూడవరోజు డాక్టర్ సుద్దాల అశోక్ తేజ, మామిడి హరికృష్ణ, 'శ్రీ సాంస్కృతిక కళాసారథి' అధ్యక్షుడు కవుటూరు రత్నకుమార్, 'సాహితీ కిరణం' మాసపత్రిక సంపాదకులు శ్రీ పొత్తూరి సుబ్బారావు, వివిధ దేశాలలోని తెలుగు సంస్థల అధ్యక్షులు పలు ప్రముఖ రచయిత్రులు పాల్గొన్నారు. రాధికా మంగిపూడి (సింగపూర్), జుర్రు చెన్నయ్య (హైదరాబాద్), జయ పీసపాటి (హాంకాంగ్), రాధిక నోరి (అమెరికా), కార్యక్రమ వ్యాఖ్యాతలుగా వ్యవహరించి ఆసక్తికరంగా కార్యక్రమాన్ని ముందుకు నడిపించారు. భారత్, అమెరికా, సింగపూర్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, యూ కె, ఖతార్ మొదలైన 17 దేశాల నుండి ఆయా ప్రాంతాలలో పేరుపొందిన 250 మంది రచయిత్రులు వారి దేశ కాలమానాలకు అనుగుణమైన సమయాలలో విచ్చేసి తమ కవితలను ఈ వేదికపై పంచుకున్నారు. ఉగాది కవితలు, ఛందోబద్ధ రచనలు, సామాజిక స్పృహ ఉండే అంశాలు మొదలైన వివిధ కోణాల నుండి వైవిధ్యభరితమైన అంశాలను ఎన్నుకొని అందంగా మలచిన కవితలతో కవయిత్రులందరూ రాణించడం విశేషంగా ఆకర్షించింది. చదవండి: ప్రవాసాంధ్రుల్లారా ఆపత్కాలంలో ఏపీకి అండగా నిలవండి -
ఆయన హస్తవాసి చాలా మంచిది
‘‘విజయబాపినీడు గారికి నన్ను ‘ఇతను చాలా బాగా రాస్తాడు. ఓ అవకాశం ఇవ్వండి’ అంటూ పరిచయం చేసింది గుత్తా సురేశ్‌గారు. ‘‘బాగా చదువుకున్నావు. నీకెందుకు సినిమా ఇండస్ట్రీ. చక్కగా ఏదైనా ఉద్యోగం చేసుకో’’ అని బాపినీడుగారు సలహా ఇచ్చారు. ‘సార్.. చిన్నతనం నుండి సినిమా వాల్‌పోస్టర్ పైన ఉన్న టైటిల్స్ మీద ‘పాటలు’ అనే కార్డు పక్కన నా పేరు రాసుకునేవాణ్ణి. అందుకే నాకు ఉద్యోగం వచ్చినా చేరలేదు. నాకు ఆల్రెడీ ఎయిర్‌ఫోర్స్‌లో ఉద్యోగం వచ్చింది’ అని లెటర్ చూపించాను. అది చూసి ఆయన ‘‘ఇప్పుడు నేను తీస్తున్న సినిమాలో పాటలు లేవు. కానీ, ‘ఆన్ పావమ్’ అనే తమిళ సినిమాలో టైటిల్ కార్డ్స్ మీద ఓ పాట వస్తుంది. ఆ సినిమా చూసిరా. నేను నిన్ను ఇప్పుడు పంపిస్తున్నాను కదా అని సినిమా ఓకే అయ్యింది అనుకోవద్దు. నువ్వు రాసినది నచ్చితేనే అవకాశం’’ అన్నారు. సరే అన్నాను. ‘ఆన్ పావమ్’ చూడ్డానికి వెళ్లాను. టైటిల్స్ పడ్డాయి, చూశాను. బయటికొచ్చి 40 పేజీల పుస్తకం కొనుక్కొని ఓ బస్ ఎక్కాను. బస్సులో మూడు పల్లవులు, నాలుగు చరణాలు రాశాను. 45 నిమిషాల తర్వాత బస్ వడపళనిలో ఆగింది. బాపినీడుగారి ఇంటికి వెళ్లాను. నన్ను చూడగానే ఆయన ‘‘ఏంటి నేను సినిమా చూడమని పంపానుగా.. వచ్చేశావ్’’ అని కోప్పడ్డారు. ‘సార్, నేను రాసేది టైటిల్కార్డ్స్లో వచ్చే పాట అన్నారు. మూడు గంటల సినిమా టైమ్ వేస్ట్ అని టైటిల్స్ చూసి వచ్చేశాను. మీరు చెప్పిన పాట రెడీ’ అన్నాను. ఆయన ఆశ్చర్యంతో ఆ చిత్ర సంగీత దర్శకుడు సాలూరి వాసూరావుని పిలిపించి, ట్యూన్ చేయమని చెప్పారు. సినిమా టైటిల్ కార్డ్స్‌పై వచ్చే పాట కదా వెస్ట్రన్ చేద్దాం అని ఆయన ఓ వెస్ట్రన్ ట్యూన్ ఇచ్చారు. నేను ఆల్రెడీ రాసుకొన్న పాటే కదా అటూ ఇటూ మార్చి ఇచ్చాను. బావుంది. అయినా మరో వెర్షన్ రాయండి అని ఈసారి ఫోక్లోర్ ట్యూన్ ఇచ్చారు. మరో పావుగంటలో ఇంకో పాట ఇచ్చాను. వాసూరావు గారు ఆశ్చర్యపోతూ ‘మీరు గతంలో ఏ సినిమా వాళ్ల దగ్గరైనా పని చేశారా’ అని అడిగారు. ‘నాకు సంగీతమంటే ఇష్టం కావటంతో హిందీ పాటలు బాగా వింటాను. నాకు హిందీ రాదు, అందుకని నేను ఆ ట్యూన్‌కి తగినట్లుగా తెలుగులో నాకిష్టం వచ్చిన పదాలతో పాటలు రాసుకొనేవాణ్ణి. అది ఇలా ఉపయోగపడింది’ అని చెప్పాను. ఇది జరిగింది 1986 డిసెంబర్ 30న. 1987 జనవరి 1న బాపినీడుగారు దర్శకత్వంలో మొదలైన ‘నాకూ పెళ్లాం కావాలి’ సినిమా ద్వారా పాటల రచయితగా మారాను. సినిమా సూపర్‌హిట్. 100 రోజులు అవుతున్నా ఇంకా ఆడుతూనే ఉంది. బాపినీడుగారు పబ్లిసిటీ చేయటంలో మాస్టర్. ‘‘సినిమా చాలా బావుంది. ఇంకో పాట యాడ్ చేద్దాం. ట్యూన్ రెడీ చేయిస్తా’’ అన్నారాయన. ‘వద్దు సార్. అదే ట్యూన్‌కు ఇంకో వెర్షన్ రాస్తాను’ అన్నాను. సరే అన్నారు. అందులో మొదటిసారి రాసిన పాట ‘‘వినోదాల విందురా, బాధలన్ని బంద్రా...’ అనేది మొదటి వెర్షన్. ఇదే ట్యూన్‌కి సినిమా 100 రోజుల తర్వాత ‘నాకు పెళ్లాం కావాలి, మూడు ముళ్లు వెయ్యాలి...’ అని రాశాను. ఒకే ట్యూన్‌కి రెండు పాటలు రాసిన ఘనత నాకే దక్కింది. సినిమా పోస్టర్ మీద ఒక్కసారైనా పేరు చూసుకోవాలన్న నా బలమైన కోరికను తీర్చిన బాపినీడుగారికి ఏమిచ్చి రుణం తీర్చుకోగలను. ఆయన గొప్పతనం గురించి నాలుగు మంచి మాటలు చెప్పటం తప్ప. నేను పరిచయం అయ్యాక ఆయన 14 సినిమాలు తీశారు. ఆయన అన్ని సినిమాల్లో నాకు చివరి వరకు అవకాశం ఇచ్చారు. ఆయన హస్తవాసి చాలా మంచిది. బాపినీడుగారికి ఆశ్రునయనాలతో తుది వీడ్కోలు పలుకుతున్నా’’. -
మేలుకో! మేలుకో!
చిత్రం: సంతానం (1955) సంగీతం: సుసర్ల దక్షిణామూర్తి రచన: అనిసెట్టి గానం: ఘంటసాల ‘సంతానం చిత్రంలో, చిన్న పిల్లలు తప్పిపోయిన సన్నివేశంలో చిత్రీకరించిన ఈ పాట అంటే నాకు ప్రాణం. కనుమూసినా కనిపించే నిజమిదేరా! ఇల లేదురా నీతి! ఇంతేనురా లోకరీతి!అంటూ మానవత్వాన్ని నిద్రలేపుతున్న పాట ఇది. ఈ మేలుకొలుపు పాటను నా చిన్నతనంలో మా అమ్మగారు నాకు నేర్పారు. ఇది పాడినప్పుడల్లా నాన్నగారు నన్ను మెచ్చుకునేవారు. మా నాన్నగారు గతించిన దుఃఖంలో నుంచి బయటపడేలా నన్ను ఓదార్చిన పాట. నా బాల్యంలో చెప్పులు కూడా కొనుక్కోలేని స్థితి మాది. కష్టపడటం తెలిసినవాడు ఎన్నిసార్లు కిందపడ్డా లేస్తాడు.‘మానవులంతా నీతి నియమాలు లేకుండా జీవిస్తున్నారు. అది సరి కాదు. మానవులంతా జ్ఞానమార్గంలో పయనించాలి’ అంటూ ఉత్తేజపరిచే మేలుకొలుపు పాట ఇది.నిద్ర నుంచి జాగరూకతలోకి ఒక మేలుకొలుపు. నిద్ర అనే అజ్ఞానం, చీకటుల నుంచి మెలకువ అనే వెలుగు, జ్ఞానాలలోకి పయనించమని బోధించడమే ఈ పాట అనిపిస్తుంది నాకు. సుఖదుఃఖాలు ఎల్లకాలం ఒకేలా ఉండవు. ఒకనాడు సుఖంగా ఉంటే, మరొకనాడు దుఃఖానికి లోనవుతాం. ఒకనాడు దుఃఖంగా ఉంటే మరొకనాడు సుఖసంతోషాలతో జీవిస్తాం. రెండు దుఃఖాల మధ్య వచ్చే సుఖం.. మనిషికి కావలసినంత సుఖాన్నిస్తుంది. రెండు సుఖాల మధ్య వచ్చే దుఃఖం... మనిషిని కుంగతీసేంత దుఃఖాన్నిస్తుంది. ‘కనుమూసినా కనిపించే నిజమిదేరా’ అంటూ ‘అనిసెట్టి’ చెప్పిన వేదాంతం ఇదే.కలకాలం ఈ కాళరాత్రి నిలువదోయి మేలుకో...అనే వాక్యంలో ఈ విషయాన్నే విశదపరిచారు రచయిత. ‘సుఖం వలన కలిగే సుఖం విలువ’ తెలియాలంటే దుఃఖాలు అనుభవించాలి. మానవ జీవితంలో కష్టసుఖాలు పగలు, రాత్రి లాగ ఉంటాయి. దుఃఖం వచ్చినప్పుడు కుంగిపోకూడదు, సుఖం వచ్చినప్పుడు పొంగిపోకూడదు. సమతుల్యత పాటించాలి. ఉదయకాంతి... మదికి శాంతి...రాత్రి విరజిమ్మిన చిమ్మచీకట్లు, ఉదయం సూర్యుడు ఉదయించగానే మటుమాయమవుతాయి. జీవితంలో అందరికీ ఒక ‘మేలుకొలుపు’ కావాలి. మనం కులమతాల పేరు మీద దెబ్బలాడుకుంటున్నాం, ఎన్ని లక్షలమందో పుడుతున్నారు, ఎంతోమంది శరీరాన్ని వదులుతున్నారు. మనం ఈ లోకానికి అతిథిగా వచ్చాం, అలాగే వెళ్లిపోతాం. జీవితంలోని ఆశలు అనేవి మెరుపుల్లాంటివి.. చావు అనివార్యం. చిట్టచివరి క్షణంలో నా వాళ్లకి ఇంత ఇవ్వాలి అని ఆలోచించకుండా ఉండాలి.భ్రమలు గొలిపే మెరుపులేరా జగతిలో ఆశలు...మనమందరం ఇద్దరు తల్లుల ఒడిలో పెరుగుతాం. మొదటిది కన్నతల్లి కడుపులో. అందులో నుంచి బయటకు వచ్చాక ఇక లోపలకు Ðð ళ్లలేం. ఆ తరువాత మనం భూమి తల్లి ఒడిలో పడతాం. ఆ తల్లి ఒడిలో నడయాడుతాం. బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం అన్నీ భూమి తల్లి ఒడిలోనే. చివరగా ఆ తల్లి ఒడిలోకి వెళ్లాక ఇక బయటకు రాలేం. ఈ పాటలోని ఒక్కో అక్షరం ఆణిముత్యం. జీవిత సత్యం. ప్రతి ఒక్కరూ జీవితం గురించి అర్థం చేసుకోవాలని పలికే పాట ఇది. – సంభాషణ: డా. వైజయంతి -
ఆశ దివ్వెలా వెలుగుతుంటే...
పాటతత్వం అన్నీ తానై పెంచిన మామయ్య ప్రేమ ఒకవైపు. మనసు కోరుకున్న మనిషి మరోవైపు. ఈ సంఘర్షణలో పుట్టిన కథే ‘ఎగిరే పావురమా’. నేను దర్శకత్వం వహించిన సినిమాల్లో ‘ఎగిరే పావురమా’ నాకు చాలా ఇష్టం. ఎన్నో భావోద్వేగాలు ముడిపడి ఉన్న కథ ఇది. శ్రీకాంత్, లైలా, జేడీ చక్రవర్తి ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాలో వన భోజనాల సందర్భం ఒకటి ఉంది. దాని కోసం మంచి పాట రాయించాలని అనుకున్నాం. మనుషుల మధ్య దూరం పెరిగింది. కుటుంబ సభ్యులు, స్నేహితులు అంతా కలుసుకోవాలంటే ఎప్పటికోగానీ తీరిక ఉండటం లేదు. అందరూ కలిసి ఒక రోజు తోటలో వంటలు వండుకుని, ఆటపాటలతో గడిపితే ఎంత బాగుంటుంది అనిపించింది. సుహాసిని పాత్రతో ఈ మాట చెప్పించి పాటకు కథలో స్థానం కల్పించాం. భువన చంద్ర గారికి చెబితే అద్భుతమైన పాట రాసిచ్చారు. నా సినిమాలకు నేనే సంగీత దర్శకత్వం వహిస్తాను. ట్యూన్‌కు రాసిన పాట ఇది... పల్లవి చాలా కొత్తగా అనిపించింది. రోనా లైలా వానలాగా.. నిన్న కల్లోకొచ్చి పాడిందొక్క పాటా మేడమ్ రంభా స్వర్గంలోనా కాటేజ్ ఇప్పిస్తాను ఆడేయ్మంది ఆటా విశ్వమిత్రా రాజపుత్రా.. ట్యూనింగ్ చేసేయ్ నీ పాటా హృదయపు కితకితలో.. సరదా పాటలు చాలా విని ఉంటాం కానీ.. ఈ పాట చాలా కొత్త కొత్త పదాలతో భువనచంద్ర గారు రాశారు. రోనా లైలా వానలాగా నిన్న కల్లోకొచ్చి పాడిదొక్క పాటా... మేడమ్ రంభా స్వర్గం లోనా కాటేజ్ ఇప్పిస్తాను ఆడేయ్ మంది ఆటా... పల్లవిలోని ఈ వరుసలు భువనచంద్ర సృష్టించిన నూతన సాహిత్య ఒరవడిని చూపిస్తాయి. చరణంలో ఈ పదాల జోరు పెంచి ఇలా రాశారు.. పసిఫిక్ ఓషన్ చెక్కిలిపైనా.. ఫుల్‌మూన్ లైటూ పడుతూ ఉంటే.. సాగర కెరటం రాకెట్ ఎక్కి... రోదసి ఎదలో నిద్దురపోతే.. అది ఒక ఇదిలే పరువపు సొదలే మనసుకు తెలిసిన కథలే విలవిలలాడే యక్షుడి విరహపు వ్యథలే లేఖలు తెచ్చే మబ్బులు కరువై కార్డ్‌లెస్ ఫోన్ లో కాంటాక్ట్ చేశామ్ కబురులు ఎవ్వరు తెచ్చిననేమి కుశలము తెలియుట ముఖ్యముగానీ పసిఫిక్ ఓషన్ చెక్కిలి, సాగర కెరటం రాకెట్, రోదసి ఎద, యక్షుడి విరహ వ్యథ... అంటూ గ్రాంథిక, ఆధునిక భాషల కలయికలో ఓ కొత్త పాటను భువనచంద్ర ఆవిష్కరించారు. ఇక రెండో చరణంలో మాసిడోనియా గుర్రాన్నీ, ఆల్ఫ్ పర్వతాల అంచుల్నీ పట్టుకొచ్చి పాటలో కూర్చారాయన. మాసిడోనియా గుర్రం లాగా నీడ తోడుకై పరిగెడుతుంటే ఆల్ఫ్ పర్వతం మొదటి అంచునా ఆశ దివ్వెలా వెలుగుతు ఉంటే తనువుల సెగలే తొణికిన కురులై సూర్యుని కప్పిన వేళా పెదవుల జారే కవితల కోసం కోయిల వేచిన వేళా హార్ట్ స్టూడియో తలుపులు తెరిచా విశ్వచిత్రమే ప్రేమగ మలిచా పాట చివర్లో వచ్చే ‘దిస్ ఈజ్ ద రిథమ్ ఆఫ్ ద లైఫ్’ అనే లైన్ హీరో హీరోయిన్లతో కలిసి మిగతా వారంతా పాడతారు. అంటే ఆ ఇద్దరి ప్రేమను అంతా ఇష్టపడుతున్నారని సింబాలిక్ గా చెప్పించాం. పాట రాయడంలో భువనచంద్ర ఏకాగ్రత చాలా గొప్పది. ఆయన అరణ్యంలోని ప్రశాంతతలో ఉన్నా... ట్రాఫిక్ గోల మధ్య ఉన్నా పాట రాయడంలో ఒకే శ్రద్ధ చూపిస్తారు. ఏ దారిలో వెళ్లినా మంచి పాట అనే గమ్యాన్ని చేరుకునే రచయిత భువనచంద్ర. ‘ఎగిరే పావురమా’ సినిమా పూర్తిగా అరకులో చిత్రీకరించాం. అక్కడి లొకేషన్ల అందాలకు మరింత అందమైన పాటలు తోడై సినిమా విజయంలో పాలుపంచుకున్నాయి. ఎగిరే పావురమా లైలాకు తొలి సినిమా. అమాయకపు యువతి పాత్రలో ఆమె చాలా బ్యూటిఫుల్‌గా నటించారు. ఓ విధంగా చెప్పాలంటే ఈ సినిమాకు లైలానే ప్రధానాకర్షణ. మరో రెండు ప్రధాన పాత్రల్లో శ్రీకాంత్, జేడీ చక్రవర్తి సహజంగా నటించారు. ఎంతో ప్రతిభ ఉండీ... ఆర్థిక పరిస్థితులతో కార్పెంటర్ పనిచేస్తుంటాడు శ్రీకాంత్. అలాంటి వ్యక్తిత్వాన్ని ఇష్టపడుతుంది లైలా. మేనకోడలు ను పెళ్లి చేసుకోవాలన్న జేడీ చక్రవర్తి ఆలోచన లోనూ... ఆమెను బాధ్యతగా చూసుకోవాలన్న ఆలోచనే ఉంటుంది. ఇలా సినిమాలో మూడు మంచి పాత్రల విలక్షణత, సంఘర్షణ ప్రేక్షకులని ఆకట్టుకుంది. సేకరణ: రమేష్ గోపిశెట్టి - భువనచంద్ర, గీత రచయిత - ఎస్.వి.కృష్ణారెడ్డి, దర్శకుడు -
గోదావరిని చూస్తే అమ్మ గుర్తొస్తుంది
సినీ గేయ రచయిత భువనచంద్ర చింతలపూడి: తెలుగు సినీ రంగంలో పరిచయం అవసరం లేని వ్యక్తి భువనచంద్ర. ఆయన స్వస్థలం చింతలపూడి. 12 సంవత్సరాల తరువాత వస్తున్న పుష్కరాలతో తనకు ఉన్న అనుబంధం గురించి ఆయన ఇలా వివరించారు.. గలగల పారే గోదావరిని చూస్తే మా అమ్మ గుర్తొస్తుంది. మా అమ్మగారు చంద్రమౌళీశ్వరి రాజమండ్రిలో చనిపోయారు. ఆమె దహన సంస్కారాలు, కర్మ కాండలు అన్నీ గోదావరి ఒడ్డునే చేశాం. అందుకే నేను ఎప్పుడు రాజమండ్రి వచ్చినా మా అమ్మ దగ్గరికి వచ్చినట్టు ఉంటుంది. అందుకేనేమో గోదావరి అంటే నాకు అంత ప్రాణం. చిన్నప్పుడు అమ్మ చిటికెన వేలు పట్టుకుని గోదావరి పుష్కరాలకు వచ్చాను. అప్పటి సంఘటనలు నాకు అంతగా గుర్తు లేకపోయినా పుష్కరాలకు ఉన్న ప్రాధాన్యం తెలిసింది. అమ్మతో కలిసి పుష్కర స్నానం అయ్యాక ఒడ్డుకు వస్తుంటే ఒక సంఘటన జరిగింది. బారు గెడ్డం, తెల్లటి వస్త్రాలు, భుజంపై పసుపు ఉత్తరీయం వేసుకున్న సాధువు ఒకాయన నా తలమీద చెయ్యి పెట్టి మీ అబ్బాయి మంచి పేరు తెచ్చుకుంటాడు అని ఆశీర్వదిస్తూ మా అమ్మగారితో అనడం నాకు ఇంకా గుర్తుంది. పుష్కరాలలో విక్రయించే జీళ్లు, పూతరేకులంటే నాకు చాలా ఇష్టం. జీళ్లు మా ఊళ్లో కూడా దొరుకుతాయి కాని, పూతరేకులు మాత్రం ఇక్కడ తినాల్సిందే. ఈ ఏడాది జరగబోయే గోదావరి పుష్కరాలకు కూడా అమ్మ దగ్గరికి వస్తాను. అమ్మ ఆశీర్వచనాలు తీసుకుంటాను. అమ్మ భౌతికంగా లేకపోయినా గోదారమ్మ రూపంలో బతికే ఉందనిపిస్తుంది. అందుకే పుష్కరాలు ప్రారంభం నుంచి పూర్తయ్యే వరకు ఇక్కడే ఉండాలని ఉంది. ఇంతవరకు గోదావరిని కీర్తిస్తూ పాట రాసే భాగ్యం కలగలేదు. అయితే త్వరలో ఒక ఆధ్యాత్మిక నవలను రచించే ఆలోచన ఉంది. భగవంతుని ఆశీస్సులతో గోదావరి చెంతనే ఉండి ఈ నవలను పూర్తి చేయాలని నిర్ణయం తీసుకున్నాను. ఇది నా చిరకాల కోరిక. -
ఇప్పటికీ నడుస్తున్నది వేటూరి ట్రెండే!
వేటూరి ఓ నిరంతర అన్వేషి. మనో యాత్రికుడు. ఓ మహా వేదాంతి... అన్నిటినీ మించి లోకేశ్వరుడంత ‘ఏకాకి’. ఈ మాటే ఒకసారి నేను వేటూరి గారిని అడిగాను. ఆయన తనదైన ‘చిరునవ్వు’ నవ్వి, ‘అవును’ అన్నారు. ఆ తరవాత చాలాసేపు కళ్లు మూసుకుని ‘‘నేను వెతుకుతూనే ఉన్నాను దేనికోసమో..! దేనికోసమో తెలీదు గానీ వెతుకుతూనే ఉన్నాను. అది దొరికే వరకూ నా ఒంటరితనం పోదు... బహుశా... నన్ను ‘నేనే’ వెతుక్కుంటున్నానేమో’’ అన్నారు. భారతీయమైన వేదాంతాన్నంతట్నీ ఒక్కముక్కలో చెప్పారాయన. రమణమహర్షి అన్నదీ అదేగా. ‘‘హూయామ్ ఐ? నేనెవరూ?’’ అన్న ప్రశ్న వేసుకోమన్నారు అంటే నిన్ను నువ్వు వెతుక్కోమనేగా! వేటూరిగారి గురించి చెప్పాలంటే ఒకే భాష వుంది... అది ‘మనోభాష’. దాని పేరు ‘మౌనం’. ఎందుకంటే అక్షరాల వెనుక ‘అనుభూతి’ని పొదిగిన రచయిత వేటూరి. అక్షరాలకి అర్థాలుంటాయి. అనుభూతికీ? ఊహూ... అక్షరాలకి అతీతమైనదది. ప్రతి మాటా, ప్రతి పాటా ఆణిముత్యమే. పాటల్ని అందరం పంచుకోగలం. ఆయన ‘మాటల్ని’ దాచుకోగలిగే భాగ్యం ‘నాకూ’ దక్కింది. ఓసారి కళ్లు మూసుకుని కూర్చున్నా. ఆయన రాకని గమనించలా. చాలా సేపయ్యాక కళ్లు తెరిచి చూస్తే ఎదుటే కుర్చీలో ఆయన. ‘‘క్షమించండి... చూళ్లేదు’’ కంగారుగా లేచి పాదాలకి నమస్కరించా. ‘‘ఆయుష్మాన్‌భవ’’ అని, ‘‘ఏమిటీ... మనసు బాగోలేదా?’’ అన్నారు. అంటే ఆయన చూసింది నన్ను కాదు... ‘నా మనసుని’ అనిపించింది. ‘‘అవును గురూగారూ... ఎన్ని వెర్షన్లు రాసినా పాట ఓకే కావడం లేదు’’ అన్నాను. ‘‘ఇక్కడ చూడు...’’ అని తన శరీరం వంక చూపించి, ‘‘బాగోలేదు... ఇంకో వెర్షన్ రాయండి...’’ అని క్షణంలో వాళ్లంటారు. కానీ ఎన్ని నరాలు తెగుతాయో, ఎన్ని చుక్కల రక్తం మెదడులో గడ్డ కడుతుందో, వాళ్లకేం తెలుసూ? నా మెదడు నిండా గాయాలే...’’ నవ్వారాయన. ప్రతీ పాటకీ ఇక్కడ జరిగేది పోస్టుమార్టమే. చిత్రం ఏమంటే యీ ‘చిత్ర హింస’ సముద్రాల, ఆరుద్ర, వేటూరి వంటి మనో పండితులకే గాక, సరికొత్త రచయితకీ తప్పదు. ఆయన ఏనాడూ ఉపన్యాస ధోరణి అవలంభించలా. చాలా క్లుప్తంగా వుంటాయి ఆయన సమాధానాలు. అర్థం మాత్రం అనంతం. ఓసారి ఓ పాట ట్యూన్కొచ్చింది. పాట రికార్డ్ అయ్యాక తెలిసింది. ఆ పాట ట్యూన్ వేటూరిగారి కిచ్చారనీ, ఆయనా రాశారనీ. తరవాత వేటూరిగార్ని కలిసినప్పుడు, ‘‘సార్ ఆ ట్యూన్ మీకిచ్చారనీ, మీరు పాట వ్రాశారనీ నిజంగా నాకు తెలీదు... మీకిచ్చిన పాట రాసే ధైర్యం నేనేనాడూ చెయ్యను. చెయ్యలేను’’ అన్నాను. ‘‘నాకు తెలుసు నాయనా... వీళ్లు చేసే మాయలు అన్నీ ఇన్నీ కావు. ఒకప్పుడు ‘నిబద్ధత’ వుండేది. ఇప్పుడది లేదు. వచ్చింది రాసెయ్యడమే. ఎవరెవరికి అదే ట్యూన్ ఇచ్చారో ఎలా తెలుస్తుందీ? పాట రాసినా పాడినా అన్నీ ప్రాప్తాన్ని బట్టేగా!’’ అన్నారు. ఓసారి సౌండ్ ఇంజినీర్ రామకృష్ణగారి రూమ్‌లో వుండగా అంటే, వేటూరిగారూ, రామకృష్ణగారూ, కోటి, రాజ్, నేనూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ వుండగా, ‘‘నటులు కెమేరా ముందు పాత్రలు ధరిస్తే మనం మనస్సులో ఆ పాత్రల్ని ధరిస్తాం... లేకపోతే మీకు ‘ట్యూనూ’ రాదు... మా పాట ‘పాత్రకి సరిపోదు’. అన్నారు. అసలీ అవగాహన ఎంతమందికున్నదీ? ఒకే ట్యూన్లో రాసే, లేక ఒదిగే మాటలు ‘హీరో’ని బట్టి మారిపోతుంటే ఆ హీరోని మనసులో పెట్టుకుంటేగానీ అతనికి సరిపోయే మాటలు పడవు. ఇక సన్నివేశానికి సంబంధించిన పాటల కథ వేరు. సన్నివేశమే కవికి చెప్తుంది... ఏం రాయాలో! ఇటు హీరోచితమైనవీ - అటు వీరోచితమైనవీ - కొన్ని ‘నటన’ని నేర్పేవీ (నిజంగా... పాట వింటుంటేనే నటన శరీరంలో ఉద్భవిస్తుంది) ఎన్ని రకాల పాటలు వ్రాశారో లెక్కలేదు. ప్రతి పాటా ఓ పాఠ్యగ్రంథమే. సినిమా పాటల్ని విభజించాలంటే రెండు భాగాలుగా విభజించాలి. ‘వేటూరి రాకముందు పాటలూ... వేటూరి పాటలూ’ అంతే. ఇప్పటికీ నడుస్తున్నది వేటూరి ట్రెండే! మరో ‘ట్రెండు’ మొదలవ్వాలంటే వేటూరి పద సముద్రాన్ని యీదుకుని అవతల ఒడ్డుకి చేరాలి. సాధ్యమా? ఆయన నిజంగా చాలా మంచి హోస్టు. అనుభవించిన వారికే ఆయన ‘తండ్రి’ హృదయం తెలుస్తుంది. ఉన్నట్టుండి ‘‘పులిహోర తిందామా?’’ అని, మమ్మల్ని (నేనూ, మరో అసిస్టెంటు డెరైక్టరూ) కార్లో ‘సవేరా’కి తీసికెళ్లారు. పులిహోర ‘చేయించిమరీ’ తినిపించారు. ‘నాయనా ఆవకాయ అన్నంలో కందిపొడి కలిపితే చాలా రుచిగా వుంటుంది. అలాగే గోంగూర పచ్చడీ!’’ అన్నారు. ఇప్పటివరకూ ఆ రుచికరమైన ‘మెనూ’నే ఫాలో అవుతూ ఉన్నాను. ‘పాట’కి పల్లకీలు కట్టిన రచయితలెందరో వున్నా, ఆర్థికంగా రచయితని అందలమెక్కించిన వారు మాత్రం కచ్చితంగా వేటూరిగారు ఒక్కరే. పాటకి అయిదొందలో వెయ్యో ఉండే రెమ్యునరేషన్‌ని అమాంతంగా పెంచి, రచయితకి గౌరవస్థానం కల్పించింది మాత్రం వేటూరిగారు. ‘‘అవును... మన కష్టానికి తగిన ప్రతిఫలం తప్పక తీసుకోవాల్సిందే. అడక్కపోతే అమ్మయినా పెట్టదుగా!’’ అనేవారు. ‘‘ఫలానా ఘనుడు పాట రాయించుకుని డబ్బులు ఎగ్గొట్టాడు గురూగారు’’ అని ఓ నాడు నేనాయనతో అంటే, ‘‘రోలు వొచ్చి మద్దెలతో మొరపెట్టుకున్నట్టుంది!’’ అన్నారు నవ్వుతూ. ‘‘మీక్కూడానా?’’ అన్నాను ఆశ్చర్యంగా. ‘‘వడ్డికాసుల వాడికే ఎగ్గొట్టే మహానుభావులున్నారు నాయనా!’’ అన్నారు అదే చిరునవ్వుతో. నాకు ఆయన దగ్గర శిష్యరికం చెయ్యాలనిపించేది. రచయితగా కాదు... ఆధ్యాత్మికంగా. ఆయన ‘లోపలి మనిషి’ ఎలా వుంటారో ఊహాతీతమే. కవిగా, నాటకకర్తగా, పాత్రికేయుడిగా ఇలా అనేక ముఖాలు వేటూరికి వున్నా, ఆయనలో వున్న ‘దాత’ చాలా తక్కువమందికి తెలుసు. ఎంతమందికి అడక్కుండా ‘డబ్బిచ్చి’ ఆదుకున్నారో, ఎందర్ని హాస్పటల్ ఫీజుల రూపంలో బతికించారో చాలామందికి తెలీదు. నాకూ తెలీదు. ప్రతిఫలాన్ని పొందిన వాళ్లు చెప్పేదాకా. అప్పుడర్థమైంది. ఆయన పబ్లిసిటీ కోరని పరమేశ్వరుడని. ఆయన ‘‘రైటర్స్ రైటర్...’’. ప్రతి పాటా ఓ అధ్యయన గ్రంథమే. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఆయనది ఓ సువర్ణాధ్యాయం. తెలుగు పాట ఉన్నంత కాలం ఆయన బ్రతికే వుంటారు... మన శ్వాసగా మన గుండెలోతుల్ని స్పృశిస్తూ.. భక్తితో... భువనచంద్ర -
అమ్మతనపు కమ్మదనానికి ‘వెల్కమ్ ఒబామా’
తారాగణం: ఊర్మిళ, రేచల్, ఎస్తాబన్, సంజీవ్... దర్శకత్వం: సింగీతం శ్రీనివాసరావు నిర్మాతలు: భారతీ, కృష్ణ మాతృమూర్తులు రెండు రకాలు. కన్నతల్లి, పెంచిన తల్లి. ఇతిహాసాలు సైతం ఈ ఇద్దరు తల్లుల గురించే ప్రస్తావించాయి. అమ్మ అనే భావన... బిడ్డల మూలకణాలు, జీన్స్ వంటి సాంకేతిక అంశాలకు అతీతం. తన శరీరాన్ని చీల్చుకొని బయటకొచ్చిన బిడ్డ జాతి గురించి, మతం, జీన్స్ గురించి అమ్మ ఆలోచించదు. శాస్త్ర, సాంకేతిక పరంగా అమెరికా లాంటి దేశాలు ఎంతైనా అభివృద్ధి చెందనీ, మనిషి జన్మకు సంబంధించినంతవరకూ ఎన్ని దారులైనా వెతకనీ.. కానీ అమ్మ మాత్రం అమ్మే. నవ మాసాలూ మోసి, కని... తన రక్తాన్ని పాలుగా మార్చి బిడ్డను సాకే తల్లికి ప్రత్యామ్నాయాన్ని మాత్రం ఎవరూ కనిపెట్టలేరు. శాస్త్రాలకు అందని మాయ అమ్మ. అందుకే ‘మాతృదేవోభవ’ అంది మన దేశం. ‘వెల్కమ్ ఒబామా’ సినిమాలో సింగీతం చెప్పింది అదే. సింగీతం శ్రీనివాసరావు నుంచి సినిమా వస్తుందంటే... కచ్చితంగా అందులో ఏదో కొత్తదనం ఉంటుందనేది ప్రేక్షకుల నమ్మకం. ఆ నమ్మకాన్ని వమ్ము చేయలేదు సింగీతం. ఇప్పటివరకూ తెలుగు తెరపై రాని ఓ కొత్త ప్రయోగంతోనే మళ్లీ ప్రేక్షకులను పలకరించారు. ఆ ప్రయోగం ఏంటో తెలుసుకోవాలనుందా? అయితే ముందు కథలోకెళదాం. లూసీ అనే విదేశీయురాలికి అద్దె గర్భం(సరోగసి) ద్వారా తన బిడ్డకు జన్మనిచ్చే ఓ అద్దె తల్లి అవసరం అవుతుంది. దాంతో ఇండియాలోని కొందరు దళారుల్ని ఆశ్రయిస్తుంది. వారి ద్వారానే యశోద గురించి తెలుసుకుంటుంది. యశోదకు డబ్బు చాలా అవసరం. తన పెంపుడు కూతురు ఆపరేషన్ నిమిత్తం ఆమెకు అర్జంట్‌గా లక్ష రూపాయిలు కావాలి. దాంతో తన గర్భం ద్వారా లూసీ బిడ్డకు జన్మనీయడానికి యశోద అంగీకరిస్తుంది. అన్నీ సక్రమంగా జరుగుతాయి. లూసీ దంపతుల బిడ్డ యశోద కడుపులో పడుతుంది. నెలలు నిండుతాయి. యశోదను మెడికల్ చెకప్‌కి తీసుకెళుతుంది లూసీ. యశోద కడుపులోని బిడ్డ వైకల్యంతో పుట్టే అవకాశం ఉందని వైద్యులు చెప్పడంతో షాక్‌కు గురవుతుంది. అలాంటి బిడ్డ తనకొద్దంటుంది. ప్రసవానంతరం బిడ్డను ఆనాథ శరణాలయంలో పడేయమని యశోదకు డబ్బు కూడా ఇవ్వబోతుంది. కానీ యశోద మాత్రం ఒప్పుకోదు. అందరూ ఉన్న తన బిడ్డ అనాథ ఎలా అవుతాడని లూసీని నిలదీస్తుంది. కానీ లూసీ మాత్రం ఆ బిడ్డ తనకొద్దంటూ అక్కడ్నుంచీ వెళ్లిపోతుంది. తీరా యశోదకు ఎలాంటి లోపం లేని చక్కని మగబిడ్డ పుడతాడు. ఆ తెల్లజాతి బిడ్డకు ‘కృష్ణ’ అని పేరు పెట్టుకొని ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటుంది యశోద. కొన్నేళ్లు గడుస్తాయి. ఓ రోజు లూసీ మళ్లీ యశోద ముందు ప్రత్యక్షమవుతుంది. తన బిడ్డను తనకిచ్చేయమంటుంది. యశోద గుండె బద్దలైనంత పనవుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? అనేది మిగిలిన కథ. అమ్మ గొప్పదనాన్ని చూపిస్తూ, అంతర్లీనంగా దేశం గొప్పతనాన్ని వివరిస్తూ నవ్యరీతిలో సింగీతం ఈ కథను నడిపించిన తీరు అభినందనీయం. భావోద్వేగాలు కూడా కథానుగుణంగా సాగాయి. కొన్ని సన్నివేశాల్లో అయితే... కళ్లు చెమర్చాయి. భారతమాతకు మరోరూపంలా యశోద పాత్రను, అమెరికాకు ప్రతిరూపంగా లూసీ పాత్రను మలిచారు సింగీతం. యశోద పాత్రలో మరాఠి నటి ఉర్మిళ చూపిన నటన అమోఘం. లూసీ క్యారెక్టర్లో రేచెల్(యూకే) ఫర్వాలేదనిపించింది. కృష్ణ పాత్రలో బాలనటుడు ఎస్తాబాన్ ఆకట్టుకున్నాడు. ఈ చిత్రంతో రచయితలు భువనచంద్ర, అనంత శ్రీరామ్, బలభద్రపాత్రుని రమణి నటులుగా మారారు. అసహజమైన వారి హావభావాలు ప్రేక్షకుల సహనానికి పెద్ద పరీక్ష. తెల్లని కాగితంపై నల్లని మచ్చలా ఉంది వారి ఎపిసోడ్. సింగీతం స్క్రీన్‌ప్లే, సంగీతం రెండూ బావున్నాయి. దర్శన్ కెమెరా, రోహిణి మాటలు సినిమాకు అదనపు ఆకర్షణలు. భారతీకృష్ణ నిర్మాణాత్మక విలువలు బాగున్నాయి. హైబ్రిడ్ చిత్రాలు రాజ్యమేలుతున్న ప్రస్తుత సమయంలో వచ్చినఈ మంచి ప్రయత్నాన్ని ప్రేక్షకులు ఏ మేర ఆదరిస్తారో తెలుసుకోవాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. ప్లస్: దర్శకత్వం, కథ, మాటలు, ఛాయా గ్రహణం, ఊర్మిళ నటన మైనస్: ముగ్గురు రచయితల ఎపిసోడ్