భువనచంద్ర
‘‘విజయబాపినీడు గారికి నన్ను ‘ఇతను చాలా బాగా రాస్తాడు. ఓ అవకాశం ఇవ్వండి’ అంటూ పరిచయం చేసింది గుత్తా సురేశ్‌గారు. ‘‘బాగా చదువుకున్నావు. నీకెందుకు సినిమా ఇండస్ట్రీ. చక్కగా ఏదైనా ఉద్యోగం చేసుకో’’ అని బాపినీడుగారు సలహా ఇచ్చారు. ‘సార్.. చిన్నతనం నుండి సినిమా వాల్‌పోస్టర్ పైన ఉన్న టైటిల్స్ మీద ‘పాటలు’ అనే కార్డు పక్కన నా పేరు రాసుకునేవాణ్ణి. అందుకే నాకు ఉద్యోగం వచ్చినా చేరలేదు. నాకు ఆల్రెడీ ఎయిర్‌ఫోర్స్‌లో ఉద్యోగం వచ్చింది’ అని లెటర్ చూపించాను.
అది చూసి ఆయన ‘‘ఇప్పుడు నేను తీస్తున్న సినిమాలో పాటలు లేవు. కానీ, ‘ఆన్ పావమ్’ అనే తమిళ సినిమాలో టైటిల్ కార్డ్స్ మీద ఓ పాట వస్తుంది. ఆ సినిమా చూసిరా. నేను నిన్ను ఇప్పుడు పంపిస్తున్నాను కదా అని సినిమా ఓకే అయ్యింది అనుకోవద్దు. నువ్వు రాసినది నచ్చితేనే అవకాశం’’ అన్నారు. సరే అన్నాను. ‘ఆన్ పావమ్’ చూడ్డానికి వెళ్లాను. టైటిల్స్ పడ్డాయి, చూశాను. బయటికొచ్చి 40 పేజీల పుస్తకం కొనుక్కొని ఓ బస్ ఎక్కాను. బస్సులో మూడు పల్లవులు, నాలుగు చరణాలు రాశాను.
45 నిమిషాల తర్వాత బస్ వడపళనిలో ఆగింది. బాపినీడుగారి ఇంటికి వెళ్లాను. నన్ను చూడగానే ఆయన ‘‘ఏంటి నేను సినిమా చూడమని పంపానుగా.. వచ్చేశావ్’’ అని కోప్పడ్డారు. ‘సార్, నేను రాసేది టైటిల్‌కార్డ్స్‌లో వచ్చే పాట అన్నారు. మూడు గంటల సినిమా టైమ్ వేస్ట్ అని టైటిల్స్ చూసి వచ్చేశాను. మీరు చెప్పిన పాట రెడీ’ అన్నాను. ఆయన ఆశ్చర్యంతో ఆ చిత్ర సంగీత దర్శకుడు సాలూరి వాసూరావుని పిలిపించి, ట్యూన్ చేయమని చెప్పారు. సినిమా టైటిల్ కార్డ్స్‌పై వచ్చే పాట కదా వెస్ట్రన్ చేద్దాం అని ఆయన ఓ వెస్ట్రన్ ట్యూన్ ఇచ్చారు.
నేను ఆల్రెడీ రాసుకొన్న పాటే కదా అటూ ఇటూ మార్చి ఇచ్చాను. బావుంది. అయినా మరో వెర్షన్ రాయండి అని ఈసారి ఫోక్‌లోర్ ట్యూన్ ఇచ్చారు. మరో పావుగంటలో ఇంకో పాట ఇచ్చాను. వాసూరావు గారు ఆశ్చర్యపోతూ ‘మీరు గతంలో ఏ సినిమా వాళ్ల దగ్గరైనా పని చేశారా’ అని అడిగారు. ‘నాకు సంగీతమంటే ఇష్టం కావటంతో హిందీ పాటలు బాగా వింటాను. నాకు హిందీ రాదు, అందుకని నేను ఆ ట్యూన్‌కి తగినట్లుగా తెలుగులో నాకిష్టం వచ్చిన పదాలతో పాటలు రాసుకొనేవాణ్ణి. అది ఇలా ఉపయోగపడింది’ అని చెప్పాను.
ఇది జరిగింది 1986 డిసెంబర్ 30న. 1987 జనవరి 1న బాపినీడుగారు దర్శకత్వంలో మొదలైన ‘నాకూ పెళ్లాం కావాలి’ సినిమా ద్వారా పాటల రచయితగా మారాను. సినిమా సూపర్‌హిట్. 100 రోజులు అవుతున్నా ఇంకా ఆడుతూనే ఉంది. బాపినీడుగారు పబ్లిసిటీ చేయటంలో మాస్టర్. ‘‘సినిమా చాలా బావుంది. ఇంకో పాట యాడ్ చేద్దాం. ట్యూన్ రెడీ చేయిస్తా’’ అన్నారాయన. ‘వద్దు సార్. అదే ట్యూన్‌కు ఇంకో వెర్షన్ రాస్తాను’ అన్నాను. సరే అన్నారు. అందులో మొదటిసారి రాసిన పాట ‘‘వినోదాల విందురా, బాధలన్ని బంద్‌రా...’ అనేది మొదటి వెర్షన్.
ఇదే ట్యూన్‌కి సినిమా 100 రోజుల తర్వాత ‘నాకు పెళ్లాం కావాలి, మూడు ముళ్లు వెయ్యాలి...’ అని రాశాను. ఒకే ట్యూన్‌కి రెండు పాటలు రాసిన ఘనత నాకే దక్కింది. సినిమా పోస్టర్ మీద ఒక్కసారైనా పేరు చూసుకోవాలన్న నా బలమైన కోరికను తీర్చిన బాపినీడుగారికి ఏమిచ్చి రుణం తీర్చుకోగలను. ఆయన గొప్పతనం గురించి నాలుగు మంచి మాటలు చెప్పటం తప్ప. నేను పరిచయం అయ్యాక ఆయన 14 సినిమాలు తీశారు. ఆయన అన్ని సినిమాల్లో నాకు చివరి వరకు అవకాశం ఇచ్చారు. ఆయన హస్తవాసి చాలా మంచిది. బాపినీడుగారికి ఆశ్రునయనాలతో తుది వీడ్కోలు పలుకుతున్నా’’.
Comments
Please login to add a commentAdd a comment