ఒక వేణువు వినిపించెను అనురాగ గీతిక | Veteran singer G Anand passes away due to Covid-19 | Sakshi
Sakshi News home page

ఒక వేణువు వినిపించెను అనురాగ గీతిక

Published Sat, May 8 2021 12:42 AM | Last Updated on Sat, May 8 2021 2:56 AM

Veteran singer G Anand passes away due to Covid-19 - Sakshi

మనకు జన్మతః తల్లితండ్రులు, బంధువులు ఉంటారు. పెరిగే కొద్ది స్నేహితులూ ఉంటారు. కాని మనింట్లో ఒక రేడియో సెట్‌ ఉంటే ఆ రేడియో ద్వారా కొంతమంది మన ఇంటి మనుషులు అవుతారు. వారు పదే పదే నట్టింట్లో మోగుతూ మనకు ఆత్మీయులైపోతారు. వారిని మరిచిపోవడం కష్టం. ఇదిగో ఏదో ఒక ‘జనరంజని’లో ఒక వేణునాదంతో మొదలయ్యే ఈ తియ్యటి పాటనూ, గొంతునూ పుస్తకంలో దాచుకున్న నెమలీక లాంటి స్పర్శను ఎలా మర్చిపోవడం?

ఒక వేణువు వినిపించెను అనురాగ గీతిక
ఒక రాధిక అందించెను నవరాగ మాలిక

జి.ఆనంద్‌ తెలుగులో కొన్ని మంచి పాటలకు వాటాదారు అయ్యారు. అలా అవడం కష్టం. సినీ ప్లేబ్యాక్‌లో ఎస్‌.పి. బాలసుబ్రహ్మణ్యం ఏకచ్ఛత్రాధిపత్యం సాగిస్తున్న సమయంలో... పి. రామకృష్ణ కూడా వెనుకంజ వేస్తున్న సమయంలో... తెలుగులో ఇద్దరు గాయకులు కొన్ని పాటలు పొందగలిగారు. వారు మాధవపెద్ది రమేశ్, జి. ఆనంద్‌. మాధవపెద్ది రమేశ్‌కు సినిమా రంగపు వెన్నుదన్నన్నా ఉంది. శ్రీకాకుళం నుంచి మద్రాసు చేరుకున్న జి. ఆనంద్‌కు అది కూడా లేదు. ఆయన ప్రధానంగా స్టేజ్‌ సింగర్‌. సినిమాల్లోకి రాకముందు ఆర్కెస్ట్రా సింగర్‌గా కళింగాంధ్రలో జి.ఆనంద్‌ పేరు మార్మోగేది.

నంద్యాలలో జరిగిన ఒక పాటల పోటీలో ప్రైజ్‌ కొట్టి జడ్జ్‌గా వచ్చిన కె.వి. మహదేవన్‌ దృష్టిలో పడి మద్రాసు చేరుకున్నాడాయన. తొలి పాటను ‘పండంటి కాపురం’లో రాజబాబుకు పాడినా పెద్ద బ్రేక్‌ ఇచ్చింది మాత్రం ‘అమెరికా అమ్మాయి’ సినిమా. సంగీత దర్శకుడు జి.కె. వెంకటేశ్‌ ఆనంద్‌కు ‘ఒక వేణువు’ పాట ఇచ్చారు. ఆ పాట పెద్ద హిట్‌ అవడమే కాదు మరణించే క్షణాల వరకూ ఆనంద్‌కు ఒక అస్తిత్వంలా, వ్యక్తిత్వంలా నిలిచింది. ఈ పాట తర్వాత ఆనంద్‌ దాసరి దర్శకత్వంలోని ‘మా బంగారక్క’లో ‘దూరాన దూరాన తారాదీపం’ పాడారు. ఆ పాట గుర్తింపు పొందింది.

సంగీత దర్శకుడు చక్రవర్తి బాలూ కెరీర్‌ను నిలబెట్టడానికి కంకణం కట్టుకున్నా కొన్ని సందర్భాలలో కొత్త గాయకులకు అవకాశాలు ఇచ్చేవారు. ‘కల్పన’లో ఆనంద్‌కు మంచి డ్యూయెట్‌ పడింది.

దిక్కులు చూడకు రామయ్య
పక్కనే ఉన్నది సీతమ్మా

ఆ తర్వాత ‘ఆమె కథ’లో ‘పువ్వులనడుగు నవ్వులనడుగు’ డ్యూయెట్‌ కూడా చక్రవర్తి సంగీతంలో హిట్‌ అయ్యింది. చక్రవర్తే ‘జూదగాడు’లో సుశీలతో చాలా మంచి డ్యూయెట్‌ ఇచ్చారు ఆనంద్‌కు. ఆ పాట కూడా జనరంజని హిట్టే.

మల్లెల వేళ అల్లరి వేళ
మదిలో మన్మథలీల

జానపదాలకు నెలవైన ఉత్తరాంధ్ర నుంచి రావడం వల్ల ఆనంద్‌ అటువంటి పాటలు దొరికితే ఊపుగా న్యాయం చేసేవారు. చిరంజీవి తొలి డ్యూయెట్‌ ‘ప్రాణం ఖరీదు’లో ‘ఎన్నియెల్లో ఎన్నియెల్లో ఎందాక’ ఆనంద్‌ పాడిందే.

ఇక ‘మనవూరి పాండవులు’ సినిమాలో మహదేవన్‌ పాడించిన ఈ పాట వినని రేడియో శ్రోత ఉండడు.

నల్లా నల్లా మబ్బుల్లోన లగ్గోపిల్లా
తెల్లాతెల్లని సందామామ లగ్గోపిల్లా

చాలామందికి గుర్తుండదు కాని ‘ఒక వేణువు’ స్థాయిలోనే ఆనంద్‌ పాడిన ఒక సోలో ఉంది. అది ‘పల్లెటూరి పిల్ల’ సినిమాలోనిది. ‘పయనించే చిరుగాలి... నా చెలి చెంతకు చేరి’.... చాలా బాగుంటుంది.

ఆనంద్‌కు తన పరిమితులు తెలుసు. శక్తులూ తెలుసు. అందుకే ఆయన గాయకుడిగా తనకు వచ్చిన గుర్తింపుతో ‘స్వరమాధురి’ ఆర్కెస్ట్రాను స్థాపించి దేశ విదేశాలలో ఎక్కడ తెలుగువారుంటే అక్కడ కచ్చేరీలు ఇవ్వడం ప్రారంభించారు. నిజానికి ప్లేబ్యాక్‌ సింగింగ్‌ కంటే కూడా ఈ కచ్చేరీల వల్లే ఆర్థికంగా ఆయన ఎక్కువ లబ్ధి పొందారు. అమెరికాలో 19 సార్లు టూర్లు నిర్వహించిన ఘనులు ఆనంద్‌. మధ్యలో ‘గాంధీనగర్‌ రెండవ వీధి’ లాంటి కొన్ని సినిమాలకు సంగీతం అందించారు. ‘గాంధీనగర్‌’లో ‘కలకానిది విలువైనది ఒక కథ ఉన్నది వినిపించనా’ పాట పెద్ద హిట్‌.

‘అమెరికా అమ్మాయి’ సినిమాతో గుర్తింపు పొందిన ఆనంద్‌ ‘అమెరికా’తో తనకేదో బంధం ఉందని చెప్పుకునేవారు. ఆ అమెరికా అమ్మాయి హీరోయిన్‌కు డబ్బింగ్‌ చెప్పడానికి వచ్చిన గాయని సుజాత పరిచయమై భార్యగా మారారు. ఆనంద్‌ ఇద్దరు అబ్బాయిలు. అమెరికాలో స్థిరపడ్డారు. అక్కడే ఒక మనవరాలు పుట్టింది కనుక ఆ పాప అమెరికా అమ్మాయి అని చెప్పుకునేవారు. అమెరికాలో చాలాకాలం ఉండి హైదరాబాద్‌ తిరిగి వచ్చిన ఆనంద్‌ కరోనాకు తన అంతిమ పాటను వినిపించారు. ఆయనకు నివాళి.

కరోనాకు బలి అయిన కమ్మని కంఠం
సీనియర్‌ సినీ గాయకుడు జి. ఆనంద్‌ (77) కరోనా బారిన పడి, గురువారం రాత్రి హైదరాబాద్‌లో హఠాన్మరణం చెందారు. కరోనా చికిత్సలో భాగంగా సకాలంలో వెంటిలేటర్‌ లభించకపోవడంతో ఆనంద్‌ మృత్యువాత పడ్డారు. శ్రీకాకుళం జిల్లాలోని తులగామ్‌ గ్రామంలో 1944 ఫిబ్రవరి 16న ఆనంద్‌ జన్మించారు. ఆయన తండ్రి రంగస్థలంపై అనేక నాటకాలు ప్రదర్శించారు. ఆనంద్‌ కూడా తన తండ్రి వద్ద సంగీతం నేర్చుకోవడంతో పాటు పలు పౌరాణిక నాటకాల్లో నటించారు. తండ్రి రాముడి పాత్ర పోషించినప్పుడు, ఆనంద్, ఆయన సోదరుడు లవ–కుశ పాత్రలు పోషించారు.

తొలినాళ్లలో తమ ఇరుగు పొరుగు గ్రామాలలో పండగలు, ఇతర కార్యక్రమాల్లో, సంగీత విభావరుల్లో పాటలు పాడి, పలు బహుమతులు గెలుచుకున్నారు ఆనంద్‌. మదరాసు (ఇప్పుడు) చెన్నైలో రచయిత దేవులపల్లి కృష్ణ శాస్త్రి, ‘నీ గొంతు బావుంది’ అంటూ కె.వి.మహదేవన్‌కు ఆనంద్‌ గురించి సిఫార్సు లేఖ రాశారట కృష్ణశాస్త్రి. ఆ సమయంలోనే ‘అమెరికా అమ్మాయి’ లో ‘ఒక వేణువు వినిపించెను..’ పాట పాడే అవకాశం ఆనంద్‌కి వచ్చింది. అప్పటినుంచి పలు చిత్రాల్లో, ప్రైవేట్‌ ఆల్బమ్స్‌లో 2500 పైచిలుకు పాటలు పాడిన ఆనంద్‌ 150 ఆల్బమ్స్‌ రిలీజ్‌ చేశారు. టీవీ సీరియల్స్‌కూ, హిందీ నుంచి తెలుగు సహా అనేక అనువాద చిత్రాలకూ స్వరసారథ్యం వహించారు.

‘స్వర మాధురి’ బృందం ద్వారా ప్రపంచమంతటా సంగీత విభావరులు నిర్వహించారు. ఏకంగా 6500 పైగా ప్రదర్శనలిచ్చారు. ‘స్వరమాధురి’ ఫౌండేషన్‌ ద్వారా ఎంతో మంది యువ గాయనీ గాయకులను సినీ, దూరదర్శన్‌ రంగాలకు పరిచయం చేశారు. సుదీర్ఘకాలం చెన్నైలో ఉన్న ఆనంద్‌ ఆ మధ్య హైదరాబాద్‌కు షిఫ్టయ్యారు. పలు సాంస్కృతిక కార్యక్ర మాల్లో ఉత్సాహంగా పాల్గొంటూ వచ్చారు. వీనులవిందైన పాటలు ఎన్నో పాడిన ఆనంద్‌ ఆ పాటల ద్వారానే గుర్తుండిపోతారు. ఆయన మృతిపట్ల హీరో చిరంజీవి సహా పలువురు సినీరంగ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. శుక్రవారం ఉదయం వనస్థలిపురం శ్మశానవాటికలో ఆనంద్‌ అంత్యక్రియలు జరిగాయి.

– సాక్షి ఫ్యామిలీ

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement