విజయ బాపినీడు, బాపినీడు భౌతిక కాయం
ప్రముఖ దర్శక–నిర్మాత, రచయిత విజయబాపినీడు (83) ఇక లేరు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మంగళవారం ఉదయం హైదరాబాద్‌లోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. విజయ బాపినీడు అసలు పేరు గుత్తా బాపినీడు చౌదరి. ఏలూరు సమీపంలోని చాటపర్రులో లీలావతి, సీతారామస్వామి దంపతులకు 1936 సెప్టెంబర్ 22న జన్మించారు బాపినీడు. ఏలూరులోని సీఆర్‌ఆర్ కళాశాలలో బీఏ చదివిన ఆయన కొంతకాలం వైద్య ఆరోగ్య శాఖలో పనిచేశారు. వ్యవసాయ కుటుంబానికి చెందిన బాపినీడుకి మొదటినుంచీ రచనా వ్యాసంగం పట్ల ఆసక్తి ఉండేది. గుత్తా బాపినీడు పేరుతో డిటెక్టివ్ నవలలు రాసేవారు. ఆ తర్వాత భార్య విజయ పేరు కలిసి వచ్చేలా విజయ బాపినీడు పేరుతో రచనలు చేశారాయన.
తన పుస్తకాలను వేరే వాళ్లు పబ్లిష్ చేయడం కంటే సొంతంగా పబ్లిష్ చేసుకుంటే సంపాదన పెరుగుతుందనే ఉద్దేశ్యంతో ఉద్యోగానికి రాజీనామా చేసి, కుటుంబంతో సహా మద్రాసు వెళ్లారు. అక్కడ అప్పటికే పేరున్న రచయితలు విశ్వప్రసాద్, కొమ్మూరిలను బాపినీడు కలిశారు. ‘డిటెక్టివ్ నవలలు ప్రచురించడం వల్ల లాభం లేదు’ అని వారు చెప్పడంతో ‘బొమ్మరిల్లు, విజయ’ అనే మాస పత్రికలను ప్రారంభించారు. ఆ రోజుల్లో బొమ్మరిల్లు పుస్తకం లేని ఇల్లు ఉండేది కాదంటే అతిశయోక్తి కాదు. ఇండియన్ ఫిల్మ్, నీలిమ పత్రికలకు ఎడిటర్‌గానూ వ్యవహరించారు. బాపినీడుని ఫల్గుణా ప్రొడక్షన్స్ వారు పిలవడంతో తన దృష్టిని చలన చిత్రరంగంవైపు మళ్లించారు. ఆయన రాసిన ‘జగత్ జెట్టీలు’ కథను ఫల్గుణా ప్రొడక్షన్స్‌వారు సినిమాగా తీశారు. ఆ తర్వాత ‘హంతకులు–దేవాంతకులు’ సినిమాకి కథ అందించారు బాపినీడు.
శ్యామ్ ప్రసాద్ ఆర్ట్స్ బ్యానర్ ఏర్పాటు...
మూడు నాలుగు సినిమాలకు కథలు అందించిన తర్వాత శ్యామ్ ప్రసాద్ ఆర్ట్స్ బ్యానర్‌ను నెలకొల్పిన విజయ బాపినీడు ‘మయంగిగిరాళ్ ఒరు మాదు’ అనే తమిళ సినిమా రీమేక్ హక్కులు కొన్నారు. దాన్ని దాసరి నారాయణరావు దర్శకత్వంలో ‘చెడిన ఆడది’ పేరుతో తెరకెక్కించాలనుకున్నారు. అయితే ఆ టైటిల్‌ని అప్పటి ‘దక్షిణ భారత చలనచిత్ర వాణిజ్య మండలి’ అధ్యక్షుడు పి.పుల్లయ్య తిరస్కరించడంతో ‘యవ్వనం కాటేసింది’గా పేరు మార్చి నిర్మించారు. ఆ తర్వాత ‘రంభ–ఊర్వశి–మేనక, బొమ్మరిల్లు, ప్రేమపూజారి, విజయ, బొట్టు–కాటుక, రుద్రతాండవం’ వంటి సినిమాలు నిర్మించారాయన. యువచిత్ర కె.మురారితో కలిసి ‘జేగంటలు’ సినిమా నిర్మించారు. ఈ సినిమాకి బాపినీడే కథ అందించడం విశేషం.
ఇతర దర్శకుల దర్శకత్వంలో 12 సినిమాలు నిర్మించిన ఆయన.. చిరంజీవి హీరోగా 1983లో ‘మగ మహారాజు’ సినిమాతో దర్శకునిగా మారారు. ఆ తర్వాత ‘మహానగరంలో మాయగాడు, మగధీరుడు, ఖైదీ నెం.786, గ్యాంగ్‌లీడర్, బిగ్‌బాస్’ చిత్రాలను స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించారు. బ్లాక్ బస్టర్‌గా నిలిచిన ‘ఖైదీ నెం. 786’ చిరంజీవి నూరవ సినిమా కావడం విశేషం. అలాగే, ‘గ్యాంగ్ లీడర్’ చిరంజీవి కెరీర్‌కి ఓ మైలురాయి అయింది. బాపినీడు తెరకెక్కించిన చిత్రాలు ఫ్యామి లీస్‌తో పాటు మాస్‌కి బాగా కనెక్ట్ అయ్యాయి. బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లు కురిపించాయి. ఆ విధంగా తనలో మంచి మాస్ దర్శకుడు ఉన్నాడని ఆయన నిరూపించుకున్నారు.
నిర్మాణత.. విజయ బాపినీడు
బాపినీడు తాను నిర్మించిన చిత్రాలకు నిర్మాణత: విజయ బాపినీడు అని వేసుకునేవారు. నిర్మాణత అనే పదాన్ని తొలిసారి ఆయనే ప్రయోగించారు.
ఎందరినో పరిచయం...
విజయబాపినీడు ఎంతోమందిని తన సినిమాల ద్వారా పరిచయం చేశారు. రాజాచంద్ర, దుర్గా నాగేశ్వరరావు, జి. రామమోహనరావు, మౌళి, వల్లభనేని జనార్ధన్‌లను దర్శకులుగా, ఎం.వి.రఘు, మహీధర్, శ్రీనివాసరెడ్డి, బాబు, ప్రసాద్‌లను కెమెరామేన్‌లుగా, పాటల రచయిత భువనచంద్రను, మాటల రచయిత కాశీ విశ్వనాథ్... వంటి ఎందర్నో పరిచయం చేశారాయన. విజయబాపినీడు మొత్తం 22 సినిమాలకు దర్శకత్వం వహించారు. చిరంజీవి, శోభన్‌బాబులతోనే ఎక్కువ సినిమాలు చేశారాయన.
కృష్ణతో ‘కృష్ణ గారడీ’, రాజేంద్రప్రసాద్‌తో ‘వాలు జడ తోలు బెల్టు, దొంగ కోళ్లు, సీతాపతి చలో తిరుపతి’ సినిమాలు తీశారు. తన కుమార్తెలు నిర్మాతలుగా బాపినీడు నిర్మించిన చివరి చిత్రం ‘కొడుకులు’ (1998). ఆ తర్వాత చిరంజీవి హీరోగా మళ్లీ సినిమా తీయాలనుకున్నారు కానీ కుదరలేదు. ఇటువంటి దర్శక–నిర్మాత దూరం కావడం చిత్రసీమకు తీరని లోటు అని చిత్రరంగ ప్రముఖులు పేర్కొన్నారు. బాపినీడు పెద్ద కుమార్తె అమెరికా నుంచి రావడానికి టైమ్ పడుతున్న కారణంగా గురువారం హైదరాబాద్‌లోని మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యలు తెలిపారు.
సినిమా ఫ్లాప్ అని ‘సి’ గ్రేడ్
విజయ బాపినీడు చాలా నిక్కచ్చిగా ఉండేవారని పేరు. సినిమా రివ్యూలు మొదలైంది ఆయన ‘విజయ’ పత్రిక ద్వారానే అని ప్రముఖ రచయిత తోట ప్రసాద్ అన్నారు. రివ్యూలకు ఇచ్చే ‘గ్రేడ్’లు చాలా నిజాయితీగా ఉండేవని ప్రసాద్ అన్నారు. విజయ, బొమ్మరిల్లు పత్రిలకు అసిస్టెంట్ ఎడిటర్‌గా చేశారు తోటప్రసాద్. బాపినీడు దర్శకత్వం వహించిన ‘పున్నమి చంద్రుడు’ రివ్యూని విజయ పత్రిక కోసం రాసినప్పుడు.. ‘సినిమా అట్టర్ ఫ్లాప్’ అంటూ బాపినీడుగారు ‘సి గ్రేడ్’ ఇచ్చుకున్నారని తోట ప్రసాద్ అన్నారు. ‘‘ఖైదీ నెంబర్ 786 సిట్టింగ్స్‌తో బాపినీడుగారు నాతో సినీ ఓనమాలు దిద్దించారు. మా గోదావరి జిల్లా యాసలో చెప్పాలంటే కేక వేసి కూడు పెట్టినోడు బాపినీడు (గారు) జన్మ జన్మలకి నేను, నా కుటుంబం ఆయన్ను మర్చిపోలేం’’ అని తోట ప్రసాద్ అన్నారు.
ప్రయోగాలంటే ఇష్టం
ప్రయోగాలు చేయడం విజయ బాపినీడుకి ఇష్టం. ఒక కన్నడ, ఒక మలయాళ చిత్రం అనువాద హక్కులు కొని, రెండు చిత్రాలను కలుపుతూ కొంత భాగం షూటింగ్ చేశారు. ఆ రెండు చిత్రాలను ఒకే సినిమాగా విడుదల చేయడం విశేషం. భారత చలనచిత్ర రంగంలో ఇది తొలి ప్రయోగం. అలాగే శరత్‌బాబుతో తీసిన ‘రుద్ర తాండవం’ చిత్రాన్ని ఒకేసారి అన్ని ఏరియాల్లో విడుదల చేయలేదు. ఒక్క వైజాగ్‌లో మాత్రమే రిలీజ్ చేసి. ప్రేక్షకులు స్పందనను బట్టి మిగతా ఏరియాల్లో విడుదల చేయాలనుకున్నారు. అయితే ఫ్లాప్ టాక్ రావడంతో రిలీజ్ చేయలేదు.
ఇవాళ నాకెంతో దుర్దినం. విజయ బాపినీడుగారు కన్నుమూశారనే వార్తను నమ్మలేకుండా ఉన్నాను. ఆయన నన్ను ఓ కొడుకులా, తమ్ముడిలా చూసుకునేవారు. ఆయనతో నా అనుబంధం కేవలం ఓ దర్శకుడు, నిర్మాత, హీరో అన్నట్లుగా ఉండేది కాదు. వారితో నా పరిచయం ‘పట్నం వచ్చిన పతివ్రతలు’ సినిమాతో ప్రారంభమైంది. ఆ తర్వాత ఆయనతో ఆరు సినిమాలు చేశాను. ‘ఇతర హీరోలతో కూడా మీరు సినిమాలు చేయవచ్చు కదా’ అని ఆయనతో అనేవాడిని.
‘‘మీతో సినిమాలు తీయడం ప్రారంభించిన తర్వాత ఆ కంఫర్ట్‌గానీ, సెంటిమెంట్‌గానీ మరొకరితో నాకు కుదరడం లేదు. వేరే వారితో చేయలేకపోతున్నాను’’ అంటూ నా పట్ల అభిమానంగా ఉన్న గొప్పవ్యక్తి ఆయన. నేను హైదరాబాద్‌కు షిప్ట్ అయిన కొత్తల్లో ఎక్కడ ఉండాలి అనుకుంటున్న సమయంలో ‘హైదారాబాద్‌లో నా గెస్ట్‌హౌస్ ఉంది. అందులో మీరు ఉండొచ్చు’ అని చెప్పి వసతి కల్పించారు. చాలాకాలం అక్కడే ఉన్నాను. ‘మగమహారాజు’ శతదినోత్సవ వేడుక రోజు ‘‘మీతో నాకు ఉన్న అనుబంధానికి, మీరు నా పట్ల చూపించే ప్రేమకు తగ్గట్లుగా ఈ ఏనుగుని బహుమతి ఇవ్వాలనుకున్నాను’’ అని బాపినీడుగారు అన్నారు.
ఆయన ఏం చేసినా కొత్తగా ఉంటుంది. ‘గ్యాంగ్ లీడర్’ ఫంక్షన్‌ను ఒకేరోజు నాలుగు సిటీస్‌లో గ్రాండ్‌గా జరిపించిన అరుదైన రికార్డు ఉంది మా కాంబినేషన్‌లో. నా అభిమానులకు కూడా ఆయనంటే చాలా ఇష్టం. ‘చిరంజీవి’ అనే మ్యాగజీన్‌ను ఆయన పబ్లిషర్‌గా, ఎడిటర్‌గా తీసుకు వచ్చారు. బాపినీడుగారి మ్యాగజీన్ ఎప్పుడు వస్తుందా? అని ప్రేక్షకులు ఎదురు చూసేవారు. అలాంటి వ్యక్తి దూరం కావడం దురదృష్టకరంగా భావిస్తున్నాను. బాపినీడుగారి ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబ సభ్యులకు ఆ దేవుడు మానసిక స్థయిర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను.
– నటుడు చిరంజీవి
విజయ బాపినీడుగారు పేరుకు తగ్గట్లు ఎన్నో విజయవంతమైన సినిమాలు తీశారు. ఆయన చివరి చిత్రం ‘కొడుకులు’లో నేను, సాయికుమార్ హీరోలుగా చేశాం. ఆయన అందరికీ దూరమవ్వడం బాధగా ఉంది.
– ‘మా’ అధ్యక్షుడు శివాజీరాజా
బాపినీడుగారు మంచి దర్శక–నిర్మాత. నాకు అత్యంత సన్నిహితులు విజయ బాపినీడు దూరం అవ్వడం చిత్రపరిశ్రమకు తీరని లోటు. బాపినీడుగారి ఆత్మకు శాంతి చేకూరాలి. ఆయన కుటుంబసభ్యులకు ఆ భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.
– నిర్మాత కేఎస్ రామారావు
చిరంజీవితో బాపినీడు
‘ఖైదీ నంబర్ 786’ సెట్‌లో మోహన్‌బాబు, చిరంజీవిలతో...
బాపినీడు మృతికి సీఎం కేసీఆర్ సంతాపం
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ సినీ దర్శకుడు, పాత్రికేయుడు, కథా రచయిత విజయబాపినీడు మృతి పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సంతాపం వ్యక్తం చేశారు. పలు విజయవంతమైన చిత్రాలు అందించడమే కాకుండా, విజయ అనే పత్రిక నడపడం ద్వారా విజయాన్ని తన ఇంటి పేరుగా మార్చుకున్న బాపినీడు..తెలుగు సినీ రంగ చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోయే ముద్ర వేశారని పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు సీఎం తన ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment