Vijaya Bapineedu
-
నంబర్ వన్‌గా నిలబెట్టిన...గ్యాంగ్ లీడర్
ఒక్కో హీరో కెరీర్లో ఒక్కో సినిమాకు ప్రత్యేక స్థానం ఉంటుంది. చరిత్ర ఉంటుంది. నటుడిగా మొదలై స్టార్‌గా ఎదిగి, మెగాస్టార్‌గా, ఆపై నంబర్ వన్‌గా మారే క్రమంలో హీరో చిరంజీవి చూసిన అలాంటి ఓ బాక్సాఫీస్ శిఖరం – ‘గ్యాంగ్ లీడర్’. విజయ బాపినీడు దర్శకత్వంలో చిరంజీవి, విజయశాంతి నటించగా బాక్సాఫీస్‌ను రప్ఫాడించి, చిరు మెగా ఇమేజ్ను సుస్థిరం చేసిన ‘గ్యాంగ్ లీడర్’ (1991 మే 9)కు నేటితో 30 వసంతాలు. అచంచల అగ్రపీఠికపై... తెలుగు సినీసీమలో తన తరంలో నంబర్ వన్ హీరోగా చిరంజీవిని ఆ స్థానంలో స్థిరంగా నిలబెట్టిన సినిమా అంటే ‘గ్యాంగ్ లీడర్’. ఫ్లాష్ బ్యాక్‌కి వెళితే.. ‘ప్రాణం ఖరీదు’(1978)తో తెర మీదకొచ్చిన చిరు ‘ఖైదీ’ (1983 అక్టోబర్ 28)తో స్టార్ హీరో అయ్యారు. తర్వాత అనేక సక్సెస్‌లు! తోటి హీరోలతో పోటీలు!! బిగ్ హిట్ ‘పసివాడి ప్రాణం’ (1987)తో పరిశ్రమ రేసులో చిరంజీవి ముందంజలోకి వచ్చారు. అయితే, నాగార్జున ‘శివ’ (1989 అక్టోబర్ 5) లాంటి హిట్లు ఆయనకు మళ్ళీ సవాలు విసిరాయి. దాన్ని విజయవంతంగా ఎదుర్కొని, ‘జగదేక వీరుడు – అతిలోక సుందరి’ (1990 మే 9)తో తన లీడ్‌ను నిలబెట్టుకున్నారు చిరు. కానీ, ‘రాజా విక్రమార్క’(1990), ‘స్టువర్ట్పురం పోలీస్ స్టేషన్’ (1991 జనవరి 9) – వరుసగా రెండు చిత్రాలు నిరాశపరిచాయి. ‘గ్యాంగ్ లీడర్’ అప్పుడొచ్చింది. ‘జగదేక...’ రిలీజైన ఏడాదికి సరిగ్గా అదే తేదీన వచ్చింది. బాక్సాఫీస్‌ను బద్దలు కొట్టింది. చిరంజీవి తిరుగులేని నంబర్ వన్ అని సుస్థిరపరిచింది. దటీజ్ ది హిస్టారికల్ ప్లేస్ ఆఫ్ ‘గ్యాంగ్ లీడర్’! టైటిల్ ఎలా వచ్చిందంటే.. నిజానికి, ముందు విజయ బాపినీడు తీయాలనుకున్న సినిమా ఇది కాదు. ఒకప్పుడు తాను తీసిన, మనసుకు బాగా నచ్చిన బ్లాక్ అండ్ వైట్ ఫ్యామిలీ డ్రామా ‘బొమ్మరిల్లు’ (’78) ప్రేరణతో, నాగబాబుతో ఓ సినిమా తీయాలనుకున్నారు. ‘షోలే’లోని గబ్బర్ సింగ్ పాత్రధారి అమ్జాద్ ఖాన్ డైలాగ్ ప్రేరణతో ‘అరె ఓ సాంబా’ అని టైటిల్ పెట్టాలనుకున్నారు. తీరా చిరంజీవి ఓ సినిమా చేద్దామని పిలిచేసరికి, అది పక్కనపెట్టి ఈ ప్రాజెక్ట్ చేపట్టారు. ఆ ఫ్యామిలీ డ్రామాకే యాక్షన్ జోడించి ఈ కొత్త సినిమా తీశారు. అప్పటికే హీరో చిరంజీవికీ, ఫ్యా¯Œ ్సకూ వారధిగా నిలిచేలా ‘మెగాస్టార్ చిరంజీవి’ అనే ఓ మాసపత్రికను బాపినీడు నడుపుతున్నారు. సినీ రచయిత సత్యమూర్తి (సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ తండ్రి) అందులో ‘గ్యాంగ్ లీడర్’ అనే ఓ సీరియల్ రాస్తున్నారు. ఆ పేరు మీద మోజుపడ్డ బాపినీడు, చిరంజీవిని ఒప్పించి మరీ దాన్నే టైటిల్‌గా పెట్టారు. ప్రజాభిప్రాయం తీసుకొని, వారు ఎంపిక చేసిన లోగో డిజైనే వాడారు. మధ్యతరగతి కుటుంబ కథ... పేరు యాక్షన్ సినిమాలా అనిపించినా, ఇది రఘుపతి (మురళీమోహన్), రాఘవ (శరత్ కుమార్), రాజారామ్ (చిరంజీవి) – అనే ముగ్గురు అన్నదమ్ముల సెంటిమెంట్ కథ. స్నేహితులతో కలసి అల్లరిచిల్లరగా తిరిగే నిరుద్యోగ యువకుడైన హీరో విచ్ఛిన్నం కాబోతున్న తన కుటుంబాన్ని కాపాడుకోవడమే కాక, సొంత అన్నయ్యను అన్యాయంగా చంపిన విలన్లను తుదముట్టించడం కథాంశం. మధ్యతరగతి యువకుడికి తగ్గట్టు రంగురంగుల కాటన్ షర్ట్స్, ఫేడెడ్ జీ¯Œ ్సతో చిరంజీవి వెరైటీ కాస్ట్యూమ్స్ అప్పట్లో ఓ క్రేజ్. సినిమా అంతా పూర్తయ్యాక ఫైనల్ వెర్షన్ ప్రివ్యూ చూసినప్పుడు, లె¯Œ ్త ఎక్కువైందని అరవింద్ బృందం భావించింది. అప్పటికప్పుడు నిడివి తగ్గించారు బాపినీడు. దానికి తగ్గట్టు చిరంజీవి మళ్ళీ డబ్బింగ్ చెప్పారు. ఇలా సమష్టి కృషి ‘గ్యాంగ్ లీడర్’. వాళ్ళందరికీ... కెరీర్ బ్రేక్ ఫిల్మ్! తెలుగులో బప్పీలహరి హవా ఓ ప్రభంజనమైంది ‘గ్యాంగ్ లీడర్’తోనే! దీంతోనే భువనచంద్ర క్రేజీ రచయిత య్యారు. అంతకు ముందు ‘జగదేక..’కి తండ్రి సుందరంకి సహాయకుడిగా ఉంటూ, సర్వం తానే అయి స్టెప్పులు సమకూర్చిన యువ ప్రభుదేవా ఈ చిత్రానికి అధికారిక డ్యా¯Œ ్స మాస్టర్ హోదాలో వాన పాట లాంటివాటితో కనువిందు చేశారు. సీనియర్ డ్యా¯Œ ్స మాస్టర్ తార అయితే సరేసరి... విశ్వరూపం చూపారు. బాపినీడుకు అల్లుడైన వల్లభనేని జనార్దన్‌కు నటుడిగా వరుస పాత్రలు అందించిందీ ‘గ్యాంగ్ లీడ’రే! ఒకే రోజు 4చోట్ల శతదినోత్సవం! అప్పట్లో స్పెషల్ ఫ్లైట్ ఆసరాగా ఒకే రోజున (చిరంజీవి బర్త్‌డే 1991 ఆగస్ట్ 22న) నాలుగు కేంద్రాల్లో (తిరుపతి, హైదరాబాద్, ఏలూరు, విజయ వాడ) ‘గ్యాంగ్ లీడర్’ శతదినోత్సవం ఓ అరుదైన విన్యాసం. అతిరథ మహారథులు రాగా, బాపినీడు ఏకంగా చిరంజీవికి స్వర్ణకిరీట ధారణ చేసి, చేతికి రాజదండమిచ్చి ఘనంగా సత్కరించడం మరో విశేషం. అప్పట్లో ‘అప్పుల అప్పారావు’ చిత్రకథలో నటి అన్నపూర్ణది చిరంజీవి ఫ్యా¯Œ ్స అసోసియేషన్ ప్రెసిడెంట్ పాత్ర. ఏలూరు శతదినోత్సవ బహిరంగ సభ దృశ్యాలను, వేదికపై చిరంజీవిని అన్నపూర్ణ స్వాగతించే దృశ్యాలను కథానుగుణంగా ఆ చిత్రంలో వాడారు. హ్యాట్రిక్ హిట్ల చిరంజీవితం! ‘గ్యాంగ్ లీడర్’ తరువాత ‘రౌడీ అల్లుడు’, ఆ వెంటనే ‘ఘరానా మొగుడు’ – ఇలా హ్యాట్రిక్ హిట్లు చిరంజీవి సాధించారు. వాటిలో ‘ఘరానా మొగుడు’ బాక్సాఫీస్ వద్ద çసృష్టించిన ప్రభంజనం మరో పెద్ద కథ. హీరోగా నంబర్ వన్ స్థానాన్ని నిలబెట్టినఫిల్మ్గా గ్యాంగ్ లీడర్ మెగాస్టార్‌కు సదా ఓ ఆకుపచ్చ జ్ఞాపకం. సూపర్ హిట్ సాంగ్స్ అప్పట్లో కొన్నేళ్ళ పాటు ‘గ్యాంగ్ లీడర్’ పాటలు వినపడని ఊరు, ఊగిపోని కుర్రకారు లేదు. తెలుగులో ‘సింహాసనం’ (1986) లాంటి చిత్రాలతో పాపులరైన బప్పీలహరి కూర్చిన బాణీలవి. ‘స్టేట్ రౌడీ’ (1989) తర్వాత చిరంజీవితో ఆయన పనిచేసిన రెండో సినిమా ఇది. వేటూరి, భువనచంద్ర సాహిత్యం సమకూర్చారు. విజయ బాపినీడు ‘నాకూ పెళ్ళాం కావాలి’ (’87) ద్వారా పరిచయమైన రచయిత భువనచంద్ర. ‘గ్యాంగ్ లీడర్’లో రెండు పాటలు (‘పాలబుగ్గ..’, ‘వయసు వరసగున్నది వాటం..’) వేటూరి రాస్తే, మిగతావన్నీ భువనచంద్ర రచనలు. టైటిల్ సాంగ్ మొదలు ‘వానా వానా వెల్లువాయె..’, ‘భద్రాచలం కొండ..’, ‘సండే అననురా...’ – ఇలా అరుదైన రీతిలో... ఆల్బమ్‌లోని ఆరు పాటలూ హిట్టే. బప్పీలహరి సంగీతం, చిరంజీవి స్టెప్పులు, విజయశాంతి గ్లామర్, ఎస్పీబీ – చిత్ర గాత్రంలోని భావవ్యక్తీకరణ అన్నీ ఈ పాటల్లో హైలైటే! ఈ తరం మోస్ట్ పాపులర్ వానపాటల్లో మొదటి వరుసలో నిలబడ్డ ‘వాన వాన వెల్లువాయె..’ భువనచంద్రకు తొలి సినీ వాన పాట. హైదరాబాద్ నుంచి మద్రాసుకు రైలులో బయలుదేరిన భువనచంద్ర పొద్దున్న రైలు దిగే లోగా... ఈ పాటతో సహా నాలుగు పాటలూ రాసేశారు. ఆడియో రిలీజయ్యాక ఆ పాటలన్నీ ఛార్ట్ బస్టర్ గా నిలిచిపోవడం ఓ చరిత్ర. ఈ చిత్రానికి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం సాలూరి వాసూరావు సమకూర్చారు. సరిగ్గా 21 ఏళ్ళకు ‘గ్యాంగ్ లీడర్’లోని అదే ‘వాన వాన వెల్లువాయె...’ పాటను మళ్ళీ చిరంజీవి తనయుడు రామ్‌చరణ్‌తో ‘రచ్చ’ (2012)లో మణిశర్మ రీమిక్స్ చేశారు. ‘వాన..’ పాటలో సెట్స్‌పై మెగా జోడీ, యువ ప్రభుదేవా హిందీలోనూ..! ఆకాశానికెత్తిన మీడియా!! ‘గ్యాంగ్‌లీడర్’ అదే పేరుతో తమిళంలోకి అనువాదమై, 1991 లోనే నవంబర్ 30న తమిళనాట రిలీజై, సక్సెస్ సాధించింది. తమిళంలో చిరంజీవికి సాయికుమార్ డబ్బింగ్ చెప్పడం విశేషం. కేరళలో తమిళ వెర్షన్‌ను రిలీజ్ చేస్తే, అక్కడా మంచి వసూళ్ళు సాధించింది. తరువాత హిందీ నిర్మాత ఎన్.ఎన్. సిప్పీ ఇదే కథను చిరంజీవితోనే హిందీలో రీమేక్ చేశారు. చిరంజీవికి ఇది రెండో హిందీ సినిమా. తొలి హిందీ సినిమా ‘ప్రతిబంధ్’ (తెలుగు ‘అంకుశం’కి రీమేక్ – 1990 సెప్టెంబర్ 28) లానే ఈ రీమేక్‌కీ రవిరాజా పినిసెట్టి దర్శకులు. చిరంజీవి సరసన మీనాక్షీ శేషాద్రి నటించగా, ఆనంద్ – మిళింద్ సంగీతంలో ఈ రీమేక్ ‘ఆజ్కా గూండా రాజ్’ (1992 జూలై 10) పేరుతో విడుదలైంది. తెలుగులో చిరంజీవి పిన్ని కొడుకు దుర్గబాబు నటించిన ఫ్రెండ్ పాత్రను ఆ హిందీ వెర్షన్లో నేటి తరం హీరో రవితేజ పోషించడం విశేషం. గమ్మత్తేమిటంటే, తెలుగునాట చిరుకు ఉన్న క్రేజ్ దష్ట్యా ఆ కొత్త హిందీ బాణీలకు తెలుగులో పాటలు రాయించి, ఆ డబ్బింగ్ సాంగ్స్‌ను ఇక్కడ రిలీజ్ చేయడం. అప్పట్లో ‘గూండా రాజ్’ పేరిట లియో సంస్థ ద్వారా ఆ డబ్బింగ్ పాటల క్యాసెట్లు మార్కెట్లోకి వచ్చాయి. ఒక హీరో తెలుగు సినిమా హిందీలో రీమేకై, మళ్ళీ ఆ హిందీ రీమేక్ పాటలు తెలుగులోకి డబ్బింగ్ అవడం అరుదైన ఘటన. డ్యాన్స్, ఫైట్లలో ఉత్తరాదినీ సమ్మోహనపరచిన చిరంజీవి గురించి ఇంగ్లీష్ మేగజైన్లు ముఖచిత్ర కథనాలు రాసి, ఆకాశానికెత్తాయి. ‘ఆజ్ కా గూండారాజ్’లో మీనాక్షీ శేషాద్రితో... 50 కేంద్రాలు... 100 రోజులు... ‘గ్యాంగ్ లీడర్’ పెద్ద హిట్. దాని రిలీజ్‌కు 5 వారాల ముందు తెలుగునాట టికెట్ రేట్లు పెరిగాయి. అదే సమయంలో తెలుగుగడ్డపై తీసిన చిత్రాలకు వినోదపన్నులో భారీ రాయితీ కల్పించింది ప్రభుత్వం. అప్పటికి ఉన్న ట్యాక్స్‌లో ఏకంగా పెద్ద సినిమాలకు దాదాపు 40 శాతం, చిన్న సినిమాలకు 70 శాతం మేర రాయితీ ఇచ్చారు. అలా టికెట్లు రేట్లు పెరిగాక, రాయితీలిచ్చాక వచ్చిన తొలి పెద్ద హిట్ ఇదే! నిజానికి, పెరిగిన టికెట్ రేట్ల ప్రభావం తెలియక ముందే, ఈ సినిమా ప్రదర్శన హక్కులను మామూలు వ్యాపార లెక్కల చొప్పున అమ్మేశారు. తీరా రిలీజయ్యాక పెరిగిన టికెట్ రేట్లలోనూ జనాదరణ బ్రహ్మాండంగా ఉండడంతో, ‘గ్యాంగ్ లీడర్’ వసూళ్ళ వర్షం కురిపించింది. బయ్యర్లందరికీ లాభాల పంట చేతికి అందింది. 75కి పైగా ప్రింట్లతో రిలీజై, ఏకంగా 30 కేంద్రాలలో నేరుగా, మరో 15 – 20 కేంద్రాలలో నూన్‌షోలతో... అన్నీ కలిపి 50 సెంటర్లలో ‘గ్యాంగ్ లీడర్’ వంద రోజులు పూర్తి చేసుకుంది. హైదరాబాద్ సుదర్శన్ 70 ఎం.ఎంలో ఏకంగా 162 రోజులు ఆడింది. చిరంజీవి ‘రౌడీ అల్లుడు’ వచ్చి, సిల్వర్ జూబ్లీ మిస్సయింది. తెలుగు సినీ రాజధాని విజయవాడలో శాంతి థియేటర్‌ను శాంతి, ప్రశాంతి అంటూ రెండుగా చేశాక, వాటిలో వచ్చిన తొలి సినిమా ‘గ్యాంగ్ లీడ’రే! ఏకకాలంలో ఆ రెండిట్లోనూ 6 వారాలాడింది. అంతకు ముందు శారద– శోభన్‌బాబుల ‘మనుషులు మారాలి’(’69) ఇలాగే విజయవాడలో ఒకేసారి రెండు (లీలామహల్, శేష్ మహల్) హాళ్ళలో 6 వారాలాడిన ఘనత దక్కించుకుంది. తర్వాత మళ్ళీ 22ఏళ్ళకు గ్యాంగ్‌లీడర్ సినీలవర్ల బెజవాడలో ఆ అరుదైన విన్యాసం చేసింది. ఇటు మెగాస్టార్... అటు లేడీ అమితాబ్... ‘గ్యాంగ్‌లీడర్’కు చిరంజీవితో పాటు విజయశాంతి పెద్ద ప్లస్. ‘కర్తవ్యం’ (1990 జూన్ 29) హిట్టయ్యాక, యాక్షన్ హీరోలకు దీటుగా విజయశాంతికి ‘లేడీ అమితాబ్’ అనే ఇమేజ్ ఉన్న రోజులవి. ‘కర్తవ్యం’ నుంచి ప్రేక్షక, ట్రేడ్ వర్గాలు రెండూ ఆమెను ఒక హీరోలా చూడడం మొదలెట్టాయి. అలా ఆ కాలంలోనే ‘ఆశయం’, ‘పోలీస్ లాకప్’ లాంటివి ఆమెతో వచ్చాయి. అందుకే, ట్రేడ్ వర్గాల దృష్టిలో ‘గ్యాంగ్ లీడర్’ ఏకంగా ‘డబుల్ స్టారర్’గా నిలిచింది. ఊటీలో ‘గ్యాంగ్ లీడర్’లోని ‘భద్రాచలం కొండ...’ పాట షూటింగ్ జరుగుతున్నప్పుడే, ‘కర్తవ్యం’లో ఉత్తమ నటిగా విజయశాంతికి నేషనల్ అవార్డ్ వరించింది. వార్త తెలిసిన వెంటనే చిరంజీవి ఆమెను అభినందించి, అందరికీ పార్టీ ఇచ్చారు. ‘గ్యాంగ్ లీడర్’లో చిరు, విజయశాంతి పోటీ పడి నటించారు. ఆ ముందు ‘యముడికి మొగుడు’ (’88), ‘స్టేట్‌రౌడీ’(’89)లాంటి వాటితో చిరంజీవి పక్కన డ్యా¯Œ ్స అంటే హీరోయిన్ రాధ తప్ప మరొకరు లేరనే భావన ఉండేది. కానీ ‘గ్యాంగ్ లీడర్’తో డ్యాన్సులో చిరంజీవితో ఢీ అంటే ఢీ అన్నారు విజయశాంతి. టైటిల్ సాంగ్ మినహా, 5 పాటలూ హీరో, హీరోయిన్ మధ్యే ఉండడం, అన్నీ మ్యూజిక్ – డ్యాన్సుల్లో హిట్టవడం మరో అరుదైన ఘటన. అది ఈ జంటకే సాధ్యమైంది. అయితే, ‘గ్యాంగ్ లీడర్’ ఘనత తమదంటే తమదని వారిద్దరూ అనుకున్నట్టు గుసగుసలొచ్చాయి. ∙చిరంజీవి, విజయశాంతి పరుచూరి బ్రదర్స్ శకంలో... ‘గ్యాంగ్ లీడర్’ సూపర్ హిట్‌కు డైలాగ్స్ కూడా కారణం. బాపినీడు తొలిసారిగా పరుచూరి బ్రదర్స్‌ను డైలాగ్ రైటర్స్‌గా పెట్టుకున్నారు. బాపినీడు తన మనసుకు దగ్గరైన పాత ‘బొమ్మరిల్లు’ కథకు, సెకండాఫ్‌లో హిందీ ‘ఘాయల్’ను అనుసరిస్తూ ఈ కథ సిద్ధం చేసుకున్నారు. కథ సిద్ధం కావడంలో ఎం.వి.వి.ఎస్. బాబూరావు సహకరించారు. కథలో, స్క్రీన్‌ప్లేలో పరుచూరి సోదరుల సలహాలూ ఉపకరించాయి. అప్పట్లో ఆ అన్నదమ్ములు రాసిందల్లా బాక్సాఫీస్ బంగారమైంది. ముఖ్యంగా, 1990 – 91 కాలంలో ఇండస్ట్రీలో సంచలనమైన – విజయశాంతి ‘కర్తవ్యం’, వెంకటేశ్ ‘బొబ్బిలిరాజా’, బాలకృష్ణ ‘లారీ డ్రైవర్’, శోభన్‌బాబు – సుమన్‌ల ‘దోషి – నిర్దోషి’, హరీశ్ – మాలాశ్రీల ‘ప్రేమఖైదీ’, మోహన్‌బాబు ‘అసెంబ్లీ రౌడీ’, చిరంజీవి ‘గ్యాంగ్ లీడర్’– ఈ ఏడు సినిమాలూ రచయితలుగా పరుచూరి బ్రదర్స్ కలం చేసుకున్నవే. వేర్వేరు ఇమేజ్లున్న ఆ ఏడు చిత్రాల హీరోలనూ ఆ సినిమాలు కొత్త ఎత్తులకు తీసుకువెళ్ళడం మరో చరిత్ర. ‘గ్యాంగ్ లీడర్’లో రావు గోపాలరావుతో ‘‘కన్నాంబకు ఎక్కువ – కాంచనమాలకు తక్కువ’’అంటూ చిత్రమైన మేనరిజమ్ డైలాగ్స్ పెట్టారు. జనజీవితంలో ఈ ఫక్కీలో డైలాగ్స్ చెప్పుకోవడం అప్పట్లో ఓ క్రేజ్. అసలీ తరహా డైలాగ్ మూలసృష్టికర్త– సినీ రచయిత ఎం.వి.ఎస్. హరనాథరావు. ‘నవయుగం’(’90) చిత్రంలో ‘‘వీడు కత్తికి ఎక్కువ, బాంబుకు తక్కువ’’ అని ఒకే ఒక్క డైలాగ్ రాశారాయన. అదిచూసి ముచ్చట పడ్డ పరుచూరి గోపాలకృష్ణ, ‘గ్యాంగ్ లీడర్’లో పాత్రకు సినిమా అంతటా ఈ తరహా డైలాగ్స్ పెట్టడం హిట్ పాయింటైంది. అలాగే, చిరంజీవి సొంత ఐడియా ‘రప్ఫాడిస్తా’ అనే ఊతపదం మోస్ట్ పాపులరైంది. బామ్మ నిర్మలమ్మతో ఫోటోలో నుంచి వచ్చినట్టు తాత గెటప్‌లో చిరంజీవి మాట్లాడే సీన్లు, ‘శబరీ’ డైలాగ్ ట్రాక్ చిరంజీవి చేసిన ఇంప్రొవైజేషన్లే! అవీ హిట్! సెట్స్‌పై బాపినీడు, పరుచూరి గ్యాంగ్‌తో... – రెంటాల జయదేవ -
మెగా డైరెక్టర్
-
విజయ పత్రిక నిర్వహించడంతో..
పశ్చిమగోదావరి, ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ప్రముఖ సినీ దర్శకుడు విజయ బాపినీడు మృతి చెందారని తెలియడంతో ఆయన స్వగ్రామం చాటపర్రులో విషాదం నెలకొంది. 1936వ సంవత్సరం సెప్టెంబర్ 22వ తేదీన జిల్లా కేంద్రం ఏలూరుకు సమీపంలోని చాటపర్రు గ్రామంలో గుత్తా సీతారామస్వామి, లీలావతి దంపతులకు జన్మించిన గుత్తా బాపినీడు చౌదరి స్థానిక సీఆర్ రెడ్డి కళాశాలలో డిగ్రీ చదివారు. చదువు అనంతరం విజయ అనే సినీ పత్రిక నిర్వహించారు. విజయ పత్రిక నిర్వహించడంతో విజయ బాపినీడుగా గుర్తింపు తెచ్చుకున్నారు. అనంతరం సినిమాలపై మక్కువ పెంచుకున్న బాపినీడు చెన్నై చేరుకుని తొలుత నిర్మాణ రంగంలోకి ప్రవేశించారు. 1976లో “యవ్వనం కాటేసింది’ అనే సినిమాతో నిర్మాతగా మారారు. అనంతరం దర్శకత్వ శాఖలోకి ప్రవేశించి తిరుగులేని విజయాలు సాధించారు. చిరంజీవి, శోభన్‌బాబు, రాజేంద్రప్రసాద్ వంటి నటులతో ఆయన చేసిన సినిమాలు తెలుగు చలనచిత్ర రంగంలో రికార్డులు సృష్టించాయి. ముఖ్యంగా చిరంజీవితో ఆయన రూపొందించిన పట్నం వచ్చిన పతివ్రతలు, మగ మహారాజు, మహానగరంలో మాయగాడు, హీరో, గ్యాంగ్‌లీడర్ తదితర విజయవంతమైన చిత్రాలను రూపొందించారు. కాగా దాదాపు 20 సంవత్సరాల నుంచి సినీ రంగానికి దూరంగా ఉంటున్నారు. తాను పుట్టిన గ్రామంలో మాత్రం బంధువులు, మిత్రులకు ఎప్పుడూ అందుబాటులో ఉండేవారని, ప్రతి ఒక్కరితో కలుపుగోలుగా మాట్లాడేవారని గ్రామస్తులు చెబుతున్నారు. అయితే ఆయన సమకాలీనులు గ్రామంలో లేకపోవడంతో ఆయనకు సంబంధించిన బాల్య స్మృతులను గుర్తు చేసే అవకాశం లేకపోయింది. మాగంటి కుటుంబంతోఅనుబంధం దివంగత మాజీ మంత్రి మాగంటి రవీంద్రనాథ్ చౌదరి కుటుంబంతో ఆయనకు దూరపు బంధుత్వంతో పాటు సినీ బంధుత్వం కూడా ఉంది. మాగంటి రవీంద్రనాథ్ చౌదరి నిర్మాతగా ఆయన దర్శకత్వంలో రూపొందించిన ఖైదీ నెంబర్ 786 అప్పట్లో భారీ హిట్ సినిమా. అలాగే చిరంజీవితో ఆయన రూపొందించిన గ్యాంగ్ లీడర్ రికార్డులను తిరగరాసింది. ఆ చిత్రం శతదినోత్సవ వేడుకలను తన స్వగ్రామానికి దగ్గరైన ఏలూరులో అత్యంత భారీగా నిర్వహించారు. విజయ బాపినీడు దర్శకత్వం వహించిన అనేక చిత్రాలను పంపిణీ చేసిన ఉషా పిక్చర్స్ అధినేత వీవీ బాల కృష్ణారావు ఆయన మృతిపై తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ప్రేక్షకులకు వినోదంతో పాటు నిర్మాతలు, పంపిణీ దారులకు లాభాలు చేకూర్చాలనే అక్ష్యంతో ఆయన చిత్రాలు రూపొందించారన్నారు. -
ఆయన హస్తవాసి చాలా మంచిది
‘‘విజయబాపినీడు గారికి నన్ను ‘ఇతను చాలా బాగా రాస్తాడు. ఓ అవకాశం ఇవ్వండి’ అంటూ పరిచయం చేసింది గుత్తా సురేశ్‌గారు. ‘‘బాగా చదువుకున్నావు. నీకెందుకు సినిమా ఇండస్ట్రీ. చక్కగా ఏదైనా ఉద్యోగం చేసుకో’’ అని బాపినీడుగారు సలహా ఇచ్చారు. ‘సార్.. చిన్నతనం నుండి సినిమా వాల్‌పోస్టర్ పైన ఉన్న టైటిల్స్ మీద ‘పాటలు’ అనే కార్డు పక్కన నా పేరు రాసుకునేవాణ్ణి. అందుకే నాకు ఉద్యోగం వచ్చినా చేరలేదు. నాకు ఆల్రెడీ ఎయిర్‌ఫోర్స్‌లో ఉద్యోగం వచ్చింది’ అని లెటర్ చూపించాను. అది చూసి ఆయన ‘‘ఇప్పుడు నేను తీస్తున్న సినిమాలో పాటలు లేవు. కానీ, ‘ఆన్ పావమ్’ అనే తమిళ సినిమాలో టైటిల్ కార్డ్స్ మీద ఓ పాట వస్తుంది. ఆ సినిమా చూసిరా. నేను నిన్ను ఇప్పుడు పంపిస్తున్నాను కదా అని సినిమా ఓకే అయ్యింది అనుకోవద్దు. నువ్వు రాసినది నచ్చితేనే అవకాశం’’ అన్నారు. సరే అన్నాను. ‘ఆన్ పావమ్’ చూడ్డానికి వెళ్లాను. టైటిల్స్ పడ్డాయి, చూశాను. బయటికొచ్చి 40 పేజీల పుస్తకం కొనుక్కొని ఓ బస్ ఎక్కాను. బస్సులో మూడు పల్లవులు, నాలుగు చరణాలు రాశాను. 45 నిమిషాల తర్వాత బస్ వడపళనిలో ఆగింది. బాపినీడుగారి ఇంటికి వెళ్లాను. నన్ను చూడగానే ఆయన ‘‘ఏంటి నేను సినిమా చూడమని పంపానుగా.. వచ్చేశావ్’’ అని కోప్పడ్డారు. ‘సార్, నేను రాసేది టైటిల్కార్డ్స్లో వచ్చే పాట అన్నారు. మూడు గంటల సినిమా టైమ్ వేస్ట్ అని టైటిల్స్ చూసి వచ్చేశాను. మీరు చెప్పిన పాట రెడీ’ అన్నాను. ఆయన ఆశ్చర్యంతో ఆ చిత్ర సంగీత దర్శకుడు సాలూరి వాసూరావుని పిలిపించి, ట్యూన్ చేయమని చెప్పారు. సినిమా టైటిల్ కార్డ్స్‌పై వచ్చే పాట కదా వెస్ట్రన్ చేద్దాం అని ఆయన ఓ వెస్ట్రన్ ట్యూన్ ఇచ్చారు. నేను ఆల్రెడీ రాసుకొన్న పాటే కదా అటూ ఇటూ మార్చి ఇచ్చాను. బావుంది. అయినా మరో వెర్షన్ రాయండి అని ఈసారి ఫోక్లోర్ ట్యూన్ ఇచ్చారు. మరో పావుగంటలో ఇంకో పాట ఇచ్చాను. వాసూరావు గారు ఆశ్చర్యపోతూ ‘మీరు గతంలో ఏ సినిమా వాళ్ల దగ్గరైనా పని చేశారా’ అని అడిగారు. ‘నాకు సంగీతమంటే ఇష్టం కావటంతో హిందీ పాటలు బాగా వింటాను. నాకు హిందీ రాదు, అందుకని నేను ఆ ట్యూన్‌కి తగినట్లుగా తెలుగులో నాకిష్టం వచ్చిన పదాలతో పాటలు రాసుకొనేవాణ్ణి. అది ఇలా ఉపయోగపడింది’ అని చెప్పాను. ఇది జరిగింది 1986 డిసెంబర్ 30న. 1987 జనవరి 1న బాపినీడుగారు దర్శకత్వంలో మొదలైన ‘నాకూ పెళ్లాం కావాలి’ సినిమా ద్వారా పాటల రచయితగా మారాను. సినిమా సూపర్‌హిట్. 100 రోజులు అవుతున్నా ఇంకా ఆడుతూనే ఉంది. బాపినీడుగారు పబ్లిసిటీ చేయటంలో మాస్టర్. ‘‘సినిమా చాలా బావుంది. ఇంకో పాట యాడ్ చేద్దాం. ట్యూన్ రెడీ చేయిస్తా’’ అన్నారాయన. ‘వద్దు సార్. అదే ట్యూన్‌కు ఇంకో వెర్షన్ రాస్తాను’ అన్నాను. సరే అన్నారు. అందులో మొదటిసారి రాసిన పాట ‘‘వినోదాల విందురా, బాధలన్ని బంద్రా...’ అనేది మొదటి వెర్షన్. ఇదే ట్యూన్‌కి సినిమా 100 రోజుల తర్వాత ‘నాకు పెళ్లాం కావాలి, మూడు ముళ్లు వెయ్యాలి...’ అని రాశాను. ఒకే ట్యూన్‌కి రెండు పాటలు రాసిన ఘనత నాకే దక్కింది. సినిమా పోస్టర్ మీద ఒక్కసారైనా పేరు చూసుకోవాలన్న నా బలమైన కోరికను తీర్చిన బాపినీడుగారికి ఏమిచ్చి రుణం తీర్చుకోగలను. ఆయన గొప్పతనం గురించి నాలుగు మంచి మాటలు చెప్పటం తప్ప. నేను పరిచయం అయ్యాక ఆయన 14 సినిమాలు తీశారు. ఆయన అన్ని సినిమాల్లో నాకు చివరి వరకు అవకాశం ఇచ్చారు. ఆయన హస్తవాసి చాలా మంచిది. బాపినీడుగారికి ఆశ్రునయనాలతో తుది వీడ్కోలు పలుకుతున్నా’’. -
మాస్ చిత్రాల మగమహారాజు ఇకలేరు
ప్రముఖ దర్శక–నిర్మాత, రచయిత విజయబాపినీడు (83) ఇక లేరు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మంగళవారం ఉదయం హైదరాబాద్‌లోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. విజయ బాపినీడు అసలు పేరు గుత్తా బాపినీడు చౌదరి. ఏలూరు సమీపంలోని చాటపర్రులో లీలావతి, సీతారామస్వామి దంపతులకు 1936 సెప్టెంబర్ 22న జన్మించారు బాపినీడు. ఏలూరులోని సీఆర్ఆర్ కళాశాలలో బీఏ చదివిన ఆయన కొంతకాలం వైద్య ఆరోగ్య శాఖలో పనిచేశారు. వ్యవసాయ కుటుంబానికి చెందిన బాపినీడుకి మొదటినుంచీ రచనా వ్యాసంగం పట్ల ఆసక్తి ఉండేది. గుత్తా బాపినీడు పేరుతో డిటెక్టివ్ నవలలు రాసేవారు. ఆ తర్వాత భార్య విజయ పేరు కలిసి వచ్చేలా విజయ బాపినీడు పేరుతో రచనలు చేశారాయన. తన పుస్తకాలను వేరే వాళ్లు పబ్లిష్ చేయడం కంటే సొంతంగా పబ్లిష్ చేసుకుంటే సంపాదన పెరుగుతుందనే ఉద్దేశ్యంతో ఉద్యోగానికి రాజీనామా చేసి, కుటుంబంతో సహా మద్రాసు వెళ్లారు. అక్కడ అప్పటికే పేరున్న రచయితలు విశ్వప్రసాద్, కొమ్మూరిలను బాపినీడు కలిశారు. ‘డిటెక్టివ్ నవలలు ప్రచురించడం వల్ల లాభం లేదు’ అని వారు చెప్పడంతో ‘బొమ్మరిల్లు, విజయ’ అనే మాస పత్రికలను ప్రారంభించారు. ఆ రోజుల్లో బొమ్మరిల్లు పుస్తకం లేని ఇల్లు ఉండేది కాదంటే అతిశయోక్తి కాదు. ఇండియన్ ఫిల్మ్, నీలిమ పత్రికలకు ఎడిటర్‌గానూ వ్యవహరించారు. బాపినీడుని ఫల్గుణా ప్రొడక్షన్స్ వారు పిలవడంతో తన దృష్టిని చలన చిత్రరంగంవైపు మళ్లించారు. ఆయన రాసిన ‘జగత్ జెట్టీలు’ కథను ఫల్గుణా ప్రొడక్షన్స్‌వారు సినిమాగా తీశారు. ఆ తర్వాత ‘హంతకులు–దేవాంతకులు’ సినిమాకి కథ అందించారు బాపినీడు. శ్యామ్ ప్రసాద్ ఆర్ట్స్ బ్యానర్ ఏర్పాటు... మూడు నాలుగు సినిమాలకు కథలు అందించిన తర్వాత శ్యామ్ ప్రసాద్ ఆర్ట్స్ బ్యానర్‌ను నెలకొల్పిన విజయ బాపినీడు ‘మయంగిగిరాళ్ ఒరు మాదు’ అనే తమిళ సినిమా రీమేక్ హక్కులు కొన్నారు. దాన్ని దాసరి నారాయణరావు దర్శకత్వంలో ‘చెడిన ఆడది’ పేరుతో తెరకెక్కించాలనుకున్నారు. అయితే ఆ టైటిల్‌ని అప్పటి ‘దక్షిణ భారత చలనచిత్ర వాణిజ్య మండలి’ అధ్యక్షుడు పి.పుల్లయ్య తిరస్కరించడంతో ‘యవ్వనం కాటేసింది’గా పేరు మార్చి నిర్మించారు. ఆ తర్వాత ‘రంభ–ఊర్వశి–మేనక, బొమ్మరిల్లు, ప్రేమపూజారి, విజయ, బొట్టు–కాటుక, రుద్రతాండవం’ వంటి సినిమాలు నిర్మించారాయన. యువచిత్ర కె.మురారితో కలిసి ‘జేగంటలు’ సినిమా నిర్మించారు. ఈ సినిమాకి బాపినీడే కథ అందించడం విశేషం. ఇతర దర్శకుల దర్శకత్వంలో 12 సినిమాలు నిర్మించిన ఆయన.. చిరంజీవి హీరోగా 1983లో ‘మగ మహారాజు’ సినిమాతో దర్శకునిగా మారారు. ఆ తర్వాత ‘మహానగరంలో మాయగాడు, మగధీరుడు, ఖైదీ నెం.786, గ్యాంగ్‌లీడర్, బిగ్‌బాస్’ చిత్రాలను స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించారు. బ్లాక్ బస్టర్‌గా నిలిచిన ‘ఖైదీ నెం. 786’ చిరంజీవి నూరవ సినిమా కావడం విశేషం. అలాగే, ‘గ్యాంగ్ లీడర్’ చిరంజీవి కెరీర్‌కి ఓ మైలురాయి అయింది. బాపినీడు తెరకెక్కించిన చిత్రాలు ఫ్యామి లీస్తో పాటు మాస్‌కి బాగా కనెక్ట్ అయ్యాయి. బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లు కురిపించాయి. ఆ విధంగా తనలో మంచి మాస్ దర్శకుడు ఉన్నాడని ఆయన నిరూపించుకున్నారు. నిర్మాణత.. విజయ బాపినీడు బాపినీడు తాను నిర్మించిన చిత్రాలకు నిర్మాణత: విజయ బాపినీడు అని వేసుకునేవారు. నిర్మాణత అనే పదాన్ని తొలిసారి ఆయనే ప్రయోగించారు. ఎందరినో పరిచయం... విజయబాపినీడు ఎంతోమందిని తన సినిమాల ద్వారా పరిచయం చేశారు. రాజాచంద్ర, దుర్గా నాగేశ్వరరావు, జి. రామమోహనరావు, మౌళి, వల్లభనేని జనార్ధన్‌లను దర్శకులుగా, ఎం.వి.రఘు, మహీధర్, శ్రీనివాసరెడ్డి, బాబు, ప్రసాద్‌లను కెమెరామేన్లుగా, పాటల రచయిత భువనచంద్రను, మాటల రచయిత కాశీ విశ్వనాథ్... వంటి ఎందర్నో పరిచయం చేశారాయన. విజయబాపినీడు మొత్తం 22 సినిమాలకు దర్శకత్వం వహించారు. చిరంజీవి, శోభన్‌బాబులతోనే ఎక్కువ సినిమాలు చేశారాయన. కృష్ణతో ‘కృష్ణ గారడీ’, రాజేంద్రప్రసాద్‌తో ‘వాలు జడ తోలు బెల్టు, దొంగ కోళ్లు, సీతాపతి చలో తిరుపతి’ సినిమాలు తీశారు. తన కుమార్తెలు నిర్మాతలుగా బాపినీడు నిర్మించిన చివరి చిత్రం ‘కొడుకులు’ (1998). ఆ తర్వాత చిరంజీవి హీరోగా మళ్లీ సినిమా తీయాలనుకున్నారు కానీ కుదరలేదు. ఇటువంటి దర్శక–నిర్మాత దూరం కావడం చిత్రసీమకు తీరని లోటు అని చిత్రరంగ ప్రముఖులు పేర్కొన్నారు. బాపినీడు పెద్ద కుమార్తె అమెరికా నుంచి రావడానికి టైమ్ పడుతున్న కారణంగా గురువారం హైదరాబాద్‌లోని మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యలు తెలిపారు. సినిమా ఫ్లాప్ అని ‘సి’ గ్రేడ్ విజయ బాపినీడు చాలా నిక్కచ్చిగా ఉండేవారని పేరు. సినిమా రివ్యూలు మొదలైంది ఆయన ‘విజయ’ పత్రిక ద్వారానే అని ప్రముఖ రచయిత తోట ప్రసాద్ అన్నారు. రివ్యూలకు ఇచ్చే ‘గ్రేడ్’లు చాలా నిజాయితీగా ఉండేవని ప్రసాద్ అన్నారు. విజయ, బొమ్మరిల్లు పత్రిలకు అసిస్టెంట్ ఎడిటర్‌గా చేశారు తోటప్రసాద్. బాపినీడు దర్శకత్వం వహించిన ‘పున్నమి చంద్రుడు’ రివ్యూని విజయ పత్రిక కోసం రాసినప్పుడు.. ‘సినిమా అట్టర్ ఫ్లాప్’ అంటూ బాపినీడుగారు ‘సి గ్రేడ్’ ఇచ్చుకున్నారని తోట ప్రసాద్ అన్నారు. ‘‘ఖైదీ నెంబర్ 786 సిట్టింగ్స్‌తో బాపినీడుగారు నాతో సినీ ఓనమాలు దిద్దించారు. మా గోదావరి జిల్లా యాసలో చెప్పాలంటే కేక వేసి కూడు పెట్టినోడు బాపినీడు (గారు) జన్మ జన్మలకి నేను, నా కుటుంబం ఆయన్ను మర్చిపోలేం’’ అని తోట ప్రసాద్ అన్నారు. ప్రయోగాలంటే ఇష్టం ప్రయోగాలు చేయడం విజయ బాపినీడుకి ఇష్టం. ఒక కన్నడ, ఒక మలయాళ చిత్రం అనువాద హక్కులు కొని, రెండు చిత్రాలను కలుపుతూ కొంత భాగం షూటింగ్ చేశారు. ఆ రెండు చిత్రాలను ఒకే సినిమాగా విడుదల చేయడం విశేషం. భారత చలనచిత్ర రంగంలో ఇది తొలి ప్రయోగం. అలాగే శరత్‌బాబుతో తీసిన ‘రుద్ర తాండవం’ చిత్రాన్ని ఒకేసారి అన్ని ఏరియాల్లో విడుదల చేయలేదు. ఒక్క వైజాగ్‌లో మాత్రమే రిలీజ్ చేసి. ప్రేక్షకులు స్పందనను బట్టి మిగతా ఏరియాల్లో విడుదల చేయాలనుకున్నారు. అయితే ఫ్లాప్ టాక్ రావడంతో రిలీజ్ చేయలేదు. ఇవాళ నాకెంతో దుర్దినం. విజయ బాపినీడుగారు కన్నుమూశారనే వార్తను నమ్మలేకుండా ఉన్నాను. ఆయన నన్ను ఓ కొడుకులా, తమ్ముడిలా చూసుకునేవారు. ఆయనతో నా అనుబంధం కేవలం ఓ దర్శకుడు, నిర్మాత, హీరో అన్నట్లుగా ఉండేది కాదు. వారితో నా పరిచయం ‘పట్నం వచ్చిన పతివ్రతలు’ సినిమాతో ప్రారంభమైంది. ఆ తర్వాత ఆయనతో ఆరు సినిమాలు చేశాను. ‘ఇతర హీరోలతో కూడా మీరు సినిమాలు చేయవచ్చు కదా’ అని ఆయనతో అనేవాడిని. ‘‘మీతో సినిమాలు తీయడం ప్రారంభించిన తర్వాత ఆ కంఫర్ట్గానీ, సెంటిమెంట్‌గానీ మరొకరితో నాకు కుదరడం లేదు. వేరే వారితో చేయలేకపోతున్నాను’’ అంటూ నా పట్ల అభిమానంగా ఉన్న గొప్పవ్యక్తి ఆయన. నేను హైదరాబాద్‌కు షిప్ట్ అయిన కొత్తల్లో ఎక్కడ ఉండాలి అనుకుంటున్న సమయంలో ‘హైదారాబాద్‌లో నా గెస్ట్‌హౌస్ ఉంది. అందులో మీరు ఉండొచ్చు’ అని చెప్పి వసతి కల్పించారు. చాలాకాలం అక్కడే ఉన్నాను. ‘మగమహారాజు’ శతదినోత్సవ వేడుక రోజు ‘‘మీతో నాకు ఉన్న అనుబంధానికి, మీరు నా పట్ల చూపించే ప్రేమకు తగ్గట్లుగా ఈ ఏనుగుని బహుమతి ఇవ్వాలనుకున్నాను’’ అని బాపినీడుగారు అన్నారు. ఆయన ఏం చేసినా కొత్తగా ఉంటుంది. ‘గ్యాంగ్ లీడర్’ ఫంక్షన్‌ను ఒకేరోజు నాలుగు సిటీస్‌లో గ్రాండ్‌గా జరిపించిన అరుదైన రికార్డు ఉంది మా కాంబినేషన్లో. నా అభిమానులకు కూడా ఆయనంటే చాలా ఇష్టం. ‘చిరంజీవి’ అనే మ్యాగజీన్‌ను ఆయన పబ్లిషర్‌గా, ఎడిటర్‌గా తీసుకు వచ్చారు. బాపినీడుగారి మ్యాగజీన్ ఎప్పుడు వస్తుందా? అని ప్రేక్షకులు ఎదురు చూసేవారు. అలాంటి వ్యక్తి దూరం కావడం దురదృష్టకరంగా భావిస్తున్నాను. బాపినీడుగారి ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబ సభ్యులకు ఆ దేవుడు మానసిక స్థయిర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను. – నటుడు చిరంజీవి విజయ బాపినీడుగారు పేరుకు తగ్గట్లు ఎన్నో విజయవంతమైన సినిమాలు తీశారు. ఆయన చివరి చిత్రం ‘కొడుకులు’లో నేను, సాయికుమార్ హీరోలుగా చేశాం. ఆయన అందరికీ దూరమవ్వడం బాధగా ఉంది. – ‘మా’ అధ్యక్షుడు శివాజీరాజా బాపినీడుగారు మంచి దర్శక–నిర్మాత. నాకు అత్యంత సన్నిహితులు విజయ బాపినీడు దూరం అవ్వడం చిత్రపరిశ్రమకు తీరని లోటు. బాపినీడుగారి ఆత్మకు శాంతి చేకూరాలి. ఆయన కుటుంబసభ్యులకు ఆ భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. – నిర్మాత కేఎస్ రామారావు చిరంజీవితో బాపినీడు ‘ఖైదీ నంబర్ 786’ సెట్లో మోహన్‌బాబు, చిరంజీవిలతో... బాపినీడు మృతికి సీఎం కేసీఆర్ సంతాపం సాక్షి, హైదరాబాద్: ప్రముఖ సినీ దర్శకుడు, పాత్రికేయుడు, కథా రచయిత విజయబాపినీడు మృతి పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సంతాపం వ్యక్తం చేశారు. పలు విజయవంతమైన చిత్రాలు అందించడమే కాకుండా, విజయ అనే పత్రిక నడపడం ద్వారా విజయాన్ని తన ఇంటి పేరుగా మార్చుకున్న బాపినీడు..తెలుగు సినీ రంగ చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోయే ముద్ర వేశారని పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు సీఎం తన ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. -
విజయ బాపినీడుకు ప్రముఖుల నివాళి
-
తమ్ముడిలా, కొడుకులా వాత్సల్యం చూపించేవారు
-
నన్ను సొంత తమ్ముడిలా ఆదరించారు : చిరంజీవి
అనారోగ్య కారణాలతో ఈ రోజు ఉదయం మరణించిన సీనియర్ దర్శకులు విజయ బాపినీడుకు మెగాస్టార్ చిరంజీవి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బాపినీడుతో ఉన్న అనుబంధాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. తన అభిమానులకు కూడా విజయ బాపినీడు అంటే ఎంతో ఇష్టం మన్న చిరు, తన కెరీర్ స్టార్టింగ్‌లో ఆయన తమ్ముడిలా ఆదరించారని గుర్తు చేసుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతి తెలిపారు. ‘నేను హైదరాబాద్ కు షిఫ్ట్ అయిన కొత్తలో ఎక్కడ ఉండాలి అని అనుకుంటున్న సమయంలో హైదరాబాద్ లో ఉన్న ఆయన గెస్ట్ హౌస్ ను నాకు ఇచ్చారు. పై ఫ్లోర్ లో ఉండే వారిని కిందకు పంపించి, పై రెండు ఫోర్లు నాకు ఇచ్చారు. చాలా కాలం అక్కడే ఉన్నాను. ఎప్పుడూ నా పై తమ్ముడిలా, కొడుకులా వాత్సల్యం చూపించేవారు. ఆయనతో ఎన్నో స్వీట్ మెమొరీస్ ఉన్నాయి. ‘ఒకరోజు ‘మగమహారాజు’ 100 రోజుల ఫంక్షన్ జరుగుతుంటే... ఓ ఏనుగును నాకు బహుమతిగా ఇచ్చారు. ఇదేమిటంటీ... దీనిని నేను ఏం చేసుకోనూ! అంటే... ‘మీతో నాకు ఉన్న అనుబంధానికి, మీరు నా పట్ల చూపించే ప్రేమకు తగ్గట్టుగా ఏ బహుమతి ఇస్తే బాగుంటుందని ఆలోచించాను. ఏనుగును ఇస్తే దానికి మ్యాచ్ అవుతుందనిపించింది. అందుకే దీనిని ఇచ్చాను’ అంటూ నా మీద ప్రేమను అలా చూపిన గొప్ప మనసున్న మనిషి ఆయన. అలానే గ్యాంగ్ లీడర్ ఫంక్షన్ ను ఒకే రోజు నాలుగు సిటీస్ లో గ్రాండ్‌గా జరిపించిన అరుదైన రికార్డ్ మా ఇద్దరి కాంబినేషన్ లో ఉంది. ఆయన ఏం చేసినా... చాలా వినూత్నంగా, కొత్తగా ఉంటుంది. ముఖ్యంగా నా అభిమానులకు ఆయన అంటే చాలా ఇష్టం. వారికి ఎంతో దగ్గరగా ఉండేవారు. దానికి కారణంగా చిరంజీవి అనే మ్యాగజైన్‌ను ఆయన పబ్లిషర్‌గా, ఎడిటర్‌గా తీసుకొచ్చారు. అందులో నాకు సంబంధించిన ఫోటోలను, వార్తలను ప్రత్యేకంగా పొందుపరిచి అందించేవారు. విజయ బాపినీడు దర్శకుడి ఎదుగుతున్న సమయంలో చిరంజీవి హీరోగా పట్నం వచ్చిన పతివ్రతలు, మగ మహారాజు, హీరో, మహానగరంలో మాయగాడు లాంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించారు. తరువాత చిరు కెరీర్‌ను మలుపు తిప్పి, మెగాస్టార్‌గా మార్చిన ఖైదీ నంబర్ 786, గ్యాంగ్ లీడర్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ కూడా ఆయన దర్శకత్వంలో తెరకెక్కినవే. 1995లో రిలీజ్ అయిన ‘బిగ్‌బాస్’ చిరంజీవి, బాపినీడు కాంబినేషన్లో తెరకెక్కిన చివరి చిత్రం. -
‘తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటు’
ప్రముఖ దర్శకుడు విజయ బాపినీడు మృతికి తెలుగు రాష్ట్రాలలోని సినీ ప్రముఖలతో పాటు పలువురు రాజకీయ నాయకులు కూడా సంతాపం తెలియజేస్తున్నారు. ఈ సందర్భంగా సీనియర్ నటుడు మోహన్ బాబు సంతాప సందేశాన్ని విడుదల చేశారు. ‘విజయబాపినీడు గారి మరణం నన్ను చాలా బాధించింది. ఆయనతో నా పరిచయం నేటిది కాదు. 1990 నుంచి విజయ బాపినీడు గారు నాకు బాగా తెలుసు. నాకు అత్యంత సన్నిహిత వ్యక్తుల్లో విజయ బాపినీడు గారు కూడా ఒకరు. ఆయన రామోజీరావు గారి మయూరి సంస్థలో పని చేస్తున్న రోజుల నుంచి మంచి సాన్నిహిత్యం ఉంది. ఎంతో మృదు స్వభావి. గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషి. విజయ బాపినీడు గారు మంచి దర్శకుడు మాత్రమే కాదు.. అంతకు మించి మంచి రచయిత.. ఎడిటర్.. అభిరుచి గల నిర్మాత. చాలా హార్డ్ వర్క్ చేస్తారు. ఆయన లాంటి గొప్ప వ్యక్తిని కోల్పోవడం తెలుగు సినిమా పరిశ్రమకు తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతున్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాన’ని తెలిపారు. కమర్షియల్ చిత్రాల దర్శకుడిగా ఎనలేని కీర్తి సంపాందించిన విజయ బాపినీడు మృతికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. పలు విజయవంతమైన చిత్రాలు అందించడమే కాకుండా, విజయ అనే పత్రిక నడపడం ద్వారా విజయాన్ని తన ఇంటి పేరుగా మార్చుకున్న బాపినీడు తెలుగు సినీ రంగ చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోయే ముద్ర వేశారని సీఎం కొనియాడారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. -
ప్రముఖ దర్శకుడు, నిర్మాత విజయ బాపినీడు మృతి
-
ప్రముఖ దర్శక నిర్మాత కన్నుమూత
మెగాస్టార్ చిరంజీవి, శోభన్ బాబులతో వరుస సినిమాలు తెరకెక్కించిన ప్రముఖ దర్శక నిర్మాత విజయ బాపినీడు(86) ఈ రోజు ఉదయం హైదరాబాద్‌లోని ఆయన స్వగృహంలో అనారోగ్యంతో కన్నుమూశారు. 1936 సెప్టెంబర్ 22న ఏలూరు సమీపంలోని చాటపర్రులో జన్మించిన విజయ బాపినీడు, ఎంతో మంది ప్రముఖులను రాష్ట్రానికి అందించిన సీఆర్ఆర్ కాలేజ్‌లో డిగ్రీ పూర్తి చేశారు. తరువాత జర్నలిస్ట్‌గా కెరీర్ ప్రారంభించి సినిమా రంగం మీద మక్కువతో రచయితగా దర్శకుడిగా మారారు. నిర్మాతగానూ విజయం సాధించారు. తెలుగులో 1982లో దర్శకుడిగా పరిచయం అయిన ఆయన మగ మహారాజు, మహానగరంలో మాయగాడు, హీరోలాంటి వరుస విజయాలతో కమర్షియల్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు. రాజేంద్ర ప్రసాద్ లాంటి కామెడీ హీరోలతోనూ వినోదాత్మక చిత్రాలను తెరకెక్కించి ఆకట్టుకున్నారు. తెలుగులో 22 చిత్రాలకు దర్శకత్వం వహించిన విజయ బాపినీడు చివరి చిత్రం 1998లో తెరకెక్కిన ‘కొడుకులు’. ఇటీవల చిరంజీవి రీ ఎంట్రీ తరువాత ఓ సినీ వేదిక మీద మాట్లాడిన ఆయన.. మరోసారి చిరును డైరెక్ట్ చేయాలనుందన్నారు. అయితే ఆ కోరిక తీరకుండానే ఆయన తుది శ్వాస విడిచారు. తెలుగు సినిమాకు ఎన్నో కమర్షియల్ సక్సెస్‌లను అందించటంతో పాటు చిరంజీవి టాప్ స్టార్‌గా ఎదగటంలో కీలక పాత్ర పోషించిన విజయ బాపినీడు మరణం పట్ల తెలుగు సినీ పరిశ్రమ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. అమెరికాలో ఉంటున్న విజయ బాపినీడు పెద్ద కుమార్తె వచ్చేందుకు ఆలస్యమవుతుండటంతో అంత్యక్రియలు గురువారం నిర్వహించాలని నిర్ణయించారు. హైదరాబాద్‌లోని మహా ప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.