ప్రముఖ దర్శకుడు విజయ బాపినీడు మృతికి తెలుగు రాష్ట్రాలలోని సినీ ప్రముఖలతో పాటు పలువురు రాజకీయ నాయకులు కూడా సంతాపం తెలియజేస్తున్నారు. ఈ సందర్భంగా సీనియర్ నటుడు మోహన్ బాబు సంతాప సందేశాన్ని విడుదల చేశారు. ‘విజయబాపినీడు గారి మరణం నన్ను చాలా బాధించింది. ఆయనతో నా పరిచయం నేటిది కాదు. 1990 నుంచి విజయ బాపినీడు గారు నాకు బాగా తెలుసు. నాకు అత్యంత సన్నిహిత వ్యక్తుల్లో విజయ బాపినీడు గారు కూడా ఒకరు. ఆయన రామోజీరావు గారి మయూరి సంస్థలో పని చేస్తున్న రోజుల నుంచి మంచి సాన్నిహిత్యం ఉంది.
ఎంతో మృదు స్వభావి. గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషి. విజయ బాపినీడు గారు మంచి దర్శకుడు మాత్రమే కాదు.. అంతకు మించి మంచి రచయిత.. ఎడిటర్.. అభిరుచి గల నిర్మాత. చాలా హార్డ్ వర్క్ చేస్తారు. ఆయన లాంటి గొప్ప వ్యక్తిని కోల్పోవడం తెలుగు సినిమా పరిశ్రమకు తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతున్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాన’ని తెలిపారు.
కమర్షియల్ చిత్రాల దర్శకుడిగా ఎనలేని కీర్తి సంపాందించిన విజయ బాపినీడు మృతికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. పలు విజయవంతమైన చిత్రాలు అందించడమే కాకుండా, విజయ అనే పత్రిక నడపడం ద్వారా విజయాన్ని తన ఇంటి పేరుగా మార్చుకున్న బాపినీడు తెలుగు సినీ రంగ చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోయే ముద్ర వేశారని సీఎం కొనియాడారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment