
కథానాయకుడిగా, ప్రతినాయకుడిగా వందలాది సినిమాలు చేశారు నటుడు మోహన్‌బాబు (Mohan Babu). వ్యక్తిగత, సినీ, రాజకీయ జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూసిన ఆయన ప్రస్తుతం కన్నప్ప సినిమా (Kannappa Movie)తో బిజీగా ఉన్నారు. మంచు విష్ణు హీరోగా నటిస్తున్న ఈ మూవీలో మోహన్‌బాబు కీలక పాత్ర పోషించడంతో పాటు నిర్మాతగానూ వ్యవహరిస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ డైలాగ్ కింగ్ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
అదే నా తొలి చిత్రం
మోహన్‌బాబు మాట్లాడుతూ.. నేను మొదట చూసిన సినిమా రాజమకుటం. దాసరి నారాయణరావు స్వర్గం- నరకం అనే సినిమాలో నాకు నటించే ఛాన్స్ ఇచ్చారు. అదే నా తొలి సినిమా. ఇది 25 వారాలు ఆడింది. నా గురువు దాసరిగారే భక్తవత్సలం నాయుడుగా ఉన్న నా పేరును మోహన్‌బాబుగా మార్చేశారు. నందమూరి తారక రామారావు చేతుల మీదుగా శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్ ప్రారంభమైంది. నా బ్యానర్‌లో తీసిన తొలి సినిమా ప్రతిజ్ఞ. ఎన్టీ రామారావుతో నా బ్యానర్‌లో మేజర్ చంద్రకాంత్ సినిమా చేశాను.
అనుభవంతో చెప్తున్నా..
ఆయన వద్దన్నా వినిపించుకోకుండా నా ఆస్తులు తాకట్టు పెట్టి మరీ తీశాను.. హిట్ కొట్టాను. నిర్మాతగా కొన్నిసార్లు ఫెయిలయ్యానేమోకానీ నటుడిగా మాత్రం ఎన్నడూ ఫెయిలవలేదు. అయితే సక్సెస్, ఫెయిల్యూర్ అనేవి మన చేతుల్లో ఉండవు. ఇది అనుభవంతో చెప్తున్నాను. చెత్త సినిమాలు ఆడతాయి.. కానీ బ్రహ్మాండమైన సినిమాలు ఆడవు. దానికి కారణం ఎవరూ చెప్పలేరు. మంచి పాత్ర దొరికితే సినిమా చేస్తాను. లేదంటే విద్యాలయాలు చూసుకుంటూ పిల్లలతో కాలక్షేపం చేస్తాను. అక్కినేని నాగేశ్వరరావు ఒక మాట చెప్తూ ఉండేవారు. బిడ్డల్ని కంటాం కానీ వారి తలరాత మన చేతుల్లో ఉండదు అని! కొన్నిసార్లు అది నిజమే అనిపిస్తుంది.
ట్రోలింగ్స్ చూడను
జీవితంలో కష్టసుఖాలు సర్వసాధారణం. కేవలం ఒక్క పూట భోజనం చేసిన రోజులున్నాయి. నేను ట్రోలింగ్స్ చూడను. అలాగే ట్రోలింగ్ చేసేవారినీ తప్పుపట్టడం లేదు. వారికి ఆ క్షణంలో అలాంటి ఆలోచనలు వచ్చాయి. మనం ఒకరిని తిడితే అది ఏదో ఒకరోజు మనకే తిరిగొస్తుంది. ఉడుకు రక్తంతో ఇలా చేస్తుంటారు. కానీ అది కుటుంబానికే నష్టం కలిగిస్తుందని ఆలోచించరు. వారి గురించి నేను విమర్శించను.. భయపడి సైలెంట్‌గా ఉండట్లేదు. ఒకర్ని తిడుతుంటే వారికి ఆనందంగా ఉందంటే సరే ఎంజాయ్ చేయండని వదిలేస్తున్నాను. గతంలో ఈ ట్రోలింగ్స్ లేవు అని చెప్పుకొచ్చారు.
మా అమ్మకు చెవుడు
కన్నప్ప సినిమా (Kannappa Movie) గురించి మాట్లాడుతూ.. ఇది భగవంతుడి ఆశీస్సులు. మా అమ్మకు రెండు చెవులు వినబడవు. రెండుసార్లు గర్భం నిలవకపోతే శివుడికి మొక్కుకుంది. ఆ భగవంతుడు ఐదుమంది సంతానాన్ని ఇచ్చాడు. ఆ దేవుడి ఆశీస్సులతోనే కన్నప్ప ముందుకు సాగింది. రేయింబవళ్లు చాలా కష్టపడ్డాం. ఈ సినిమా విజయం సాధిస్తుందని నమ్ముతున్నాను అని మోహన్‌బాబు ధీమా వ్యక్తం చేశారు.
చదవండి: 'టెస్ట్' సినిమా రివ్యూ.. నయనతార, మాధవన్ మెప్పించారా..?