బతుకు అర్థం తెలియచేసిన మంచి కవికి వీడ్కోలు | Telugu Film Lyricist Adrusthta Deepak Tributes | Sakshi
Sakshi News home page

బతుకు అర్థం తెలియచేసిన మంచి కవికి వీడ్కోలు

Published Mon, May 17 2021 1:01 AM | Last Updated on Mon, May 17 2021 9:42 AM

Telugu Film Lyricist Adrusthta Deepak Tributes - Sakshi

వినోదం పంచే కవులు బహుగురు. బతుకు కోరే కవులు పదుగురు. నీవు వినే మాట, పాట నీకో దారి దీపం కాగలిగితే, కవి అలా చేసి ఇవ్వగలిగితే ఆ కవిని కాలం గుర్తు పెట్టుకుంటుంది. చెప్పాల్సింది, తెలపాల్సింది ఉన్నప్పుడే రాస్తాను అని రాసి గౌరవం పొందారు అదృష్టదీపక్‌. పాట అంటే పురోగామి, చైతన్యపథగామి అని పదేపదే చెప్పారాయన. మన బతుకు అర్థవంతమై ఎదుటివారి బతుకు అర్థవంతం చేయడమే మనిషి చేయవలసింది అని బోధించిన అదృష్టదీపక్‌కు వీడ్కోలు.

‘కులం లేని మతం లేని మమతే మన పాటగా మానవత్వం చాటరా’ అని అదృష్టదీపక్‌ ‘యువతరం కదిలింది’లో తన తొలిపాటలో రాశారు. ‘ఆశయాల పందిరిలో’ అనే పల్లవితో ఉండే ఆ పాట అదృష్టదీపక్‌కు మాదాల రంగారావు ఇచ్చిన తొలిపాట. అందులోనే ఆయన పాట, తన పాట ఎలా ఉంటుందో చెప్పారు. ‘ఎరుపెక్కిన ఆశలతో తూరుపు తెల్లారింది’ అని ఆ పాటలోనే రాశారు. మనిషి సగటు ఆశలు నెరవేరాలంటే ఆ ఆశలకు ఉండాల్సిన రంగు ‘ఎరుపు’ అని ఆయన అన్యాపదేశంగా చెప్పారు. పాటను ప్రయోజనం కోసం, సందేశం కోసం రాసిన అదృష్టదీపక్‌ (71) కరోనా చికిత్స పొందుతూ కాకినాడలో ఆదివారం మరణించారు. అదృష్టదీపక్‌ శ్రీమతి పేరు స్వరాజ్యం. కుమారుడు చక్రవర్తి సినీ పరిశ్రమలో పని చేస్తున్నారు. కుమార్తె కిరణ్మయి గృహిణి.

రైతుబిడ్డ
అదృష్టదీపక్‌ది తూ.గో.జిల్లా రామచంద్రాపురం. ఆయన బాల్యం తొమ్మిదో తరగతి వరకూ రావులపాలెంలో సాగింది. తండ్రి బంగారయ్య రైతు. పొగాకు వ్యాపారం కూడా చేసేవారు. ఆయనకు నాటకాలపై ఆసక్తి ఉండేది. తల్లి సూరమ్మ అరుగు మీద తోటి స్త్రీలను కూచోపెట్టి బాలనాగమ్మ, బాల సన్యాసమ్మ లాంటి కథలను గానరూపంలో పాడి వినిపించేది. అదృష్టదీపక్‌ మీద ఆ ప్రభావం ఉంది. ఆ తర్వాత బడ్డీకొట్లకు వేళ్లాడుతూ కనిపించే చందమామ ఆయనకు పఠనాశక్తి కలిగించిది. చిన్నప్పుడు బాగా చదువుతున్నాడని స్కూలులో బహూకరించిన ‘బొమ్మల భారతం కథ’ శాశ్వత పాఠకుడిని చేసింది. ఇవన్నీ అదృష్టదీపక్‌ను సాహిత్యంవైపు తీసుకువచ్చాయి.

చరిత్ర అధ్యాపకుడు
రామచంద్రాపురంలో పి.జి చేసిన అదృష్టదీపక్‌ ద్రాక్షారామం జూనియర్‌ కళాశాలలో చరిత్ర అధ్యాపకుడిగా చేరి 28 సంవత్సరాలు పని చేసి రిటైర్‌ అయ్యారు. అయితే అందరూ లెక్చరర్స్‌కు మల్లే ఆయనకు రిటైర్‌మెంట్‌ బెనిఫిట్స్‌ పూర్తిగా రాలేదు. కొన్ని సాంకేతిక కారణాల వల్ల భారీగా పెన్షన్‌ను, బెనిఫిట్స్‌ను నష్టపోయారు. ఉత్తమ కవికి పదమే సంపద అన్నట్టు సైకిల్‌ మీద సింపుల్‌గా తిరిగేవారు. ఒకవైపు అధ్యాపకుడిగా కొనసాగుతూనే మరోవైపు కవిగా, నటుడిగా రాణించారు. ‘అరసం’, ‘ప్రజానాట్యమండలి’తో కలిసి పని చేశారు. ‘కోకిలమ్మ పదాలు’, ‘అగ్ని’, ‘సమర శంఖం’, ‘ప్రాణం’, ‘అడవి’, ‘దీపకరాగం’, ‘ఆశయాల పందిరిలో’, ‘శ్రీశ్రీ ఒక తీరని దాహం’ తదితర కవితా సంపుటాలు వెలువరించారు. విమర్శలో రాణించారు. అదృష్టదీపక్‌ సప్తతి సందర్భంగా మిత్రుల పరిచయ వ్యాసాలతో ‘దీపం’, మిత్రులతో తనకున్న పరిచయాలను ‘తె రచిన పుస్తకం’ పేర్లతో అదృష్టదీపక్‌ వెలువరించారు.

పద విన్యాసం
అదృష్టదీపక్‌కు తెలుగు భాషకు సంబంధించిన ‘గళ్ల నుడికట్టు’ను నిర్వహించడంలో అభిరుచి ఉంది. అది సరదా కోసంగానే కాక తెలుగు భాష విస్తృతిని కొత్తతరాల్లో పాదుకొల్పడానికి కూడా ఆయన నిర్వహించేవారు. గతంలో ఉదయం పత్రికలో దశాబ్ద కాలం నిర్వహించిన ఆయన ‘సాక్షి’ ప్రారంభం నుంచి ‘ఫన్‌డే’లో మరణించేనాటి వరకూ కూడా భాషా నుడికట్టును విజయవంతంగా నిర్వహించారు.

మానవత్వం పరిమళించే
అదృష్టదీపక్‌ ‘ప్రాణం’ కవితా సంపుటిని చూసిన దర్శకుడు మాదాల రంగారావు ఆయనను మద్రాసు పిలిపించి ‘యువతరం కదిలింది’ సినిమాలో అవకాశం కల్పించారు. ఆ తర్వాత టి.కృష్ణకు సన్నిహితం అయిన అదృష్టదీపక్‌ ‘నేటి భారతం’, ‘దేవాలయం’, ‘దేశంలో దొంగలు పడ్డారు’ తదితర సినిమాలకు పని చేశారు. మొత్తం 40 సినిమా పాటలు రాశారు. మద్రాసులోనే ఉంటూ అన్ని అవకాశాలను ఉపయోగించుకుని ఉంటే ఎన్ని పాటలు రాసేవారో కాని కమర్షియల్‌ పాటలు రాయడం ఇష్టం లేదని రామచంద్రాపురం తిరిగి వచ్చేశారు. ఆయనకు విశేషమైన పేరు తెచ్చిన పాట ‘నేటి భారతం’లోని ‘మానవత్వం పరిమళించే మంచి మనసుకు స్వాగతం’.

ఆ సినిమాలో వేశ్యలను సంస్కరించి ఉపాధి చూపిన ఇన్‌స్పెక్టర్‌ సుమన్‌ వారెలా ఉన్నారో చూద్దామని భార్యతో పాటు వచ్చినప్పుడు వారు పాడే పాట అది. ‘ఆ పాట రాయించే ముందు మూడ్‌ కోసం దర్శకుడు టి.కృష్ణ నన్ను ఒక రోజంతా ఎస్‌.జానకి ప్రయివేటు గీతాలు వినమన్నారు. అలాగే అమెరికాలో ఉదయ్‌శంకర్‌ చేసిన కచేరి కేసెట్‌ను కూడా వినమన్నారు. అందువల్లే ఆ పాట అంత లలితంగా వచ్చింది’ అని అదృష్టదీపక్‌ చెప్పారు. ఆ పాట వచ్చి దాదాపు ముప్పై ఏళ్లు అయినా ఏ మంచి వ్యక్తికి సంబంధించిన విశేష కార్యక్రమంలో కూడా ఆ పాటనే ప్లే చేయడం ఆనవాయితీగా వస్తోంది. అంతేకాదు మత పురుషుల మీదా ఆ పాటను ప్లే చేయడం విశేషం.

ముగిసిన శకం
రామచంద్రాపురంలో ఒక పెద్ద దిక్కుగా ఉంటూ సాహితీ ప్రోత్సాహకులుగా, మార్గదర్శిగా ఉన్న అదృష్టదీపక్‌ తన నిష్క్రమణతో ఆ ప్రాంతంలో ఒక పెద్ద శూన్యాన్ని మిగిల్చారు. తెలుగు పాట ఆదర్శదారిని గుర్తు చేసే కలంగా ఉంటూ వచ్చిన ఆయన ఇక వీడ్కోలు తీసుకోవడం కూడా ఒక పెద్దలోటు. ఆయనకు నివాళి.
– సాక్షి ఫ్యామిలీ

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement