Adrushta deepak
-
అక్షర యోధుడు అదృష్టదీపుడు
అతను ‘ఎర్రజెండా నా ఎజెండా’ అని నినదించిన నిబద్ధత గల అభ్యుదయ కవి. సినిమా పాటకు కొత్త బాట వేసిన గేయకవి. నటుడు, గాయకుడు, ఉత్తమ ఉపన్యాసకుడు. చాలామందికి తెలియని అతని పూర్తి పేరు – సత్తి అదృష్ట దీప రామకృష్ణారెడ్డి. విద్యార్థి దశలోనే శ్రీశ్రీని అభిమానించిన దీపక్ శ్రీశ్రీ గేయాలను సభల్లోనూ, సమావేశాల్లోనూ వీరావేశంతో ఆలపించేవాడు. ‘అరసం’, ప్రజా నాట్యమండలి వంటి సంస్థలలో క్రియాశీల పాత్ర పోషించాడు. ‘కోకిలమ్మ పదాలు’తో కలంపట్టిన దీపక్... ‘అగ్ని’, ‘ప్రాణం’, ‘అడవి’ కవితా సంపుటాలనూ, ‘దీపక రాగం’ సాహిత్య వ్యాస సంపుటినీ వెలువరించాడు. అతని కుటుంబ సభ్యులు ప్రచురించిన ‘దీపం’ వ్యాస సంకలనం, అభిమానులు ప్రచురించిన ‘తెరచిన పుస్తకం’ జీవిత చరమాంకంలో వెలుగుచూసిన కానుకలు! ‘సాక్షి’ ఫన్డేలో ‘పదశోధన’ పేరుతో 640 వారాలుగా నిర్వహించిన పదబంధ ప్రహేళిక శీర్షిక తెలుగు భాష మీద దీపక్‌కు ఉన్న పట్టుకు నిదర్శనం. ప్రముఖ నటుడు, నిర్మాత మాదాల రంగారావు ‘ప్రాణం’ చదివి ముగ్ధుడై ‘యువతరం కదిలింది’ (1980)లో పాటలు రాయమని పిలవడంతో అయాచితంగా అదృష్ట దీపక్ సినీ రంగంలో అడుగుపెట్టాడు. ఆ చిత్రంలో ‘ఆశయాల పందిరిలో’ అంటూ దీపక్ రాసిన పాట రెండు దశాబ్దాల పాటు నలభై సినిమా పాటల వరకు రాయడానికి దారి దీపమైంది. (చదవండి: శతతంత్రుల మాంత్రికుడు) ‘నేటి భారతం’ చిత్రం కోసం రాసిన ‘మానవత్వం పరిమళించే మంచి మనసుకు స్వాగతం...’ బహుళ ప్రాచుర్యాన్ని పొందింది. ‘ఎర్రమల్లెలు’ చిత్రం కోసం రాసిన ‘మేడే’ గీతం నేటికీ ఆ రోజున మారుమోగుతూనే ఉంది. తను నమ్మిన సిద్ధాంతాలకు విరుద్ధంగా చవకబారు పాటల్ని రాయడానికి ఇష్టపడక పోవడంవల్ల ‘నేను సైతం’ (2004) చిత్రం తర్వాత అతను చిత్ర పరిశ్రమకు దూరమయ్యాడు. ‘అక్షరాలే వేళ అగ్ని విరజిమ్మాలి’ అంటూ యువతరాన్ని ఉత్తేజపరిచిన అదృష్ట దీపక్ చిరస్మరణీయుడు. (చదవండి: కైఫియత్తులే ఇంటిపేరుగా...) – డాక్టర్ పైడిపాల, సినీ పరిశోధకుడు (మే 16న అదృష్ట దీపక్ ప్రథమ వర్ధంతి) -
బతుకు అర్థం తెలియచేసిన మంచి కవికి వీడ్కోలు
వినోదం పంచే కవులు బహుగురు. బతుకు కోరే కవులు పదుగురు. నీవు వినే మాట, పాట నీకో దారి దీపం కాగలిగితే, కవి అలా చేసి ఇవ్వగలిగితే ఆ కవిని కాలం గుర్తు పెట్టుకుంటుంది. చెప్పాల్సింది, తెలపాల్సింది ఉన్నప్పుడే రాస్తాను అని రాసి గౌరవం పొందారు అదృష్టదీపక్. పాట అంటే పురోగామి, చైతన్యపథగామి అని పదేపదే చెప్పారాయన. మన బతుకు అర్థవంతమై ఎదుటివారి బతుకు అర్థవంతం చేయడమే మనిషి చేయవలసింది అని బోధించిన అదృష్టదీపక్‌కు వీడ్కోలు. ‘కులం లేని మతం లేని మమతే మన పాటగా మానవత్వం చాటరా’ అని అదృష్టదీపక్ ‘యువతరం కదిలింది’లో తన తొలిపాటలో రాశారు. ‘ఆశయాల పందిరిలో’ అనే పల్లవితో ఉండే ఆ పాట అదృష్టదీపక్‌కు మాదాల రంగారావు ఇచ్చిన తొలిపాట. అందులోనే ఆయన పాట, తన పాట ఎలా ఉంటుందో చెప్పారు. ‘ఎరుపెక్కిన ఆశలతో తూరుపు తెల్లారింది’ అని ఆ పాటలోనే రాశారు. మనిషి సగటు ఆశలు నెరవేరాలంటే ఆ ఆశలకు ఉండాల్సిన రంగు ‘ఎరుపు’ అని ఆయన అన్యాపదేశంగా చెప్పారు. పాటను ప్రయోజనం కోసం, సందేశం కోసం రాసిన అదృష్టదీపక్ (71) కరోనా చికిత్స పొందుతూ కాకినాడలో ఆదివారం మరణించారు. అదృష్టదీపక్ శ్రీమతి పేరు స్వరాజ్యం. కుమారుడు చక్రవర్తి సినీ పరిశ్రమలో పని చేస్తున్నారు. కుమార్తె కిరణ్మయి గృహిణి. రైతుబిడ్డ అదృష్టదీపక్ది తూ.గో.జిల్లా రామచంద్రాపురం. ఆయన బాల్యం తొమ్మిదో తరగతి వరకూ రావులపాలెంలో సాగింది. తండ్రి బంగారయ్య రైతు. పొగాకు వ్యాపారం కూడా చేసేవారు. ఆయనకు నాటకాలపై ఆసక్తి ఉండేది. తల్లి సూరమ్మ అరుగు మీద తోటి స్త్రీలను కూచోపెట్టి బాలనాగమ్మ, బాల సన్యాసమ్మ లాంటి కథలను గానరూపంలో పాడి వినిపించేది. అదృష్టదీపక్ మీద ఆ ప్రభావం ఉంది. ఆ తర్వాత బడ్డీకొట్లకు వేళ్లాడుతూ కనిపించే చందమామ ఆయనకు పఠనాశక్తి కలిగించిది. చిన్నప్పుడు బాగా చదువుతున్నాడని స్కూలులో బహూకరించిన ‘బొమ్మల భారతం కథ’ శాశ్వత పాఠకుడిని చేసింది. ఇవన్నీ అదృష్టదీపక్‌ను సాహిత్యంవైపు తీసుకువచ్చాయి. చరిత్ర అధ్యాపకుడు రామచంద్రాపురంలో పి.జి చేసిన అదృష్టదీపక్ ద్రాక్షారామం జూనియర్ కళాశాలలో చరిత్ర అధ్యాపకుడిగా చేరి 28 సంవత్సరాలు పని చేసి రిటైర్ అయ్యారు. అయితే అందరూ లెక్చరర్స్‌కు మల్లే ఆయనకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ పూర్తిగా రాలేదు. కొన్ని సాంకేతిక కారణాల వల్ల భారీగా పెన్షన్‌ను, బెనిఫిట్స్‌ను నష్టపోయారు. ఉత్తమ కవికి పదమే సంపద అన్నట్టు సైకిల్ మీద సింపుల్‌గా తిరిగేవారు. ఒకవైపు అధ్యాపకుడిగా కొనసాగుతూనే మరోవైపు కవిగా, నటుడిగా రాణించారు. ‘అరసం’, ‘ప్రజానాట్యమండలి’తో కలిసి పని చేశారు. ‘కోకిలమ్మ పదాలు’, ‘అగ్ని’, ‘సమర శంఖం’, ‘ప్రాణం’, ‘అడవి’, ‘దీపకరాగం’, ‘ఆశయాల పందిరిలో’, ‘శ్రీశ్రీ ఒక తీరని దాహం’ తదితర కవితా సంపుటాలు వెలువరించారు. విమర్శలో రాణించారు. అదృష్టదీపక్ సప్తతి సందర్భంగా మిత్రుల పరిచయ వ్యాసాలతో ‘దీపం’, మిత్రులతో తనకున్న పరిచయాలను ‘తె రచిన పుస్తకం’ పేర్లతో అదృష్టదీపక్ వెలువరించారు. పద విన్యాసం అదృష్టదీపక్‌కు తెలుగు భాషకు సంబంధించిన ‘గళ్ల నుడికట్టు’ను నిర్వహించడంలో అభిరుచి ఉంది. అది సరదా కోసంగానే కాక తెలుగు భాష విస్తృతిని కొత్తతరాల్లో పాదుకొల్పడానికి కూడా ఆయన నిర్వహించేవారు. గతంలో ఉదయం పత్రికలో దశాబ్ద కాలం నిర్వహించిన ఆయన ‘సాక్షి’ ప్రారంభం నుంచి ‘ఫన్డే’లో మరణించేనాటి వరకూ కూడా భాషా నుడికట్టును విజయవంతంగా నిర్వహించారు. మానవత్వం పరిమళించే అదృష్టదీపక్ ‘ప్రాణం’ కవితా సంపుటిని చూసిన దర్శకుడు మాదాల రంగారావు ఆయనను మద్రాసు పిలిపించి ‘యువతరం కదిలింది’ సినిమాలో అవకాశం కల్పించారు. ఆ తర్వాత టి.కృష్ణకు సన్నిహితం అయిన అదృష్టదీపక్ ‘నేటి భారతం’, ‘దేవాలయం’, ‘దేశంలో దొంగలు పడ్డారు’ తదితర సినిమాలకు పని చేశారు. మొత్తం 40 సినిమా పాటలు రాశారు. మద్రాసులోనే ఉంటూ అన్ని అవకాశాలను ఉపయోగించుకుని ఉంటే ఎన్ని పాటలు రాసేవారో కాని కమర్షియల్ పాటలు రాయడం ఇష్టం లేదని రామచంద్రాపురం తిరిగి వచ్చేశారు. ఆయనకు విశేషమైన పేరు తెచ్చిన పాట ‘నేటి భారతం’లోని ‘మానవత్వం పరిమళించే మంచి మనసుకు స్వాగతం’. ఆ సినిమాలో వేశ్యలను సంస్కరించి ఉపాధి చూపిన ఇన్స్పెక్టర్ సుమన్ వారెలా ఉన్నారో చూద్దామని భార్యతో పాటు వచ్చినప్పుడు వారు పాడే పాట అది. ‘ఆ పాట రాయించే ముందు మూడ్ కోసం దర్శకుడు టి.కృష్ణ నన్ను ఒక రోజంతా ఎస్.జానకి ప్రయివేటు గీతాలు వినమన్నారు. అలాగే అమెరికాలో ఉదయ్‌శంకర్ చేసిన కచేరి కేసెట్ను కూడా వినమన్నారు. అందువల్లే ఆ పాట అంత లలితంగా వచ్చింది’ అని అదృష్టదీపక్ చెప్పారు. ఆ పాట వచ్చి దాదాపు ముప్పై ఏళ్లు అయినా ఏ మంచి వ్యక్తికి సంబంధించిన విశేష కార్యక్రమంలో కూడా ఆ పాటనే ప్లే చేయడం ఆనవాయితీగా వస్తోంది. అంతేకాదు మత పురుషుల మీదా ఆ పాటను ప్లే చేయడం విశేషం. ముగిసిన శకం రామచంద్రాపురంలో ఒక పెద్ద దిక్కుగా ఉంటూ సాహితీ ప్రోత్సాహకులుగా, మార్గదర్శిగా ఉన్న అదృష్టదీపక్ తన నిష్క్రమణతో ఆ ప్రాంతంలో ఒక పెద్ద శూన్యాన్ని మిగిల్చారు. తెలుగు పాట ఆదర్శదారిని గుర్తు చేసే కలంగా ఉంటూ వచ్చిన ఆయన ఇక వీడ్కోలు తీసుకోవడం కూడా ఒక పెద్దలోటు. ఆయనకు నివాళి. – సాక్షి ఫ్యామిలీ -
మూగబోయిన ‘దీపక్’ రాగం
అంతు తెలియని వేదనలతో అలమటించే ఆర్తజనులకు కొత్త ఊపిరి అందజేసిన ఆ స్నేహశీలిని.. పనికిరారని పారవేసిన మోడువారిన జీవితాలకు చిగురుటాశల దారి చూపిన ఆ మార్గదర్శిని.. కారుమబ్బులు ఆవరించిన కటిక చీకటి జీవితాల్లో వెలుగులు ప్రసరింపజేసిన ఆ కాంతిమూర్తిని.. కరోనా రాహువు కబళించింది. ఔను.. తన అక్షర శరాలతో సమాజ అవకరాలను చీల్చి చెండాడిన కవి, బహుముఖ ప్రజ్ఞాశాలి అదృష్ట దీపక్.. కోవిడ్‌తో మృతి చెందారన్న వార్త సాహితీలోకానికి అశనిపాతమే అయింది. మానవత్వం పరిమళించిన మంచి మనసు కలిగి.. బతుకు అర్థం తెలియజేసిన ఆ మంచి మనిíÙ.. భువిని వీడి దివికేగిపోవడంతో గోదావరి గడ్డ విషాదంలో మునిగిపోయింది. రామచంద్రపురం: ‘‘ఎర్రజెండాయే నా అజెండా’’ అంటూ అసమ సమాజం మీద అక్షర యుద్ధం ప్రకటించిన రాజీలేని కలం యోధుడు అదృష్ట దీపక్ (72). విద్యార్థి సమాఖ్య, యువజన సమాఖ్య, అభ్యుదయ రచయితల సంఘం, ప్రజానాట్య మండలి సంస్థల్లో క్రియాశీలక బాధ్యతలు నిర్వహించారు. భాషావేత్తగా, నిబద్ధ కవిగా, కథకుడిగా, బుర్రకథా రచయితగా, వ్యాసకర్తగా, కాలమిస్టుగా, విమర్శకుడిగా, ఉపన్యాసకుడిగా, నటుడిగా, గాయకుడిగా, సినీ గేయ రచయితగా అన్ని రంగాల్లోనూ బలమైన ముద్ర వేసిన ఆ బహుముఖ ప్రజ్ఞాశాలి ఇక లేరు. నాలుగు రోజుల క్రితం కరోనా బారిన పడిన అదృష్ట దీపక్ కాకినాడలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో ఆదివారం ఆయన కన్నుమూశారు. బాల్యం నుంచే.. రావులపాలెంలో 1950 జనవరి 18న జన్మించిన ఆయనకు మేనమామ అదృష్ట దీపక్ అనే పేరు పెట్టారు. కాశీ మజిలీ కథలు రెండో భాగంలో అదృష్టదీప చక్రవర్తి కథ ఉంది. వైవిధ్యంగా ఉంటుందని ఆ పేరు పెట్టారు. ఐదో తరగతి చదివేటప్పుడు మంచి మార్కులు సాధిస్తున్న దీపక్‌కు.. వేంకట పార్వతీశ్వర కవులు రచించిన ‘పిల్లల బొమ్మల భారతం’ పుస్తకం బహుమతిగా ఇచ్చారు. దీంతోపాటు ఆ రోజుల్లో చందమామ పత్రిక ఆయనను బాగా ఆకర్షించి, పఠనాసక్తి పెంచడానికి దోహదపడింది. దీపక్ మేనమామకు నాజర్ వంటి ప్రజాకళాకారులతో మంచి సంబంధాలుండేవి. తద్వారా వాళ్లందరితో సన్నిహితంగా తిరిగే అవకాశం చిన్నతనంలోనే దీపక్‌కు లభించింది. వ్యవసాయదారుడైన తండ్రి బంగారయ్య ఆలపించే రామదాసు కీర్తనలు, జానపద గీతాలు ప్రభావం చూపేవి. వీటితో పాటు దీపక్ తల్లి సూరాయమ్మ వీధి అరుగు మీద ఇరుగుపొరుగు స్త్రీలను కూర్చోబెట్టుకుని స్త్రీల పాటలు, గేయ కథలు పాడి వినిపించేది. ఈ నేప«థ్యమే దీపక్‌ను కవిగా, కళాకారుడిగా తయారు చేసింది. ఏడేళ్ల వయస్సులోనే.. కమ్యూనిస్టు కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన అదృష్ట దీపక్ ఏడేళ్ల వయస్సులోనే గాయకుడిగా, తొమ్మిదేళ్లకే నటుడిగా, పన్నెండేళ్లకే రచయితగా కళా జీవితాన్ని ప్రా రంభించారు. అనేక పత్రికలు, సంస్థలు నిర్వహించిన పోటీల్లో ఉత్తమ కవిగా, కథా రచయితగా బహుమతు లు పొందారు. నాటక పరిషత్తుల్లో ఉత్తమ నటుడిగా అవార్డులు అందుకున్నారు. ఎన్నో ప్రసిద్ధ సంకలనా ల్లో దీపక్ రచనలు చోటు చేసుకున్నాయి. బెర్ర్టోల్ట్ బ్రెహ్ట్, ప్లేటో నెరుడాల కవితలను తెలుగులోకి అనువదించారు. దీపక్ రాసిన కొన్ని కవితలను ప్రముఖ కవి నిర్మలానంద వాత్సాయన్ హిందీలోకి అనువదించారు. పత్రికల్లో శీర్షికల నిర్వహణ ఇరవయ్యెనిమిదేళ్ల పాటు కళాశాలలో చరిత్ర అధ్యాపనం చేసి రిటైరైన దీపక్.. విద్యార్థి దశలోనే జోకర్ మాసపత్రికలో ‘కాలింగ్ బెల్’ శీర్షిక నిర్వహించారు. తరువాతి కాలంలో ఉదయం దినపత్రికలో ‘పద సంపద’, చినుకు మాసపత్రికలో ‘దీపక రాగం’ శీర్షికల ద్వారా పాఠకులకు బాగా దగ్గరయ్యారు. ప్రస్తుతం ‘సాక్షి’ దినపత్రిక ఆదివారం అనుబంధం ఫన్డేలో ప్రారంభ సంచిక నుంచి ‘పదశోధన’ శీర్షిక నిర్వహిస్తున్నారు. అనేక ప్రతిష్టాత్మక సాహితీ పురస్కారాల ఎంపికలో న్యాయ నిర్ణేతగా వ్యవహరించారు. ఇరవై ఐదు సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్‌లో అనేక ప్రముఖ నాటక పరిషత్తులకు న్యాయనిర్ణేతగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 1980లో మాదాల రంగారావు తీసిన ‘యువతరం కదిలింది’ చిత్రంలో ‘ఆశయాల పందిరిలో’ గీత రచనతో సినీ రంగప్రవేశం చేసి, 40కి పైగా ప్రగతిశీలకమైన పాటలు రాశారు. కొంత కాలం కిందట ‘సాక్షి’ దినపత్రిక, నలుగురు ప్రముఖులతో నియమించిన కమిటీ.. అప్పటి వరకూ వెలువడిన 34 వేల తెలుగు సినిమా పాటల్లో 100 ఉత్తమ గీతాలను ఎంపిక చేసింది. ‘నేటి భారతం’ సినిమాకు అదృష్ట దీపక్ రాసిన ‘మానవత్వం పరిమళించే మంచి మనసుకు స్వాగతం’ అనే పాట ఆ వంద గీతాల్లో ఒకటిగా ఎంపికైంది. ఇటీవలే గుంటూరు మహిళా కళాశాలలో తెలుగు అధ్యాపకురాలిగా పని చేస్తున్న జి.స్వర్ణలత రూపొందించిన ‘అదృష్ట దీపక్ సాహిత్యం – అనుశీలన’ అనే సిద్ధాంత గ్రంథానికి ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం డాక్టరేట్ ప్రదానం చేసింది. మంచి స్నేహశీలి ‘ఆగండి నేను పోజు పెట్టొద్దా.. అప్పుడే ఫొటో తీసేస్తున్నారు..’ అంటూ నాటకోత్సవాలు, సాహితీ సభల్లో పాత్రికేయులతో ఎంతో స్నేహశీలిగా ఉంటూ జోకులతో నవ్వించేవారు. ఎప్పుడూ నవ్వుతూ.. ఎంతో స్నేహశీలిగా అదృష్ట దీపక్ అందరి మనసులలో నాటుకుపోయారు. యువ సాహితీవేత్తలను ఆయన ఎంతో ప్రోత్సహించేవారు. ఆయన ఆకస్మిక మృతిని సాహితీవేత్తలు, ఆయనతో సన్నిహితంగా ఉండేవారు జీరి్ణంచుకోలేకపోతున్నారు. దీపక్‌కు అత్యంత సన్నిహితుడైన ప్రముఖ వైద్యుడు డాక్టర్ యనమదల మురళీకృష్ణ, అదృష్టదీపక్ శాశ్వత న్యాయనిర్ణేతగా వ్యవహరించిన మయూర కళాపరిషత్ అధ్యక్ష, కార్యదర్శులు సత్తి వెంకటరెడ్డి, శృంగారం అప్పలాచార్యర్, గోదావరి కవి ర్యాలి శ్రీనివాస్, రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్‌చంద్రబోస్, మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ అమలాపురం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు తోట త్రిమూర్తులు, ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వట్టికూటి సూర్యచంద్ర రాజశేఖర్, రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి కొవ్వూరి త్రినాథ్‌రెడ్డి, పార్టీ నాయకులు తొగరు మూర్తి తదితరులు సంతాపం తెలిపిన వారిలో ఉన్నారు. ఇంతింతై... పేరు : అదృష్టదీపక్ పుట్టిన రోజు : 18–1–1950 పుట్టిన ఊరు : తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం తల్లిదండ్రులు : సూరాయమ్మ, బంగారయ్య భార్య : స్వరాజ్యం కుమారుడు : చక్రవర్తి కుమార్తె : కిరణ్మయి అదృష్ట దీపక్ విద్యాభాస్యం : 8వ తరగతి వరకూ రావులపాలెం. ఎంఏ వరకూ రామచంద్రపురం. వృత్తి : ద్రాక్షారామ పీవీఆర్ జూనియర్ కళాశాలలో చరిత్రోపన్యాసకునిగా 1979 నుంచి 2008 వరకూ పని చేసి ఉద్యోగ విరమణ పొందారు. ప్రవృత్తి : సాహిత్యం, నాటక రంగాలు, కవి, సినీ గేయ రచయిత, నాటకాలకు న్యాయనిర్ణేత, విమర్శకుడు. రచనలు : కోకిలమ్మ పదాలు పదశతకం (1972–2014), అగ్ని కవిత్వం (1974), ప్రాణం కవిత్వం (1978), సమరశంఖం బుర్రకథ (1981), అడవి కవిత్వం (2008), దీపకరాగం వ్యాసాలు (2008), ఆశయాల పందిరిలో సినిమా పాటల సంకలనం (2010), శ్రీశ్రీ ఒక తీరని దాహం – మహాకవి సంస్మరణ (2010), అదృష్ట దీపక్ క«థలు (2016), దీపం, తెరచిన పుస్తకం (2020) పురస్కారాలు ♦1984 : నేటిభారతం చిత్రంలో ‘మానవత్వం పరిమళించే మంచి మనసుకు స్వాగతం’ గీతానికి ఉత్తమ గేయ రచయితగా మద్రాసులో అప్పటి రాష్ట్రపతి డాక్టర్ శంకర్‌దయాళ్‌శర్మ చేతుల మీదుగా కళాసాగర్ అవార్డు. ♦2003 : అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చేతుల మీదుగా రాష్ట ప్రభుత్వ ఉత్తమ అధ్యాపక అవార్డు. ♦2003 : విశాలాంధ్ర స్వర్ణోత్సవ వేడుకల్లో కవి సత్కారం. ♦2004 : మోడరన్ ఫౌండేషన్ కళానిధి అవార్డు, సాహితీ పురస్కారం. ♦2004 : సినీ నటుడు తనికెళ్ల భరణి సార«థ్యంలో రావులపాలెంలో పౌర సన్మానం. ఉగాది పురస్కారం. ♦2006 : తూర్పు గోదావరి జిల్లా అధికార భాషా సమీక్ష సంఘ సభ్యునిగా నియామకం. ♦2008 : రాష్ట్ర ప్రభుత్వం రాజమండ్రిలో నిర్వహించిన నంది నాటకోత్సవాల్లో అభినందన సత్కారం. ♦2009 : అరసం విశాఖ శాఖ ఆధ్వర్యంలో పురిపండా సాహితీ పురస్కారం. ♦2010 : విజయవాడలో జరిగిన మహాకవి శ్రీశ్రీ శతజయంతి ఉత్సవాల్లో శ్రీశ్రీ సాహితీ పురస్కారం. ♦2010 : హైదరాబాద్ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఆధ్వర్యాన సృజనాత్మక సాహిత్యంలో కీర్తి పురస్కారం. ♦2010 : విశాఖపట్నం కళాభారతి ఆడిటోరియంలో జాలాది సాహితీ పురస్కారం. ♦2012 : తూర్పు గోదావరి జిల్లా కొత్తపేటలో నాటి ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ జార్జివిక్టర్ చేతుల మీదుగా శ్రీనాథ రత్న శిల్పి ఉడయార్ కళాపురస్కారం. ♦2013 : కాకినాడ సూర్యకళా మందిరంలో నాటి రాష్ట్ర మంత్రి తోట నరసింహం చేతుల మీదుగా తెలుగు నాటకరంగ దినోత్సవ పురస్కారం. ♦2017 : నంది నాటకోత్సవాల్లో న్యాయనిర్ణేతగా రాష్ట్ర ప్రభుత్వ నంది పురస్కారం. ఇవే కాకుండా 50కి పైగా వివిధ నాటక కళాపరిషత్తులలోనూ, సాహితీ సభల్లోనూ, విద్యాలయాల్లోనూ, ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్నారు. చదవండి: కానిస్టేబుల్ ప్రాణాలు కాపాడిన ఎమ్మెల్యే దుద్దుకుంట ప్రాణ వాయువుకు ఫుల్‘పవర్’ -
ఆశయాల పందిరిలో...
తెలుగు వెండి తెర మీద ఎర్రజెండాను కన్నులపండువుగా ఆవిష్కరించిన మొదటివ్యక్తి మాదాల రంగారావు. అంతవరకూ చిన్నచిన్న వేషాలకు పరిమితమైన మాదాల, ‘నవతరం పిక్చర్స్’ పతాకంపై ‘యువతరం కదిలింది’ చిత్ర నిర్మాణానికి నడుం కట్టాడు. ముందుగా అనుకున్న దర్శక, రచయితలతో అతనికి అంతగా పొసగలేదు. ఆరంభంలోనే తీవ్రమైన అభిప్రాయభేదాలు తలెత్తాయి. నా ‘ప్రాణం’ కవితా సంపుటం చదివిన మాదాల రంగారావు, తన భావాలను నిక్కచ్చిగా ప్రతిబింబించే గీతాలు నేను రాయగలననే నమ్మకంతో నన్ను మద్రాసు రమ్మని కబురు చేశాడు. నేను సినిమా పాటలు రాస్తానని కలలో కూడా అనుకోలేదు. ఎప్పుడూ అటువైపు దృష్టి పెట్ట లేదు. రంగారావు తాను నిర్మిస్తున్న ‘యువతరం కదిలింది’ చిత్రంలో ‘ఆశయాల పందిరిలో’ పాట ద్వారా నన్ను సినిమా రంగానికి పరిచయం చేశాడు. పాటతో పాటు కొన్ని సన్నివేశాలకు సంభాషణలు కూడా నా చేత రాయించాడు. నేను రాసిన పాట రికార్డింగ్ 1980 మార్చి 26న మద్రాసు విజయా గార్డెన్స్‌లో జరిగింది. పూజలూ, పురోహితులూ లేకుండా, కనీసం కొబ్బరికాయ కూడా కొట్టకుండా ప్రారంభమైన ఈ కార్యక్రమం పెద్ద సంచలనం సృష్టించింది. ‘ఇలా జరగడం మద్రాసు చలనచిత్ర చరిత్రలో ఇదే మొదటిసారి’ అంటూ పత్రికలు ఈ సంఘటనను ప్రముఖంగా పేర్కొన్నాయి. ‘ఆశయాల పందిరిలో/అనురాగం సందడిలో/ఎదలు రెండు కలిశాయి/ఏటికెదురు నిలిచాయి / కులంలేని, మతం లేని/మమతే మనబాటరా/మానవతను చాటరా’ అనే పల్లవితో ఈ పాట మొదలవుతుంది. ‘ఇల్లరికం’ సినిమాలో ‘నిలువవే వాలు కనుల దానా/వయారి హంస నడక దానా’ అనే పాట తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు ఇంత సుదీర్ఘమైన పల్లవికి ట్యూన్ చేస్తున్నట్టుగా సంగీత దర్శకుడు టి. చలపతిరావు అన్నారు. బాధ్యతలు తెలియకుండా అల్లరిచిల్లరగా తిరుగుతున్న విద్యార్థులను... సామాజిక చైతన్యం కలిగిన ఒక లెక్చరర్ (నటుడు రామకృష్ణ) మంచిదారిలో పెడతాడు. ఊరి పెద్దల కాముకత్వానికి బలైపోయిన ఒక అభాగ్యురాలిని పెళ్లి చేసుకోవడానికి అభ్యుదయ భావాలు కలిగిన ఒక యువకుడు (నటుడు నారాయణరావు ప్రస్తుతం హైదరాబాద్‌లో మధు ఫిలిం ఇన్స్టిట్యూట్ ప్రిన్సిపల్) ముందుకొస్తాడు. వాళ్లిద్దరూ ఎలాంటి ఆర్భాటం లేకుండా తమకు మార్గదర్శిగా నిలచిన లెక్చరర్ ఆధ్వర్యంలో ఆదర్శంగా దండలు మార్చుకుంటారు. ఆ సందర్భంలో సాయిచంద్ తదితర విద్యార్థులతో కలసి లెక్చరర్ ఈ పాట పాడతాడు. ‘మనసు మనసు కలిసిందా/బ్రతుకంతా మధుమాసం/మధురమైన జీవితాలు/ఆలపించు రసగీతం/తరతరాల చీకటిపై/తిరుగుబాటు జరిగింది/ఎరుపెక్కిన ఆశలతో/తూరుపు తెల్లారింది/నవ్యమైన భావాలకు/ఈనాడే శుభోదయం/నవలోకం నిర్మించే/యువశక్తికి మహోదయం’ అనే చరణాలలో యువతరం ఆశలనూ, ఆశయాలనూ అక్షరాలలోకి అనువదించాను. ముఖ్యంగా చివరి రెండు చరణాలూ భాషలోనూ, భావంలోనూ మామూలు యుగళగీతాల ధోరణికి భిన్నంగా ఉండేలా ప్రయత్నించాను. పాట జరుగుతుండగా నాయకుడు, నాయికతో కలసి సముద్ర తీరంలో నృత్యం చేస్తున్నట్టు ఊహల్లో విహరిస్తుంటాడు. ఆ సన్నివేశంలో స్వతహాగా మంచి డాన్సర్ అయిన నారాయణరావు చాల అందమైన నృత్య భంగిమలతో అలరించాడు. చరణానికీ, చరణానికీ మధ్యలో నాయిక తండ్రి (వల్లం నరసింహారావు) డప్పునూ, నాయకుడి తండ్రి (ప్రభాకరరెడ్డి) మద్దెలనూ వాయిస్తూ పోటాపోటీగా వేసిన అడుగులు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. పాట రికార్డింగ్ జరిగిన రోజే రంగారావు తన సినిమా విడుదలయ్యే తేదీ కూడా ప్రకటించాడు. ఆగస్టు 15న విడుదలైన ఈ చిత్రం, భారీ బడ్జెట్ సినిమాలను సైతం ప్రక్కకు తోసేసి ఘనవిజయం సాధించింది. తరువాత రోజులలో ఎన్నో విజయవంతమైన చిత్రాలకు పాటలు రాశాను. అవార్డులు అందుకున్నాను. అయినా మొదటిపాట ‘ఆశయాల పందిరిలో’ ఒక తీపి గుర్తుగా నిలచిపోయింది. 2010లో మహాకవి శ్రీశ్రీ శతజయంతి సందర్భంగా ఆయనకు అంకితంగా వెలువరించిన నా సినిమా పాటల సంపుటానికి ‘ఆశయాల పందిరిలో’ అని పేరు పెట్టాను. ఇటీవల ఒక సభలో కలిసిన మిత్రుడు సుద్దాల అశోక్‌తేజ ఈ పాటను ప్రస్తావించి ‘శ్రీశ్రీ గారి తరువాత సినిమాలలో అభ్యుదయగీతాల ఒరవడి కొనసాగించింది నువ్వే అన్నా!’ అని అభినందించాడు. (జనవరి 18, అదృష్ట దీపక్ సప్తతి పూర్తి సందర్భంగా) సంభాషణ: పురాణపండ వైజయంతి -
పరిమళించిన స్నేహం
తూర్పుగోదావరి జిల్లాలో రామచంద్రపురం పేరు చెప్పగానే వెంటనే గుర్తు్తకొచ్చేపేరు అదృష్ట దీపక్! అతడు స్నేహార్తితో అలమటించే వారికి ‘ఒయాసిస్సు’లాంటివాడు! ఔషధ విలువలున్న ‘కేక్టస్ మొక్క’లాంటివాడు! నేను రామచంద్రపురం హైస్కూల్లో చదివేటప్పుడు, అందరినీ ఇంటిపేర్లతోనే పిలుచుకునేవాళ్లం. ఒరేయ్ భావరాజు, గరికిపాటి, కర్రి, నల్లమిల్లి, గోగినేని, ముద్దంశెట్టి, కటకం... ఇలా ఉండేవి పిలుపులు. కానీ పేరుతో పిలిపించుకున్నవాడు ఒక్కడే – అదృష్ట దీపక్! దీపక్ అనీ, దీపూ అనీ పిలిచేవాళ్లం. మేం ఇద్దరమూ ఒకే బెంచీలో కూర్చునేవాళ్లం. యిద్దరికీ కొన్ని కామన్ టేస్టులుండేవి. ఖాళీ సమయాల్లో విద్యార్థులు అందరూ రకరకాల వ్యాపకాలతో ఉంటే, మేము పత్రికలతో, సినిమా కబుర్లతో కాలక్షేపం చేసేవాళ్లం. అప్పటికే పత్రికలలో వాడు రాసిన చిన్న చిన్న రచనలు అచ్చవుతూ ఉండేవి. ఏవేవో రాయాలని నాకు కూడా పెద్ద పెద్ద కోరికలు మొదలయ్యాయి. ఈ విషయంలో వాడే నాకు ఇన్స్పిరేషన్! ఆ వయసులో మేము పంపిన చిట్టి కథల్నీ, హాస్యరచనల్నీ ప్రచురించి జోకర్, బుడుగు, పకపకలు, నవ్వులు పువ్వులు పత్రికలు మమ్మల్ని ఎంతో ప్రోత్సహించాయి. ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి మాస్టారు కవులెందరినో తీసుకొచ్చి మా స్కూల్లో సాహిత్యసభలు ఏర్పాటు చేసేవారు. ఒకసారి విశ్వనాథ సత్యనారాయణ ప్రసంగం–మాకేమీ తలకెక్కలేదు. బయటకొచ్చేసి రాజగోపాల్ థియేటర్లో ‘ఉయ్యాల జంపాల’ సినిమాకు చెక్కేశాం. తరువాత ఒకసారి ఆరుద్రను తీసుకొచ్చారు. ఆ ఉపన్యాసం మాత్రం ఎంజాయ్ చేశాం. దీపక్ మేనమామ కళాకారుడు. మా ప్రాంతంలో కమ్యూనిస్టు పార్టీ నాయకుడు. ఆయన ప్రభావంతో దీపక్ బాలనటుడిగా రంగస్థలం మీద అనుభవం సంపాదించాడు. స్కూల్లో ప్రదర్శించే నాటికల్లో ప్రధాన పాత్రధారి మాత్రమే కాదు– దర్శకుడూ వాడే! గొల్లపూడి మారుతిరావు ‘అనంతం’ నాటికలో నాచేత వేషం వేయించి, నన్ను కూడా స్టేజ్ యాక్టర్‌ని చేశాడు. హైస్కూల్ చదువు పూర్తయ్యాక వాడు రామచంద్రపురంలోనే ఉండిపోయాడు. నేను కాకినాడ, ఆ తరువాత హైదరాబాద్ వెళ్లిపోయాను. అయినా మా స్నేహం చెక్కుచెదరకుండా ఈరోజుకీ ఎంతో ఫ్రెష్‌గా ఉంది. దీపక్ కాలేజ్ లెక్చరర్ వృత్తిలో కొనసాగాడు. రాష్ట్ర ప్రభుత్వం వారి ఉత్తమ అధ్యాపక అవార్డు అందుకున్నాడు. ఉద్యోగ జీవితంలో విద్యార్థులతో ఏర్పడిన అనుబంధాల ముందు ఈ అవార్డులు, రివార్డులు పనికిరావు అంటాడు.ప్రవృత్తిలో దీపక్ సాహిత్యం, నాటకాల వైపు మళ్లితే, నేను మేజిక్, మనస్తత్వ విశ్లేషణారంగాల వైపు మళ్లాను. మా రంగాలలో కృషికి గుర్తింపుగా తెలుగు యూనివర్సిటీవారు హైదరాబాద్‌లో మా యిద్దరికీ ఒకే వేదికమీద ‘కీర్తి’ పురస్కారాలు యిచ్చి సత్కరించడం మరపురాని అనుభవం! దీపక్ సినిమా పాటలు రాస్తున్న విషయం నాకు చాలా రోజుల తరువాత ఇంకా చెప్పాలంటే ‘మానవత్వం పరిమళించే/ మంచి మనసుకు స్వాగతం’ ఆంధ్ర దేశాన్ని పరిమళ భరితం చేసినప్పుడు మాత్రమే ఓ జర్నలిస్టు మిత్రుడి ద్వారా తెలిసింది. ఫోన్ చేసి ‘‘ఏరా నువ్వు సినిమాలకు పాటలు రాస్తున్నావా?’’ అని అడిగితే కూల్‌గా అవును అన్నాడు. ‘‘ఈసారైనా మొహమాటం విడిచిపెట్టి నలుగురినీ కలుసుకో!’’ అంటే ‘‘అవసరం లేదు’’ అన్నాడు. ‘‘వాళ్లు పిలిస్తే, వెళ్లి రాసి వస్తున్నా. అవకతవక పాటలు రాయడం నాకు యిష్టంలేదు. నాకు నచ్చితేనే రాస్తా. నచ్చకపోతే రాయనని చెప్పి వచ్చేస్తున్నా. అవకాశాల కోసం ఆఫీసుల చుట్టూ తిరిగే అలవాటు నాకు లేదు’’ అన్నాడు. ఇదీ వాడి మనస్తత్వం! కవిగా, వక్తగా, సినీగేయ రచయితగా, నాటకరంగ న్యాయనిర్ణేతగా, భాషాపరమైన గళ్లనుడికట్టు నిర్వాహకునిగా దీపక్‌కు మంచి గుర్తింపు ఉంది. ఎందరో అభిమానులున్నారు. (నేను ఎప్పుడూ అదృష్టదీపుడి అభిమానినే!) ఇన్ని ప్రత్యేకతలున్నా తన గురించి గొప్పలు చెప్పుకోడు. ‘లో ప్రొఫైల్’ మెయిన్‌టెయిన్ చేస్తాడు. డెబ్బై యేళ్ల నిత్య చైతన్య స్ఫూర్తి, మంచిమనసున్న స్నేహదీప్తి అదృష్ట దీపక్ పరిచయం నా జీవితంలో గొప్ప అదృష్టంగా భావిస్తా. సప్తతి నడుస్తున్న వేళ వాడికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. బి.వి.పట్టాభిరామ్ -
పఠాభి పదిపదుల పన్‌డుగ
వీపుమీద కళ్లు అతికించుకున్న సకల సనాతన ఛాందస సంప్రదాయవాదుల సాహిత్య పీఠాల కింద పఠాభి (1919–2006) మందుపాతరలు పేల్చాడు. జీవన వాస్తవికతకు దూరమైన భావుకత్వం మీదా, భావ కవిత్వం మీదా దండయాత్ర చేశాడు. వెన్నెలతాగే చకోరాలూ, వసంతంలో కోకిల గానాలూ, ఊహా ప్రేయసి మీద విరహ గీతాలూ– పాతబడిన భావాల మీదా, అరిగిపోయిన భాష మీదా తుపానులా విరుచుకుపడ్డాడు. ఈ సందర్భంలో కృష్ణశాస్త్రి గురించి చా.సో. చేసిన విమర్శ గుర్తుకొస్తోంది. ‘‘1936–39ల మధ్య ఒక పూటకైనా తిండికి నోచుకోని ప్రజలు దారుణమైన ఆర్థిక మాంద్యంతో అలమటించిపోయారు. అలాంటి దుర్భర పరిస్థితులలో సమాజానికి సంబంధం లేకుండా ‘దిగిరాను దిగిరాను– దివినుండి భువిపైకి’ అంటున్న కృష్ణశాస్త్రి భావాలను నేను జీర్ణించుకోలేక పోయాను’. 1939లో పఠాభి వెలువరించిన ఫిడేలు రాగాల డజన్– పేరు దగ్గర్నుంచీ వెటకారమే! వెల ‘డజన్ అర్ధణాలు’. అంకితం ‘మృణాళినికి కాదు కల్యాణికి కాదు ఇరువురికి’. విలక్షణంగా ఉన్న ఈ కావ్యాన్ని AntiPoem అన్నారు వెల్చేరు నారాయణరావు. Baffonery, Egoism, Sex were all part of my Arsenal అని ధైర్యంగా చెప్పుకొన్నాడు పఠాభి. ‘శ్రీశ్రీ, చలం, ఫ్రాయిడ్, ఐన్‌స్టీన్, వాల్ట్ విట్మన్లలోని ఒరిజినాలిటీ నన్ను బాగా ప్రభావితం చేసింది. విమర్శకూ, తిట్లకూ సిద్ధపడే ఈ రచన చేశాను’ అని కూడా వివరించాడు. 1964లో వచ్చిన పఠాభి ‘పన్’చాంగమ్– ఆధునిక తెలుగు సాహిత్యంలో సరికొత్త ప్రయోగం. శబ్దార్థాలతోనూ, శ్లేషలతోనూ చెడుగుడు ఆడేశాడు. ‘కరగ్రహణానికి ముందు ‘వేలు’ కావాలంటాడు ఈనాటి యువకుడు’ లాంటి చమత్కారాలతో ఈ పుస్తకం ఉక్కిరిబిక్కిరి చేసింది. ఈవేళ తామరతంపరగా వెలువడుతున్న లఘు కవితా రూపాలలో అక్కడక్కడ తళుక్కుమంటున్న చమత్కారాలకు స్ఫూర్తి పఠాభి పన్చాంగమే. అంత్యప్రాసల ముద్ర ఆరుద్రకు పఠాభి రచనలు ఎంతో స్ఫూర్తినిచ్చాయి. ఈ విషయం ఆరుద్రే ఒప్పుకొన్నాడు. కొంతమంది కళాకారులు అరాచకత్వంతో జీవితాన్ని కళంకితం చేసుకుంటారు. కాని పఠాభి కుటుంబం కళకు అంకితమైన ఆదర్శకుటుంబంగా పేరుపొందింది. పఠాభి, ఆయన భార్య స్నేహలత సోషలిస్టు రామ్మనోహర్ లోహియాకు అనుచరులు. స్నేహలత నటి, సామాజిక కార్యకర్త. కొడుకు కోణార్క మనోహర్ కెమెరామన్. కూతురు నందన ఇసబెలియా నటి. 1970లో యు.ఆర్.అనంతమూర్తి నవల ఆధారంగా పఠాభి నిర్మించి, దర్శకత్వం వహించిన ‘సంస్కార’ రాష్ట్రపతి స్వర్ణపతకం పొందిన మొదటి కన్నడ చిత్రంగా గుర్తింపు పొందింది. దీని విడుదల విషయంలో ఎన్నో అడ్డంకులు ఎదురయ్యాయి. అప్పటి పార్లమెంట్ మెంబర్ కొంగర జగ్గయ్య సహకారంతో ఎలాగో బయటపడింది. నక్సలైట్ ఉద్యమ నేపథ్యంలో పఠాభి తీసిన ‘చండమారుత’ పెద్ద సంచలనమే సృష్టించింది. తెలుగు చిత్రసీమతోనూ పఠాభికి విడదీయరాని సంబంధం ఉంది. మహాదర్శకుడు కె.వి. రెడ్డితో కలిసి ‘పెళ్లినాటి ప్రమాణాలు’, ‘శ్రీకృష్ణార్జున యుద్ధం’ మొదలైన సినిమాలు నిర్మించారు. ఈవేళ తొంభైయేళ్లు పైబడిన నవయువ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు పఠాభి సహచరుడే. ఇంత వైవిధ్యభరితమైన జీవితాన్ని గడిపిన పఠాభి ముందుచూపు కళారంగంలో ప్రయోగ వాదులకూ, అతినవ్యవాదులకూ దారిదీపమై నిలిచింది. -అదృష్ట దీపక్ -
నాకు నచ్చిన ఐదు పుస్తకాలు
చిన్నతనంలో ‘చందమామ’ నాలో పఠనాసక్తి పెరగడానికి కారణమైంది. పుస్తకాలు చదవడం అభిరుచి స్థాయిని దాటిపోయి వ్యసనంగా మార్పుచెందింది. వినోదం కావచ్చు– విషాదం కావచ్చు–నా ఆలోచనల్ని ఆక్రమించి ఉక్కిరిబిక్కిరి చేసిన ప్రతి రచనా నాకు ఇష్టమే! చదివిన వందలాది పుస్తకాలలోంచి నాకు నచ్చిన అయిదు పుస్తకాలను మాత్రం ఇక్కడ ప్రస్తావించే సాహసం చేస్తున్నాను. కూనలమ్మ పదాలు: కవిగా నాచేత తొలి అడుగులు వేయించిన పుస్తకం ‘కూనలమ్మ పదాలు’. మకుటం కాకుండా ఒక్కొక్కటీ పదిమాత్రల నిడివి మాత్రమే ఉన్న మూడేమూడు పాదాలతోనూ, అందమైన అంత్య ప్రాసలతోనూ నిండిన ఆ పదాలు నన్ను ఎంత గానో ఆకర్షించాయి. అచ్చమైన దేశీయ ఛందస్సులో ఆరుద్ర ప్రద ర్శించిన ఒడుపూ, చమత్కారమూ గట్టిగా పట్టుకున్నాయి. ఆ ఊపు లోనే ఈ ఛందస్సును అనుసరిస్తూ ‘కోకిలమ్మ పదాలు’ రాశాను. మహాప్రస్థానం: అప్పటి వరకూ జోకర్, బుడుగులాంటి హాస్యపత్రికల ఆస్థాన రచయితగా చలామణీ అవుతున్న నేను ‘మహా ప్రస్థానం’ ప్రభావంతో సీరియస్ కవిగా అవతారమెత్తాను. హైస్కూల్ రోజుల్లో ఆ గీతాలు పూర్తిగా అర్థం కాకపోయినా చదివిన ప్రతిసారీ ఆలోచనలనిండా విద్యుదీకరణ జరిగేది. ‘‘కష్టజీవికి ఇరువైపులా నిలబడ్డవాడే కవి’’ అని ప్రకటించి బూజుపట్టిన పాతభావాలమీద తిరుగుబాటు జెండా ఎగరేసిన సాంస్కృతిక సేనాని శ్రీశ్రీ. మఖ్దూం కవిత: కమ్యూనిస్టులు ప్రేమ భావానికి వ్యతిరేకులనే అపవాదును నిజం చేస్తూ చాలామంది అభ్యుదయ కవులు ప్రేమకవిత్వానికి దూరంగా ఉండేవారు. సున్నితమైన శృంగారాన్నీ, చుర్రుమనిపించే అంగారాన్నీ సుస్పష్టంగా కవిత్వీకరించిన వారిలో ఉర్దూ కవి మఖ్దూం మొహియుద్దీన్ ముందువరుసలో ఉంటాడు. గజ్జెల మల్లారెడ్డి, రాంభట్ల కృష్ణమూర్తి, సినారెలాంటి ప్రతిభావంతులు చేసిన అనువాదాలతో ‘మఖ్దూం కవిత’ తెలుగు పాఠకులకు దగ్గరైంది. ప్రజానాట్యమండలి కళాకారుల గళాలద్వారా మఖ్దూం గీతాలు నిత్యనూతనంగా వినిపిస్తూనే ఉంటాయి. సారస్వత వివేచన: రా.రా.గా ప్రసిద్ధుడైన మార్కి ్సస్టు మేధావి రాచమల్లు రామచంద్రారెడ్డి రచనల్లో ‘సారస్వత వివేచన’ నాకు ఇష్టమైన పుస్తకం. విమర్శ కూడా ఒక అద్భుతమైన రచనా విధానమనీ, కళాత్మకమైన సాహితీ ప్రక్రియ అనీ ఈ పుస్తకం రుజువు చేస్తుంది. సునిశితమైన అవగాహనతోనూ, తుపానువేగంతో విరుచుకుపడే వచనంతోనూ, అసాధారణమైన వాదనాపటిమతోనూ రా.రా. తెలుగులో సాహిత్య విమర్శకు కొత్త అందాలు చేకూర్చాడు. పతంజలి భాష్యం: కె.యన్.వై.పతంజలిగా అందరికీ తెలిసిన కాకర్లపూడి నారసింహ యోగ పతంజలి రచించిన ‘పతంజలి భాష్యం’ అంటే నాకు మహా ఇష్టం. సమాజంలో వివిధ రంగాల్లో విచ్చలవిడిగా బరితెగించి విహరిస్తున్న మేకవన్నె పులుల పీఠాల కింద మందుపాతరలు పేల్చిన అక్షరయోధుడు పతంజలి! పురివిప్పిన విషాదాన్నీ, కట్టలు తెంచుకున్న ఆగ్రహాన్నీ, అనితర సాధ్యమైన వ్యంగ్యవైభవంతో రంగరించి అందించిన పుస్తకం ఇది. - అదృష్టదీపక్ 94405 28155