నాకు నచ్చిన ఐదు పుస్తకాలు
చిన్నతనంలో ‘చందమామ’ నాలో పఠనాసక్తి పెరగడానికి కారణమైంది. పుస్తకాలు చదవడం అభిరుచి స్థాయిని దాటిపోయి వ్యసనంగా మార్పుచెందింది. వినోదం కావచ్చు– విషాదం కావచ్చు–నా ఆలోచనల్ని ఆక్రమించి ఉక్కిరిబిక్కిరి చేసిన ప్రతి రచనా నాకు ఇష్టమే! చదివిన వందలాది పుస్తకాలలోంచి నాకు నచ్చిన అయిదు పుస్తకాలను మాత్రం ఇక్కడ ప్రస్తావించే సాహసం చేస్తున్నాను.
కూనలమ్మ పదాలు: కవిగా నాచేత తొలి అడుగులు వేయించిన పుస్తకం ‘కూనలమ్మ పదాలు’. మకుటం కాకుండా ఒక్కొక్కటీ పదిమాత్రల నిడివి మాత్రమే ఉన్న మూడేమూడు పాదాలతోనూ, అందమైన అంత్య ప్రాసలతోనూ నిండిన ఆ పదాలు నన్ను ఎంత గానో ఆకర్షించాయి. అచ్చమైన దేశీయ ఛందస్సులో ఆరుద్ర ప్రద ర్శించిన ఒడుపూ, చమత్కారమూ గట్టిగా పట్టుకున్నాయి. ఆ ఊపు లోనే ఈ ఛందస్సును అనుసరిస్తూ ‘కోకిలమ్మ పదాలు’ రాశాను.
మహాప్రస్థానం: అప్పటి వరకూ జోకర్, బుడుగులాంటి హాస్యపత్రికల ఆస్థాన రచయితగా చలామణీ అవుతున్న నేను ‘మహా ప్రస్థానం’ ప్రభావంతో సీరియస్ కవిగా అవతారమెత్తాను. హైస్కూల్ రోజుల్లో ఆ గీతాలు పూర్తిగా అర్థం కాకపోయినా చదివిన ప్రతిసారీ ఆలోచనలనిండా విద్యుదీకరణ జరిగేది. ‘‘కష్టజీవికి ఇరువైపులా నిలబడ్డవాడే కవి’’ అని ప్రకటించి బూజుపట్టిన పాతభావాలమీద తిరుగుబాటు జెండా ఎగరేసిన సాంస్కృతిక సేనాని శ్రీశ్రీ.
మఖ్దూం కవిత: కమ్యూనిస్టులు ప్రేమ భావానికి వ్యతిరేకులనే అపవాదును నిజం చేస్తూ చాలామంది అభ్యుదయ కవులు ప్రేమకవిత్వానికి దూరంగా ఉండేవారు. సున్నితమైన శృంగారాన్నీ, చుర్రుమనిపించే అంగారాన్నీ సుస్పష్టంగా కవిత్వీకరించిన వారిలో ఉర్దూ కవి మఖ్దూం మొహియుద్దీన్ ముందువరుసలో ఉంటాడు. గజ్జెల మల్లారెడ్డి, రాంభట్ల కృష్ణమూర్తి, సినారెలాంటి ప్రతిభావంతులు చేసిన అనువాదాలతో ‘మఖ్దూం కవిత’ తెలుగు పాఠకులకు దగ్గరైంది. ప్రజానాట్యమండలి కళాకారుల గళాలద్వారా మఖ్దూం గీతాలు నిత్యనూతనంగా వినిపిస్తూనే ఉంటాయి.
సారస్వత వివేచన: రా.రా.గా ప్రసిద్ధుడైన మార్కి ్సస్టు మేధావి రాచమల్లు రామచంద్రారెడ్డి రచనల్లో ‘సారస్వత వివేచన’ నాకు ఇష్టమైన పుస్తకం. విమర్శ కూడా ఒక అద్భుతమైన రచనా విధానమనీ, కళాత్మకమైన సాహితీ ప్రక్రియ అనీ ఈ పుస్తకం రుజువు చేస్తుంది. సునిశితమైన అవగాహనతోనూ, తుపానువేగంతో విరుచుకుపడే వచనంతోనూ, అసాధారణమైన వాదనాపటిమతోనూ రా.రా. తెలుగులో సాహిత్య విమర్శకు కొత్త అందాలు చేకూర్చాడు.
పతంజలి భాష్యం: కె.యన్.వై.పతంజలిగా అందరికీ తెలిసిన కాకర్లపూడి నారసింహ యోగ పతంజలి రచించిన ‘పతంజలి భాష్యం’ అంటే నాకు మహా ఇష్టం. సమాజంలో వివిధ రంగాల్లో విచ్చలవిడిగా బరితెగించి విహరిస్తున్న మేకవన్నె పులుల పీఠాల కింద మందుపాతరలు పేల్చిన అక్షరయోధుడు పతంజలి! పురివిప్పిన విషాదాన్నీ, కట్టలు తెంచుకున్న ఆగ్రహాన్నీ, అనితర సాధ్యమైన వ్యంగ్యవైభవంతో రంగరించి అందించిన పుస్తకం ఇది.
- అదృష్టదీపక్
94405 28155