పరిమళించిన స్నేహం | Adrushta Deepak Praised By His Friend BV Pattabhiram | Sakshi
Sakshi News home page

పరిమళించిన స్నేహం

Published Mon, Oct 21 2019 12:08 AM | Last Updated on Mon, Oct 21 2019 12:08 AM

Adrushta Deepak Praised By His Friend BV Pattabhiram - Sakshi

తూర్పుగోదావరి జిల్లాలో రామచంద్రపురం పేరు చెప్పగానే వెంటనే గుర్తు్తకొచ్చేపేరు అదృష్ట దీపక్‌! అతడు స్నేహార్తితో అలమటించే వారికి ‘ఒయాసిస్సు’లాంటివాడు! ఔషధ విలువలున్న ‘కేక్టస్‌ మొక్క’లాంటివాడు! నేను రామచంద్రపురం హైస్కూల్లో చదివేటప్పుడు, అందరినీ ఇంటిపేర్లతోనే పిలుచుకునేవాళ్లం. ఒరేయ్‌ భావరాజు, గరికిపాటి, కర్రి, నల్లమిల్లి, గోగినేని, ముద్దంశెట్టి, కటకం... ఇలా ఉండేవి పిలుపులు. కానీ పేరుతో పిలిపించుకున్నవాడు ఒక్కడే – అదృష్ట దీపక్‌! దీపక్‌ అనీ, దీపూ అనీ పిలిచేవాళ్లం. మేం ఇద్దరమూ ఒకే బెంచీలో కూర్చునేవాళ్లం. యిద్దరికీ కొన్ని కామన్‌ టేస్టులుండేవి. ఖాళీ సమయాల్లో విద్యార్థులు అందరూ రకరకాల వ్యాపకాలతో ఉంటే, మేము పత్రికలతో, సినిమా కబుర్లతో కాలక్షేపం చేసేవాళ్లం. అప్పటికే పత్రికలలో వాడు రాసిన చిన్న చిన్న రచనలు అచ్చవుతూ ఉండేవి. ఏవేవో రాయాలని నాకు కూడా పెద్ద పెద్ద కోరికలు మొదలయ్యాయి. ఈ విషయంలో వాడే నాకు ఇన్‌స్పిరేషన్‌! 

ఆ వయసులో మేము పంపిన చిట్టి కథల్నీ, హాస్యరచనల్నీ ప్రచురించి జోకర్, బుడుగు, పకపకలు, నవ్వులు పువ్వులు పత్రికలు మమ్మల్ని ఎంతో ప్రోత్సహించాయి. ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి మాస్టారు కవులెందరినో తీసుకొచ్చి మా స్కూల్లో సాహిత్యసభలు ఏర్పాటు చేసేవారు. ఒకసారి విశ్వనాథ సత్యనారాయణ ప్రసంగం–మాకేమీ తలకెక్కలేదు. బయటకొచ్చేసి రాజగోపాల్‌ థియేటర్‌లో ‘ఉయ్యాల జంపాల’ సినిమాకు చెక్కేశాం. తరువాత ఒకసారి ఆరుద్రను తీసుకొచ్చారు. ఆ ఉపన్యాసం మాత్రం ఎంజాయ్‌ చేశాం. దీపక్‌ మేనమామ కళాకారుడు. మా ప్రాంతంలో కమ్యూనిస్టు పార్టీ నాయకుడు. ఆయన ప్రభావంతో దీపక్‌ బాలనటుడిగా రంగస్థలం మీద అనుభవం సంపాదించాడు. స్కూల్లో ప్రదర్శించే నాటికల్లో ప్రధాన పాత్రధారి మాత్రమే కాదు– దర్శకుడూ వాడే! గొల్లపూడి మారుతిరావు ‘అనంతం’ నాటికలో నాచేత వేషం వేయించి, నన్ను కూడా స్టేజ్‌ యాక్టర్ని చేశాడు. 

హైస్కూల్‌ చదువు పూర్తయ్యాక వాడు రామచంద్రపురంలోనే ఉండిపోయాడు. నేను కాకినాడ, ఆ తరువాత హైదరాబాద్‌ వెళ్లిపోయాను. అయినా మా స్నేహం చెక్కుచెదరకుండా ఈరోజుకీ ఎంతో ఫ్రెష్‌గా ఉంది. దీపక్‌ కాలేజ్‌ లెక్చరర్‌ వృత్తిలో కొనసాగాడు. రాష్ట్ర ప్రభుత్వం వారి ఉత్తమ అధ్యాపక అవార్డు అందుకున్నాడు. ఉద్యోగ జీవితంలో విద్యార్థులతో ఏర్పడిన అనుబంధాల ముందు ఈ అవార్డులు, రివార్డులు పనికిరావు అంటాడు.ప్రవృత్తిలో దీపక్‌ సాహిత్యం, నాటకాల వైపు మళ్లితే, నేను మేజిక్, మనస్తత్వ విశ్లేషణారంగాల వైపు మళ్లాను. మా రంగాలలో కృషికి గుర్తింపుగా తెలుగు యూనివర్సిటీవారు హైదరాబాద్‌లో మా యిద్దరికీ ఒకే వేదికమీద ‘కీర్తి’ పురస్కారాలు యిచ్చి సత్కరించడం మరపురాని అనుభవం! 

దీపక్‌ సినిమా పాటలు రాస్తున్న విషయం నాకు చాలా రోజుల తరువాత ఇంకా చెప్పాలంటే ‘మానవత్వం పరిమళించే/ మంచి మనసుకు స్వాగతం’ ఆంధ్ర దేశాన్ని పరిమళ భరితం చేసినప్పుడు మాత్రమే ఓ జర్నలిస్టు మిత్రుడి ద్వారా తెలిసింది. ఫోన్‌ చేసి ‘‘ఏరా నువ్వు సినిమాలకు పాటలు రాస్తున్నావా?’’ అని అడిగితే కూల్‌గా అవును అన్నాడు. ‘‘ఈసారైనా మొహమాటం విడిచిపెట్టి నలుగురినీ కలుసుకో!’’ అంటే ‘‘అవసరం లేదు’’ అన్నాడు. ‘‘వాళ్లు పిలిస్తే, వెళ్లి రాసి వస్తున్నా. అవకతవక పాటలు రాయడం నాకు యిష్టంలేదు. నాకు నచ్చితేనే రాస్తా. నచ్చకపోతే రాయనని చెప్పి వచ్చేస్తున్నా. అవకాశాల కోసం ఆఫీసుల చుట్టూ తిరిగే అలవాటు నాకు లేదు’’ అన్నాడు. ఇదీ వాడి మనస్తత్వం! 

కవిగా, వక్తగా, సినీగేయ రచయితగా, నాటకరంగ న్యాయనిర్ణేతగా, భాషాపరమైన గళ్లనుడికట్టు నిర్వాహకునిగా దీపక్‌కు మంచి గుర్తింపు ఉంది. ఎందరో అభిమానులున్నారు. (నేను ఎప్పుడూ అదృష్టదీపుడి అభిమానినే!) ఇన్ని ప్రత్యేకతలున్నా తన గురించి గొప్పలు చెప్పుకోడు. ‘లో ప్రొఫైల్‌’ మెయిన్‌టెయిన్‌ చేస్తాడు. డెబ్బై యేళ్ల నిత్య చైతన్య స్ఫూర్తి, మంచిమనసున్న స్నేహదీప్తి అదృష్ట దీపక్‌ పరిచయం నా జీవితంలో గొప్ప అదృష్టంగా భావిస్తా.  సప్తతి నడుస్తున్న వేళ వాడికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు.

బి.వి.పట్టాభిరామ్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement