
వీపుమీద కళ్లు అతికించుకున్న సకల సనాతన ఛాందస సంప్రదాయవాదుల సాహిత్య పీఠాల కింద పఠాభి (1919–2006) మందుపాతరలు పేల్చాడు. జీవన వాస్తవికతకు దూరమైన భావుకత్వం మీదా, భావ కవిత్వం మీదా దండయాత్ర చేశాడు. వెన్నెలతాగే చకోరాలూ, వసంతంలో కోకిల గానాలూ, ఊహా ప్రేయసి మీద విరహ గీతాలూ– పాతబడిన భావాల మీదా, అరిగిపోయిన భాష మీదా తుపానులా విరుచుకుపడ్డాడు.
ఈ సందర్భంలో కృష్ణశాస్త్రి గురించి చా.సో. చేసిన విమర్శ గుర్తుకొస్తోంది. ‘‘1936–39ల మధ్య ఒక పూటకైనా తిండికి నోచుకోని ప్రజలు దారుణమైన ఆర్థిక మాంద్యంతో అలమటించిపోయారు. అలాంటి దుర్భర పరిస్థితులలో సమాజానికి సంబంధం లేకుండా ‘దిగిరాను దిగిరాను– దివినుండి భువిపైకి’ అంటున్న కృష్ణశాస్త్రి భావాలను నేను జీర్ణించుకోలేక పోయాను’.
1939లో పఠాభి వెలువరించిన ఫిడేలు రాగాల డజన్– పేరు దగ్గర్నుంచీ వెటకారమే! వెల ‘డజన్ అర్ధణాలు’. అంకితం ‘మృణాళినికి కాదు కల్యాణికి కాదు ఇరువురికి’. విలక్షణంగా ఉన్న ఈ కావ్యాన్ని AntiPoem అన్నారు వెల్చేరు నారాయణరావు. Baffonery, Egoism, Sex were all part of my Arsenal అని ధైర్యంగా చెప్పుకొన్నాడు పఠాభి. ‘శ్రీశ్రీ, చలం, ఫ్రాయిడ్, ఐన్‌స్టీన్, వాల్ట్ విట్మన్‌లలోని ఒరిజినాలిటీ నన్ను బాగా ప్రభావితం చేసింది. విమర్శకూ, తిట్లకూ సిద్ధపడే ఈ రచన చేశాను’ అని కూడా వివరించాడు.
1964లో వచ్చిన పఠాభి ‘పన్’చాంగమ్– ఆధునిక తెలుగు సాహిత్యంలో సరికొత్త ప్రయోగం. శబ్దార్థాలతోనూ, శ్లేషలతోనూ చెడుగుడు ఆడేశాడు. ‘కరగ్రహణానికి ముందు ‘వేలు’ కావాలంటాడు ఈనాటి యువకుడు’ లాంటి చమత్కారాలతో ఈ పుస్తకం ఉక్కిరిబిక్కిరి చేసింది. ఈవేళ తామరతంపరగా వెలువడుతున్న లఘు కవితా రూపాలలో అక్కడక్కడ తళుక్కుమంటున్న చమత్కారాలకు స్ఫూర్తి పఠాభి పన్‌చాంగమే. అంత్యప్రాసల ముద్ర ఆరుద్రకు పఠాభి రచనలు ఎంతో స్ఫూర్తినిచ్చాయి. ఈ విషయం ఆరుద్రే ఒప్పుకొన్నాడు.
కొంతమంది కళాకారులు అరాచకత్వంతో జీవితాన్ని కళంకితం చేసుకుంటారు. కాని పఠాభి కుటుంబం కళకు అంకితమైన ఆదర్శకుటుంబంగా పేరుపొందింది. పఠాభి, ఆయన భార్య స్నేహలత సోషలిస్టు రామ్‌మనోహర్ లోహియాకు అనుచరులు. స్నేహలత నటి, సామాజిక కార్యకర్త. కొడుకు కోణార్క మనోహర్ కెమెరామన్. కూతురు నందన ఇసబెలియా నటి.
1970లో యు.ఆర్.అనంతమూర్తి నవల ఆధారంగా పఠాభి నిర్మించి, దర్శకత్వం వహించిన ‘సంస్కార’ రాష్ట్రపతి స్వర్ణపతకం పొందిన మొదటి కన్నడ చిత్రంగా గుర్తింపు పొందింది. దీని విడుదల విషయంలో ఎన్నో అడ్డంకులు ఎదురయ్యాయి. అప్పటి పార్లమెంట్ మెంబర్ కొంగర జగ్గయ్య సహకారంతో ఎలాగో బయటపడింది. నక్సలైట్ ఉద్యమ నేపథ్యంలో పఠాభి తీసిన ‘చండమారుత’ పెద్ద సంచలనమే సృష్టించింది.
తెలుగు చిత్రసీమతోనూ పఠాభికి విడదీయరాని సంబంధం ఉంది. మహాదర్శకుడు కె.వి. రెడ్డితో కలిసి ‘పెళ్లినాటి ప్రమాణాలు’, ‘శ్రీకృష్ణార్జున యుద్ధం’ మొదలైన సినిమాలు నిర్మించారు. ఈవేళ తొంభైయేళ్లు పైబడిన నవయువ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు పఠాభి సహచరుడే. ఇంత వైవిధ్యభరితమైన జీవితాన్ని గడిపిన పఠాభి ముందుచూపు కళారంగంలో ప్రయోగ వాదులకూ, అతినవ్యవాదులకూ దారిదీపమై నిలిచింది.
-అదృష్ట దీపక్
Comments
Please login to add a commentAdd a comment