ఫైల్‌ఫోటో
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: ‘బీసీలు అంటే వెన్నెముక. వెనుకబడిన వర్గాల వారు కాదు’ అని రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్‌మోహన్‌రెడ్డి పదే పదే చెబుతున్నారు. ఆ వర్గాలను అదే స్థాయిలో చూస్తున్నారు. పదవుల అంశంలో అంతే ప్రాధాన్యమిస్తున్నారు. బీసీలకు మంచి చేయడంలో వైఎస్సార్ సీపీ అధినేతకు యావత్ భారతదేశంలో మంచి గుర్తింపు వచ్చింది. ఆదరణ లభిస్తోంది.
‘మరి మన పార్టీలో ఏం జరిగింది. ఇప్పుడేం జరుగుతోంది. బీసీలు అన్నింటినీ బేరీజు వేసుకుంటున్నారు. మాటలతో మనం ఇంకెంత కాలం మభ్యపెట్టగలం’ అని టీడీపీ అధినేత చంద్రబాబు వద్ద ఆ పార్టీకి చెందిన సీనియర్లు వాపోయారు. గన్నవరంలో చోటుచేసుకున్న తాజా పరిణామాల నేపథ్యంలో బీసీ వర్గాల ముఖ్యనేతల అంతర్గత చర్చల్లో వచ్చిన అంశాలు అధినేత చెవికి చేరాయి. దీనిపై తీవ్రంగా కలత చెందిన చంద్రబాబు తక్షణ నష్ట నివారణ చర్యలకు ఉపక్రమించారు.
‘గన్నవరం నియోజకవర్గ ఇంచార్జి బచ్చుల అర్జునుడు తీవ్ర అస్వస్థతలో ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా తగుదునమ్మా అంటూ నేను వస్తున్నా. నేనే పోటీచేస్తా అంటూ పట్టాభిరాం అక్కడకు ఎలా వెళతారు. అర్జునుడు బీసీ వర్గానికి చెందినందునే అంత ధీమాగా, బహిరంగంగా ఆయన చాలెంజ్ చేయగలిగారు. అదే పార్టీలో బలమైన సామాజికవర్గానికి చెందిన వారు అక్కడ ఇంచార్జిగా ఉన్నట్లయితే ఆ మాట అనగలిగే వారా? సామాజికవర్గం అండ చూసుకునే రెచ్చిపోయారు. మీ దన్ను అంతలా ఉండబట్టే పట్టాభి ఆ స్థాయిలో రెచ్చిపోతున్నారనేది పార్టీలో మెజార్టీ అభిప్రాయం’ అని టీడీపీ సీనియర్లు అనడంతో చంద్రబాబు కంగుతిన్నారనేది సమాచారం.
‘క్యాడర్, క్యారక్టర్ ఏవీ పట్టించుకోకుండా ఇష్టానుసారం బూతులు మాట్లాడిన వారికి పదవులు ఇచ్చేస్తారనేది ముఖ్య శ్రేణులు భావిస్తున్నాయి. మంగళగిరి, గన్నవరం పార్టీ ఆఫీసులపై దాడులు ఎవరివల్ల జరిగాయి? ఎందువల్ల జరిగాయో మీరే విశ్లేషించుకోండి’ అని పార్టీ నాయకులు అనడంతో బాబు ఆలోచనల్లో పడ్డారని తెలిసింది. అయినా కృష్ణా జిల్లా పార్టీ అధ్యక్షుడిగా కొనకళ్ల నారాయణ, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర తదితర బీసీ వర్గానికి చెందిన నాయకులు ఉన్నారు.
గన్నవరంలో పార్టీకి ఏదైనా సమస్య ఉందని భావిస్తే అర్జునుడు తీవ్ర అస్వస్థతో ఉన్నందున కొనకళ్ల, కొల్లు, లేదా బచ్చుల కుమారుడు, మరెవరినైనా సీనియర్లను అక్కడకు పంపి ఉండవచ్చు. కానీ పట్టాభిని పంపి రెచ్చగొట్టించడాన్ని బట్టి బీసీలంటే మీకు చిన్నచూపు ఉందనే భావన ప్రజల్లోకి, పార్టీ క్యాడర్‌లోకి బాగా వెళ్లిపోయిందని వివరించడంతో బాబు కంగుతిన్నారని సీనియర్ నాయకుడు ‘సాక్షి’కి తెలిపారు. బీసీల గురించి చెప్పే మాటలకు, చేసే పనులకు పొంతన ఎంతమేరకు ఉందనేది బేరీజు వేసుకుంటున్నారని కూడా అన్నారనేది సమాచారం.
మాటలు చెపితే సరిపోదు...
‘ఎమ్మెల్సీల్లో బీసీలకు జగన్ ఇచ్చిన ప్రాధాన్యతపై మా వెనుకబడిన వర్గాల్లో బాగా చర్చ జరుగుతోంది. అంతకుముందు కూడా వివిధ పదవుల్లో దక్కిన ప్రాధాన్యతను ఇప్పటికే గుర్తించారు. ఇక నుంచి మీకు మేమంత చేశాం.. ఇంత చేసేశాం.. అని టీడీపీ చెపితే వినే దశలో బీసీ వర్గాలు లేవు. అన్నీ విశ్లేషించుకుంటున్నాయి. గణాంకాలతో సహా ముఖ్యులకే పాఠాలు అప్పజెపుతాయి’ అని విజయవాడకు చెందిన బీసీ ముఖ్య నాయకుడు ఒకరు కుండబద్దలు కొట్టారు.
గన్నవర్గానికి కో– ఆర్డినేటర్ కమిటీ
చంద్రబాబు ఆదేశాల మేరకు గన్నవరం నియోజకవర్గానికి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు శుక్రవారం కమిటీని నియమించారు. కమిటీ కో–ఆర్డినేటర్‌గా కొనకళ్ల నారాయణ, సభ్యులుగా బచ్చుల అర్జునుడు కుమారుడు బచ్చుల సుబ్రహ్మణ్యంతోపాటు మరో నలుగురికి చోటు కల్పించారు.
సీఐ కనకారావుపై చేసిన దాడిని పోలీసువర్గాలు తీవ్రంగా భావిస్తున్నాయని. టీడీపీ అల్లరిమూకలు ఇంతలా బరితెగిస్తాయని అనుకోలేదని వారంటున్నారని చంద్రబాబు దృష్టికి పలువురు తీసుకెళ్లారు. సంఘటన జరిగినప్పుడు గాయం తీవ్రత బాగా తెలిసిందని, ఏడు కుట్లు పడ్డాయని వివరించారు.
చదవండి: రామోజీ తప్పు చేస్తే ఉద్యోగులు బలిపశువులా?
Comments
Please login to add a commentAdd a comment