తెలుగు వెండి తెర మీద ఎర్రజెండాను కన్నులపండువుగా ఆవిష్కరించిన మొదటివ్యక్తి మాదాల రంగారావు. అంతవరకూ చిన్నచిన్న వేషాలకు పరిమితమైన మాదాల, ‘నవతరం పిక్చర్స్’ పతాకంపై ‘యువతరం కదిలింది’ చిత్ర నిర్మాణానికి నడుం కట్టాడు. ముందుగా అనుకున్న దర్శక, రచయితలతో అతనికి అంతగా పొసగలేదు. ఆరంభంలోనే తీవ్రమైన అభిప్రాయభేదాలు తలెత్తాయి. నా ‘ప్రాణం’ కవితా సంపుటం చదివిన మాదాల రంగారావు, తన భావాలను నిక్కచ్చిగా ప్రతిబింబించే గీతాలు నేను రాయగలననే నమ్మకంతో నన్ను మద్రాసు రమ్మని కబురు చేశాడు. నేను సినిమా పాటలు రాస్తానని కలలో కూడా అనుకోలేదు. ఎప్పుడూ అటువైపు దృష్టి పెట్ట లేదు. రంగారావు తాను నిర్మిస్తున్న ‘యువతరం కదిలింది’ చిత్రంలో ‘ఆశయాల పందిరిలో’ పాట ద్వారా నన్ను సినిమా రంగానికి పరిచయం చేశాడు. పాటతో పాటు కొన్ని సన్నివేశాలకు సంభాషణలు కూడా నా చేత రాయించాడు.
నేను రాసిన పాట రికార్డింగ్ 1980 మార్చి 26న మద్రాసు విజయా గార్డెన్స్‌లో జరిగింది. పూజలూ, పురోహితులూ లేకుండా, కనీసం కొబ్బరికాయ కూడా కొట్టకుండా ప్రారంభమైన ఈ కార్యక్రమం పెద్ద సంచలనం సృష్టించింది. ‘ఇలా జరగడం మద్రాసు చలనచిత్ర చరిత్రలో ఇదే మొదటిసారి’ అంటూ పత్రికలు ఈ సంఘటనను ప్రముఖంగా పేర్కొన్నాయి. ‘ఆశయాల పందిరిలో/అనురాగం సందడిలో/ఎదలు రెండు కలిశాయి/ఏటికెదురు నిలిచాయి / కులంలేని, మతం లేని/మమతే మనబాటరా/మానవతను చాటరా’ అనే పల్లవితో ఈ పాట మొదలవుతుంది. ‘ఇల్లరికం’ సినిమాలో ‘నిలువవే వాలు కనుల దానా/వయారి హంస నడక దానా’ అనే పాట తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు ఇంత సుదీర్ఘమైన పల్లవికి ట్యూన్ చేస్తున్నట్టుగా సంగీత దర్శకుడు టి. చలపతిరావు అన్నారు.
బాధ్యతలు తెలియకుండా అల్లరిచిల్లరగా తిరుగుతున్న విద్యార్థులను... సామాజిక చైతన్యం కలిగిన ఒక లెక్చరర్ (నటుడు రామకృష్ణ) మంచిదారిలో పెడతాడు. ఊరి పెద్దల కాముకత్వానికి బలైపోయిన ఒక అభాగ్యురాలిని పెళ్లి చేసుకోవడానికి అభ్యుదయ భావాలు కలిగిన ఒక యువకుడు (నటుడు నారాయణరావు ప్రస్తుతం హైదరాబాద్‌లో మధు ఫిలిం ఇన్‌స్టిట్యూట్ ప్రిన్సిపల్) ముందుకొస్తాడు. వాళ్లిద్దరూ ఎలాంటి ఆర్భాటం లేకుండా తమకు మార్గదర్శిగా నిలచిన లెక్చరర్ ఆధ్వర్యంలో ఆదర్శంగా దండలు మార్చుకుంటారు.
ఆ సందర్భంలో సాయిచంద్ తదితర విద్యార్థులతో కలసి లెక్చరర్ ఈ పాట పాడతాడు. ‘మనసు మనసు కలిసిందా/బ్రతుకంతా మధుమాసం/మధురమైన జీవితాలు/ఆలపించు రసగీతం/తరతరాల చీకటిపై/తిరుగుబాటు జరిగింది/ఎరుపెక్కిన ఆశలతో/తూరుపు తెల్లారింది/నవ్యమైన భావాలకు/ఈనాడే శుభోదయం/నవలోకం నిర్మించే/యువశక్తికి మహోదయం’ అనే చరణాలలో యువతరం ఆశలనూ, ఆశయాలనూ అక్షరాలలోకి అనువదించాను. ముఖ్యంగా చివరి రెండు చరణాలూ భాషలోనూ, భావంలోనూ మామూలు యుగళగీతాల ధోరణికి భిన్నంగా ఉండేలా ప్రయత్నించాను.
పాట జరుగుతుండగా నాయకుడు, నాయికతో కలసి సముద్ర తీరంలో నృత్యం చేస్తున్నట్టు ఊహల్లో విహరిస్తుంటాడు. ఆ సన్నివేశంలో స్వతహాగా మంచి డాన్సర్ అయిన నారాయణరావు చాల అందమైన నృత్య భంగిమలతో అలరించాడు. చరణానికీ, చరణానికీ మధ్యలో నాయిక తండ్రి (వల్లం నరసింహారావు) డప్పునూ, నాయకుడి తండ్రి (ప్రభాకరరెడ్డి) మద్దెలనూ వాయిస్తూ పోటాపోటీగా వేసిన అడుగులు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.
పాట రికార్డింగ్ జరిగిన రోజే రంగారావు తన సినిమా విడుదలయ్యే తేదీ కూడా ప్రకటించాడు. ఆగస్టు 15న విడుదలైన ఈ చిత్రం, భారీ బడ్జెట్ సినిమాలను సైతం ప్రక్కకు తోసేసి ఘనవిజయం సాధించింది.
తరువాత రోజులలో ఎన్నో విజయవంతమైన చిత్రాలకు పాటలు రాశాను. అవార్డులు అందుకున్నాను. అయినా మొదటిపాట ‘ఆశయాల పందిరిలో’ ఒక తీపి గుర్తుగా నిలచిపోయింది. 2010లో మహాకవి శ్రీశ్రీ శతజయంతి సందర్భంగా ఆయనకు అంకితంగా వెలువరించిన నా సినిమా పాటల సంపుటానికి ‘ఆశయాల పందిరిలో’ అని పేరు పెట్టాను. ఇటీవల ఒక సభలో కలిసిన మిత్రుడు సుద్దాల అశోక్‌తేజ ఈ పాటను ప్రస్తావించి ‘శ్రీశ్రీ గారి తరువాత సినిమాలలో అభ్యుదయగీతాల ఒరవడి కొనసాగించింది నువ్వే అన్నా!’ అని అభినందించాడు.
(జనవరి 18, అదృష్ట దీపక్ సప్తతి పూర్తి సందర్భంగా) సంభాషణ: పురాణపండ వైజయంతి
Comments
Please login to add a commentAdd a comment