lyricist writer
-
ఆదిపురుష్‌కు పని చేయడమే నేను చేసిన పెద్ద తప్పు: రచయిత
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కెరీర్లో అతిపెద్ద డిజాస్టర్ చిత్రాల్లో ఆదిపురుష్ ఒకటి. ఈ సినిమాకు వచ్చినన్ని విమర్శలు ప్రభాస్ నటించిన మరే చిత్రానికీ రాలేదు. ఆ రేంజ్లో ఈ మూవీపై ట్రోలింగ్ జరిగింది. సినిమాలో నటీనటుల గెటప్స్, డైలాగ్స్ దగ్గరినుంచి విజువల్ ఎఫెక్ట్స్ వరకు అన్నింటి మీదా విమర్శలు వచ్చాయి. ఈ సినిమాకు సంభాషణల రచయితగా పని చేసిన మనోజ్ ముంతషీర్ మీదైతే లెక్కలేనంత ట్రోల్ జరిగింది. ఆయన రాసిన ఓ డైలాగ్పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం కావడంతో దాన్ని మార్చేసి ప్రేక్షకులకు సారీ కూడా చెప్పాడు. వాళ్లకు నేను ఎప్పటికీ హీరోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన ఆదిపురుష్ వల్ల ఎదురైన ఇబ్బందులు పేర్కొన్నాడు. 'ఈ ప్రపంచం ఓ రోజు మనల్ని మంచివాడిగా చూస్తుంది. మరో రోజు చెడ్డవాడిగా చూస్తుంది. కానీ మన కుటుంబానికి మాత్రం మనం ఎప్పటికీ హీరోనే! నేనొక తప్పు చేశాను.. ఆదిపురుష్ సినిమాకు రచయితగా పనిచేసి చాలా పెద్ద తప్పు చేశాను. కానీ దాని నుంచి ఎంతో నేర్చుకున్నాను. ఇక నుంచి ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తాను. సెకండ్ ఛాన్స్ కావాలి ఆ సినిమా రిలీజయ్యాక వచ్చిన విమర్శలపై స్పందించకుండా ఉంటే బాగుండేది. అప్పటికే జనాలు నామీద కోసంతో ఊగిపోతున్నారు. అలాంటప్పుడు సంయమనంతో సైలెంట్‌గా ఉంటే అయిపోయేది. కానీ నన్ను ఇంకా ద్వేషించారు. చంపుతామని బెదిరించారు. అప్పుడు నేను విదేశాలకు వెళ్లిపోయి ఆ వివాదం సద్దుమణిగేంతవరకు అక్కడే ఉన్నాను. ఇక ఇండస్ట్రీలో ఎన్నో హిట్ సినిమాలకు పని చేసిన నాకు సెకండ్ ఛాన్స్ కావాలి. బాహుబలి హిందీ డబ్బింగ్‌తో పాటు తేరి మిట్టీ, దేశ్ మేరే వంటి ఎన్నో చిత్రాలకు రచయితగా పని చేశాను. అసలు నా పాటలు మోగకుండా రామనవమి, దీపావళి, దసరా పండగలే జరగవని నేను సగర్వంగా చెప్పగలను' అని చెప్పుకొచ్చాడు మనోజ్ ముంతషీర్. చదవండి: తినడానికి తిండి లేని రోజులు.. కన్నీళ్లు పెట్టుకున్న శోభ తల్లి -
లతా మంగేష్కర్ నా సినిమా జీవితానికి ఆమె వీసా ఇచ్చింది
‘మన జీవితంలో పండగ వచ్చినా, నిశ్చితార్థం జరిగినా, పెళ్లి వేడుక, పిల్లాడు పుట్టినా, సుప్రభాత పూజ చేస్తున్నా... ప్రతి సందర్భానికి లతా పాడిన పాట ఉంటుంది. వింటాము. లతా అలా మన జీవితంలో మనకు తెలియకుండానే నిండి పోయింది. అందుకనే ఆమె ఎప్పటికీ వినపడుతూనే ఉంటుంది’ అని గీత రచయిత గుల్జార్ అన్నారు. శనివారం జరిగిన జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్లో లతా మంగేష్కర్ మీద వెలువడ్డ తాజా పుస్తకం ‘లతాజీ– ఏ లైఫ్ ఇన్ మ్యూజిక్’ ఆవిష్కరణ సందర్భంగా గుల్జార్ మాట్లాడారు. ‘బందినిలో మొర గోర అంగ్ లైలే... నా మొదటి పాట. కాని దానికి మూడేళ్ల ముందు నుంచి లతా దీదీ సంగీత దర్శకుడు ఎస్.డి.బర్మన్తో మాట్లాడటం లేదు. ఎస్.డి.బర్మన్ కూడా ఆమెతో మాట్లాడదలుచుకోలేదు. నేనేమో పాట రాశాను. లతా నా పాటను మెచ్చి మొత్తం మీద పాడి నాకు సినిమా రంగంలో ప్రవేశానికి వీసా ఇచ్చింది. ఆ తర్వాత తను ప్రొడ్యూసర్‌గా నా దర్శకత్వంలో ‘లేకిన్’ నిర్మించింది. నేను ఆమె మీద అభిమానంతో ‘నామ్ గుమ్ జాయేగా’ (కినారా) పాట రాశాను. ఆ పాటలోని ‘మేరి ఆవాజ్ హీ పెహెచాన్ హై’ అనే లైన్‌ను మీరు ఆటోగ్రాఫ్ చేసేప్పుడు మెన్షన్ చేసేందుకు వీలుగా రాశాను అని లతాతో చెప్పాను. ఆ లైనే ఆమె బతికి ఉండగానేగాక మరణించాక ఒక అస్తిత్వంగా మారింది’ అన్నాడు. ‘లతాజీ– ఏ లైఫ్ ఇన్ మ్యూజిక్’ పుస్తక రచయిత యతీంద్ర మిశ్రా మాట్లాడుతూ ‘ఇవాళ గాయనీ గాయకులు పొందుతున్న రాయల్టీ సౌకర్యాలకు, అవార్డులకు లతా మొదలెట్టిన పోరాటమే కారణం. ఫిల్మ్‌ఫేర్ అవార్డు కొత్తల్లో గాయనీ గాయకులకు ఇచ్చేవారు కాదు. సంగీత దర్శకులకే ఇచ్చేవారు. ‘చోరి చోరి’ సినిమాలోని ‘రసిక్ బల్మా’ పాటకు శంకర్ జైకిషన్కు ఫిల్మ్‌ఫేర్ వచ్చింది. ఆ వేడుకలో ఆ పాట పాడమని జైకిషన్ లతాను పిలిచాడు. అవార్డు మీకు వచ్చింది... వెళ్లి ట్యూన్ వాయించండి సరిపోతుంది అందామె. గాయని లేకుండా పాట ఎలా? టైమ్స్ గ్రూప్ అధినేత రంగంలో దిగి ఫోన్ చేసి బతిమిలాడినా పాడలేదు. దాంతో ఇంకో రెండేళ్లకు గాయనీ గాయకులకు ఫిల్మ్‌ఫేర్ ప్రవేశపెట్టారు. రాయల్టీ విషయంలో కూడా లతా పట్టుదల వల్లే గాయనీ గాయకులకు డబ్బులు వచ్చాయి’ అని తెలియచేశాడు. లతా పాడిన పాటల వెనుక కథలు, విశేషాలతో ‘లతాజీ– ఏ లైఫ్ ఇన్ మ్యూజిక్’ వెలువడింది. -
సిరివెన్నెలను ఎక్కువగా శ్రమ పెట్టిన పాట ఏంటి..?
ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామాశాస్త్రి మంగళవారం సాయంత్రం కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన ట్విటర్లో చేరి ఏడాది పూర్తయిన సందర్భంగా 2021, జూన్‌లో నెటిజనులతో ముచ్చటించారు. ఆ వివరాలు.. ‘సిరివెన్నెలను అడగండి’ అంటూ దాదాపు గంటసేపు అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. కొన్ని ఆసక్తికరమైన ప్రశ్నలు–సమాధానాలు ఈ విధంగా.. ► అప్పట్లో ఉన్న పాటలు, సినిమాలు ఇప్పుడు ఎందుకు రావడం లేదు? ప్రతీ కాలంలోనూ పాటలు, సినిమాలు అన్నీ అన్ని రకాలుగానూ ఉన్నాయి. ఏ రకం అభిరుచి ఉన్నవాళ్ళు దాన్ని ఆస్వాదిస్తారు. భిన్నంగా ఉన్నదాన్ని గురించి విసుక్కుంటారు. మన అభిరుచికి అనుగుణంగా ఉన్న పాటలను ఎంచుకునే అవకాశం మనకు ఉంది. విసుక్కునే చేదు మాని, మన అభిరుచిని ఆస్వాదించే తీపిని చవి చూద్దాం. ► త్రివిక్రమ్‌గారు మిమ్మల్ని రాత్రి ఉదయించే సూర్యుడు అని సంబోధించడానికి కారణం? మనకు ఇష్టమైన విషయాన్ని, మనకు తోచిన విధంగా వ్యక్తీకరిస్తాం. నేను సాధారణంగా రాత్రిపూట పని చేస్తాను. కాబట్టి దానిని ఆయన భాషలో ఆయన వ్యక్తీకరించారు. ► ‘లైఫ్ ఆఫ్ రామ్..’ పాట ఒక అద్భుతం. ఆ పాటలోని మీకు నచ్చిన ఒక లైన్ గురించి... ‘ఇలాగే కడదాకా ఒక ప్రశ్నై ఉండాలనుకుంటున్నా ఏదో ఒక బదులై నను చెరపొద్దని కాలాన్ని అడుగుతు ఉన్నా’. అది నా ఆలోచనా ప్రపంచానికి కేంద్రబిందువు. ► మీరు రాసిన పాటల్లో మిమ్మల్ని అత్యధికంగా శ్రమ పెట్టిన పాట? పాట వచ్చే క్రమంలో శ్రమ అనే మాటకు చోటు లేదు ► దైవాన్ని నిర్వచించాలంటే? తనను తాను నిర్వచించుకోగలగాలి. ► మీకు బాగా నచ్చిన పుస్తకం? ‘భగవద్గీత’, ఖలీల్ జిబ్రాన్ రాసిన ‘ద ప్రాఫెట్’. ► వేటూరి సుందరరామ్మూర్తిగారికి మీరు రాసిన పాటల్లో ఏ పాట ఇష్టం? చాలా ఉన్నాయని వాళ్ళూ వీళ్ళూ అన్నారు. ‘నీలాల కన్నుల్లొ సంద్రమే, నింగి నీలమంతా సంద్రమే’ అన్న పాటను ఆయన అత్యంత ఆత్మీయంగా విశ్లేషించి మెచ్చుకున్నారని బాలు అన్నయ్య నాకు చెప్పారు. ► మీరు మెలకువగా ఉన్న సమయంలో ఎక్కువగా ఏం చేస్తుంటారు? ఇప్పుడైతే ఎక్కువగా ఐపాడ్‌తో గేమ్స్ ఆడుతూ కాలక్షేపం చేస్తున్నాను. ► ఫిలాసఫీ చూపులో ప్రపంచమో బూటకమా? మనని జీవితం అనే ప్రశ్న వెంటాడి వేధించకపోతే, ఊరికే తెలివితేటలతో మాటాడాల్సి వస్తే, ఆ వాచాలతలో బూటకమే! ► తెలుగులో ట్వీట్ చేసినవారికే బదులు ఇస్తున్నారు? తెలుగులోనే నన్ను నేను స్పష్టంగా వ్యక్తపరుచుకోగలను అన్న కారణం వల్ల. అలానే టింగ్లీషు నాకు సరిగా రాదు. ► ఏకాగ్రతకు మీ నిర్వచనం? నేను తప్ప ఇంకేం కనిపించకపోవడం, నేను తప్ప ఇంకేం అనిపించకపోవడం. ► ఒక రచయితకి ఉండాల్సిన మొదటి లక్షణం? తానేం చెప్తున్నాడో, ఎందుకు చెప్తున్నాడో తనకి స్పష్టంగా తెలియడం. ► మళ్ళీ తెలుగు సాహిత్యపు స్వర్ణయుగాన్ని చూసేదెప్పుడు? రాను రాను పద ప్రయోగాలు తగ్గిపోతూ వచ్చి ఇంగ్లీష్ లేదా యాస పాటలు వచ్చేశాయి. మీ ప్రయోగాలను, అద్భుత కావ్యాలను ఎప్పుడు చూడగలం? సాహిత్యానికి ముందు తెలుగు అనో, మరోటనో చేర్చకూడదు. భాషతో సంబంధం లేనిది భావం. భావాలనేవి అన్ని విధాలుగానూ ఉంటాయి. ధాన్యం పొట్టుతో పాటే ఉంటుంది. దూగర దులిపి, గింజను ఏరుకోవడం ఎప్పుడూ జరగాల్సిన పనే. ఎప్పుడూ మనకు కావాల్సింది ఉంటుంది. మనం చేయాల్సింది ఏరుకోవడమే. ► దేవులపల్లిగారి సాహిత్యంలో మీకు బాగా నచ్చిన కవిత? ‘మ్రోయించకోయి మురళీ, మ్రోయించకోయి కృష్ణా... తియ్య తేనియ బరువు మోయలేదీ బరువు’ – వివరణ అనేది దాహం తీర్చుకునేవారి పాత్రతను బట్టి, పాత్రను బట్టి ఉంటుంది. ► ‘సామజ వర గమనా’ అన్న సమాసం వింటే త్యాగరాజస్వామి గుర్తుకు వచ్చేవారు. ఇప్పుడు అందమైన యువతి ఊరువులు, వాటిని మోహించే యువకుడు మదిలో మెదులుతున్నారు. తప్పంతా సామాజికుడిదేనంటారా? దృశ్యంలో లేదు. చూసే కన్ను వెనకాల ఉన్న సంస్కారంలో ఉంది. ► మీరు హేతువాది అయినప్పటికీ దేవుడు ఉన్నాడని మీరు ఎలా నమ్ముతారు? నేనున్నాను గనుక. ► రచయితలు – సాంఘికీకరణపై మీ అభిప్రాయం? ‘సరిగా చూస్తున్నదా నీ మది.. గదిలో నువ్వే కదా ఉన్నది..’ చుట్టూ అద్దాలలో విడివిడి రూపాలు నువ్వు కాదంటున్నది no man is island.. ► లిరిక్స్ రాయడానికి మీకు ఫేవరెట్ ప్లేస్ ఏదైనా ఉందా? నా బుర్రలో అలజడి. ► ‘యుగయుగాలుగా ఏ మృగాల కన్నా ఎక్కువ ఏం ఎదిగాం?’ అన్నారు. నిజమా? తప్పే! మృగాలను అవమానించకూడదు. ► పాటలో నిరాశానిస్పృహలను వ్యక్తపరిచే సందర్భంలో కూడా, ఆ స్టేట్ ఆఫ్ మైండ్‌ను దాటి ఓ ఆశావాద కోణం కూడా ఇనుమడింపజేస్తూ వచ్చారు. ఆ తూకం పాటించడానికి గల ప్రత్యేకమైన కారణం ఏదైనా ఉందా? ‘కాలం గాయాన్ని మాన్పుతుంది’ అన్న సత్యాన్ని గుర్తిస్తే ఏడుపైనా, నవ్వైనా, మరేదైనా మనం చెయ్యాలనుకున్నంత సేపు చెయ్యలేం. ఇది ముందే తెలుసుకుంటే, భావాల ఉద్ధృతిని మోతాదు మించనివ్వం. ‘‘నిన్న రాత్రి పీడకలను నేడు తలుచుకుంటూ నిద్ర మానుకోగలమా? ఎంత మంచి స్వప్నమైనా అందులోనే ఉంటూ లేవకుండా ఉండగలమా?’’ ► తెలుగు భాష మీద పట్టు లేని కొంతమంది గాయకులు మీ కలం నుండి జారిన అద్భుతమైన పాటలను ఖూనీ చేసినట్టు గానీ, సంగీత దర్శకులు ఆ విషయాన్ని విస్మరించినట్టు గానీ మీకెప్పుడైనా అనిపించిందా ? బియ్యంలో రాళ్ళు ఏరుకుని వండుకుంటాం. అన్నంలో తగిలిన రాళ్ళను పక్కన పెట్టి తింటాం. ‘చూపులను అలా తొక్కుకు వెళ్ళకు...’ అని మీకూ తెలుసు... ఎవరినో ఎందుకు నిందించడం! ► మీరు ‘గాయం’లో పాడిన ‘నిగ్గదీసి అడుగు’ పాట నాకు చాలా ఇష్టం. ఇలాంటి పాటలను మళ్ళీ రాయాలని మీకు ఎందుకు అనిపించలేదు? అలాంటి భావాలున్న మిగిలిన పాటలను మీరెందుకు పరిశీలించరు? జిరాక్స్ కాపీని ఎందుకు అడుగుతున్నారు. ► ‘సిరివెన్నెలగారు’ పాటల రచయిత కాకపోయి ఉంటే? జరగాల్సిందే జరిగింది. జరగాల్సిందే జరుగుతుంది. -
బతుకు అర్థం తెలియచేసిన మంచి కవికి వీడ్కోలు
వినోదం పంచే కవులు బహుగురు. బతుకు కోరే కవులు పదుగురు. నీవు వినే మాట, పాట నీకో దారి దీపం కాగలిగితే, కవి అలా చేసి ఇవ్వగలిగితే ఆ కవిని కాలం గుర్తు పెట్టుకుంటుంది. చెప్పాల్సింది, తెలపాల్సింది ఉన్నప్పుడే రాస్తాను అని రాసి గౌరవం పొందారు అదృష్టదీపక్. పాట అంటే పురోగామి, చైతన్యపథగామి అని పదేపదే చెప్పారాయన. మన బతుకు అర్థవంతమై ఎదుటివారి బతుకు అర్థవంతం చేయడమే మనిషి చేయవలసింది అని బోధించిన అదృష్టదీపక్‌కు వీడ్కోలు. ‘కులం లేని మతం లేని మమతే మన పాటగా మానవత్వం చాటరా’ అని అదృష్టదీపక్ ‘యువతరం కదిలింది’లో తన తొలిపాటలో రాశారు. ‘ఆశయాల పందిరిలో’ అనే పల్లవితో ఉండే ఆ పాట అదృష్టదీపక్‌కు మాదాల రంగారావు ఇచ్చిన తొలిపాట. అందులోనే ఆయన పాట, తన పాట ఎలా ఉంటుందో చెప్పారు. ‘ఎరుపెక్కిన ఆశలతో తూరుపు తెల్లారింది’ అని ఆ పాటలోనే రాశారు. మనిషి సగటు ఆశలు నెరవేరాలంటే ఆ ఆశలకు ఉండాల్సిన రంగు ‘ఎరుపు’ అని ఆయన అన్యాపదేశంగా చెప్పారు. పాటను ప్రయోజనం కోసం, సందేశం కోసం రాసిన అదృష్టదీపక్ (71) కరోనా చికిత్స పొందుతూ కాకినాడలో ఆదివారం మరణించారు. అదృష్టదీపక్ శ్రీమతి పేరు స్వరాజ్యం. కుమారుడు చక్రవర్తి సినీ పరిశ్రమలో పని చేస్తున్నారు. కుమార్తె కిరణ్మయి గృహిణి. రైతుబిడ్డ అదృష్టదీపక్ది తూ.గో.జిల్లా రామచంద్రాపురం. ఆయన బాల్యం తొమ్మిదో తరగతి వరకూ రావులపాలెంలో సాగింది. తండ్రి బంగారయ్య రైతు. పొగాకు వ్యాపారం కూడా చేసేవారు. ఆయనకు నాటకాలపై ఆసక్తి ఉండేది. తల్లి సూరమ్మ అరుగు మీద తోటి స్త్రీలను కూచోపెట్టి బాలనాగమ్మ, బాల సన్యాసమ్మ లాంటి కథలను గానరూపంలో పాడి వినిపించేది. అదృష్టదీపక్ మీద ఆ ప్రభావం ఉంది. ఆ తర్వాత బడ్డీకొట్లకు వేళ్లాడుతూ కనిపించే చందమామ ఆయనకు పఠనాశక్తి కలిగించిది. చిన్నప్పుడు బాగా చదువుతున్నాడని స్కూలులో బహూకరించిన ‘బొమ్మల భారతం కథ’ శాశ్వత పాఠకుడిని చేసింది. ఇవన్నీ అదృష్టదీపక్‌ను సాహిత్యంవైపు తీసుకువచ్చాయి. చరిత్ర అధ్యాపకుడు రామచంద్రాపురంలో పి.జి చేసిన అదృష్టదీపక్ ద్రాక్షారామం జూనియర్ కళాశాలలో చరిత్ర అధ్యాపకుడిగా చేరి 28 సంవత్సరాలు పని చేసి రిటైర్ అయ్యారు. అయితే అందరూ లెక్చరర్స్‌కు మల్లే ఆయనకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ పూర్తిగా రాలేదు. కొన్ని సాంకేతిక కారణాల వల్ల భారీగా పెన్షన్‌ను, బెనిఫిట్స్‌ను నష్టపోయారు. ఉత్తమ కవికి పదమే సంపద అన్నట్టు సైకిల్ మీద సింపుల్‌గా తిరిగేవారు. ఒకవైపు అధ్యాపకుడిగా కొనసాగుతూనే మరోవైపు కవిగా, నటుడిగా రాణించారు. ‘అరసం’, ‘ప్రజానాట్యమండలి’తో కలిసి పని చేశారు. ‘కోకిలమ్మ పదాలు’, ‘అగ్ని’, ‘సమర శంఖం’, ‘ప్రాణం’, ‘అడవి’, ‘దీపకరాగం’, ‘ఆశయాల పందిరిలో’, ‘శ్రీశ్రీ ఒక తీరని దాహం’ తదితర కవితా సంపుటాలు వెలువరించారు. విమర్శలో రాణించారు. అదృష్టదీపక్ సప్తతి సందర్భంగా మిత్రుల పరిచయ వ్యాసాలతో ‘దీపం’, మిత్రులతో తనకున్న పరిచయాలను ‘తె రచిన పుస్తకం’ పేర్లతో అదృష్టదీపక్ వెలువరించారు. పద విన్యాసం అదృష్టదీపక్‌కు తెలుగు భాషకు సంబంధించిన ‘గళ్ల నుడికట్టు’ను నిర్వహించడంలో అభిరుచి ఉంది. అది సరదా కోసంగానే కాక తెలుగు భాష విస్తృతిని కొత్తతరాల్లో పాదుకొల్పడానికి కూడా ఆయన నిర్వహించేవారు. గతంలో ఉదయం పత్రికలో దశాబ్ద కాలం నిర్వహించిన ఆయన ‘సాక్షి’ ప్రారంభం నుంచి ‘ఫన్డే’లో మరణించేనాటి వరకూ కూడా భాషా నుడికట్టును విజయవంతంగా నిర్వహించారు. మానవత్వం పరిమళించే అదృష్టదీపక్ ‘ప్రాణం’ కవితా సంపుటిని చూసిన దర్శకుడు మాదాల రంగారావు ఆయనను మద్రాసు పిలిపించి ‘యువతరం కదిలింది’ సినిమాలో అవకాశం కల్పించారు. ఆ తర్వాత టి.కృష్ణకు సన్నిహితం అయిన అదృష్టదీపక్ ‘నేటి భారతం’, ‘దేవాలయం’, ‘దేశంలో దొంగలు పడ్డారు’ తదితర సినిమాలకు పని చేశారు. మొత్తం 40 సినిమా పాటలు రాశారు. మద్రాసులోనే ఉంటూ అన్ని అవకాశాలను ఉపయోగించుకుని ఉంటే ఎన్ని పాటలు రాసేవారో కాని కమర్షియల్ పాటలు రాయడం ఇష్టం లేదని రామచంద్రాపురం తిరిగి వచ్చేశారు. ఆయనకు విశేషమైన పేరు తెచ్చిన పాట ‘నేటి భారతం’లోని ‘మానవత్వం పరిమళించే మంచి మనసుకు స్వాగతం’. ఆ సినిమాలో వేశ్యలను సంస్కరించి ఉపాధి చూపిన ఇన్స్పెక్టర్ సుమన్ వారెలా ఉన్నారో చూద్దామని భార్యతో పాటు వచ్చినప్పుడు వారు పాడే పాట అది. ‘ఆ పాట రాయించే ముందు మూడ్ కోసం దర్శకుడు టి.కృష్ణ నన్ను ఒక రోజంతా ఎస్.జానకి ప్రయివేటు గీతాలు వినమన్నారు. అలాగే అమెరికాలో ఉదయ్‌శంకర్ చేసిన కచేరి కేసెట్ను కూడా వినమన్నారు. అందువల్లే ఆ పాట అంత లలితంగా వచ్చింది’ అని అదృష్టదీపక్ చెప్పారు. ఆ పాట వచ్చి దాదాపు ముప్పై ఏళ్లు అయినా ఏ మంచి వ్యక్తికి సంబంధించిన విశేష కార్యక్రమంలో కూడా ఆ పాటనే ప్లే చేయడం ఆనవాయితీగా వస్తోంది. అంతేకాదు మత పురుషుల మీదా ఆ పాటను ప్లే చేయడం విశేషం. ముగిసిన శకం రామచంద్రాపురంలో ఒక పెద్ద దిక్కుగా ఉంటూ సాహితీ ప్రోత్సాహకులుగా, మార్గదర్శిగా ఉన్న అదృష్టదీపక్ తన నిష్క్రమణతో ఆ ప్రాంతంలో ఒక పెద్ద శూన్యాన్ని మిగిల్చారు. తెలుగు పాట ఆదర్శదారిని గుర్తు చేసే కలంగా ఉంటూ వచ్చిన ఆయన ఇక వీడ్కోలు తీసుకోవడం కూడా ఒక పెద్దలోటు. ఆయనకు నివాళి. – సాక్షి ఫ్యామిలీ -
‘రజనీగంధ’ కవి యోగేష్ మృతి
‘రజనీగంధ’ సినిమా గుర్తుందా? అందులోని ‘రజనీగంధ ఫూల్ తుమ్హారే’ పాట ఇప్పటికీ సంగీత ప్రియులకి ఎంతో ఇష్టమైనది. రాజేష్ ఖన్నా నటించిన ‘ఆనంద్’ సినిమా తెలుసు కదా. అందులో ముఖేశ్ పాడిన ‘కహీ దూర్ జబ్ దిన్ ఢల్ జాయే’ పాటను ఎందరో ఇప్పటికీ కూనిరాగం తీస్తూనే ఉంటారు. ఇక ‘ఛోటీసి బాత్’లో లతా పాడిన ‘నా జానే క్యూ’ టైటిల్ సాంగ్ ప్రతి రెండోరోజూ రేడియోలో వస్తూనే ఉంటుంది. ఈ అన్ని పాటలు రాసిన సుప్రసిద్ధ సినీ గీత రచయిత యోగేష్ (77) నేడు ముంబైలో తుదిశ్వాస విడిచాడు. తక్కువ పాటలు రాసినా రాసినవి నిక్కమైన నీలాలు అని యోగేష్ పేరు పొందాడు. హిందీ పాటలలో సాధారణంగా మజ్రూ సుల్తాన్‌పురి, కైఫీ ఆజ్మీ, హస్రత్ జైపురి వంటి ఉర్దూ కవుల ప్రభావం ఎక్కువ. పాటలలో ఉర్దూపదాల వాడకం కూడా ఎక్కువ. కాని యోగేష్ తన పాటలలో హిందీపదాల ఉపయోగానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవాడు. పొదుపైన పదాలతో పాటలు రాసేవాడు. లక్నోకు చెందిన యోగేష్ తండ్రి మరణంతో 18 ఏళ్ల వయసులో ముంబై చేరుకుని సినీ రంగంలో పాటల రచయితగా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. జూనియర్ ఆర్టిస్టుగా నటించాడు. చాలాకాలం ఆయన మురికివాడల్లోనే ఒక గుడిసెలో నివసించాడు. ఆయనతోపాటు లక్నో నుంచి వచ్చిన మిత్రుడొకడు తాను సంపాదిస్తూ మిత్రుణ్ణి ఎలాగైనా సినీ రచయితగా చూడాలని సంకల్పించడంతో యోగేష్ కవిగా నిలదొక్కుకున్నాడు. సంగీత దర్శకుడు సలీల్ చౌదరి ఎక్కువగా యోగేష్‌ను ప్రోత్సహించాడు. ఆయన సంగీతంలో యోగేష్ రాసిన ‘కహి బార్ యూ భీ దేఖాహై’ (రజనీగంధ) పాడి గాయకుడు ముఖేశ్ జాతీయ పురస్కారం పొందాడు. ఎస్.డి.బర్మన్, రాజేష్ రోషన్ తదితర సంగీతదర్శకులు యోగేష్ సృజనను ఉపయోగించుకున్నవారిలో ఉన్నారు. ‘మిలి’, ‘బాతో బాతోం మే’, ‘మంజిల్’, ‘అన్నదాత’ తదితర సినిమాలలో యోగేష్ పాటలు రాశాడు. నలుగురిలో చొచ్చుకుపోయే అలవాటు లేకపోవడం వల్ల ఆయనకు ఎక్కువ పాటలు రాలేదన్న వ్యాఖ్య ఉంది. యోగేష్ గత 15 సంవత్సరాలుగా ఒంటరిగా ముంబైలో జీవిస్తున్నాడు. ఆయన భార్య ఆయనతో 30 ఏళ్ల క్రితమే విడిపోయింది. ఇద్దరు కుమార్తెలు. ఒక కుమారుడు. వారు కూడా తండ్రిని పెద్దగా చూడలేదు. సత్యేంద్ర త్రిపాఠి అనే గాయకుడు ఆయన బాగోగులు చూస్తూ వచ్చాడు. ఆయన ద్వారానే యోగేష్ మరణవార్త లోకానికి తెలిసింది. యోగేష్ పట్ల గాయని లతా మంగేష్కర్‌కు అమిత అభిమానం ఉంది. ‘ఆయన రాసిన చాలా మంచి పాటలు నేను పాడాను. ఆయన మరణవార్త విని బాధ కలిగింది. ఆయన శాంత స్వభావం ఉన్నవాడు. ఆయనకు నా శ్రద్ధాంజలి’ అని ఆమె ట్వీట్ చేసింది. యోగేష్‌ను సినిమా ఇండస్ట్రీ ఎప్పుడో మర్చిపోయింది. కాని ఆయన పాటలు మాత్రం అభిమానులకు ఎప్పటికీ గుర్తుంటాయి. -
ఫాదర్ కంటే ముందు మదర్ ఉండాలి కదా?
11 ఏళ్ల ప్రాయం నుండే తన పాటలతో సాహితి దిగ్గజాలతో శభాష్ అనిపించుకున్న సినీగేయ రచయిత సీహెచ్ అనంతశ్రీరామ్ శుక్రవారం గుంటూరు విచ్చేశారు. హిందూ కళాశాల వార్షికోత్సవంలో విద్యా పురస్కారం అందుకున్న అనంతరం అనంత శ్రీరామ్ “సాక్షి’తో తన అంతరంగాన్ని పంచుకున్నారు. ఆయన మాటల్లోనే.. సాక్షి, గుంటూరు : నాకు చిన్ననాటి నుంచి సాహిత్యంపై ఎనలేని అభిరుచి. ప్రత్యేకంగా గురువు ఎవరూ లేకపోయినా మా పాఠశాలలోని తెలుగు మాస్టారు, గొప్ప పండితులతో పరిచయాలు నాలోని సాహితి తృష్ణకు పదును పెట్టాయి. మా నాన్న తరచూ పద్య గానం చేసేవారు.. అవే నాకు ప్రేరణ. నాకు భాష మీద కన్నా భావం మీద పట్టు ఎక్కువ. తెలిసిన భాషలో భావాన్ని వ్యక్తం చేయడమే నా విజయానికి సోపానం. ఇప్పటికి ఎన్ని చిత్రాలకు పాటలు రాశానో గుర్తులేదు కానీ 1006 పాటలు పూర్తయ్యాయి. సాహసం శ్వాసగా సాగిపో చిత్రంలో నేను రచించిన.. తాను నేను అన్నపాట నాకు బాగా ఇష్టమైంది. సిరివెన్నెల సీతారామశాస్త్రి, వేటూరి నా అభిమాన రచయితలు. దేశభక్తి జోడించిన సినిమాలు ఎక్కువగా ఇష్టపడతాను. పాటపాటకు కొత్తదనం ఉండాలనేది నా తపన. నాకు కొత్తగా అనిపిస్తేనే కాగితం మీద పెడతాను. సినిమా రంగంలో పాటలు రాసేటప్పుడు ఓ ప్రత్యేక పరిస్థితి ఎదుర్కొంటుంటాం. ఒక సిట్టింగ్‌లో భక్తి పాట రాసి వెంటనే మరో సిట్టింగ్‌లో రక్తి పాట రాయాల్సివస్తోంది. నిర్మాత, దర్శకులు ఏది అడిగితే అది రాయగలగాలి. అదే పాటకు, సినిమా పాటకు తేడా. ఏడాదికి వెయ్యి పాటలు సినీ పరిశ్రమకు అవసరమైతే దర్శకుడు కోరుకున్న విధంగా రాయగలిగే రచయితలు పట్టుమని పది మందే ఉన్నారు. కాబట్టే రచయితల మధ్య పోటీ తక్కువ. సినిమా రంగంలో ఎదగాలంటే గాడ్ ఫాదర్స్ తప్పక ఉండాలన్నది నిజం కాదు. ఫాదర్ కంటే ముందు మదర్ ఉండాలి కదా?. నెసెసిటీ ఆఫ్ ఇన్వెన్షన్ అన్న నానుడి అనుసరించి గాడ్ ఫాదర్ లేకపోయిన రచయిత తన ప్రతిభతో ముందుకు వెళ్లగలడు. సామాజిక రుగ్మతలు పెరిగాయి నా విషయానికి వస్తే ఓటేస్తావా అనే పాట నా మదిలో నుంచి రాగానే అప్పటికప్పుడు బల్లపై వేళ్లతో మ్యూజిక్ కొడుతూ పాడాను. అది సామాజిక మాధ్యమాల్లో ఎంత హిట్ కొట్టిందో మీ అందరికీ తెలుసు. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాల వల్ల మెతుకు సంపాదించడం కోసం బతుకంతా కష్టపడాల్సిన పరిస్థితులు నేడు సామాన్యులకు లేవు. అయితే కడుపు నిండక పోతే వంద సమస్యలు.. నిండితే కోటి సమస్యలు అన్న విధంగా నేటి సామాజిక రుగ్మతలు పెరిగాయి. మద్యం మహమ్మారితో సమస్యలు, ప్రేమ పేరుతో జరిగే అఘాయిత్యాలు ఎన్నో చోటుచేసుకుంటున్నాయి. గతంలో తాగేవాడిని వెలివేస్తే నేడు తాగని వారిని వెలివేస్తున్నారు. సినిమా వ్యాపారాత్మక కళ, కళాత్మకమైన వ్యాపారం. దీంతో నిర్మాత, దర్శకులు సగటు యువకుడు ఏమి కోరుకుంటున్నాడో కథా వస్తువుగా తీసుకొని సినిమా తీయాల్సిన పరిస్థితి. ప్రేమ విఫలమై కొందరు యువత ఆత్మహత్య చేసుకుంటున్నారు అనే అంశంపై అనంత శ్రీరామ్ మాట్లాడుతూ ప్రేమించేటప్పుడు కెరీర్‌ను కలుపుకుంటే ఇలాంటివి జరగవు. ప్రేమే జీవితం కాదు. ప్రియురాలితో పాటు మన చుట్టూ ఉన్న బంధాలను సంతోష పెట్టాలి. -
ఇంద్రగంటి కన్నుమూత
హైదరాబాద్ : దాదాపు నాలుగున్నర దశాబ్దాలు సాహిత్య, పత్రికా రంగాల్లో విశేష సేవలందించిన ప్రముఖ రచయిత, కవి ఇంద్రగంటి శ్రీకాంత శర్మ (75) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ నేరేడ్మెట్లోని ఆయన స్వగృహంలో గురువారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. దీంతో ఆయన నివాసం వద్ద విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబసభ్యులతోపాటు బంధువులు, సన్నిహితులు శోకసంద్రంలో మునిగారు. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురంలో ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి, వెంకటరత్నమ్మ దంపతుల మూడో కొడుకు శ్రీకాంత శర్మ. విజయవాడలో చాలా కాలంపాటు ఆయన జర్నలిస్టుగా పనిచేశారు. ఇంద్రగంటి భార్య ప్రముఖ రచయిత్రి జానకీబాల, కొడుకు ప్రముఖ సినీ దర్శకులు ఇంద్రగంటి మోహన్‌కృష్ణ. కాగా, బంధువులు, సన్నిహితుల సమక్షంలో గురువారం సాయంత్రం అల్వాల్‌లో అంత్యక్రియలు నిర్వహించారు. అంతకుముందు, ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, సినీనటులు నరేష్, తనికెళ్ల భరణి, షఫి, పవిత్రలోకేష్, సాహిత్య రంగ ప్రముఖులు శ్రీరమణ, పతంజలిశాస్త్రి, సుధామ, శారదాశ్రీనివాస్ తదితరులు ఇంద్రగంటి పార్థివ దేహం వద్ద నివాళులర్పించి, మోహన్‌కృష్ణ, ఇతర కుటుంబసభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అభ్యుదయ కవి, సాహితీవేత్త.. 1944 మే 29న జన్మించిన ఇంద్రగంటికి.. తండ్రి హనుమత్ శాస్త్రి సుప్రసిద్ధ కవి కావడంతో సహజంగానే సాహిత్యం ఒంటబట్టింది. విద్యార్థి దశనుంచే ఆయన రచనావ్యాసాంగాన్ని చేపట్టారు. చిన్నవయసులోనే అభ్యుదయ కవిగా ప్రసిద్ధులయ్యారు. ఆ తర్వాత ఆంధ్రజ్యోతి వారపత్రికలో సబ్ఎడిటర్గా పనిచేశారు. 1976లో ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో సహాయ సంపాదకుడిగా బాధ్యతలు నిర్వహించారు. రేడియోలో నాటికలు, డాక్యుమెంటరీలు, సంగీత రూపకాలకు ప్రాణం పోశారు. ఆ తర్వాత ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రికకు సంపాదకులుగా కూడా ఇంద్రగంటి శ్రీకాంత శర్మ పనిచేశారు. ఇటీవలే ఆయన ’ఇంటిపేరు ఇంద్రగంటి’పేరుతో తన ఆత్మకథను వెలువరించారు. గత యాభై సంవత్సరాల్లో తానెరిగిన సాహిత్య జీవితాన్ని, అలాగే తన కుటుంబ విశేషాలను, రచయితగా తన అనుభవాలను కలగలిపి ఈ ఆత్మ కథ రాసి 2018 జనవరిలో విడుదల చేశారు. దాదాపు నాలుగున్నర దశబ్దాల సాహితీ ప్రస్థానంలో కవిత్వం, విమర్శలు, నాటకాలు, నవలలు 20కిపైగా పుస్తకాలు రాశారు. రచయితగా, కవిగా, పాత్రికేయుడిగా, సంపాదకులుగా ఆయన సాహిత్యరంగంలో చేసిన సేవలకుగాను పలు జాతీయ స్థాయి పురస్కారాలు, వివిధ సంస్థల నుంచి అవార్డులను అందుకున్నారు. తెలుగు సాహిత్యంలో గుడిపాటి వెంకటాచలం, కృష్ణశాస్త్రి, శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి, శ్రీశ్రీ, బుచ్చిబాబు, బాల గంగాధర్ తిలక్, విశ్వనాథశాస్త్రి, అజంతా రచనలతో ఆయన బాగా ప్రభావితమయ్యారు. ‘ఈ ప్రపంచంలో సర్వవిశ్వాసాలకి, చర్యలకి, వ్యక్తి కేంద్రమని నేను నమ్ముతాను. సెయింట్ కావచ్చు, సిన్నర్ కావచ్చు. వ్యక్తి సమూహాలను శాసిస్తాడని నా విశ్వాసం అయితే ఏ ఒక్క విశ్వాసమూ పరిపూర్ణ సత్యం కాదు. సాపేక్ష సత్యమే. అందుచేత సాహిత్య పఠనం, రచనా వ్యాసంగంలోకి మనసు పెట్టే వాళ్లు, తమ మనసులకుండే కిటికీలు తెరిచిపెట్టడం అవసరం. పాత విశ్వాసాలు కొట్టుకుపోవాల్సి రావచ్చు. కొత్త విశ్వాసాలు దూసుకురావచ్చు. మనసులోకి వెలుతురుతాకే అవకాశం ముఖ్యం. దాన్ని మూసి పెట్టకూడదు’అని ఓ సందర్భంలో ఇంద్రగంటి శ్రీకాంతశర్మ చేసిన ప్రతిపాదన నేటి రచయితలకు ఓ దీపస్తంభం లాంటిది. నెలవంక నుంచి సమ్మోహనం వరకు శ్రీకాంత శర్మ 20కి పైగా సినిమాలకు పాటలు కూడా రాశారు. జంధ్యాల దర్శకత్వం వహించిన ’నెలవంక’చిత్రంలో 6పాటలు రాశారు. ఇందులో ’ఏది మతం’పాటకు జాతీయ అవార్డు వస్తుందని అనుకున్నారు. ఆ తర్వాత జంధ్యాల దర్శకత్వంలోనే ’పుత్తడిబొమ్మ’సినిమాకు రెండు పాటలు, ’రావు–గోపాల్‌రావు’చిత్రంలో ఓ పాట రాశారు. ’కృష్ణమూర్తి కుక్కపిల్లలు’అనే టెలీఫిలిం కోసం ఓ పాట రాశారు. తనయుడు మోహనకృష్ణ దర్శకత్వం వహించిన ’గోల్కొండ హైస్కూల్’సినిమాలో ’ఏనాటివో రాగాలు’పాటను, ‘అంతకు ముందు ఆ తర్వాత’చిత్రంలో ’నా అనురాగం’పాటను, ’సమ్మోహనం’లో ’మనసైనదేదో’పాటను రాశారు. 74 సంవత్సరాల వయసులో ఆరోగ్యం సహకరించని పరిస్థితుల్లోనూ ’సమ్మోహనం’కోసం ఆయన రాసిన ఫుల్ రొమాంటిక్ సాంగ్ అందరినీ ఆకట్టుకుంది. -
రచనల్లో జీవించే ఉంటారు
రొమాంటిక్ సాంగ్ రాయాలంటే మంచి వయసులో ఉండాలా? ఉంటేనే రాయగలుగుతారా? అలాంటిదేం లేదు. మనసులో భావాలు మెండుగా ఉండాలే కానీ ఏ వయసులోనైనా ప్రేమ పాటలు రాయొచ్చు. అందుకు ఉదాహరణగా నిలిచినవాళ్లల్లో ఇంద్రగంటి శ్రీకాంత శర్మ ఒకరు. 74 ఏళ్ల వయసులో ఆయన కలం నుంచి ‘మనసైనదేదో..’ అనే ప్రేమ పాట కాగితం మీదకు వచ్చింది. ప్రేక్షకులను సమ్మోహనపరిచింది. ఆరోగ్యం సరిగ్గా లేని సమయంలోనూ ‘సమ్మోహనం’ కోసం ఆయన ఈ పాట రాయడం విశేషం. ఇదే శ్రీకాంత శర్మ రాసిన చివరిపాట. ఎన్నో అద్భుతమైన రచనలను మిగిల్చి, ఎప్పటికీ రచనల్లో గుర్తుండిపోయే ప్రముఖ కవి, సాహితీవేత్త ఇంద్రగంటి శ్రీకాంత శర్మ గురువారం తెల్లవారుఝామున తుది శ్వాస విడిచారు. ఏడాది కాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న శ్రీకాంత శర్మ తన స్వగృహంలోనే నిద్రలో కన్ను మూశారు. 1944, మే 29న తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురంలో జన్మించారాయన. శ్రీకాంతశర్మ తండ్రి ఇంద్రగంటి హనమచ్ఛాస్త్రి మహా పండితులు. తండ్రి బాటలోనే సాహిత్య రంగంపై తనదైన ముద్రవేశారు. కవిత్వం, లలిత గీతం, చలన చిత్రం, యక్షగానం, కథ, నవల, నాటిక, వ్యాసం, పత్రికా రచన ఇలా బహు రూపాలుగా శ్రీకాంత శర్మ ప్రతిభ వికసించింది. జర్నలిస్ట్‌గా తన కెరీర్‌ను ప్రారంభించిన శ్రీకాంత శర్మ 1976లో ఆలిండియా రేడియో విజయవాడలో అసిస్టెంట్ ఎడిటర్‌గా చేరారు. ఆ తర్వాత సినీ కవిగా మారారు. ‘కృష్ణావతారం’ సినీ రచయితగా ఆయన తొలి సినిమా. అలాగే జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన నెలవంక, రావు – గోపాలరావు, రెండు జళ్ల సీత, పుత్తడి బొమ్మ వంటì సినిమాల్లో పాటలను రాశారు శ్రీకాంత శర్మ. ఆయన సతీమణి ఇంద్రగంటి జానకీబాల ప్రముఖ రచయిత్రి. ప్రముఖ దర్శకుడు ఇంద్రగంటి మోహన కృష్ణ ఈయన తనయుడే. మోహనకృష్ణ తెరకెక్కించిన ‘గోల్కొండ హైస్కూల్, ‘అంతకుముందు ఆ తర్వాత’, సమ్మోహనం’ సినిమాల్లోనూ పాటలు రాశారాయన. ‘ఇంటిపేరు ఇంద్రగంటి’ పేరుతో తన ఆత్మకథను 2018లో విడుదల చేశారు. తన సాహిత్య జీవితం, కుటుంబ విశేషాలు, రచయితగా తన అనుభవాలు ఇందులో పొందుపరిచారు. శ్రీకాంత శర్మ మృతి పట్ల పలువురు ఇండస్ట్రీ ప్రముఖులు తమ సంతాపాన్ని తెలియజేశారు. బంగారు పూలతో అభిషేకం చేశాను – తనికెళ్ల భరణి అనుభూతి కవిత్వం అనేది ఒక ప్రక్రియ. ‘అనుభూతి గీతాలు’ టైటిల్‌తో శ్రీకాంత శర్మగారు రాశారు. కవి, పండితుడు, సంస్కృతం బాగా చదువుకున్నవాడు. ఆయనది ఒక శకం. సాహిత్యంలో ఏ డౌట్ వచ్చినా ఆయన్నే అడిగేవాణ్ణి. ‘కవికి కనకాభిషేకం’ పేరుతో నేను ఆయనకు బంగారు పూలతో అభిషేకించుకునే అవకాశం లభించింది. 50 వేల రూపాయిల బంగారం పూలతోటి వారికి అభిషేకం చేయడం ఒక పండగ. అక్కినేని నాగేశ్వరరావు కూడా వచ్చారు. నా జీవితంలో అది బెస్ట్ మూమెంట్. మర్చిపోలేనిది. ఆయన అర్హుడు. ఇవాళ ఉదయం (గురువారం) వాళ్ల ఇంటికి వెళ్లి నమస్కరించుకొని వచ్చాను. వాళ్ల కుటుంబమంతా పండితుల సమూహం. వాళ్ల తండ్రి, భార్య, కుమారుడు అందరూ సాహితీవేత్తలే. తెలుగు సాహిత్యం గురించి ఆయన ఎంత గొప్పగా చెప్పగలరో సంస్కృత సాహిత్యం గురించీ అంతే గొప్పగా చెప్పగలరు. సంస్కృత కావ్యాలు కొన్ని తెలుగులోకి అనువదించారు. సంస్కృత కావ్యాల మీద నాకు ఆసక్తి కలగడానికి కారణం పరోక్షంగా ఆయనే. తెలుగు కావ్యాలనుంచి గొప్ప సాహిత్య సంపదను పరిచయం చేశారు. శ్రీకాంత శర్మగారు ఎంతో గొప్ప జీవితాన్ని అనుభవించారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలి. -
పెళ్లి వయసు
యాంకర్ నుంచి హీరోగా మారారు తమిళ నటుడు శివ కార్తికేయన్. ముందు కమెడియన్‌గా, తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, ఇప్పుడు హీరోగా.. ఇలా అంచలంచెలుగా ఎదిగారు. ఇలా తనలోని కొత్త టాలెంట్‌ను ఎప్పటికప్పుడు బయటపెడుతూనే ఉన్నారాయన. ‘మాన్ కరాటే’తో సింగర్‌గా కూడా మారారు. ఇప్పుడు పాటల రచయితగా కలం పట్టారు. నయనతార ప్రధాన పాత్రలో రూపొందుతున్న తమిళ చిత్రం ‘కోలమావు కోకిల’ సినిమా కోసం ఓ పాట రాశారు శివ కార్తికేయన్. అనిరు«ద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకుడు. ‘కల్యాణ వయసు....’ అంటూ సాగే ఈ పాట మే 17న రిలీజ్ కానుంది. అన్నట్లు... ‘పెళ్లి వయసు’ అని పాట రాసిన శివ కార్తికేయన్‌కి పెళ్లయింది. ఒక పాప కూడా ఉంది. -
అదే కదా ఉగాది
అన్ని రోజులూ ఒకలా ఉండవు. అలా అని ప్రతి రోజూ పండగలా ఉండకూడదని కాదు. నిజానికి ప్రతిరోజూ ఉగాది కావాలి. అన్ని భావోద్వేగాలనూ షడ్రుచులలా ఆస్వాదించాలి. సిరిలాంటి మాటలు..వెన్నెల్ లాంటి భావాల‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి ఇంటర్వ్యూను ఆస్వాదించండి. ► సిరివెన్నెలగారిది అచ్చ తెలుగు సాహిత్యం. ఉగాది అంటే మన తెలుగు సంవత్సరాది. ఈ సందర్భంగా బాల్యంలో మీరు జరుపుకున్న ఉగాదిని గుర్తు చేసుకుంటారా? సాధారణంగా బాల్యానికి శ్రమను, ఉత్సాహాన్ని, ఇష్టాన్ని కలిగించేవి వినాయక చవితి, దీపావళి, దసరా, సంక్రాంతికి భోగి మంట. వినాయక చవితి పత్రి కోసం అడవిలోకి వెళ్లేవాళ్లం. దీపావళికి నెల ముందు నుంచీ మందుగుండు సామగ్రి తయారు చేస్తూ చేతులు కాల్చుకునేవాళ్లం. భోగి మంట అంటే ఇంట్లో ఉన్న సామాన్లన్నీ ఎక్కడ నిప్పుల్లో పడేస్తామేమో అని పెద్దవాళ్లు కంగారుపడేవాళ్లు. ఉగాది గురించి పెద్ద పెద్ద జ్ఞాపకాలు లేవు. ఉగాది అంటే ఉదయాన్నే పచ్చడి తినటం. ఏ పండగైనా సరే పులిహోర, గారెలు, పాయసం అన్నీ ఉంటాయి. ఆ వయసులో తిండి యావ ఉంటుంది. నా బాల్యంలో ఆటపాటలు ఎక్కువగా లేవు. నా జీవితం ఎక్కువగా లైబ్రరీలోనే గడిచింది. ► వేపపూత కోసం చెట్టెక్కిన సందర్భం మిగతా రోజుల్లో అయితే చెట్టెక్కితే కాళ్లు విరగ్గొట్టే వారు. ఆరోజు మాత్రం చెట్టెక్కితే ఏమీ అనేవాళ్లు కాదు. ► ఉగాది రుచుల్లో మీకు ఏది ఇష్టం? ఆరు రుచులు కలిసిన ఒక కొత్త రుచితో ఉగాది పచ్చడి తయారవుతుంది. ఆ రుచి ఇష్టం. మా చిన్నప్పుడు చేసిన పచ్చడిలాగా ఇప్పుడు చేయడం లేదు. మా అప్పుడు చిక్కగా ఉండేది. ఇప్పుడు పల్చబడిపోయింది. ఏం లోపించిందో చెప్పలేను కానీ కచ్చితంగా తేడా వచ్చింది. ► మీకు పచ్చడి చేయడం వచ్చా? వంటలో ప్రవేశం ఉందా? వంట మీద ఆసక్తి లేదు. ఉద్యోగంలో చేరిన కొత్తలో పప్పు, చారు నేర్చుకున్నాను. వంకాయ, బంగాళ దుంప, టమాటా.. మూడూ కలిపి కూర చేయడంవచ్చు. ఇప్పుడు ఇటు పుల్ల అటు పెడదామనుకున్నా అదేదో అపరాధం అనుకుంటారు నా భార్య, పిల్లలు. తన వల్లే నేను వంట మర్చిపోయాను. నాకు ఏ మూడు కూరలు ఇష్టమో తను అందులో స్పెషలిస్ట్. నేను వండుకున్న రోజుల్లో గ్యాస్ స్టౌ లేదు. అందుకే గ్యాస్ స్టౌ అంటే తెలియని ఫోబియా. అది ఎటు తిప్పితే ఆన్ అవుతుందో కూడా తెలియదు. ► ఉగాదికి మీరు తీసుకోబోయే కొత్త సంకల్పం ఏంటి? ఏమీ లేదు. అందరికీ నేను చెప్పదలచుకున్నది కొత్త సంకల్పం ఏమీ తీసుకోవద్దని. ‘మనో వాక్కాయ కర్మణే’ అంటారు. ముందు మనసులో సంకల్పించాలి. తర్వాత దాన్ని మాటతో అనాలి. ఆ తర్వాత చేత. ఒకసారి సంకల్పించుకుంటే ఆ పని మొదలైనట్లే. సంకల్పించుకోవ టానికి ఒక రోజు ఎందుకు? తలచుకుంటే ప్రతిరోజూ యుగాది. యుగాది అంటేనే అంతకు ముందు యుగంలో లేనిది ఆ రోజుతోనే మొదలయ్యేది అనే అర్థం వస్తుంది. ప్రతిరోజూ సూర్యుడితో పాటు మళ్లీ పుట్టాను అనుకో. నిత్యం శుభాన్నే సంకల్పించుకుందాం. దీని కోసం జనవరి ఒకటి నుంచి, ఇంకెప్పుడో అని అనుకోవక్కర్లేదు. ► ప్రపంచం పరిగెడుతోంది. ఈ పరుగులో ఉద్వేగాలు కోల్పో తున్నాం. పోటీ తప్ప మరోటి లేదు. ఈ పరిస్థితి గురించి? ఓ ఇరవై, ఇరవై ఐదేళ్ల నుంచి కొంచెం విపరీతాలు.. పైత్యం ఎక్కువ చేస్తున్నాం. జీవితం గురించి ఏమీ మాట్లాడుకోవడంలేదు. జీవితం నుంచి తప్పించుకు పారిపోయేవే చేస్తున్నాం. అసలు కొట్టుకోవడమేంటి? కొట్టుకోవ డం అనే కాన్సెప్ట్ విచిత్రమైన విషయం. గట్టిగా తిట్టుకోవాలంటే అవమానంగా అనిపిస్తుంది. మన అందరిలోనూ సున్నితత్వాలు పోతున్నాయి. అందుకే సినిమాల్లో కూడా ఒక్కడే పదీ ఇరవై మందిని కొట్టేస్తున్నాడు. సమాజంలో ఉన్న సంక్లిష్టత అంతా చిక్కు పడిపోయిన దారపు ఉండలా ఉండి పోయింది. దీన్ని బాగు చేయాలంటే ఎక్కడ మొదలు పెట్టాలి? అనే తెలియని కంగారులో ఎవరికి వాళ్లు ఎవరో వస్తారు.. ఏదో చేస్తారు అని చూస్తూ కలలు కంటూ కూర్చుంటాం. ‘ఒక్కడు’ సినిమాలో హీరో క్రీడాకారుడు. ‘పసిడి పతకాల హారం కాదురా విజయ తీరం. ఆట అనే మాటకు అర్థం నిన్ను నువ్వే గెలుచు యుద్ధం’ అని పాట రాశాను. అలాగే ‘గోల్కొండ హైస్కూల్’లో ‘మొదలెట్టక మునుపే ముగిసే నడక కాదే మన పయనం, సమరానికి సై అనగలిగే సంసిద్ధత పేరే యుద్ధం’ అని రాశా. పాట అంటే మనసుకు ఆనందాన్నిచ్చేది, ఆహ్లాదాన్ని కలిగించేది. ఇవాళ పాటల పోటీ అని పెట్టి, ‘మీరు ఓడిపోయారు.. మీరు గెలిచారు’ అని చెప్పటం మూలానే అసలు గెలుపనే మాటకు అర్థం తీసేశారు. పోటీలు పెట్టకండి. ఇలాంటి దౌర్భాగ్యపు భావాల్ని పెంపొందించకండి. యుద్ధం అంటే గెలిచాడు.. ఓడిపోయాడని కాదు. యుద్ధానికి నేను సిద్ధం అన్నప్పుడే గెలిచినట్టు. మన జీవితంలోకి ఇది అన్వయించుకుంటే ఏ కష్టం కష్టంలా తోచదు. ► బడి చదువుకి, జీవితపు చదువుకి తేడా చెబుతారా? బడి చదువులు సులభమైనవి. జవాబులు చెప్పి, తర్వాత ప్రశ్నలు వేస్తుంది. కానీ జీవితపు చదువు ముందు ప్రశ్నేసి తర్వాత సమాధానం నేర్పుతుంది. జీవితం అక్కడ గొయ్యి ఉందని చెప్పదు. ముందు పడేస్తుంది. ఆ పడటం మనకు జీవితాన్ని నేర్పిస్తుంది. జీవితాన్ని మనం ఎలా తీసుకుంటున్నామనేది ముఖ్యం. శివరాత్రి రోజు భక్తితో పస్తుంటాం. ఒకరోజు అన్నం లేకా పస్తుంటాం. అప్పుడు భక్తితో ఊగిపోయాం, ఇప్పుడు ఆకలితో తల్లడిల్లిపోయాం. ఆకలి పస్తును భక్తి పస్తే అనుకుంటే ఇష్టంగా పస్తుంటాం. ► ‘తెలుగు పాట’లో పరభాష పదాల తాకిడి ఎక్కువైందనే వాదన ఉంది. ఈ పరిస్థితి మారాలంటే మీరిచ్చే సలహా? ఈరోజుల్లో అందరి సంస్కృతులు అందరికీ పరిచయం అవుతున్నాయి. చచ్చేలోపు కాశీకి పోకపోతే పుణ్యం రాదనుకుంటాం. ఇప్పుడు అమెరికాకు వెళ్లకపోతే బతుకు లేదనుకుంటున్నాం. ఇలా దేశవిదేశాల తాలూకు వివిధ సంస్కృతుల కలబోతలలో స్వీయ సంస్కృతులను, మనం పుట్టి పెరిగిన మూలాలను మర్చిపోయి ఎదుగుతున్నాం. అక్కడి నుంచి ఇక్కడి నుంచి తీసుకోవద్దు అనటం లేదు. కానీ పాట అనగానే షకీరా పాడిన పాటను తీసుకువచ్చి ఇక్కడ పెడతానంటే నువ్వు ఏ భావాన్నీ కలిగించలేవు. సినిమా పాటలలో చాలా ప్రయోజనం ఉంది. ఆ ప్రయోజనం పరిపూర్ణంగా విస్మరించబడుతోందని నా అభిప్రాయం, అభియోగం కూడా. దీనికి కారకులు ఎవరంటే ఇచ్చేవాళ్లూ.. పుచ్చుకునేవాళ్లు. ఈ మధ్య సినిమాలు ఎంత పెద్ద హిట్ అయినా కూడా పట్టుమని ఒక్క పాట కూడా నిలబడలేదు. నిర్మాతలకు నేను చెప్పేది ఏంటంటే పాట అంటే ఆరు లక్షల నుంచి ఆరు కోట్లు వరకు ఖర్చు అయ్యే ప్రొడక్ట్. అలాంటి పాట పట్ల అంత అశ్రద్ధ ఏంటి? సినిమా బావుంటే పాట లేక పోయినా చూస్తారు అనే స్థితికి ప్రేక్షకులు వెళితే పాటలు తీసేయ్. డబ్బులు మిగులుతాయి కదా. లేదా ఈ పాటలు మాకు కావాలని వాళ్లు తహతహలాడాలి. పూర్వం తహతహలాడే వారు. సాహిత్యం కాకపోయినా ఆ సంగీతం అయినా చాలా కమ్మగా ఉండేది. ఆ రోజుల్లో విశ్వనా«థ్గారి సినిమాల్లో ఒక పాట కూడా మిస్ అయ్యేవారు కాదు. ఆ పాట ఏదో చెబుతుంది. ఈరోజుల్లో తెలుగు పాట నిద్రావస్థ స్థితిలో ఉంది. నేను ఆశావాదిని. నిద్ర అంటే లేస్తాం. నిదనం అంటే చావు. ఇది నిద్ర తప్ప నిదనం కాదు. ఈ ఉగాది సందర్భంలో అయినా మంచి పాట కావాలని మీరు, చేయాలని నటులు అనుకుంటే సరిపోతుంది. ► మీరు అనేక దేశాల్లోని తెలుగువాళ్లను కలుస్తుంటారు. తెలుగుదనాన్ని కాపాడుకోవడంలో అక్కడివాళ్ల చిత్తశుద్ధికి, ఇక్కడివాళ్ల చిత్తశుద్ధికి ఎలాంటి తేడా గమనించారు? నిస్సంశయంగా ఇక్కడికంటే అక్కడే బాగుంది. వాళ్లు ఎందుకు వెళ్లినప్పటికీ కూడా ఒక ‘నోస్టాలిజిక్’ ఫీలింగ్ ఉంటుంది. అది మానవ సహజం. మనం ఒక ఊరి నుంచి ఇంకో ఊరికి మారేటప్పుడు మొత్తం సామానంతా పట్టుకెళ్లలేం. నా చిన్నప్పటి సంగతి చెబుతున్నా. ఒక ఊరి నుంచి ఇంకో ఊరికి వెళ్లేటప్పుడు అయిష్టంగా రుబ్బు రోలు ఇచ్చేస్తాం. ఆ బరువు తీసుకెళ్లలేక (నవ్వుతూ). వాళ్లు ఇక్కడ ఉంటే చేసుకుంటారో లేదో చెప్పలేం. ఇక్కడ ఉన్నప్పుడు చేసుకున్నవి అక్కడికెళ్లాక చేసుకోలేకపోతున్నాం అనే బెంగ ఉంటుంది. ఆ బెంగ వల్ల చేసుకుంటున్నారు. కష్టపడి వేప పువ్వు సంపాదించుకుని పచ్చడి చేసుకుంటున్నారు. వాళ్ల దేశాలు ఒప్పుకోకపోతే ఇంట్లో గుట్టుగా ఎలక్ట్రికల్ భోగి మంటైనా వేసుకుంటున్నారు. అక్కడికెళ్లినప్పుడు నేనేం చెప్పానంటే... ‘‘పండగ పరమార్థం తెలుసుకుని చేయండి. అమెరికాలో పేడతో పనులు చేయడం అనేది శుభ్రం కాదని వాళ్లు ఒప్పుకోరు. మీరు అమెరికాకు పోవద్దు. వెళితే అమెరికాకు తగ్గట్టే ఉండాలి. సంక్రాంతి వచ్చినప్పుడు ఏదో చట్టవిరుద్ధమైన పని చేస్తున్నట్లు రహస్యంగా పేడ సేకరించి తలుపులేసుకుని, గొబ్బెమ్మలు పెట్టి, ఇంగ్లిషు మాట్లాడే మీ పిల్లలకు పట్టు లంగాలు తొడిగి,‘బొహియల్లో బొహియల్లో’ అని తిప్పకండి. మీకు సంక్రాంతి కావాలంటే సంక్రాంతి తాలూకు అర్థాన్ని చెప్పండి. పుష్యమాసంలో పంట ఇంటికి వస్తుంది. నేను తినడానికి ముందు సమాజంలో ఉన్నవాళ్లకు నా వంతుగా ఇస్తా అనే సంప్రదాయం ఏదైతే ఉందో అదీ సంక్రాంతి అంటే. సమైక్య క్రాంతి అని అంటాం. ఆ రోజు తెలుగువాళ్లందరూ ఒకచోట కలవండి. అవసరమైన వాళ్లకు ఇవ్వండి. అంతేకానీ పేడ చుట్టూ తిరగక్కర్లేదు. ► తెలుగువారి ఖ్యాతికి జాతీయ స్థాయిలో న్యాయం జరుగుతోందని మీకనిపిస్తోందా? ‘పద్మ’ అవార్డుల విషయంలో మీ అభిప్రాయం ఏంటి? అవార్డులనేవి ఎప్పుడూ వివాదాస్పదంగానే ఉంటాయి. ఎందుకంటే ఒక ఐదారుగురు కూర్చుని, ఇవ్వబడిన తక్కువ సమయంలో అనేకమైన సినిమాలు చూసి, గబగబా నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయంలో, ఇంకా ఇతరత్రా పైరవీలు.. ఇలా చాలా కారణాలు ఉంటాయి. ఒక అవార్డు ద్వారా నీ విలువను నిరూపించకూడదు. ఒక విలువని గుర్తించి, గౌరవించడం కోసమే అవార్డు పుట్టింది కానీ అవార్డుల కోసం విలువ పుట్టలేదు. ఏనాడైతే నువ్వు రాసిన పాట పది మంది పెదాల మీద కూనిరాగాలు తీస్తుందో అదే పెద్ద అవార్డు కింద లెక్క. అది కాకుండా చెక్కముక్క మీద పద్మశ్రీ రాసి ఇస్తే, అది నా గోడకు తగిలించుకుంటే ఏం ప్రయోజనం? అంటే.. రాక ఏడుస్తున్నావా? అని మీరు అనొద్దు. నాకన్నా అవార్డులు పొందినవాళ్లు తెలుగులో ఎవరూ లేరు. అవార్డులు తీసుకుంటున్నప్పుడు నేను ఒకటే చెబుతా... మనం పెట్టుకున్నటువంటి, మనం విధించుకున్నది ప్రభుత్వం. తప్పూ తేడా ఉంటే సరిదిద్దుకుందాం. మనం ఏర్పాటు చేసుకున్న మన వ్యవస్థను గౌరవించుకోవడానికి సంకేతం కోసమే అవార్డులను స్వీకరిస్తాను తప్ప అవార్డు వచ్చిన ఆ పాట మాత్రమే గొప్పది అని కాదు. దాని విలువను జడ్జి చేయడానికి అక్కడ కూర్చున్న కమిటీ సరిపోదు.. సమయమూ సరిపోదు. అసలు నేను ‘పద్మశ్రీ’ తెచ్చు కునే ఇండస్ట్రీకి వచ్చాను అని ఆ మధ్య ఓ సందర్భంలో అన్నాను. నా భార్య పేరు ‘పద్మ’ (నవ్వుతూ). నా జీవితాన్ని ఇవాళ మీరొచ్చి ఇంటర్వ్యూ అడిగేదాకా తీసుకొచ్చింది ఆవిడే. ఈ వెన్నెల్లో ‘సిరి’ ఆవిడే. ► తెలుగు సంప్రదాయాల్ని మీ ఇంట్లో ఎలా మార్గదర్శకత్వం చేస్తుంటారు? నేను నమ్మేది ఒక్కటే. పిల్లలకు ఏమీ చెప్పడానికి ప్రయత్నించొద్దు. పిల్లలు చాలా చురుకైన మేధస్సు కలిగినవాళ్లు. వాళ్ల మెదడు ఖాళీగా ఉంటుంది. గబగబా నింపుకోవడానికి సిద్ధంగా ఉంటుంది. రెండు కళ్లతో ప్రపంచాన్ని తాగేయడానికి చూస్తుంటారు. వాళ్లకు ఏం కనిపించాలి? వాళ్ల చెవులు ఏం వినాలి? వాళ్ల చేతులు ఏం పుచ్చుకోవాలి? అన్నది మొట్టమొదట వేసుకో వాల్సిన ప్రశ్న. అమ్మా నాన్న ఇద్దరూ ఏం మాట్లాడు కుంటే వీళ్లేం వింటారు. సో.. ఇంట్లో జీవించండి. ఆడదాని నుంచి ఇల్లాలివై, ఆ తర్వాత అమ్మ అయ్యావు. ఒక మగాడివై భర్త అయ్యి, తండ్రి అయ్యావు. దానికి తగ్గట్టు ఇద్దరూ జీవించాలి. మీలో అంతవరకూ ఏమైనా లోపాలుంటే దిద్దుకుని ఇంతకు మునుపు లేని విలువలు తెచ్చిపెట్టుకోవాలి. అంతకు ముందు లక్ష్యం లేకుండా తిరిగితే లక్ష్యం పెట్టుకో. నా పాటల్లో ఇదే రాశాను. నా పాటల్లో ఒకలా జీవితంలో ఒకలా నేను లేను. పాటల్లో చెప్పే నీతినే ఆచరిస్తున్నాను. ► ‘చేదైనా గాని ఇష్టంగానే తింటున్నామంటే ఉగాది అనుకోమా..’ అని ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’లో ‘మరీ అంతగా మహా చింతగా..’ పాటలో రాశారు. ఎంతో అర్థం ఉన్న ఆ వాక్యం గురించి వివరంగా చెబుతారా? మనకు అవకాశం ఉందని చేదు లేకుండా పచ్చడి చేస్తే ఏదో లోపించినట్టు ఫీలవుతాం కదా. చేదును కోరుకుంటున్నాం. అదీ ఎప్పుడు? జీవితానికి మరో కొత్త ప్రారంభం (కొత్త సంవత్సరం) అనుకుంటున్న రోజు. అదే కదా ఉగాది. ఉగాది పచ్చడి ఆరు రుచులలో చేదు, కారం ఉంటాయి. అవి ఇష్టంగా తీసుకుంటున్నాం. ఆ రుచులను మన జీవితానికి అన్వయించుకుంటే కష్టాలు వచ్చినప్పుడు అవసరమైన దానికంటే ఎక్కువ తల్లడిల్లి పోము. తల్లడిల్లకూడదని కాదు. ఎక్కువ తల్లడిల్లకూడదంటున్నాను. అలా రాయడానికి ఆ సినిమాలో అవకాశం దొరికింది. ఎంతో ఇష్టంగా రాశానా పాట. సంగీతప్రియులకు నచ్చింది. నంది అవార్డు గెలుచుకున్నాను. ► కుటుంబ విలువలను శ్లాఘించే పాటలెన్నో రాశారు. ఇవాళ తెలుగు కుటుంబాలు ఎలా ఉన్నాయని మీకనిపిస్తోంది? మా చిన్నతనంలో ఉన్నవి కొన్ని డిగ్రీలే. ఏదో గుమస్తా ఉద్యోగమో.. మహా అయితే బ్యాంక్ ఆఫీసర్ ఉద్యోగమో. ఎప్పుడైతే అవకాశాలు తక్కువ అనుకున్నామో అప్పుడు చదువుకుని, ఓ ఉద్యోగం చూసుకునే వాళ్లం. త్వరగా పెళ్లి చేసుకుని, వంశం నిలబడాలి కాబట్టి, పిల్లల్ని కనేవాళ్లం. ఇప్పుడలా కాదు. 40 ఏళ్ల వయసు వచ్చేవరకూ చదువుతూనే ఉంటారు. సెటిల్ కాలేదని పెళ్లి చేసుకోవడం లేదు. ఇప్పుడంతా 40ఏళ్ల పెళ్లికొడుకు లు, 35 ఏళ్ల పెళ్లి కూతుళ్లు. భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలకు వెళ్లిపోతున్నారు. వారి స్పర్శ తాలూకు వెచ్చదనం పిల్లలకు ఎక్కడ తెలుస్తుంది? తెలుగు కుటుంబాలు అనేకన్నా ఇవాళ కుటుంబం అనేది భారతదేశంలో విచ్ఛిన్నం అవుతోంది. అనేక రకాల ఆరాటాలు, సమస్యలతో జీవితాన్ని క్లిష్టమయం చేసుకుని ఏం సాధిస్తున్నావ్? ఇవాళ ప్రతి ఒక్కరికీ కారు ఉంది. నా చిన్నతనంలో ఒక్క సైకిల్ ఉండేది. నలుగురైదుగురు సర్దుకునేవాళ్లం. మాకది బాగుండేది. మేం జీవితంలో ఒక్కసారైనా కారు ఎక్కాలని కల కన్నాం. ఇవాళ కళ్లల్లోంచి కలలు కూడా రాలిపోయాయి. ఎందుకంటే ప్రతి ఒక్కరికీ రెండేసి కార్లు ఉన్నాయి. కారు ఉంది కాబట్టి 250 మైళ్ల దూరంలో ఆఫీసు ఉన్నా వెళుతున్నారు. కారు అనేది పరిగెత్తడానికి పనికొస్తోంది... సౌకర్యానికి కాదు. ఈరోజు సాంకేతిక ప్రగతి అనేది మనకు సుఖం ఇవ్వడంలేదు. అంటే వికాసం వద్దనను. 1995లో వచ్చింది సెల్‌ఫోన్. ఇప్పుడు సెల్ఫీలు తీసుకుని చనిపోయే పరిస్థితికి రావడం అనేది ఏ రకమైన సాంకేతిక వికాసం. ఇది అడిగేవాళ్లు లేరు. అడిగితే చెప్పేవాళ్లు లేరు. చెబితే వినేవాళ్లు లేరు. ‘నువ్వంటే నువ్వు కాదు. ఒక వ్యవస్థవి. ఈ వ్యవస్థకి పునాది ఒక కుటుంబం. నీ కుటుంబంలోను, పక్క కుటుంబంలోనూ నీతో పొంతనలేనివాళ్లు ఉంటారు. వాళ్ల కోసం నీ ఇష్టాలను వదులుకుని గడపడమే కుటుంబం, పక్క కుటుంబం. పక్క కుటుంబం ద్వారానే ఊరు, ఊరు ద్వారా రాష్ట్రం, రాష్ట్రం ద్వారా దేశం. ఇలా అయితేనే ఎప్పటికైనా నిలబడగలుగుతాం. లేకపోతే క్రమంగా విచ్ఛిన్నం తప్పదు. ► భారతీయులంతా ఒక్కటే అనే భావనతో బతకాలి అంటుంటాం. కానీ నీ ప్రాంతం.. నా ప్రాంతం.. నీ భాష.. నా భాష అంటూ గొడవలు పడుతున్నాం. దీనిపై మీ అభిప్రాయం? ఇటీవల కాలంలో భారతీయత అనే కాన్సెప్ట్ మరుగునపడిపోయి తమ తమ ప్రాంతాలతో తోటి, తమ తమ యాసలతోటి, భాషలతోటి ఉనికిని ప్రదర్శించుకోవడానికి ఉత్సాహపడుతున్నారు. చెట్టు మూలాలను నరుక్కుంటూ బయటికొచ్చేస్తున్న పరిస్థితి. భారత మాత ఒక్కటే. తెలుగు తల్లి, తమిళ తల్లి అని లేదు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అందరం మన తల్లిదండ్రులను దేవతలుగా పూజించాలి అని విశ్వసిస్తాం. మన పుట్టుక ముందు నుంచీ ప్రయాణం ఉంది. చనిపోయాక కూడా మన ప్రయాణం ఉంది. ఇలాంటి ఆలోచనలతో ఉన్న మనం ఇవాళ మన భాష ద్వారా మనం వేరుపడుతున్నాం. ‘నేను బెంగాలీవాణ్ణి కాదు.. నేను తమిళీయుణ్ణి’ అంటున్నారు. మొన్నటికి మొన్న కర్ణాటకవాళ్లు జెండా తయారు చేసుకున్నారు. ఇది వినాశకర ఆలోచన. ఇప్పుడు కూడా మనం తెలంగాణ, ఆంధ్రాగా విడిపోయింది పరిపాలనా సౌలభ్యం కోసం, భౌగోళికంగానూ, భౌతికంగానూ, రాజకీయంగానూ మారాం. అది తప్పు లేదు. రెండు తెలుగులు లేవు. ఒకటే తెలుగు ఉంది. మనము, తమిళులం, అందరం.. ఈ భారతదేశపు వివిధ శాఖలం అనుకోవాలి. సమైక్యంగా ఉండాలి. ఎవరో పోయారని అదే పనిగా తలుచుకుంటే వాళ్లు మళ్లీ రారు. వాళ్లు మనల్ని ఎంతగాప్రేమించారో గుర్తుపెట్టుకుంటే వాళ్లు మనతోనే బ్రతికి ఉన్నట్టు లెక్క. మన తల్లిదండ్రులుఎప్పుడూ పోరు అని మనం గుర్తుపెట్టుకోవాలి. వయసు వాళ్ల శరీరాల్ని తీసుకువెళ్తుంది. వాళ్లేవాళ్ల ప్రాణాల్ని, ఆత్మల్ని మనలో పెట్టారు. ఆ సంగతి గ్రహిస్తే వాళ్లు పోయినట్టు లెక్క కాదు. – డి.జి. భవాని -
సినిమా ప్రమాణాలు పడిపోవు
సినిమా సాహిత్యం నాడు-నేడుపై వెన్నెలకంటి వ్యాఖ్య డాక్టర్ ఏబీ సాయిప్రసాద్, బూదాటి వెంకటేశ్వర్ల ప్రసంగాలు మద్రాసు విశ్వవిద్యాలయంలో ధర్మనిధి ఉపన్యాసాలు చెన్నై : ఆ కాలంలో సినిమాలు, సాహిత్యాలు బాగుండేవి, నేడు దారుణంగా మారాయని కొందరు చేసే విమర్శలు అర్థరహితమని ప్రముఖ సినీరచయిత వెన్నెలకంటి అన్నారు. కాలానుగుణంగా సినిమా ప్రమాణాలు మారిపోతుంటాయే గానీ పడిపోవడం జరగదని ఆయన స్పష్టం చేశారు. మద్రాసు విశ్వవిద్యాలయం తెలుగుశాఖ అధ్యక్షులు మాడభూషి సంపత్‌కుమార్ నేతృత్వంలో ధర్మనిధి ఉపన్యాసాల కార్యక్రమం బుధవారం జరిగింది. ఈ సందర్భంగా ఆర్కాటు ప్రకాశరావు ధర్మనిధి ఉపన్యాసం పేరున సినిమా సాహిత్యం-నాడు, నేడు అనే అంశంపై వెన్నెలకంటి ప్రసంగించారు. సినిమా సాహిత్యంలో నాడు - నేడు అనే ప్రస్థావనే తగదని అన్నారు. 1913లో భక్త ప్రహ్లాద చిత్రం ద్వారా చందాల కేశవదాస్తో సినీ రచయిత ప్రారంభం కాగా ఈ 2016వ సంవత్సరంతో నాడు - నేడుగా ఇలా విడగొడుతామని చెప్పారు. సినిమా సమాజం ఒక దాని కొకటి ప్రతిబింబించాలని ఆయన పేర్కొన్నారు. శంకరాభరణం వంటి ఉన్నతమైన చిత్రం వచ్చిన రోజులలో నాసిరకం చిత్రాలు కూడా విడుదలయ్యాయని తెలిపారు. అయితే శంకరాభరణం చిత్రం ప్రభావం వలన ఎందరో సంగీతాభిలాషను ప్రదర్శించారని తెలిపారు. అలాగే సాగరసంగమం సినిమా విడుదల కాగానే నృత్య కళాశాలలు నిండిపోయాయని అన్నారు. అదేరీతిలో శివ సినిమా వచ్చినప్పుడు ప్రతి విద్యార్థి సైకిల్ చైన్‌తో హీరోయిజం ప్రదర్శించారని ఆశించారన్నారు. విద్య, ఉద్యోగాలలో తగిన వేషధారణ ఉన్నట్లుగానే సినిమా సాహిత్య ధోరణి కూడా కాలానుగుణంగా మారుతుందని, ప్రేక్షకుడు గ్రహించే తీరును బట్టి అర్థాలు మారిపోతాయన్నారు. సినీ కవుల్లో ఒక్కొక్కరు ఒక్కో అంశాలలో అగ్రజులుగా వెలిగారని తెలిపారు. సీనియర్ సముద్రాల ఒక తరాన్నే శాసించారని చెప్పారు. పింగళి సాహిత్యం నేటికీ విరాజిల్లుతోందన్నారు. పింగళి సాహిత్య గుభాలింపుకు మాయాబజార్ చిత్రం ఒక పెద్ద ఉదాహరణ అని చెప్పారు. అలాగే జానపద సాహిత్యంలో కొసరాజు నేటికి మేటి అని అన్నారు. ద్వంద్వర్థాల పాటలు రాస్తారనే విమర్శలను ఎదుర్కొన్న వేటూరు సుందరరామమూర్తి కలం నుండి కిరాతార్జునీయం అనే అద్భుత కవిత జాలువారిందని తెలిపారు. బంగారు కోడిపెట్ట వంటి మాస్ సాంగ్‌ను రాసిన భువన చంద్ర మేధస్సు నుండి ఇది తరతరాల చరితం అనే అద్భుత సాహిత్యం ప్రేక్షకులను మైమరపించిందని చెప్పారు. గీతాల రచనలలో దేవులపల్లి కృష్ణశాస్త్రి, సినీ శ్రీ ఆరుద్ర, రాజశ్రీ, గోపి, సి.నారాయణరెడ్డి, సిరివెన్నెల సీతారామశాస్త్రి, చంద్రబోస్, అనిశెట్టి, మల్లెమాల, జొన్నవిత్తుల సాహితీ, సుద్దాల అశోక్ తేజ, వనమాలి.. ఎవరి ప్రత్యేకతలు వారివన్నారు. మహాకవి ఆత్రేయ వెండితెర వేమనగా ప్రసిద్ధి చెందారని చెప్పారు. సంగీత దర్శకుడు కీరవాణి, దేవిశ్రీ ప్రసాద్ సైతం అద్భుత సాహితీ వేత్తలని కొందరికే తెలుసని అన్నారు. తాను సైతం తక్కువ కాకుండా మంచి పాటలనే రాశానని తెలిపారు. తన వారసుడిగా సినీ రంగంలోకి అడుగుపెట్టిన కుమారుడు శశాంక్ అందాల రాక్షసి అనే సినిమాలో మనసు పలికే భాష ప్రేమ అనే పాటను రాసి సీనియర్ రచయితల మన్ననలను పొందారని తెలిపారు. ఇలా సినీ సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన మహా కవులను, రచయితలను ఆయన పేరు పేరునా ప్రస్థావించారు. ఆచార్య గంధం అప్పారావు ధర్మనిధి ఉపన్యాసం కింద వేమన మానవతావాదం అనే అంశంపై డాక్టర్ ఎబి సాయిప్రసాద్ ప్రసంగించారు. మానవతావాదం అనేది మనిషి వ్యక్తిత్వం పైనే ఆధారపడి ఉంటుందని అన్నారు. నార్ల వారు తన సాహిత్యంతో గొప్ప మానవతావాదిగా ప్రూవ్ చేసుకున్నారని చెప్పారు. ఇప్పటికీ ప్రజల నీతిబోధలకు ఒక దిక్సూచీగా వేమన శతకాలు ఉన్నాయన్నారు. మనిషి లోటుపాట్లు తెలిసిన వ్యక్తి వేమన అని ఆయన అభివర్ణించారు. ప్రజలలో ఆకలి - ఆహారం అనే రెండు వర్గాలు ఉన్నాయన్నారు. ఆకలి ఉన్నవారి వద్ద ఆహారం ఉండదు, ఆహారం అందుబాటులో ఉన్న వారికి ఆకలి ఉండదని ఆయన పేర్కొన్నారు. మనిషి స్వర్గానికి వెళ్లడం కాదు స్వర్గాన్నే మనిషి వద్దకు తీసుకురావడమే మానవతావాదమని చెప్పారు. మానవతావాది క్షమాగుణం కలిగినవారై ఉండాలని ఉద్భోధించారు. ఆచార్య ములుమూడి ఆదిలక్ష్మి ధర్మనిధి ఉపన్యాసం కింద మహాభారతం - మానవీయ ధృక్పథం అంశంపై ఆచార్య బూదాటి వెంకటేశ్వర్లు ప్రసంగించారు. ఏ సాహితీవేత్త నేలవిడచి సాముచేయడు, మానవీయ కోణాన్నివదలడని అన్నారు. నేటి సామాజిక రాజకీయ పరిస్థితులను ఆనాటి మహాభారతంతో పోల్చవచ్చని అన్నారు. మహాభారతం ఈనాటి సమాజానికి అద్ధమని, నేటి రాజకీయాలలో దాదాపుగా అందరూ దుశ్శాసనులేనని అన్నారు. జూదంలో ఓడిపోయి పాండవులు అడవుల పాలైనప్పుడు కౌరవులు వంటి దుర్మార్గుల పాలనలో ఉండలేమని, మీ వెంటే వస్తామని ప్రజలు వెంటబడినట్లు వెంకటేశులు తెలిపారు. అంటే ప్రజలెప్పుడు మంచి పాలకులనే కోరుకుంటారనే అర్థాన్ని నేటికీ అన్వయించుకోవచ్చని తెలిపారు. అలాగే మహాభారతంలో అణువణువునా మానవీయం కూడా కనిపిస్తుందని చెప్పారు. సమస్థ ప్రకృతి మానవీయమేనని పేర్కొన్నారు. పలువురు ఔత్సాహిక కవులు, ప్రముఖులు పాల్గొన్నారు.