అదే కదా ఉగాది | ugadi special sirivennela seetharama sastry sakshi special interview | Sakshi
Sakshi News home page

అదే కదా ఉగాది- ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి

Published Sun, Mar 18 2018 1:40 AM | Last Updated on Tue, Nov 6 2018 4:19 PM

ugadi special sirivennela seetharama sastry sakshi special interview - Sakshi

అన్ని రోజులూ ఒకలా ఉండవు. అలా అని ప్రతి రోజూ పండగలా ఉండకూడదని కాదు. నిజానికి ప్రతిరోజూ ఉగాది కావాలి. అన్ని భావోద్వేగాలనూ షడ్రుచులలా ఆస్వాదించాలి. సిరిలాంటి మాటలు..వెన్నెల్ లాంటి భావాల‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి  ఇంటర్వ్యూను ఆస్వాదించండి.

► సిరివెన్నెలగారిది అచ్చ తెలుగు సాహిత్యం. ఉగాది అంటే మన తెలుగు సంవత్సరాది. ఈ సందర్భంగా బాల్యంలో మీరు జరుపుకున్న ఉగాదిని గుర్తు చేసుకుంటారా?
సాధారణంగా బాల్యానికి శ్రమను, ఉత్సాహాన్ని, ఇష్టాన్ని కలిగించేవి వినాయక చవితి, దీపావళి, దసరా, సంక్రాంతికి భోగి మంట. వినాయక చవితి పత్రి కోసం అడవిలోకి వెళ్లేవాళ్లం. దీపావళికి నెల ముందు నుంచీ మందుగుండు సామగ్రి తయారు చేస్తూ చేతులు కాల్చుకునేవాళ్లం.

భోగి మంట అంటే ఇంట్లో ఉన్న సామాన్లన్నీ ఎక్కడ నిప్పుల్లో పడేస్తామేమో అని పెద్దవాళ్లు కంగారుపడేవాళ్లు. ఉగాది గురించి పెద్ద పెద్ద జ్ఞాపకాలు లేవు. ఉగాది అంటే ఉదయాన్నే పచ్చడి తినటం. ఏ పండగైనా సరే పులిహోర, గారెలు, పాయసం అన్నీ ఉంటాయి. ఆ వయసులో తిండి యావ ఉంటుంది. నా బాల్యంలో ఆటపాటలు ఎక్కువగా లేవు. నా జీవితం ఎక్కువగా లైబ్రరీలోనే గడిచింది.

► వేపపూత కోసం చెట్టెక్కిన సందర్భం
మిగతా రోజుల్లో అయితే చెట్టెక్కితే కాళ్లు విరగ్గొట్టే వారు. ఆరోజు మాత్రం చెట్టెక్కితే ఏమీ అనేవాళ్లు కాదు.

► ఉగాది రుచుల్లో మీకు ఏది ఇష్టం?
ఆరు రుచులు కలిసిన ఒక కొత్త రుచితో ఉగాది పచ్చడి తయారవుతుంది. ఆ రుచి ఇష్టం. మా చిన్నప్పుడు చేసిన పచ్చడిలాగా ఇప్పుడు చేయడం లేదు. మా అప్పుడు చిక్కగా ఉండేది. ఇప్పుడు పల్చబడిపోయింది. ఏం లోపించిందో చెప్పలేను కానీ కచ్చితంగా తేడా వచ్చింది.

► మీకు పచ్చడి చేయడం వచ్చా? వంటలో ప్రవేశం ఉందా?
వంట మీద ఆసక్తి లేదు. ఉద్యోగంలో చేరిన కొత్తలో పప్పు, చారు నేర్చుకున్నాను. వంకాయ, బంగాళ దుంప, టమాటా.. మూడూ కలిపి కూర చేయడంవచ్చు. ఇప్పుడు  ఇటు పుల్ల అటు పెడదామనుకున్నా అదేదో అపరాధం అనుకుంటారు నా భార్య, పిల్లలు. తన వల్లే నేను వంట మర్చిపోయాను. నాకు ఏ మూడు కూరలు ఇష్టమో తను అందులో స్పెషలిస్ట్‌. నేను వండుకున్న రోజుల్లో గ్యాస్‌ స్టౌ లేదు. అందుకే గ్యాస్‌ స్టౌ అంటే తెలియని ఫోబియా. అది ఎటు తిప్పితే ఆన్‌ అవుతుందో కూడా తెలియదు.

► ఉగాదికి మీరు తీసుకోబోయే కొత్త సంకల్పం ఏంటి?
ఏమీ లేదు. అందరికీ నేను చెప్పదలచుకున్నది కొత్త సంకల్పం ఏమీ తీసుకోవద్దని. ‘మనో వాక్కాయ కర్మణే’  అంటారు. ముందు మనసులో సంకల్పించాలి. తర్వాత దాన్ని మాటతో అనాలి. ఆ తర్వాత చేత. ఒకసారి సంకల్పించుకుంటే ఆ పని మొదలైనట్లే. సంకల్పించుకోవ టానికి ఒక రోజు ఎందుకు? తలచుకుంటే ప్రతిరోజూ యుగాది. యుగాది అంటేనే అంతకు ముందు యుగంలో లేనిది ఆ రోజుతోనే మొదలయ్యేది అనే అర్థం వస్తుంది. ప్రతిరోజూ సూర్యుడితో పాటు మళ్లీ పుట్టాను అనుకో. నిత్యం శుభాన్నే సంకల్పించుకుందాం. దీని కోసం జనవరి ఒకటి నుంచి, ఇంకెప్పుడో అని అనుకోవక్కర్లేదు.

► ప్రపంచం పరిగెడుతోంది. ఈ పరుగులో ఉద్వేగాలు కోల్పో తున్నాం. పోటీ తప్ప మరోటి లేదు.  ఈ పరిస్థితి గురించి?
ఓ ఇరవై, ఇరవై ఐదేళ్ల నుంచి కొంచెం విపరీతాలు.. పైత్యం ఎక్కువ చేస్తున్నాం. జీవితం గురించి ఏమీ మాట్లాడుకోవడంలేదు. జీవితం నుంచి తప్పించుకు పారిపోయేవే చేస్తున్నాం. అసలు కొట్టుకోవడమేంటి? కొట్టుకోవ డం అనే కాన్సెప్ట్‌ విచిత్రమైన విషయం. గట్టిగా తిట్టుకోవాలంటే అవమానంగా అనిపిస్తుంది. మన అందరిలోనూ సున్నితత్వాలు పోతున్నాయి. అందుకే సినిమాల్లో కూడా ఒక్కడే పదీ ఇరవై మందిని కొట్టేస్తున్నాడు. సమాజంలో ఉన్న సంక్లిష్టత అంతా చిక్కు పడిపోయిన దారపు ఉండలా ఉండి పోయింది.

దీన్ని బాగు చేయాలంటే ఎక్కడ మొదలు పెట్టాలి? అనే తెలియని కంగారులో ఎవరికి వాళ్లు ఎవరో వస్తారు.. ఏదో చేస్తారు అని చూస్తూ కలలు కంటూ కూర్చుంటాం. ‘ఒక్కడు’ సినిమాలో హీరో క్రీడాకారుడు. ‘పసిడి పతకాల హారం కాదురా విజయ తీరం. ఆట అనే మాటకు అర్థం నిన్ను నువ్వే గెలుచు యుద్ధం’ అని పాట రాశాను. అలాగే ‘గోల్కొండ హైస్కూల్‌’లో ‘మొదలెట్టక మునుపే ముగిసే నడక కాదే మన పయనం, సమరానికి సై అనగలిగే సంసిద్ధత పేరే యుద్ధం’ అని రాశా.

పాట అంటే మనసుకు ఆనందాన్నిచ్చేది, ఆహ్లాదాన్ని కలిగించేది. ఇవాళ పాటల పోటీ అని పెట్టి, ‘మీరు ఓడిపోయారు.. మీరు గెలిచారు’ అని చెప్పటం మూలానే అసలు గెలుపనే మాటకు అర్థం తీసేశారు. పోటీలు పెట్టకండి. ఇలాంటి దౌర్భాగ్యపు భావాల్ని పెంపొందించకండి. యుద్ధం అంటే గెలిచాడు.. ఓడిపోయాడని కాదు. యుద్ధానికి నేను సిద్ధం అన్నప్పుడే గెలిచినట్టు. మన జీవితంలోకి ఇది అన్వయించుకుంటే ఏ కష్టం కష్టంలా తోచదు.

► బడి చదువుకి, జీవితపు చదువుకి తేడా చెబుతారా?
బడి చదువులు సులభమైనవి. జవాబులు చెప్పి, తర్వాత ప్రశ్నలు వేస్తుంది. కానీ జీవితపు చదువు ముందు ప్రశ్నేసి తర్వాత సమాధానం నేర్పుతుంది. జీవితం అక్కడ గొయ్యి ఉందని చెప్పదు. ముందు పడేస్తుంది. ఆ పడటం మనకు జీవితాన్ని నేర్పిస్తుంది. జీవితాన్ని మనం ఎలా తీసుకుంటున్నామనేది ముఖ్యం. శివరాత్రి రోజు భక్తితో పస్తుంటాం. ఒకరోజు అన్నం లేకా పస్తుంటాం. అప్పుడు భక్తితో ఊగిపోయాం, ఇప్పుడు ఆకలితో తల్లడిల్లిపోయాం. ఆకలి పస్తును భక్తి పస్తే అనుకుంటే ఇష్టంగా పస్తుంటాం.

► ‘తెలుగు పాట’లో పరభాష పదాల తాకిడి ఎక్కువైందనే  వాదన ఉంది. ఈ పరిస్థితి మారాలంటే మీరిచ్చే సలహా?
ఈరోజుల్లో అందరి సంస్కృతులు అందరికీ పరిచయం అవుతున్నాయి. చచ్చేలోపు కాశీకి పోకపోతే పుణ్యం రాదనుకుంటాం. ఇప్పుడు అమెరికాకు వెళ్లకపోతే బతుకు లేదనుకుంటున్నాం. ఇలా దేశవిదేశాల తాలూకు వివిధ సంస్కృతుల కలబోతలలో స్వీయ సంస్కృతులను, మనం పుట్టి పెరిగిన మూలాలను మర్చిపోయి ఎదుగుతున్నాం. అక్కడి నుంచి ఇక్కడి నుంచి తీసుకోవద్దు అనటం లేదు. కానీ పాట అనగానే షకీరా పాడిన పాటను తీసుకువచ్చి ఇక్కడ పెడతానంటే నువ్వు ఏ భావాన్నీ కలిగించలేవు.

సినిమా పాటలలో చాలా ప్రయోజనం ఉంది. ఆ ప్రయోజనం పరిపూర్ణంగా విస్మరించబడుతోందని నా అభిప్రాయం, అభియోగం కూడా. దీనికి కారకులు ఎవరంటే ఇచ్చేవాళ్లూ.. పుచ్చుకునేవాళ్లు. ఈ మధ్య  సినిమాలు ఎంత పెద్ద హిట్‌ అయినా కూడా పట్టుమని ఒక్క పాట కూడా నిలబడలేదు. నిర్మాతలకు నేను చెప్పేది ఏంటంటే పాట అంటే ఆరు లక్షల నుంచి ఆరు కోట్లు వరకు ఖర్చు అయ్యే ప్రొడక్ట్‌. అలాంటి పాట పట్ల అంత అశ్రద్ధ ఏంటి? సినిమా బావుంటే పాట లేక పోయినా చూస్తారు అనే స్థితికి ప్రేక్షకులు వెళితే పాటలు తీసేయ్‌.

డబ్బులు మిగులుతాయి కదా. లేదా ఈ పాటలు మాకు కావాలని వాళ్లు తహతహలాడాలి. పూర్వం తహతహలాడే వారు. సాహిత్యం కాకపోయినా ఆ సంగీతం అయినా చాలా కమ్మగా ఉండేది. ఆ రోజుల్లో విశ్వనా«థ్‌గారి సినిమాల్లో ఒక పాట కూడా మిస్‌ అయ్యేవారు కాదు. ఆ పాట ఏదో చెబుతుంది. ఈరోజుల్లో తెలుగు పాట నిద్రావస్థ స్థితిలో ఉంది. నేను ఆశావాదిని. నిద్ర అంటే లేస్తాం. నిదనం అంటే చావు. ఇది నిద్ర తప్ప నిదనం కాదు. ఈ ఉగాది సందర్భంలో అయినా మంచి పాట కావాలని మీరు, చేయాలని నటులు అనుకుంటే సరిపోతుంది.

► మీరు అనేక దేశాల్లోని తెలుగువాళ్లను కలుస్తుంటారు. తెలుగుదనాన్ని కాపాడుకోవడంలో అక్కడివాళ్ల చిత్తశుద్ధికి, ఇక్కడివాళ్ల చిత్తశుద్ధికి ఎలాంటి తేడా గమనించారు?
నిస్సంశయంగా ఇక్కడికంటే అక్కడే బాగుంది. వాళ్లు ఎందుకు వెళ్లినప్పటికీ కూడా ఒక ‘నోస్టాలిజిక్‌’ ఫీలింగ్‌ ఉంటుంది. అది మానవ సహజం. మనం ఒక ఊరి నుంచి ఇంకో ఊరికి మారేటప్పుడు మొత్తం సామానంతా పట్టుకెళ్లలేం. నా చిన్నప్పటి సంగతి చెబుతున్నా. ఒక ఊరి నుంచి ఇంకో ఊరికి వెళ్లేటప్పుడు అయిష్టంగా రుబ్బు రోలు ఇచ్చేస్తాం. ఆ బరువు తీసుకెళ్లలేక (నవ్వుతూ). వాళ్లు ఇక్కడ ఉంటే చేసుకుంటారో లేదో చెప్పలేం.

ఇక్కడ ఉన్నప్పుడు చేసుకున్నవి అక్కడికెళ్లాక చేసుకోలేకపోతున్నాం అనే బెంగ ఉంటుంది. ఆ బెంగ వల్ల చేసుకుంటున్నారు. కష్టపడి వేప పువ్వు సంపాదించుకుని పచ్చడి చేసుకుంటున్నారు. వాళ్ల దేశాలు ఒప్పుకోకపోతే ఇంట్లో గుట్టుగా ఎలక్ట్రికల్‌ భోగి మంటైనా వేసుకుంటున్నారు. అక్కడికెళ్లినప్పుడు నేనేం చెప్పానంటే... ‘‘పండగ పరమార్థం తెలుసుకుని చేయండి. అమెరికాలో పేడతో పనులు చేయడం అనేది శుభ్రం కాదని వాళ్లు ఒప్పుకోరు. మీరు అమెరికాకు పోవద్దు. వెళితే అమెరికాకు తగ్గట్టే ఉండాలి.

సంక్రాంతి వచ్చినప్పుడు ఏదో చట్టవిరుద్ధమైన పని చేస్తున్నట్లు రహస్యంగా పేడ సేకరించి తలుపులేసుకుని, గొబ్బెమ్మలు పెట్టి, ఇంగ్లిషు మాట్లాడే మీ పిల్లలకు పట్టు లంగాలు తొడిగి,‘బొహియల్లో బొహియల్లో’ అని తిప్పకండి. మీకు సంక్రాంతి కావాలంటే సంక్రాంతి తాలూకు అర్థాన్ని చెప్పండి. పుష్యమాసంలో పంట ఇంటికి వస్తుంది. నేను తినడానికి ముందు సమాజంలో ఉన్నవాళ్లకు నా వంతుగా ఇస్తా అనే సంప్రదాయం ఏదైతే ఉందో అదీ సంక్రాంతి అంటే. సమైక్య క్రాంతి అని అంటాం. ఆ రోజు తెలుగువాళ్లందరూ ఒకచోట కలవండి. అవసరమైన వాళ్లకు ఇవ్వండి. అంతేకానీ పేడ చుట్టూ తిరగక్కర్లేదు.

► తెలుగువారి ఖ్యాతికి జాతీయ స్థాయిలో న్యాయం జరుగుతోందని మీకనిపిస్తోందా? ‘పద్మ’ అవార్డుల విషయంలో మీ అభిప్రాయం ఏంటి?
అవార్డులనేవి ఎప్పుడూ వివాదాస్పదంగానే ఉంటాయి. ఎందుకంటే ఒక ఐదారుగురు కూర్చుని, ఇవ్వబడిన తక్కువ సమయంలో అనేకమైన సినిమాలు చూసి, గబగబా నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయంలో, ఇంకా ఇతరత్రా పైరవీలు.. ఇలా చాలా కారణాలు ఉంటాయి. ఒక అవార్డు ద్వారా నీ విలువను నిరూపించకూడదు. ఒక విలువని గుర్తించి, గౌరవించడం కోసమే అవార్డు పుట్టింది కానీ అవార్డుల కోసం విలువ పుట్టలేదు.

ఏనాడైతే నువ్వు రాసిన పాట పది మంది పెదాల మీద కూనిరాగాలు తీస్తుందో అదే పెద్ద అవార్డు కింద లెక్క. అది కాకుండా చెక్కముక్క మీద పద్మశ్రీ రాసి ఇస్తే, అది నా గోడకు తగిలించుకుంటే ఏం ప్రయోజనం? అంటే.. రాక ఏడుస్తున్నావా? అని మీరు అనొద్దు. నాకన్నా అవార్డులు పొందినవాళ్లు తెలుగులో ఎవరూ లేరు. అవార్డులు తీసుకుంటున్నప్పుడు నేను ఒకటే చెబుతా... మనం పెట్టుకున్నటువంటి, మనం విధించుకున్నది ప్రభుత్వం. తప్పూ తేడా ఉంటే సరిదిద్దుకుందాం.

మనం ఏర్పాటు చేసుకున్న మన వ్యవస్థను గౌరవించుకోవడానికి సంకేతం కోసమే అవార్డులను స్వీకరిస్తాను తప్ప అవార్డు వచ్చిన ఆ పాట మాత్రమే గొప్పది అని కాదు. దాని విలువను జడ్జి చేయడానికి అక్కడ కూర్చున్న కమిటీ సరిపోదు.. సమయమూ సరిపోదు. అసలు నేను ‘పద్మశ్రీ’ తెచ్చు కునే ఇండస్ట్రీకి వచ్చాను అని ఆ మధ్య ఓ సందర్భంలో అన్నాను. నా భార్య పేరు ‘పద్మ’ (నవ్వుతూ). నా జీవితాన్ని ఇవాళ మీరొచ్చి ఇంటర్వ్యూ అడిగేదాకా తీసుకొచ్చింది ఆవిడే. ఈ వెన్నెల్లో ‘సిరి’ ఆవిడే.  

► తెలుగు సంప్రదాయాల్ని మీ ఇంట్లో ఎలా మార్గదర్శకత్వం చేస్తుంటారు?
నేను నమ్మేది ఒక్కటే. పిల్లలకు ఏమీ చెప్పడానికి ప్రయత్నించొద్దు. పిల్లలు చాలా చురుకైన మేధస్సు కలిగినవాళ్లు. వాళ్ల మెదడు ఖాళీగా ఉంటుంది. గబగబా నింపుకోవడానికి సిద్ధంగా ఉంటుంది. రెండు కళ్లతో ప్రపంచాన్ని తాగేయడానికి చూస్తుంటారు. వాళ్లకు ఏం కనిపించాలి? వాళ్ల చెవులు ఏం వినాలి? వాళ్ల చేతులు ఏం పుచ్చుకోవాలి? అన్నది మొట్టమొదట వేసుకో వాల్సిన ప్రశ్న. అమ్మా నాన్న ఇద్దరూ ఏం మాట్లాడు కుంటే వీళ్లేం వింటారు.

సో.. ఇంట్లో జీవించండి. ఆడదాని నుంచి ఇల్లాలివై, ఆ తర్వాత అమ్మ అయ్యావు. ఒక మగాడివై భర్త అయ్యి, తండ్రి అయ్యావు. దానికి తగ్గట్టు ఇద్దరూ జీవించాలి. మీలో అంతవరకూ ఏమైనా లోపాలుంటే  దిద్దుకుని ఇంతకు మునుపు లేని విలువలు తెచ్చిపెట్టుకోవాలి. అంతకు ముందు లక్ష్యం లేకుండా తిరిగితే లక్ష్యం పెట్టుకో. నా పాటల్లో ఇదే రాశాను. నా పాటల్లో ఒకలా జీవితంలో ఒకలా నేను లేను. పాటల్లో చెప్పే నీతినే ఆచరిస్తున్నాను.


► ‘చేదైనా గాని ఇష్టంగానే తింటున్నామంటే ఉగాది అనుకోమా..’ అని ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’లో ‘మరీ అంతగా మహా చింతగా..’ పాటలో రాశారు. ఎంతో అర్థం ఉన్న ఆ వాక్యం గురించి వివరంగా చెబుతారా?
మనకు అవకాశం ఉందని చేదు లేకుండా పచ్చడి చేస్తే ఏదో లోపించినట్టు ఫీలవుతాం కదా. చేదును కోరుకుంటున్నాం. అదీ ఎప్పుడు? జీవితానికి మరో కొత్త ప్రారంభం (కొత్త సంవత్సరం) అనుకుంటున్న రోజు. అదే కదా ఉగాది. ఉగాది పచ్చడి ఆరు రుచులలో చేదు, కారం ఉంటాయి. అవి ఇష్టంగా తీసుకుంటున్నాం. ఆ రుచులను మన జీవితానికి అన్వయించుకుంటే కష్టాలు వచ్చినప్పుడు అవసరమైన దానికంటే ఎక్కువ తల్లడిల్లి పోము. తల్లడిల్లకూడదని కాదు. ఎక్కువ తల్లడిల్లకూడదంటున్నాను. అలా రాయడానికి ఆ సినిమాలో అవకాశం దొరికింది. ఎంతో ఇష్టంగా రాశానా పాట. సంగీతప్రియులకు నచ్చింది. నంది అవార్డు గెలుచుకున్నాను.

► కుటుంబ విలువలను శ్లాఘించే పాటలెన్నో రాశారు. ఇవాళ తెలుగు కుటుంబాలు ఎలా ఉన్నాయని మీకనిపిస్తోంది?
మా చిన్నతనంలో ఉన్నవి కొన్ని డిగ్రీలే. ఏదో గుమస్తా ఉద్యోగమో.. మహా అయితే బ్యాంక్‌ ఆఫీసర్‌ ఉద్యోగమో. ఎప్పుడైతే అవకాశాలు తక్కువ అనుకున్నామో అప్పుడు చదువుకుని, ఓ ఉద్యోగం చూసుకునే వాళ్లం. త్వరగా పెళ్లి చేసుకుని, వంశం నిలబడాలి కాబట్టి, పిల్లల్ని కనేవాళ్లం. ఇప్పుడలా కాదు. 40 ఏళ్ల వయసు వచ్చేవరకూ చదువుతూనే ఉంటారు. సెటిల్‌ కాలేదని పెళ్లి చేసుకోవడం లేదు. ఇప్పుడంతా 40ఏళ్ల పెళ్లికొడుకు లు, 35 ఏళ్ల పెళ్లి కూతుళ్లు. భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలకు వెళ్లిపోతున్నారు.

వారి స్పర్శ తాలూకు వెచ్చదనం పిల్లలకు ఎక్కడ తెలుస్తుంది? తెలుగు కుటుంబాలు అనేకన్నా ఇవాళ కుటుంబం అనేది భారతదేశంలో విచ్ఛిన్నం అవుతోంది. అనేక రకాల ఆరాటాలు, సమస్యలతో జీవితాన్ని క్లిష్టమయం చేసుకుని ఏం సాధిస్తున్నావ్‌? ఇవాళ ప్రతి ఒక్కరికీ కారు ఉంది. నా చిన్నతనంలో ఒక్క సైకిల్‌ ఉండేది. నలుగురైదుగురు సర్దుకునేవాళ్లం. మాకది బాగుండేది. మేం జీవితంలో ఒక్కసారైనా కారు ఎక్కాలని కల కన్నాం.

ఇవాళ కళ్లల్లోంచి కలలు కూడా రాలిపోయాయి. ఎందుకంటే ప్రతి ఒక్కరికీ  రెండేసి కార్లు ఉన్నాయి. కారు ఉంది కాబట్టి 250 మైళ్ల దూరంలో ఆఫీసు ఉన్నా వెళుతున్నారు. కారు అనేది  పరిగెత్తడానికి పనికొస్తోంది... సౌకర్యానికి కాదు. ఈరోజు సాంకేతిక ప్రగతి అనేది మనకు సుఖం ఇవ్వడంలేదు. అంటే వికాసం వద్దనను. 1995లో వచ్చింది సెల్‌ఫోన్‌. ఇప్పుడు సెల్ఫీలు తీసుకుని చనిపోయే పరిస్థితికి రావడం అనేది ఏ రకమైన సాంకేతిక వికాసం.

ఇది అడిగేవాళ్లు లేరు. అడిగితే చెప్పేవాళ్లు లేరు. చెబితే వినేవాళ్లు లేరు. ‘నువ్వంటే నువ్వు కాదు. ఒక వ్యవస్థవి. ఈ వ్యవస్థకి పునాది ఒక కుటుంబం. నీ కుటుంబంలోను, పక్క కుటుంబంలోనూ నీతో పొంతనలేనివాళ్లు ఉంటారు. వాళ్ల కోసం నీ ఇష్టాలను వదులుకుని గడపడమే కుటుంబం, పక్క కుటుంబం. పక్క కుటుంబం ద్వారానే ఊరు, ఊరు ద్వారా రాష్ట్రం, రాష్ట్రం ద్వారా దేశం. ఇలా అయితేనే ఎప్పటికైనా నిలబడగలుగుతాం. లేకపోతే క్రమంగా విచ్ఛిన్నం తప్పదు.

► భారతీయులంతా ఒక్కటే అనే భావనతో బతకాలి అంటుంటాం. కానీ నీ ప్రాంతం.. నా ప్రాంతం.. నీ భాష.. నా భాష అంటూ గొడవలు పడుతున్నాం. దీనిపై మీ అభిప్రాయం?
ఇటీవల కాలంలో భారతీయత అనే కాన్సెప్ట్‌ మరుగునపడిపోయి తమ తమ ప్రాంతాలతో తోటి, తమ తమ యాసలతోటి, భాషలతోటి ఉనికిని ప్రదర్శించుకోవడానికి ఉత్సాహపడుతున్నారు. చెట్టు మూలాలను నరుక్కుంటూ బయటికొచ్చేస్తున్న పరిస్థితి. భారత మాత ఒక్కటే. తెలుగు తల్లి, తమిళ తల్లి అని లేదు. కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు అందరం మన తల్లిదండ్రులను దేవతలుగా పూజించాలి అని విశ్వసిస్తాం. మన పుట్టుక ముందు నుంచీ ప్రయాణం ఉంది.

చనిపోయాక కూడా మన ప్రయాణం ఉంది. ఇలాంటి ఆలోచనలతో ఉన్న మనం ఇవాళ మన భాష ద్వారా మనం వేరుపడుతున్నాం. ‘నేను బెంగాలీవాణ్ణి కాదు.. నేను తమిళీయుణ్ణి’ అంటున్నారు. మొన్నటికి మొన్న కర్ణాటకవాళ్లు జెండా తయారు చేసుకున్నారు. ఇది వినాశకర ఆలోచన. ఇప్పుడు కూడా మనం తెలంగాణ, ఆంధ్రాగా విడిపోయింది పరిపాలనా సౌలభ్యం కోసం, భౌగోళికంగానూ, భౌతికంగానూ, రాజకీయంగానూ మారాం. అది తప్పు లేదు. రెండు తెలుగులు లేవు. ఒకటే తెలుగు ఉంది. మనము, తమిళులం, అందరం.. ఈ భారతదేశపు వివిధ శాఖలం అనుకోవాలి. సమైక్యంగా ఉండాలి.

ఎవరో పోయారని అదే పనిగా తలుచుకుంటే వాళ్లు మళ్లీ రారు. వాళ్లు మనల్ని ఎంతగాప్రేమించారో  గుర్తుపెట్టుకుంటే వాళ్లు మనతోనే బ్రతికి ఉన్నట్టు లెక్క. మన తల్లిదండ్రులుఎప్పుడూ పోరు అని మనం గుర్తుపెట్టుకోవాలి. వయసు వాళ్ల శరీరాల్ని తీసుకువెళ్తుంది. వాళ్లేవాళ్ల ప్రాణాల్ని, ఆత్మల్ని మనలో పెట్టారు. ఆ సంగతి గ్రహిస్తే వాళ్లు పోయినట్టు లెక్క కాదు.

– డి.జి. భవాని

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement