Sirivennela Seetharama Sastry: సిరివెన్నెల సీతారామశాస్త్రి.. తెలుగు పాటకు అందాన్నే కాక గౌరవాన్ని కూడా తీసుకువచ్చారు. తెలుగు సినీ పాటకు విశ్వ ఖ్యాతిని తెచ్చిన సిరివెన్నెల అస్తమయాన్ని ప్రేక్షకులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన మనమధ్య లేకపోయినా ఆయన రాసిన పాటలు మాత్రం అందరి హృదయాల్లో సజీవంగా మిగిలిపోనున్నాయి. ఆయన రాసిన పలు పాటలు ఇంకా విడుదల కావాల్సి ఉంది. అందులో శ్యామ్ సింగరాయ్ సినిమాలో రాసిన రెండు పాటలు కూడా ఉన్నాయి. అయితే ఆ పాటలు రాస్తున్న క్రమంలోనే తన మరణాన్ని ఊహించినట్లున్నారు సిరివెన్నెల. ఇదే నా చివరి పాట అని రాహుల్‌తో అన్నారట!
తాజాగా ఈ విషయాన్ని దర్శకుడు రాహుల్ ప్రేక్షకులతో పంచుకున్నాడు. 'నవంబర్ 3వ తేదీన రాత్రి సిరివెన్నెల సీతారామశాస్త్రి ఫోన్ చేసి తన ఆరోగ్యం సహకరించక ఈ పాటను పూర్తి చేయలేకపోతున్నాను.. ఇంకెవరితోనైనా రాయిద్దాం అన్నారు. పర్లేదు సర్ అన్నాను. ఆ తర్వాతి రోజు ఉదయం 7 గంటలకు ఫోన్ చేసి నన్ను నిద్ర లేపారు. ఆరోజు దీపావళి. ఆయన ఫోన్ చేసి పల్లవి అయిపోయింది చెప్తాను రాస్కో అన్నారు.
నేను వెంటనే పక్కనున్న మహాభారతం పుస్తకంలో పల్లవి రాశాను. అందులో మొదటి వాక్యంలో సిరివెన్నెల తన పేరు రాశారు. ఎందుకుసార్ ఈ పాటకు సంతకమిచ్చారని అడిగితే.. బహుశా ఇదే నా ఆఖరి పాట అవచ్చు అని గట్టిగా నవ్వారు... ఈ పాట రికార్డింగ్ మొదలు పెట్టిన రోజునే ఆయన అంత్యక్రియలు జరిగాయి. పాట చాలా బాగా వచ్చింది, అందుకే ఈ సాంగ్‌కు ఆయన పేరే పెట్టాం' అని చెప్పుకొచ్చాడు. హీరో నాని మాట్లాడుతూ.. శ్యామ్ సింగరాయ్ సినిమాను సిరివెన్నెల సీతారామశాస్త్రికి అంకితమిస్తున్నట్లు ప్రకటించాడు.
Comments
Please login to add a commentAdd a comment