సినిమా సాహిత్యం నాడు-నేడుపై వెన్నెలకంటి వ్యాఖ్య
డాక్టర్ ఏబీ సాయిప్రసాద్, బూదాటి వెంకటేశ్వర్ల ప్రసంగాలు
మద్రాసు విశ్వవిద్యాలయంలో ధర్మనిధి ఉపన్యాసాలు
చెన్నై : ఆ కాలంలో సినిమాలు, సాహిత్యాలు బాగుండేవి, నేడు దారుణంగా మారాయని కొందరు చేసే విమర్శలు అర్థరహితమని ప్రముఖ సినీరచయిత వెన్నెలకంటి అన్నారు. కాలానుగుణంగా సినిమా ప్రమాణాలు మారిపోతుంటాయే గానీ పడిపోవడం జరగదని ఆయన స్పష్టం చేశారు.
మద్రాసు విశ్వవిద్యాలయం తెలుగుశాఖ అధ్యక్షులు మాడభూషి సంపత్‌కుమార్ నేతృత్వంలో ధర్మనిధి ఉపన్యాసాల కార్యక్రమం బుధవారం జరిగింది. ఈ సందర్భంగా ఆర్కాటు ప్రకాశరావు ధర్మనిధి ఉపన్యాసం పేరున సినిమా సాహిత్యం-నాడు, నేడు అనే అంశంపై వెన్నెలకంటి ప్రసంగించారు.
సినిమా సాహిత్యంలో నాడు - నేడు అనే ప్రస్థావనే తగదని అన్నారు. 1913లో భక్త ప్రహ్లాద చిత్రం ద్వారా చందాల కేశవదాస్‌తో సినీ రచయిత ప్రారంభం కాగా ఈ 2016వ సంవత్సరంతో నాడు - నేడుగా ఇలా విడగొడుతామని చెప్పారు. సినిమా సమాజం ఒక దాని కొకటి ప్రతిబింబించాలని ఆయన పేర్కొన్నారు.
శంకరాభరణం వంటి ఉన్నతమైన చిత్రం వచ్చిన రోజులలో నాసిరకం చిత్రాలు కూడా విడుదలయ్యాయని తెలిపారు. అయితే శంకరాభరణం చిత్రం ప్రభావం వలన ఎందరో సంగీతాభిలాషను ప్రదర్శించారని తెలిపారు. అలాగే సాగరసంగమం సినిమా విడుదల కాగానే నృత్య కళాశాలలు నిండిపోయాయని అన్నారు. అదేరీతిలో శివ సినిమా వచ్చినప్పుడు ప్రతి విద్యార్థి సైకిల్ చైన్‌తో హీరోయిజం ప్రదర్శించారని ఆశించారన్నారు.
విద్య, ఉద్యోగాలలో తగిన వేషధారణ ఉన్నట్లుగానే సినిమా సాహిత్య ధోరణి కూడా కాలానుగుణంగా మారుతుందని, ప్రేక్షకుడు గ్రహించే తీరును బట్టి అర్థాలు మారిపోతాయన్నారు. సినీ కవుల్లో ఒక్కొక్కరు ఒక్కో అంశాలలో అగ్రజులుగా వెలిగారని తెలిపారు.
సీనియర్ సముద్రాల ఒక తరాన్నే శాసించారని చెప్పారు. పింగళి సాహిత్యం నేటికీ విరాజిల్లుతోందన్నారు. పింగళి సాహిత్య గుభాలింపుకు మాయాబజార్ చిత్రం ఒక పెద్ద ఉదాహరణ అని చెప్పారు. అలాగే జానపద సాహిత్యంలో కొసరాజు నేటికి మేటి అని అన్నారు. ద్వంద్వర్థాల పాటలు రాస్తారనే విమర్శలను ఎదుర్కొన్న వేటూరు సుందరరామమూర్తి కలం నుండి కిరాతార్జునీయం అనే అద్భుత కవిత జాలువారిందని తెలిపారు. బంగారు కోడిపెట్ట వంటి మాస్ సాంగ్‌ను రాసిన భువన చంద్ర మేధస్సు నుండి ఇది తరతరాల చరితం అనే అద్భుత సాహిత్యం ప్రేక్షకులను మైమరపించిందని చెప్పారు.
గీతాల రచనలలో దేవులపల్లి కృష్ణశాస్త్రి, సినీ శ్రీ ఆరుద్ర, రాజశ్రీ, గోపి, సి.నారాయణరెడ్డి, సిరివెన్నెల సీతారామశాస్త్రి, చంద్రబోస్, అనిశెట్టి, మల్లెమాల, జొన్నవిత్తుల సాహితీ, సుద్దాల అశోక్ తేజ, వనమాలి.. ఎవరి ప్రత్యేకతలు వారివన్నారు. మహాకవి ఆత్రేయ వెండితెర వేమనగా ప్రసిద్ధి చెందారని చెప్పారు. సంగీత దర్శకుడు కీరవాణి, దేవిశ్రీ ప్రసాద్ సైతం అద్భుత సాహితీ వేత్తలని కొందరికే తెలుసని అన్నారు. తాను సైతం తక్కువ కాకుండా మంచి పాటలనే రాశానని తెలిపారు. తన వారసుడిగా సినీ రంగంలోకి అడుగుపెట్టిన కుమారుడు శశాంక్ అందాల రాక్షసి అనే సినిమాలో మనసు పలికే భాష ప్రేమ అనే పాటను రాసి సీనియర్ రచయితల మన్ననలను పొందారని తెలిపారు.
ఇలా సినీ సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన మహా కవులను, రచయితలను ఆయన పేరు పేరునా ప్రస్థావించారు. ఆచార్య గంధం అప్పారావు ధర్మనిధి ఉపన్యాసం కింద వేమన మానవతావాదం అనే అంశంపై డాక్టర్ ఎబి సాయిప్రసాద్ ప్రసంగించారు. మానవతావాదం అనేది మనిషి వ్యక్తిత్వం పైనే ఆధారపడి ఉంటుందని అన్నారు.
నార్ల వారు తన సాహిత్యంతో గొప్ప మానవతావాదిగా ప్రూవ్ చేసుకున్నారని చెప్పారు. ఇప్పటికీ ప్రజల నీతిబోధలకు ఒక దిక్సూచీగా వేమన శతకాలు ఉన్నాయన్నారు. మనిషి లోటుపాట్లు తెలిసిన వ్యక్తి వేమన అని ఆయన అభివర్ణించారు. ప్రజలలో ఆకలి - ఆహారం అనే రెండు వర్గాలు ఉన్నాయన్నారు. ఆకలి ఉన్నవారి వద్ద ఆహారం ఉండదు,
ఆహారం అందుబాటులో ఉన్న వారికి ఆకలి ఉండదని ఆయన పేర్కొన్నారు. మనిషి స్వర్గానికి వెళ్లడం కాదు స్వర్గాన్నే మనిషి వద్దకు తీసుకురావడమే మానవతావాదమని చెప్పారు. మానవతావాది క్షమాగుణం కలిగినవారై ఉండాలని ఉద్భోధించారు. ఆచార్య ములుమూడి ఆదిలక్ష్మి ధర్మనిధి ఉపన్యాసం కింద మహాభారతం - మానవీయ ధృక్పథం అంశంపై ఆచార్య బూదాటి వెంకటేశ్వర్లు ప్రసంగించారు.
ఏ సాహితీవేత్త నేలవిడచి సాముచేయడు, మానవీయ కోణాన్నివదలడని అన్నారు. నేటి సామాజిక రాజకీయ పరిస్థితులను ఆనాటి మహాభారతంతో పోల్చవచ్చని అన్నారు. మహాభారతం ఈనాటి సమాజానికి అద్ధమని, నేటి రాజకీయాలలో దాదాపుగా అందరూ దుశ్శాసనులేనని అన్నారు. జూదంలో ఓడిపోయి పాండవులు అడవుల పాలైనప్పుడు కౌరవులు వంటి దుర్మార్గుల పాలనలో ఉండలేమని, మీ వెంటే వస్తామని ప్రజలు వెంటబడినట్లు వెంకటేశులు తెలిపారు. అంటే ప్రజలెప్పుడు మంచి పాలకులనే కోరుకుంటారనే అర్థాన్ని నేటికీ అన్వయించుకోవచ్చని తెలిపారు. అలాగే మహాభారతంలో అణువణువునా మానవీయం కూడా కనిపిస్తుందని చెప్పారు. సమస్థ ప్రకృతి మానవీయమేనని పేర్కొన్నారు. పలువురు ఔత్సాహిక కవులు, ప్రముఖులు పాల్గొన్నారు.