‘మన జీవితంలో పండగ వచ్చినా, నిశ్చితార్థం జరిగినా, పెళ్లి వేడుక, పిల్లాడు పుట్టినా, సుప్రభాత పూజ చేస్తున్నా... ప్రతి సందర్భానికి లతా పాడిన పాట ఉంటుంది. వింటాము. లతా అలా మన జీవితంలో మనకు తెలియకుండానే నిండి పోయింది. అందుకనే ఆమె ఎప్పటికీ వినపడుతూనే ఉంటుంది’ అని గీత రచయిత గుల్జార్ అన్నారు.
శనివారం జరిగిన జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్‌లో లతా మంగేష్కర్ మీద వెలువడ్డ తాజా పుస్తకం ‘లతాజీ– ఏ లైఫ్ ఇన్ మ్యూజిక్’ ఆవిష్కరణ సందర్భంగా గుల్జార్ మాట్లాడారు. ‘బందినిలో మొర గోర అంగ్ లైలే... నా మొదటి పాట. కాని దానికి మూడేళ్ల ముందు నుంచి లతా దీదీ సంగీత దర్శకుడు ఎస్.డి.బర్మన్‌తో మాట్లాడటం లేదు. ఎస్.డి.బర్మన్ కూడా ఆమెతో మాట్లాడదలుచుకోలేదు. నేనేమో పాట రాశాను.
లతా నా పాటను మెచ్చి మొత్తం మీద పాడి నాకు సినిమా రంగంలో ప్రవేశానికి వీసా ఇచ్చింది. ఆ తర్వాత తను ప్రొడ్యూసర్‌గా నా దర్శకత్వంలో ‘లేకిన్’ నిర్మించింది. నేను ఆమె మీద అభిమానంతో ‘నామ్ గుమ్ జాయేగా’ (కినారా) పాట రాశాను. ఆ పాటలోని ‘మేరి ఆవాజ్ హీ పెహెచాన్ హై’ అనే లైన్‌ను మీరు ఆటోగ్రాఫ్ చేసేప్పుడు మెన్షన్ చేసేందుకు వీలుగా రాశాను అని లతాతో చెప్పాను. ఆ లైనే ఆమె బతికి ఉండగానేగాక మరణించాక ఒక అస్తిత్వంగా మారింది’ అన్నాడు.
‘లతాజీ– ఏ లైఫ్ ఇన్ మ్యూజిక్’ పుస్తక రచయిత యతీంద్ర మిశ్రా మాట్లాడుతూ ‘ఇవాళ గాయనీ గాయకులు పొందుతున్న రాయల్టీ సౌకర్యాలకు, అవార్డులకు లతా మొదలెట్టిన పోరాటమే కారణం. ఫిల్మ్‌ఫేర్ అవార్డు కొత్తల్లో గాయనీ గాయకులకు ఇచ్చేవారు కాదు. సంగీత దర్శకులకే ఇచ్చేవారు. ‘చోరి చోరి’ సినిమాలోని ‘రసిక్ బల్మా’ పాటకు శంకర్ జైకిషన్‌కు ఫిల్మ్‌ఫేర్ వచ్చింది. ఆ వేడుకలో ఆ పాట పాడమని జైకిషన్ లతాను పిలిచాడు. అవార్డు మీకు వచ్చింది... వెళ్లి ట్యూన్ వాయించండి సరిపోతుంది అందామె. గాయని లేకుండా పాట ఎలా? టైమ్స్ గ్రూప్ అధినేత రంగంలో దిగి ఫోన్ చేసి బతిమిలాడినా పాడలేదు. దాంతో ఇంకో రెండేళ్లకు గాయనీ గాయకులకు ఫిల్మ్‌ఫేర్ ప్రవేశపెట్టారు. రాయల్టీ విషయంలో కూడా లతా పట్టుదల వల్లే గాయనీ గాయకులకు డబ్బులు వచ్చాయి’ అని తెలియచేశాడు.
లతా పాడిన పాటల వెనుక కథలు, విశేషాలతో ‘లతాజీ– ఏ లైఫ్ ఇన్ మ్యూజిక్’ వెలువడింది.
Comments
Please login to add a commentAdd a comment