‘పిల్లలతో స్నేహంగా ఉండండి. వాళ్లు తల్లిదండ్రులకు భయపడేలా ఉంచకండి. వాళ్ల నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉంటాయి’ అంటున్నారు సుధామూర్తి. 15 ఏళ్ల వయసున్నప్పుడు 45 ఏళ్లు ఉన్న తనకు తన కూతురు అక్షత నేర్పిన పాఠం వల్ల తాను ఈ రోజు సామాజిక సేవ చేస్తున్నానని అన్నారు.
‘పిల్లలకు తమ మీద తాము ఆధారపడటం నేర్పాలి. ఆనందం పొందడం నేర్పించాలి. నా తల్లిదండ్రుల నుంచి అదే నేర్చుకున్నాను. నా పిల్లలకూ అదే నేర్పాను’ అన్నారు సుధామూర్తి. జైపూర్‌లో జరుగుతున్న లిటరేచర్ ఫెస్టివల్‌లో పాల్గొని తల్లిదండ్రులను, యువతను ఉద్దేశించి తన పుస్తకాల నేపథ్యంలో మాట్లాడారు.
‘పిల్లల నుంచి తల్లిదండ్రులు... తల్లిదండ్రుల నుంచి పిల్లలు నేర్చుకుంటూనే ఉండాలి. అలా జరగాలంటే ఇద్దరి మధ్య భయం లేని సంభాషణ జరిగే వాతావరణం ఉండాలి. తల్లిదండ్రులను చూసి పిల్లలు భయపడేలా ఉంటే తమ మనసులోది చెప్పకుండా ఉంటారు. అప్పుడు ఇరుపక్షాలకూ నష్టం జరుగుతుంది’ అన్నారు సుధామూర్తి.
తొలికాలపు మహిళా ఇంజినీర్‌గా, ఇన్ఫోసిస్ దిగ్గజంగా తనకు ఉన్న గుర్తింపు కంటే పుస్తకాలు రాయడం ద్వారా ‘దేశానికి అమ్మమ్మ’గా తనకు వస్తున్న గుర్తింపు, తన రాతలూ మాటలూ నవతరం వింటున్న తీరు తనకు ఎంతో ఆనందం కలిగిస్తోందని అన్నారామె. జైపూర్‌లో జరుగుతున్న లిటరేచర్ ఫెస్టివల్‌లో శుక్రవారం క్రిక్కిరిసిన పాఠకుల మధ్య ‘మై బుక్స్ అండ్ బిలీఫ్స్’ అనే అంశం మీద మాట్లాడారు.
► ఆడపిల్ల గొప్పతనం
‘ఆడపిల్ల దేనిలోనూ తక్కువ కాదని నేను నిరూపించదల్చుకున్నాను. మా నాన్న డాక్టర్. నేను డాక్టరైతే బాగుంటుందని అనుకున్నాడు. మా అమ్మ లెక్కల టీచర్. నేను కూడా లెక్కలు టీచరు అయితే సరిపోతుందని భావించింది. కాని నేను అప్లయిడ్ సైన్స్‌లో ఇంజినీరింగ్ చేద్దామని నిశ్చయించుకున్నాను. ఇంజినీరింగ్ మగవారి విద్య అని అప్పటివరకూ భావన. మా నానమ్మ నేను ఇంజినీరింగ్ చదివితే తమ ఇళ్లల్లో కుర్రాళ్లు ఎవరు పెళ్లి చేసుకుంటారని హడలిపోయింది.
ఆడపిల్లలు ఇంజినీరింగ్ చేస్తారని తెలియక నేను చదివిన కాలేజీలో లేడీస్ టాయిలెట్ కట్టలేదు. నేను చేరాక కూడా ఈ సెమిస్టర్ అయ్యాక మానేస్తుంది వచ్చే సెమిస్టర్‌లో మానేస్తుంది అని కట్టలేదు. నేను మానలేదు. పట్టుదలగా ఇంజినీరింగ్ పూర్తి చేశాను. జ్ఞానం ఏ ఒక్కరి సొంతం కాదు... అందరిది... అదే నేను నిరూపించాను. ఏ ఇంటి అమ్మాయిలైనా ఇలాంటి పట్టుదలతో ఉండాలి. మీ మీద మీరు ఆధారపడి ముందుకు పోవాలి’ అందామె.
► కూతురి పాఠం
‘ఇంజినీరింగ్ పూర్తయ్యాక నేను మంచి ఇంజనీర్‌ని అనిపించుకోవాలని... మగవాళ్ల కంటే బాగా పని చెయ్యాలని ఉద్యోగంలో విపరీతంగా కష్టపడేదాన్ని. (భర్త నారాయణమూర్తితో) ఇన్ఫోసిస్ స్థాపించాక లాభాల గురించి పత్రికల్లో వార్తలు వచ్చినా పిల్లలకు అది పెద్ద విషయంగా చూపేదాన్ని కాదు. అంతేకాదు, పది రూపాయలు పిల్లలకు ఇచ్చినా లెక్క అడిగేదాన్ని.
ఇలా ఉండగా నా కూతురు అక్షత, అప్పుడు 15 ఏళ్లు ఉంటాయి, తనకు తెలిసిన ఒక పేద పిల్లాడికి కాలేజీలో సీటు వచ్చిందని, ఆ అబ్బాయిని స్పాన్సర్ చేయమని నన్ను అడిగింది. నేను నా పని హడావిడిలో ఆ మాట విని– నువ్వు స్పాన్సర్ చెయ్ అనేశాను తేలిగ్గా. దానికి నా కూతురు భయపడకుండా– అమ్మా... నీకు 45 ఏళ్లు వచ్చాయి. మంచి స్థితిలో ఉన్నావు. ఆదాయం ఉంది. ఒకరికి సాయం చేయగలవు.
నాకు నువ్వు పాకెట్ మనీ కూడా ఇవ్వవు. కాని సాయం చేయమనేసరికి నన్ను చేయమంటున్నావు. చేయగలిగిన స్థితిలో ఉండి నువ్వు చేయలేనప్పుడు ఇంకొకరు సాయం చేయాలని ఆశించకు అంది. ఆ రోజు ఆఫీస్‌కు వెళ్లి అలా కూర్చుండిపోయాను. రెండు రోజులు ఆ మాటలు వెంటాడాయి. దాని నుంచే నా ఫౌండేషన్ పుట్టింది. ఫలితం? ఎందరో పేదలకు సాయం చేస్తున్నాను. ఎదుటివాళ్లకు సాయం చేయడంలోని ఆనందం నా కూతురి వల్లే పొందడం నేను నేర్చుకున్నాను’ అందామె.
► పోల్చి చూసుకోవద్దు
‘పిల్లలకు ఇంకొకరితో పోల్చి చూసుకోవడం నేర్పించవద్దు. నా కొడుక్కు నాలుగో ర్యాంకు వస్తే ఫస్ట్ ర్యాంక్ వచ్చిన పిల్లాణ్ణి కంగ్రాచ్యులేట్ చేయమన్నాను. నేను చేయను... వాడు నాకు పోటీ అన్నాడు. మన కంటే బాగా పని చేసేవారు ఎప్పుడూ ఉంటారు... మన కంటే ప్రతిభ ఉన్నవారిని చూసి ఈర్ష్య పడటం మంచి అలవాటు కాదు అని నేర్పించాను. పిల్లలకు తమతో మాత్రమే తాము పోల్చుకుని చూసుకోవాలని చెప్పాలి.
నిన్నటి కంటే ఇవాళ మెరుగ్గా ఉన్నానా అని చెక్ చేసుకుని ఎదిగేలా వారికి తర్ఫీదు ఇవ్వాలి. నీ మంచి మిత్రుడివి నీవే... చెడిపోవాలంటే నిన్ను చెడగొట్టుకునేది నీవే... నీలోని మంచి మిత్రుడిని కాపాడుకో అని చెప్పాలి’ అన్నారామె.‘తల్లిదండ్రులు పిల్లలకు దేశం తిప్పి చూపించాలి. మన దేశాన్ని అర్థం చేయిస్తే వారు తాము తెలుసుకోవాల్సింది తెలుసుకుంటారు. ఒంటి మీద చొక్కాలేని పేదలే ఈ దేశాన్ని నిజంగా అర్థం చేయిస్తారు అనే మాట పిల్లలకు చెప్తే దేశం కోసం వాళ్లు ఏం చేయాలో తోటివారికి ఎలా సాయం చేయాలో తెలుసుకుంటారు’ అని ముగించారామె.
‘నీ మంచి మిత్రుడివి నీవే... చెడిపోవాలంటే నిన్ను చెడగొట్టుకునేది నీవే... నీలోని మంచి మిత్రుడిని కాపాడుకో’ అని చెప్పాలి.
– సుధామూర్తి
– జైపూర్ నుంచి సాక్షి ప్రతినిధి
Comments
Please login to add a commentAdd a comment