Vennelakanti Rajeswara Prasad
-
వెన్నెల (కంటి) జ్ఞాపకాలు
వెన్నెలనూ వెన్నెలకంటినీ ఇష్టపడని వారెవరు? వెన్నెల అందరిది, వెన్నెలకంటి అంద రివాడు. మంచి మనిషి కాని వాడు మంచికవి కాలేడు. వెన్నెలకంటి వెన్నెలంత స్వచ్ఛ మైన మనసున్నవాడు. నేను 1989లో పీహెచ్డీ పట్టా నిమిత్తం మద్రాసు విశ్వవిద్యాలయంలో పరిశోధన చేయడానికి వెళ్లినప్పుడు పరిచయం. మొదట్లో ఆయన ప్రతిభను గుర్తించలేక పోయినా క్రమంగా పాత, కొత్త సినిమా పాటల మీద ఆయన అవగాహననూ, వాటిని అప్పటికప్పుడు అప్పగించే అసాధారణమైన ధార ణనూ గమనించి ఆశ్చర్య పోయాను. నా సిద్ధాంత వ్యాసం ‘తెలుగు సినిమాపాట చరిత్ర’లో ఆయన అందించిన విలువైన సమాచారం నాకెంతగానో ఉపక రించింది. సమాచారం ఇవ్వడమే కాదు, ఆ కోవకు చెందిన నా పుస్తకావిష్కరణ సభలన్నిటికీ వ్యాఖ్యా తగా వ్యవహరించారు. వేటూరి అభివ్యక్తినీ, ఆత్రేయ శైలినీ ఆదర్శంగా ఎంచుకొన్నప్పటికీ పడికట్టు పదాలను వాడకుండా తనదైన శైలిని ఏర్పరచుకున్నారు. చిన్నతనంలోనే పద్య రచనలు అలవడిన ఆయన సినిమాపాటల రచన లోనూ సాహిత్యాభిరుచినీ, అలంకార ప్రీతినీ కనబ ర్చారు. ‘మాటరాని మౌనమిది/ మౌనవీణ గానమిది/ గానమిది నా ధ్యానమిది...’; ‘చిరునవ్వుల వరమి స్తావా, చితినుంచి బ్రతికొస్తాను/ మరుజన్మకు కరుణి స్తావా, ఈ క్షణమే మరణిస్తాను’ వంటి వెన్నెల తున కలు దీనికి ఉదాహరణలు. వెన్నెలకంటి స్ట్రెయిట్ చిత్రాల్లో కంటే డబ్బింగ్ చిత్రాలకే ఎక్కువగా మాటల్ని, పాటల్ని రాశారు. ఎనభైల దశకంలో డబ్బింగ్ ప్రక్రియను ఏలుతున్న రాజశ్రీతో పాటు ‘నాయకుడు’ చిత్రంలో రెండు పాటల్ని రాసే అవకాశం రావడంతో ఆ రంగంలో కాలు మోపి ఇంతింతై వటుడింతౖయె అన్నట్టుగా ఎదిగి డబ్బింగ్ రంగంలో ఒక దశను సొంతం చేసుకున్నారు. ‘సన్నజాజి పడక... మంచెకాడ పడక... చల్లగాలి పడక’; ‘నేనాటోవాణ్ని, ఆటోవాణ్ణి, అన్నగారి రూటు వాణ్ణి’ లాంటి పాటలతో పాటు, ‘భామనే సత్యభా మనే’ చిత్రం మొదలుకుని కమల్‌హాసన్ నటించిన అన్ని తమిళ చిత్రాలకు తెలుగులో డబ్బింగ్ రచన చేసి ఆయన అభిమానానికి పాత్రుడయ్యారు. హిందీ, కన్నడ, మలయాళ చిత్రాలతో పాటు ‘జురాసిక్ పార్క్’తో ప్రారంభించి అనేక ఆంగ్ల చిత్రాలను, ‘నింగీ నేలా నాదే’ అనే చైనీయ చిత్రాన్ని కూడా ‘డబ్’ చేసిన ఘనత ఆయనకు దక్కింది. ‘తల్లిదండ్రులు నాకు జన్మనిస్తే, బాలసుబ్ర హ్మణ్యం సినీ గేయరచయితగా నాకు పునర్జన్మని చ్చారు’ అని జీవితాంతం ‘బాలు’ పట్ల తన కృతజ్ఞతా భావాన్ని వెల్లడించుకున్నారు. వెన్నెలకంటి సామ ర్థ్యాన్ని గ్రహించే బాలుగారు ఆయన్ని తన వారసుడిగా ప్రకటించారు. ఆయనతో ‘కరోనా’ మీద కూడా పాట రాయించి గానం చేశారు. సింగీతం శ్రీనివాసరావు ‘మాయాబజార్’లో పింగళి రాసిన ‘నవవసంత మధు రిమ...’ అనే పల్లవికి చరణాల్ని వెన్నెలకంటి చేత పూర్తి చేయించి తన మనవరాలితో కలిసి పాడారు. విద్యార్థి దశలోనే వెన్నెలకంటి మూడు శతకాలను రాశారు. ‘ఆత్మవత్ సర్వభూతాని’, ‘యత్ర నార్యస్తు పూజ్యన్తే...’ అనే నాటికలకు పరిషత్‌లలో బహుమతు లను పొందారు. ‘ఉషోదయం ఆపలేవు’, ‘వెన్నెల జల్లు’, ‘లహరి’ కవితాసంపుటాలు వెలువరించారు. అయినా తనివి తీరక సినీరంగానికి సంబంధించిన విశ్లేషణ గ్రంథం ఏదైనా రాయాలని అభిలషించేవారు. కానీ సినిమా రచనల ఒత్తిడివల్ల ఆ పనికి తీరిక లభిం చేది కాదు. అలాగే శ్రీరామచంద్రుని స్తుతిస్తూ ఒక పద్యశతకాన్ని మొదలుపెట్టి కిష్కింధకాండ వరకు ఉన్న కథా వస్తువుతో 600 పద్యాలు రాశారు. అది కూడా అసంపూర్ణంగా మిగిలిపోవడం విధి వైప రీత్యం. ‘పురాణమిత్యేవ న సాధు సర్వం’ అన్నట్టు వెన్నెలకంటి పాత సినిమా పాటల్ని గౌరవించడంతో పాటు కొత్తపాటల్ని కూడా సమర్థించేవారు. నేటి సినిమా పాటల్లో విలువలు దిగజారిపోయాయనే నా వాదంతో ఆయన ఏకీభవించలేదు. అలాగే నేను ‘మనస్విని’ పురస్కార న్యాయ నిర్ణేతలలో ఒకరినై ఉండి కూడా ఆయన పాటలకు ఆ పురస్కారాన్ని ఇవ్వకపోయినా, నన్నెప్పుడూ పల్లెత్తు మాట అనని సంస్కారి. వెన్నెలకంటి అభిమానుల హృదయాలలో చిరంజీవి. ఆయన ఆత్మకు శాంతి కలగాలని తడి కన్ను లతో ప్రార్థించడం తప్ప మన చేతుల్లో ఏముంది? ‘హృదయం ఎక్కడున్నదీ... హృదయం ఎక్కడున్నదీ... నీ చుట్టూనే తిరుగుతున్నది!’ డాక్టర్ పైడిపాల వ్యాసకర్త సినీ గేయ పరిశోధకుడు మొబైల్ : 99891 06162 -
అంతరంగం: వెన్నెలకంటి ఆఖరి ఇంటర్వ్యూ
‘సాక్షి’ టీవీ చానల్‌కి ఇటీవల ‘వెన్నెలకంటి’ ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ. ఇదే ఆయన ఆఖరి ఇంటర్వూ్య. వెన్నెలకంటి ‘అంతరంగం’ ఆయన మాటల్లో... చిన్నప్పట్నించి నాకు పద్యాలు రాయటం అలవాటు. పదకొండు, పన్నెండేళ్లు వచ్చేటప్పటికే ఆటవెలది, కందపద్యాలు రాసేవాణ్ణి. భక్తి శతకాలు రాశాను. తర్వాత పద్యం నుండి గేయానికి వచ్చాను. గేయంలో అభ్యుదయ కవిత్వం వైపు వెళ్లాను. పద్యానికి పోలూరి హనుమా జానకి రామశర్మగారని నెల్లూరు సీఆర్ కాలేజీలో గురువుగారుండేవారు. గేయానికి నాగభైరవ కోటేశ్వరరావుగారు గురువుగా ఉండి నన్ను సొంత బిడ్డలా చూసుకునేవారు. ఇలా అన్ని ప్రక్రియలు దాటుకుని పాట దాకా వచ్చాను. సినిమా రంగానికి వచ్చిన తర్వాత సినిమా బాణీకి పాట రాయాల్సి వస్తుంది. నాకు గిరీశం అని చిన్ననాటి నుండి కలిసి పెరిగిన మిత్రుడున్నాడు. వాడు ట్యూన్ కడితే నేను పాట రాసేవాణ్ని. ఆ సమయంలో కొన్ని వందల పాటల్ని మేమిద్దరం తయారు చేశాం. అవన్నీ నాకు తర్వాత ఉపయోగపడ్డాయి. ఆ ఇద్దరికీ నేను భక్తుణ్ణి సముద్రాల గారి దగ్గరనుండి కొత్త కుర్రాళ్ల దాకా అందరి దగ్గరా నేర్చుకుంటూ ఉండేవాణ్ణి. 1986లో నేను వచ్చేనాటికి చాలామంది రచయితలు ఉన్నారు. ఎవరు మంచి పాట రాసినా వారికి అభిమాని అయ్యేవాణ్ణి. ఆత్రేయగారికి, వేటూరిగారికి మాత్రం నేను అభిమానిని కాను. వారికి మాత్రం నేను భక్తుణ్ని. ఆత్రేయగారిలోని లోతైన ఆలోచన, వేటూరిగారిలో ఉన్న భావవ్యక్తీకరణ అంటే నాకు బాగా ఇష్టం. ఆ రెండూ కలిపే ప్రయత్నమే నా పాట. వాళ్లతో ప్రత్యక్షంగా పరిచయం కావడం, వాళ్ల ఆశీర్వాదం లభించడం నా అదృష్టం. ఆత్రేయగారు ‘నీరాజనం’ సినిమాలో ‘మనసున్న మధుకలపం..’ పాటకి పల్లవి మాత్రం రాశారు.. చరణాలు ఇవ్వలేదు. ఓ రికార్డింగ్‌లో ముంబయ్‌లో ఉన్నారు. నిర్మాతగారు ఫోన్ చేస్తే అక్కడ ఎవరున్నారంటే నేనున్నానని చెప్పారు.. వాడు నాలాగే రాస్తాడు.. చరణాలు రాయించుకోండని ఆత్రేయగారు చెప్పడంతో నేను రాశా. ఇద్దరి పేర్లు వేయమంటే వద్దండీ.. ఇది నా గురుదక్షిణ అన్నాను. నేనంటే ఆయనకు చాలా ప్రాణం. ఆ పాటకు ఎంతోమంది అభిమానులున్నారు ‘ఏప్రిల్ ఒకటి విడుదల’ సినిమాకి అన్నయ్య సీతారామశాస్త్రి పాటలన్నీ రాశారు. వంశీగారు నన్ను పిలిచి.. నాకు ఓ థీమ్ పాటలా కావాలన్నారు. రెండు చరణాలకు రెండు థీమ్స్ ఇచ్చి పాటగా రాయమన్నారు.. అలా రాశాను. ఇళయరాజాగారి ట్యూన్‌కి ‘మహర్షి’ సినిమాలో నేను రాసిన ‘మాటరాని మౌనమిది..’ పాట చాలా పెద్ద హిట్ అయింది.. ఆ పాటకి ఎంతో మంది అభిమానులున్నారు. సన్నివేశ ప్రాధాన్యం ఉన్న పాట అది. ఇళయరాజాగారికి చాలా పాటలు రాశాను. డబ్బింగ్ పాటలు కూడా ఎక్కువగా ఆయనవే రాశాను. ఈ మధ్య ప్రైవేట్ ఆల్బమ్స్ నాతోనే రాయించుకున్నారు తెలుగులో. ‘నాయకుడు’ సినిమా డబ్బింగ్ చిత్రం అని చెప్పలేం. అందులో నేను పాట రాశా. నేపథ్యంలో వచ్చే దానికి డబ్బింగ్లో రాసినా, స్ట్రయిట్‌గా రాసినా ఒక్కటే.. ‘సుందరాంగుడు’ చిత్రానికి నాతో బలవంతంగా డబ్బింగ్ పాటలు రాయించింది ఎంవీ రావు అనే ఫ్రెండ్. ఆ తర్వాత ‘సంగ్రామం’ అనే సినిమాలోని మొత్తం పాటలు నన్నే రాయమన్నారు.. కొంచెం కష్టం అనిపించింది. దానికి రాజశ్రీగారు నన్ను బాగా గైడ్ చేశారు. డబ్బింగ్ కళాకారులను గుర్తించింది కమల్‌గారే డబ్బింగ్ కళాకారులను బాగా గుర్తించింది ఎవరంటే కమల్‌హాసన్‌గారు.. డబ్బింగ్ రాయడం, కామెడీ రాయడం చాలా కష్టం అంటారాయన. మాటల వరకూ అయితే ఓ లెంత్ చూసుకుంటే చాలు.. పాటలయితే లిప్ మూమెంట్‌కి దగ్గరగా ఉండాలి. మాటల్లో ఒక్కో భాషలో ఒక్కో జాతీయాలుంటాయి.. అవి మనకు ఉండవు. కొన్ని ఎబ్బెట్టుగా ఉంటాయి. దానికి సమానమైన జాతీయాలు మనం వాడాలి. ఆరుద్రగారు చెప్పినట్టు లిప్ మూమెంట్ పాటిస్తూనే చెవికి తెలుగు వినపడేట్టు చేయడం అనువాద రచయిత లక్షణం. ఇన్ని భాషల్లో రాశాను.. ఇప్పుడు తమిళం కూడా నాకు కొద్ది కొద్దిగా వచ్చు. మిగతా ఏ భాష కూడా రాదు. హిందీ సినిమాల డబ్బింగ్ వెర్షన్ నేనే రాశాను. సూపర్ హిట్ అయ్యాయి. కానీ నాకు హిందీ అక్షరం ముక్క రాదు. మలయాళం, కన్నడ కూడా రాదు. తెలుగు వస్తే చాలు. సన్నివేశం చూసి రాసేవాణ్ణి. మొదట్లో స్క్రిప్ట్ చూసి ప్రిపేర్ అయ్యేవాణ్ణి.. స్క్రిప్ట్‌తో థియేటర్‌కి వెళ్లేవాణ్ణి. ఇప్పుడు తమిళ్ వరకూ అది అక్కర్లేదు. తమిళ్లో కూడా ఒక్క కమల్‌హాసన్‌గారి సినిమాలకు మాత్రం, ముఖ్యంగా క్రేజీ మోహన్‌గారు–కమల్‌గారు కలిస్తే ముందు హోమ్ వర్క్ చేసుకుని స్క్రిప్ట్ మొత్తం రాసుకునే థియేటర్‌కి వెళ్లాలి. ముళ్లపూడి రమణగారి స్క్రిప్ట్ ఇంకో భాషలోకి అనువదించడం ఎంత కష్టమో.. క్రేజీ మోహన్‌గారు–కమల్‌గారి సినిమా అనువదించడం కూడా అంతే కష్టం. ‘భామనే సత్యభామనే, తెనాలి, పంచతంత్రం’ ఈ సినిమాలన్నీ కామెడీవే. వెంటవెంటనే పంచ్‌లుంటాయి. అది గొప్ప అదృష్టం ‘జురాసిక్ పార్క్’ అన్నది మామూలు సినిమా కాదు.. అందులో సైంటిఫిక్‌గా చాలా క్లిష్టమైన విషయాలున్నాయి.. చాలా ప్రమాదాలుంటాయి. వాటిని చాలా సింపుల్‌గా ఉండేలా లిప్ సింక్ అయ్యేలా తీసుకురావాలి. పైగా ఆ సినిమాకి డబ్బింగ్ చెప్పేది ఎవరంటే జగ్గయ్యగారు. అంత గొప్పాయన నన్ను పిలిపించారు. మాటలు ఎవరు రాస్తున్నారంటే నేనే రాస్తున్నానని చెప్పడంతో నా ఆఖరు సినిమా నీకే చెబుతున్నాను.. అని డబ్బింగ్ చెప్పారాయన.. అది గొప్ప అదృష్టం. ఆ తర్వాత టైటానిక్, మమ్మీ సిరీస్, హ్యారీ పోటర్ సిరీస్, జేమ్స్‌బాండ్‌లో కొన్ని సిరీస్ చేశాను. హిందీలో ‘దిల్వాలే దుల్హనియా లే జాయేంగే, కహోనా ప్యార్హై, రాజా హిందుస్తాన్..’ ఇలా చాలా చేశాను. ఆయన నమ్మకమే నిజమైంది ‘ ప్రేమాలయం’ చిత్రానికి సూరజ్ బర్జాత్యగారు డైరెక్టర్. వాళ్ల నాన్న రాజ్‌కుమార్ బర్జాత్యగారు ‘మేం తెలుగులో ఆడియో విడుదల చేయడం లేదు.. సినిమా విడుదలైన వంద రోజుల వరకూ రిలీజ్ చేయం’ అనడంతో నా గుండె జారిపోయింది. పాటలు బాగా హిట్ అయితేనే కదా ప్రేక్షకులు సినిమాకి వస్తారు.. లేకుంటే రారు అని చెప్పాను. అప్పట్లో పైరసీలు ప్రస్తుత పరిస్థితుల్లోగా లేవు. అందుకే పాటలు వినాలంటే కచ్చితంగా థియేటర్‌కి వచ్చి చూస్తారు అని ఆయన అన్నారు.. ఆయన నమ్మకమే నిజమైంది. పాటలు రిలీజ్ చేయకపోయినా వంద రోజులు హౌస్‌ఫుల్ కలెక్షన్స్‌తో సినిమా ఆడింది. ఆ తర్వాత ఆడియో విడుదలయ్యాక సిల్వర్ జూబ్లీ ఆడింది. ‘ప్రేమాలయం, ప్రేమించి పెళ్లాడతా’ సినిమాల్లో పాటలు బాగా పాపులర్ అయ్యాయి. అందుకే ఆ ముద్రపడింది చెన్నైలో ఉంటూ రాయడంవల్ల డబ్బింగ్ మాటల రచయితగా నా మీద ముద్రపడింది. అది సహజం. నేను అక్కడ బిజీగా ఉన్న సమయంలోనూ నన్ను పిలిచి స్ట్రయిట్ చిత్రాలకు పాటలు రాయించుకున్న దర్శక–నిర్మాతలకు, సంగీత దర్శకులకు నేనెప్పుడూ రుణపడి ఉంటాను.. ఆ పాటలు కూడా బాగా హిట్ అయ్యాయి. అయితే డబ్బింగ్ రచయిత అనే ముద్ర నాకు మేలే చేసింది. కానీ దాని వల్ల స్ట్రయిట్ సినిమాల్లో పాటలు రాసే కొన్ని అవకాశాలు తగ్గి ఉండొచ్చు. అయితే అనువాదంలోకి వెళ్లడంతో కమల్‌హాసన్‌గారికి పర్మనెంట్ రైటర్ అయ్యాను. ఓ సారి కమల్‌గారి బర్త్ డేలో రజనీకాంత్‌గారికి నన్ను పరిచయం చేస్తూ, మీ ‘బాషా’ తెలుగు రచయిత, నా పర్మనెంట్ తెలుగు రచయిత’ అన్నారు. ‘‘కమల్‌గారి ‘మహానది’లో ‘శ్రీరంగ రంగ..’ అనే పాట సాహిత్యం చాలా బాగుంది, ఇంత మంచి సాహిత్యం తెలుగు అనువాదంలో వస్తుందా?’’ అంటూ దర్శకుడు కె. విశ్వనాథ్‌గారు నన్ను అభినందించారు. డబ్బింగ్ రైటర్ అంటే చిన్న చూపు డబ్బింగ్ రైటర్ అంటే ఓ చిన్న చూపు ఉంటుంది. బడ్జెట్, పారితోషికం... ఇలా ఏ రకంగా చూసుకున్నా స్ట్రయిట్ సినిమా రేంజ్ వేరు? డబ్బింగ్ సినిమా రేంజ్ వేరు. గతంతో పోలిస్తే ఇప్పుడు డబ్బింగ్ సినిమాలు స్ట్రయిట్ సినిమాకి పోటీ పడే స్థాయిలో రావడం సంతోషం. ఒకానొక సమయంలో డబ్బింగ్ సినిమాలు బ్యాన్ చేయాలనే చర్చ తెలుగు సినిమా పెద్దల మధ్య జరిగింది. స్ట్రయిట్ సినిమా అయినా డబ్బింగ్ సినిమా అయినా బాగుంటేనే ఆడతాయి. నా పిల్లలు నా శిష్యులు కాదు ప్రాక్టీస్ అన్నది చేసేకొద్దీ వస్తుంది. నా పిల్లలు ఎవరూ నా వద్ద శిష్యరికం చేయలేదు. డబ్బింగ్‌లు చెప్పే మా పెద్దబ్బాయి శశాంక్ వెన్నెలకంటిని డబ్బింగ్ రచయితని చేశారు. వాడి తొలి సినిమా ‘మన్మథ’ 100 రోజులు ఆడింది. రెండో సినిమా ‘గజనీ’ పెద్ద హిట్ అయింది. ‘ఆకాశమే నీ హద్దురా’ సినిమాకి రెండో అబ్బాయి రాకేందు మౌళి రాశాడు. నాలుగోతరంలో నా మనవడు, మనవరాలు కూడా డబ్బింగ్ రంగంలోకి వచ్చారు. వారిద్దరికీ పదేళ్ల లోపే ఉంటాయి. ఓ కుటుంబం నుంచి నాలుగు తరాలు రావడం చాలా ఆనందంగా ఉంది. మా నాన్నగారి ఆశీర్వాదాల వల్లే ఇదంతా జరిగింది. మా అబ్బాయిలకు సలహాలు చెప్పే అవసరం పెద్దగా రాలేదు. రాకేందు మౌళి ‘అందాల రాక్షసి’ సినిమాకి ఉత్తమ అప్‌కమింగ్ లిరిక్ రైటర్, బెస్ట్ అప్‌కమింగ్ సింగర్ అవార్డులు అందుకున్నాడు. ఆ స్టేజిపై మాట్లాడుతూ లిరిక్ రైటర్ అవార్డు నా వల్ల, సింగర్ అవార్డు నా భార్య వల్ల వచ్చిందని మాకు కృతజ్ఞతలు చెబుతూ, బాలుగారికి ఏకలవ్య శిష్యుణ్ణి అని చెప్పి ఆయనకు అంకితం చేశాడు. నిజానికి నేను ఆత్రేయగారికి భక్తుణ్ణి. ఆయనంత గొప్ప కవిని కాకపోయినా ఆయన బద్దకం మాత్రం నాకు బాగా వచ్చింది. ఇది చాలా రోజులుగా అనుకుంటున్నదే.. కార్యాచరణలో పెట్టాలి. ఓ కావ్యం రాశాను.. అది ప్రింట్ చేయాలి. ఇప్పుడు రాస్తున్న ‘రామాయణం’ కూడా ప్రింట్ చేయాలి. పాటలన్నీ కలిపి ఓ పుస్తకం తేవాలి.. ఇలా చాలా ఉన్నాయి. – రెంటాల జయదేవ -
ఒక్కరోజు కూడా పేరు పెట్టి పిలవలేదు..
ప్రముఖ రచయిత వెన్నెలకంటి రాజేశ్వరప్రసాద్ మంగళవారం కన్నుమూశారు. ఆయనతో తమ అనుబంధాన్ని రచయితలు భువనచంద్ర, జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు పంచుకున్నారు. బుల్లబ్బాయ్ నా తోడబుట్టని తమ్ముడు 34 ఏళ్ల పరిచయంలో ఏనాడూ మేం రైటర్స్లా మాట్లాడుకోలేదు. నన్ను ఒక్కరోజు కూడా పేరు పెట్టి పిలవలేదు. నన్ను ‘అన్నయ్యా’ అంటే నేను ‘బుల్లబ్బాయ్’ అనేవాణ్ణి. నిన్న (సోమవారం)నే మాట్లాడుకున్నాం. ‘ఈ ఏడాది ఇంకా కలుసుకోలేదు, కలుద్దాం అన్నయ్యా’ అన్నాడు. సరే అన్నాను. ఇలా కలుసుకున్నాను తమ్ముణ్ణి. మనిషి లేడని ఊహకు కూడా అందటం లేదు. ఏ పేరుతో పిలిస్తే పలుకుతాడో తెలిస్తే బావుండు.. ఆ పేరుతో పిలుస్తాను. మనిషి చక్కగా నిద్రపోతున్నాడు. వెన్నెలకంటి అంటే వస్తాడా, బుల్లబ్బాయ్ అంటే వస్తాడా... ఎలా పిలిచినా రాకుండా అందనంత దూరం వెళ్లిపోయాడు. ‘ఈ రోజు వెళ్లిపోతున్నాను’ అన్నట్లుగా చూస్తున్నాడు. ఎవరైనా కొంతకాలానికి వెళ్లవలసిన వాళ్లమే అని తెలుసు కానీ, ఎందుకో అంతా శూన్యంలా ఉంది. కన్నతల్లి కడుపునుండి నేలతల్లి వొళ్లోకొచ్చి ఆట, పాటలాడి ఎన్నో బంధాలను పేర్చుకుని చేసే ప్రయాణమే కదా జీవితం. మళ్లీ నేలతల్లిని ముద్దాడాడు తమ్ముడు. ఈ ఇద్దరమ్మల ప్రయాణంలో తన శరీరానికి పెట్టుకున్న పేరు ‘వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్’. ఇక లేడు అనే వార్త కలా? నిజమా? అని అర్థం కాని పరిస్థితిలో ఉన్నాను. ఏ సభకెళ్లినా, సన్మానాలకెళ్లినా, ఆంధ్రా క్లబ్లో పురస్కారాలకెళ్లినా అందరూ మమ్మల్ని అన్నతమ్ములొచ్చారు అనేవాళ్లు. ‘అన్నయ్యా.. మనిద్దరం నెల్లూరు వెళుతున్నాం. అక్కడ సభ ఉంది. మనిద్దరి పేరు ఇచ్చేశాను’ అనేవాడు. తిరిగొచ్చేటప్పుడు మా కబుర్లు ప్రపంచమంతా తిరిగేవి. మా రెండు గొంతుల్లో ఒక గొంతు మూగబోయింది, మరో గొంతు పక్కన నిలబడి మౌనంగా రోదిస్తోంది. ఆయన పేరు, కీర్తి ప్రతిష్టలు.. అన్నింటినీ ఇక్కడే వదిలి ఈ రోజు నింగిలో కలిసిపోయాడు. పదివేల కోట్లున్నా ఏం చేసుకుంటాం? అనుభవించటానికి పక్కన సరైన మనిషి కావాలి కానీ.. ఆయన కోప్పడటం నేను చూడలేదు, ఏ సభలోనైనా అందరినీ గలగలా నవ్విస్తాడు. ప్రతిరోజూ నవ్వించే ఆ మనిషి ఈ రోజు ఏడిపిస్తున్నాడు (ఏడుస్తూ). మనసులో ఏదో తెలియని వెలితి. ‘ఐ మిస్ యు ఫర్ ఎవర్.. బుల్లబ్బాయ్’. – రచయిత భువనచంద్ర నలుగురం ఒక్కసారే వచ్చాం ‘సిరివెన్నెల’ సీతారామ శాస్త్రిగారు 1985లో, నేను 1986 సెప్టెంబర్‌లో, 1987 జనవరి 1న భువనచంద్ర వచ్చాం. వెన్నెలకంటి కూడా అప్పుడే పరిశ్రమలోకొచ్చారు. దాదాపు నలుగురం ఒకేసారి ఏడాది వ్యవధిలోనే చిత్రపరిశ్రమకు వచ్చాం. వెన్నెలకంటి నాకు అత్యంత ఆత్మీయుడు. మాతో పాటు మా కుటుంబాలు కూడా ఎంతో అన్యోన్యంగా ఉంటాయి. వెన్నెలకంటి చనిపోయిన విషయం తెలియగానే ఆయన శ్రీమతితో మాట్లాడాను. మాట్లాడుతూనే గుండెపోటుతో పోయారట, ఆసుపత్రికి తీసుకెళ్లే సమయం కూడా లేదని చెప్పారామె. డబ్బింగ్ చిత్రాల్లో వండర్స్ క్రియేట్ చేసింది వెన్నెలకంటిగారే. పద్యకవిగా, పాటల కవిగా ప్రసిద్ధి చెందారు. ఆయనతో నాకు ఎన్నో మరపురాని సంఘటనలు ఉన్నాయి. ‘మైనే ప్యార్ కియా’ డబ్బింగ్ చిత్రానికి ఈయన రాసిన మాటలకు ముగ్ధుడైన ఆ హిందీ చిత్ర నిర్మాత తారాచంద్ బర్జాత్యా ఈయనకు పాదాభివందనం చేయటం నాకింకా గుర్తుంది. ఏదేమైనా ఈ రోజు అత్యంత ఆత్మీయుడిని కోల్పోవటం బాధాకరం. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. – రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరావు -
దివికేగిన ఎస్పీ బాలు దోస్త్..
ఒకరు స్వర మాంత్రికుడు.. మరొకరు సిరా యాంత్రికుడు.. ఇద్దరూ సినీ ప్రపంచంలో హాలికులు.. సింహపురి ముద్దుబిడ్డలు.. ఆ ఇద్దరిదీ గురుశిష్యులు.. అన్నదమ్ములు.. స్నేహితుల అనుబంధం.. సినీ గాయకుడు ఎస్పీ బాలు దివికేగిన కొద్దినెలలకే ఆయన ఆత్మీయుడు, సినీ గేయ రచయిత వెన్నెలకంటి రాజేశ్వరప్రసాద్ మంగళవారం కన్నుమూశారు. పాటలు పాడే చందమామను వెతుక్కుంటూ వినీలాకాశంలోకి ఈ ‘వెన్నెల’ వెళ్లిపోయింది. చెన్నైలో నివాసం ఉంటున్నా.. నెల్లూరుతో విడదీయరాని అనుబంధాన్ని పెనవేసుకున్నారు. ఆయన మాట.. పాట వెన్నెలంత హాయిగా ఉండేదని స్నేహితులు జ్ఞాపకాలను నెమరవేసుకుంటున్నారు. ఎస్బీఐలో కొలువు కాదనుకుని సినీ రంగంలో చేసిన సాహిత్య ప్రయాణం మరపురానిది.. ‘మాటరాని మౌనమిది..’ అంటూ సింహపురి మూగబోయింది. సాక్షి, నెల్లూరు(బృందావనం): సింహపురి శోకసంద్రమైంది. ఎస్పీ బాలసుబ్రహ్మణంను పోగొట్టుకున్న విషాదాన్ని మరువకముందే ఈ ప్రాంతానికి చెందిన సినీగేయ రచయిత వెన్నెలకంటి రాజేశ్వరప్రసాద్ మృతిచెందడంతో కన్నీటి సంద్రమైంది. డబ్బింగ్ చిత్రాలకు పాటల రచయితగా తనకంటూ ప్రత్యేకతను సృష్టించుకున్న వెన్నెలకంటి నెల్లూరులో కళాకారులందరికీ వెన్నెల కాంతులను అందించారు. కవిగా, స్నేహితుడిగా ఎన్నో కళాసంఘాలకు అధ్యక్షుడిగా తాను అందించిన ప్రోత్సాహాన్ని స్నేహితులు కంటితడి పెట్టుకుంటూ చెప్పుకొచ్చారు. నగరంలోని ట్రంకురోడ్డు సీమా సెంటర్, పురమందిరం, టీవీఎస్ కల్యాణసదన్ తదితర ప్రాంతాల్లో జరిగిన ఏ సంగీత, సాహిత్యసభ అయినా వెన్నెలకంటి జ్ఞాపకాలు గుర్తుతెస్తుంది. ఎస్పీబీతోపాటు వెన్నెలకంటి సినిమా కళాకారులను నెల్లూరుకు తీసుకొచ్చి చేసిన కార్యక్రమాలతో ఎందరో వర్ధమాన కళాకారులు వెలుగులోకి వచ్చారు. కళాంజలి సంస్థకు ఎంతో ప్రోత్సాహం కళాంజలి సంస్థ ప్రతి కార్యక్రమంలో వెన్నెలకంటి ప్రోత్సాహం ఉండేది. సుదీర్ఘమైన ప్రయాణంలో కవిగా, స్నేహితుడిగా ఆయన అందించిన సహాయసహకారాలు మరచిపోలేము. మా సంస్థ తరఫున వెన్నెలకంటిని సన్మానించిన దృశ్యం ఇంకా కళ్లముందే కదిలాడుతోంది. – కళాంజలి అనంత్, బెనర్జీ ఉన్నత విలువలు కలిగిన వ్యక్తి వెన్నెలకంటి ఉన్నతమైన విలువలు కలిగిన వ్యక్తి. ఇటీవల టీటీడీకి వెన్నెలకంటి రాసిన పాటను హిందీలోకి అనువదించడం నా పూర్వజన్మ సుకృతం. – డాక్టర్ శైలజ, కవయిత్రి, మరుపూరు కోదండరామిరెడ్డి స్మారక అవార్డు కమిటీ అధ్యక్షురాలు బాధాకరం నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పాటల రచయిత వెన్నెలకంటితో సుదీర్ఘ ప్రస్థానంలో ఎన్నో అనుభవాలు ఎన్నో జ్ఞాపకాలున్నాయి. నెల్లూరు కళారంగానికి సేవచేసిన ఇద్దరిని కోల్పోవడం బాధాకరం. – వీరిశెట్టి హజరత్‌బాబు, మురళీకృష్ణ గ్రూప్ ఆఫ్ హోటల్స్ ఎండీ నా ఆరోప్రాణం బాల్యస్నేహితుడు వాడి మరణవార్త తెలియగానే నాకు ఊపిరి ఆగినంతపనైంది. నాకు వాడు ఆరోప్రాణం. స్నేహానికి, ఆత్మీయతకు మరో రూపం వెన్నెలకంటి. కొద్దిరోజుల్లోనే బాల్యమిత్రులు బాలు, వెన్నెలకంటిలను పోగొట్టుకోవడం మరచిపోలేని విషాదం. – యజ్ఞావఝుల శేషగిరీశం, వెన్నెలకంటి బాల్యమిత్రుడు చేదోడువాదోడుగా ఉండేవాడు రాజేశ్వరప్రసాద్ మాకు ఎన్నో కార్యక్రమాల్లో చేదోడువాదోడుగా ఉండేవాడు. మా కమిటీ అ«ధ్యక్షుడిగా వ్యవహరించేవాడు. ఆయన మరణవార్త నివ్వెరపరచింది. సాహితీలోకానికి తీరనిలోటు. – చిన్ని నారాయణరావు, ప్రధానకార్యదర్శి, డాక్టర్ నాగభైరవ అవార్డు కమిటీ కళలకు తీరనిలోటు వెన్నెలకంటి మరణం కళారంగానికి తీరనిలోటు. ఆయన లేకపోవడం అటు సింహపురికి ఇటు ఆయన్ను అభిమానించే మాలాంటి వారికి ఎంతో విషాదం. – అమరావతి కృష్ణారెడ్డి, అధ్యక్షుడు, 25 కళాసంఘాలు సాహితీ ప్రియుడిని కోల్పోయాం సింహపురి మధురగాయకుని కోల్పో యిన కొద్దికాలంలోనే మరో సాహితీప్రియుడిని కోల్పోయింది. ఇది సినిమా రంగానికే కాదు సాహిత్యలోకానికి తీరనిలోటు. – పెరుగు రామకృష్ణ, కవి స్ఫూర్తిదాయకం ఇరుగుపొరుగునే ఉండేవారం. ఆ కుటుంబంతో ఎంతో సాన్నిహిత్యం. కవిగా, రచయితగా వెన్నెలకంటి ఎదిగిన జీవితం ఎందరికో స్ఫూర్తిదాయకం. ఇటీవల వెన్నెలకంటితో మాట్లాడాను. ఆయన లేరన్న వార్త దిగ్భ్రాంతికి గురిచేసింది. – వెల్లంచేటి చంద్రమౌళి, అధ్యక్షుడు, ఏపీ బ్రాహ్మణసేవా సంఘం సమాఖ్య మాకు మార్గదర్శి మా సంస్థ కార్యక్రమాల్లో మార్గదర్శిగా వ్యవహరించారు. ఎన్నో సలహాలు, సూచనలు ఇచ్చారు. సంస్థ ఉన్నతిలో తన వంతు తోడ్పాటు ఉంది. – దోర్నాల హరిబాబు, హరివిల్లు క్రియేషన్స్ అధినేత -
చిన్ని చిన్ని కన్నయ్యకు వెన్నెల జోల
‘మాటరాని మౌనమిది... మౌనవీణ గానమిది.. గానమిదీ నీ ధ్యానమిది.. ధ్యానములో నా ప్రాణమిదీ.. ప్రాణమైన మూగ గుండె రాగమిది’... పదాల కూర్పు చదివారు కదా. మౌనంతో ముగించి.. మౌనంతో ఆరంభించి.. గానంతో ముగించి.. గానంతో ఆరంభించి... ధ్యానంతో ముగించి.. ధ్యానంతో ఆరంభించి... మొదటి పంక్తిలోని చివరి పదంతో రెండో పంక్తిని మొదలుపెట్టడం. ఇదే కాదు...‘నేను ఆటోవాణ్ణి..’ అని మాస్‌కి కిక్ ఇచ్చారు. ‘హృదయం ఎక్కడున్నది..’ అంటూ ప్రేమికులకు మంచి పాటిచ్చారు ‘రాసలీల వేళ.. రాయబారమేల..’ అంటూ రొమాన్స్ పండించారు.ఇంకా ఎన్నో ఇచ్చారు... మంచి పాటలా మనసులో నిలిచిపోయారు.ఇప్పుడు ఆ కలం మౌనం వహించింది. మాటలు ఎప్పటికీ ఉంటాయి. ప్రముఖ గేయరచయిత వెన్నెలకంటి (64) మంగళవారం గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన అసలు పేరు రాజేశ్వరప్రసాద్. ‘వెన్నెలకంటి’ ఇంటి పేరు. సుమారు 300పై చిలుకు సినిమాల్లో రెండువేలకు పైగా పాటలు రాశారు. ఆ 300 సినిమాల్లో 270కి పైగా సినిమాలు అనువాద చిత్రాల్లోని పాటలే. 1957లో నెల్లూరులో జన్మించారు వెన్నెలకంటి. విద్యాభ్యాసాన్నంతా నెల్లూరులోనే పూర్తి చేశారు. చిన్నప్పటి నుంచీ సాహిత్యమంటే అభిరుచి ఎక్కువ. వెన్నెలకంటి తండ్రి వి. కోటేశ్వరరావు (సినీ ఇండస్ట్రీలో ప్రొడక్షన్ ఇన్చార్జ్గా చేసేవారు). టైటిల్ కార్డ్స్‌లో తండ్రి పేరు చూసి సినిమాల్లోకి రావాలనే ఆకాంక్ష ఎక్కువైంది. పదకొండేళ్ల వయసున్నప్పుడే ‘దుఃఖనాశ పార్వతీశా’ అనే మకుటంతో శతకం రాశారు వెన్నెలకంటి. అలానే ‘రామచంద్ర శతకం, లలితా శతకం’ కూడా రాశారు. మనసంతా నాటకాలు, సినిమాలతోనే నిండిపోయుండేది. నెల్లూరులో సాంస్కృతిక, సాహిత్యానికి సంబంధించిన ఏ కార్యక్రమమైనా వెన్నెలకంటి తప్పనిసరి ఉండేవారు. చదువు పూర్తి చేసి బ్యాంక్‌లో ఉద్యోగం పొందినా, దృష్టంతా సినిమాల వైపే. నెల్లూరు నుంచి సరదాగా చెన్నై వెళ్లి వస్తుండేవారు. నటుడు, నిర్మాత ప్రభాకర్ రెడ్డి ద్వారా 1986లో ‘శ్రీరామచంద్రుడు’ సినిమాలో తొలి పాట రాసే అవకాశం వచ్చింది. చదవండి: తేజకు నో చెప్పిన కాజల్.. తాప్సీ ఓకే అలా వెన్నెలకంటి రాసిన మొదటి పాట ‘చిన్ని చిన్ని కన్నయ్యకు వెన్నెల జోల...’. గాయకులు యస్పీ బాలసుబ్రహ్మణ్యం ప్రోత్సాహంతో 1987లో ‘అన్నా చెల్లెలు’లో ‘అందాలు ఆవురావురన్నాయి..’ అనే పాట రాశారు. ఆ తర్వాత రచయితగా బిజీ కావడంతో బ్యాంక్ ఉద్యోగానికి రాజీనామా ఇచ్చేశారు. 1988లో ‘మహర్షి’ సినిమా రూపంలో ఆయన కెరీర్‌కు పెద్ద బ్రేక్ దొరికింది. ఆ సినిమాకి రాసిన ‘మాట రాని మౌనమిది.. మౌనవీణ గానమిది...’ పాటను తెలుగు రాష్ట్రమంతా పాడుకుంది. దీంతో ‘మహర్షి’ నిర్మాత ‘స్రవంతి’ రవికిశోరే ‘నాయకుడు’ (మణిరత్నం – కమల్‌హాసన్) తెలుగు డబ్బింగ్ వెర్షన్‌కి పాటలు రాయించారు. ఆ వెంటనే వంశీ ‘చెట్టుకింద ప్లీడర్’ సినిమాలో ‘చల్తీకా నామ్ గాడీ చలాకీ వన్నె లేడీ...’, ‘అల్లిబిల్లి కలలా రావే.. అల్లుకున్న కథలా రావే..’ పాట రాశారు. సింగీతం శ్రీనివాసరావు ‘బృందావనం’లో రాసిన ‘మధురమే సుధా గానం..., ఓహో ఓహో బుల్లి పావురమా...’ పాటలు రాశారు వెన్నెలకంటి. ఈ పాటలు విని, ‘పింగళిగారితో రాయించుకున్న ఫీలింగ్ కలుగుతోంది’ అని మెచ్చుకున్నారట సింగీతం. ఆ తర్వాత ‘స్వాతి కిరణం, క్షత్రియపుత్రుడు, మహానది’ వంటి అనువాద సినిమాలకు పాటలు రాశారు. అర్జున్, ఖుష్భూ ప్రధాన పాత్రల్లో నటించిన ‘సంగ్రామం’తో డైలాగ్ రైటర్‌గా మారారు. కమల్ నటించిన ‘పంచతంత్రం, పోతురాజు, ముంబై ఎక్స్‌ప్రెస్, దశావతారం, మన్మధ బాణం’ వంటి సినిమాలకు తెలుగు డైలాగ్స్ రాశారు. లాక్డౌన్లో రామాయణానికి సంబంధించిన పద్యాలు రాశారు. ఆయుష్షు ఉంటే రామాయణ మహాగ్రంధాన్ని రాయాలనుందని ఇటీవలే తన కోరికను పంచుకున్నట్టు వెన్నెలకంటి కుమారుడు శశాంక్ వెన్నెలకంటి పేర్కొన్నారు. వెన్నెలకంటికి భార్య ప్రమీలాకుమారి, ఇద్దరు కుమారులు శశాంక్, రాకేందు మౌళి ఉన్నారు. శశాంక్ రచయితగా, రాకేందు రచయితగా, నటుడిగానూ చేస్తున్నారు. వెన్నెలకంటి మరణం ఆ కుటుంబానికే కాదు సినిమా ఇండస్ట్రీకి కూడా తీరని లోటు. వెన్నెలకంటి కలం నుంచి వచ్చిన మొదటి పాట ‘చిన్ని చిన్ని కన్నయ్యకు వెన్నెల జోల...’. అవును... ఇప్పుడు నింగి పండగ చేసుకునే వేళ. నింగికి జోల వినిపించడానికి వెన్నెల వెళ్లారు. ఆ వెన్నెల కూడా ఈ వెన్నెలకు జోల పాడబోతోంది. ఇక ‘మాట రాని మౌనం’ ఇక్కడ. కానీ... పాటల వెన్నెల బతికే ఉంటుంది. వెన్నెలకంటి హిట్స్‌లో కొన్ని నేనాటోవాణ్ణి ఆటోవాణ్ణి అన్నగారి రూటువాణ్ణి (బాష) రాసలీల వేళ రాయబారమేళ (ఆదిత్య 369) శ్రీరంగ రంగనాథుని రూపమే చూడవే (మహానది) సన్నజాజి పడకా (క్షత్రియ పుత్రుడు) హృదయం ఎక్కడున్నది హృదయం ఎక్కడున్నది (గజిని) చిరునవ్వుల వరమిస్తావా చితినుంచి బతికొస్తాను (చిరునవ్వుల వరమిస్తావా). -
సినిమా ప్రమాణాలు పడిపోవు
సినిమా సాహిత్యం నాడు-నేడుపై వెన్నెలకంటి వ్యాఖ్య డాక్టర్ ఏబీ సాయిప్రసాద్, బూదాటి వెంకటేశ్వర్ల ప్రసంగాలు మద్రాసు విశ్వవిద్యాలయంలో ధర్మనిధి ఉపన్యాసాలు చెన్నై : ఆ కాలంలో సినిమాలు, సాహిత్యాలు బాగుండేవి, నేడు దారుణంగా మారాయని కొందరు చేసే విమర్శలు అర్థరహితమని ప్రముఖ సినీరచయిత వెన్నెలకంటి అన్నారు. కాలానుగుణంగా సినిమా ప్రమాణాలు మారిపోతుంటాయే గానీ పడిపోవడం జరగదని ఆయన స్పష్టం చేశారు. మద్రాసు విశ్వవిద్యాలయం తెలుగుశాఖ అధ్యక్షులు మాడభూషి సంపత్‌కుమార్ నేతృత్వంలో ధర్మనిధి ఉపన్యాసాల కార్యక్రమం బుధవారం జరిగింది. ఈ సందర్భంగా ఆర్కాటు ప్రకాశరావు ధర్మనిధి ఉపన్యాసం పేరున సినిమా సాహిత్యం-నాడు, నేడు అనే అంశంపై వెన్నెలకంటి ప్రసంగించారు. సినిమా సాహిత్యంలో నాడు - నేడు అనే ప్రస్థావనే తగదని అన్నారు. 1913లో భక్త ప్రహ్లాద చిత్రం ద్వారా చందాల కేశవదాస్తో సినీ రచయిత ప్రారంభం కాగా ఈ 2016వ సంవత్సరంతో నాడు - నేడుగా ఇలా విడగొడుతామని చెప్పారు. సినిమా సమాజం ఒక దాని కొకటి ప్రతిబింబించాలని ఆయన పేర్కొన్నారు. శంకరాభరణం వంటి ఉన్నతమైన చిత్రం వచ్చిన రోజులలో నాసిరకం చిత్రాలు కూడా విడుదలయ్యాయని తెలిపారు. అయితే శంకరాభరణం చిత్రం ప్రభావం వలన ఎందరో సంగీతాభిలాషను ప్రదర్శించారని తెలిపారు. అలాగే సాగరసంగమం సినిమా విడుదల కాగానే నృత్య కళాశాలలు నిండిపోయాయని అన్నారు. అదేరీతిలో శివ సినిమా వచ్చినప్పుడు ప్రతి విద్యార్థి సైకిల్ చైన్‌తో హీరోయిజం ప్రదర్శించారని ఆశించారన్నారు. విద్య, ఉద్యోగాలలో తగిన వేషధారణ ఉన్నట్లుగానే సినిమా సాహిత్య ధోరణి కూడా కాలానుగుణంగా మారుతుందని, ప్రేక్షకుడు గ్రహించే తీరును బట్టి అర్థాలు మారిపోతాయన్నారు. సినీ కవుల్లో ఒక్కొక్కరు ఒక్కో అంశాలలో అగ్రజులుగా వెలిగారని తెలిపారు. సీనియర్ సముద్రాల ఒక తరాన్నే శాసించారని చెప్పారు. పింగళి సాహిత్యం నేటికీ విరాజిల్లుతోందన్నారు. పింగళి సాహిత్య గుభాలింపుకు మాయాబజార్ చిత్రం ఒక పెద్ద ఉదాహరణ అని చెప్పారు. అలాగే జానపద సాహిత్యంలో కొసరాజు నేటికి మేటి అని అన్నారు. ద్వంద్వర్థాల పాటలు రాస్తారనే విమర్శలను ఎదుర్కొన్న వేటూరు సుందరరామమూర్తి కలం నుండి కిరాతార్జునీయం అనే అద్భుత కవిత జాలువారిందని తెలిపారు. బంగారు కోడిపెట్ట వంటి మాస్ సాంగ్‌ను రాసిన భువన చంద్ర మేధస్సు నుండి ఇది తరతరాల చరితం అనే అద్భుత సాహిత్యం ప్రేక్షకులను మైమరపించిందని చెప్పారు. గీతాల రచనలలో దేవులపల్లి కృష్ణశాస్త్రి, సినీ శ్రీ ఆరుద్ర, రాజశ్రీ, గోపి, సి.నారాయణరెడ్డి, సిరివెన్నెల సీతారామశాస్త్రి, చంద్రబోస్, అనిశెట్టి, మల్లెమాల, జొన్నవిత్తుల సాహితీ, సుద్దాల అశోక్ తేజ, వనమాలి.. ఎవరి ప్రత్యేకతలు వారివన్నారు. మహాకవి ఆత్రేయ వెండితెర వేమనగా ప్రసిద్ధి చెందారని చెప్పారు. సంగీత దర్శకుడు కీరవాణి, దేవిశ్రీ ప్రసాద్ సైతం అద్భుత సాహితీ వేత్తలని కొందరికే తెలుసని అన్నారు. తాను సైతం తక్కువ కాకుండా మంచి పాటలనే రాశానని తెలిపారు. తన వారసుడిగా సినీ రంగంలోకి అడుగుపెట్టిన కుమారుడు శశాంక్ అందాల రాక్షసి అనే సినిమాలో మనసు పలికే భాష ప్రేమ అనే పాటను రాసి సీనియర్ రచయితల మన్ననలను పొందారని తెలిపారు. ఇలా సినీ సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన మహా కవులను, రచయితలను ఆయన పేరు పేరునా ప్రస్థావించారు. ఆచార్య గంధం అప్పారావు ధర్మనిధి ఉపన్యాసం కింద వేమన మానవతావాదం అనే అంశంపై డాక్టర్ ఎబి సాయిప్రసాద్ ప్రసంగించారు. మానవతావాదం అనేది మనిషి వ్యక్తిత్వం పైనే ఆధారపడి ఉంటుందని అన్నారు. నార్ల వారు తన సాహిత్యంతో గొప్ప మానవతావాదిగా ప్రూవ్ చేసుకున్నారని చెప్పారు. ఇప్పటికీ ప్రజల నీతిబోధలకు ఒక దిక్సూచీగా వేమన శతకాలు ఉన్నాయన్నారు. మనిషి లోటుపాట్లు తెలిసిన వ్యక్తి వేమన అని ఆయన అభివర్ణించారు. ప్రజలలో ఆకలి - ఆహారం అనే రెండు వర్గాలు ఉన్నాయన్నారు. ఆకలి ఉన్నవారి వద్ద ఆహారం ఉండదు, ఆహారం అందుబాటులో ఉన్న వారికి ఆకలి ఉండదని ఆయన పేర్కొన్నారు. మనిషి స్వర్గానికి వెళ్లడం కాదు స్వర్గాన్నే మనిషి వద్దకు తీసుకురావడమే మానవతావాదమని చెప్పారు. మానవతావాది క్షమాగుణం కలిగినవారై ఉండాలని ఉద్భోధించారు. ఆచార్య ములుమూడి ఆదిలక్ష్మి ధర్మనిధి ఉపన్యాసం కింద మహాభారతం - మానవీయ ధృక్పథం అంశంపై ఆచార్య బూదాటి వెంకటేశ్వర్లు ప్రసంగించారు. ఏ సాహితీవేత్త నేలవిడచి సాముచేయడు, మానవీయ కోణాన్నివదలడని అన్నారు. నేటి సామాజిక రాజకీయ పరిస్థితులను ఆనాటి మహాభారతంతో పోల్చవచ్చని అన్నారు. మహాభారతం ఈనాటి సమాజానికి అద్ధమని, నేటి రాజకీయాలలో దాదాపుగా అందరూ దుశ్శాసనులేనని అన్నారు. జూదంలో ఓడిపోయి పాండవులు అడవుల పాలైనప్పుడు కౌరవులు వంటి దుర్మార్గుల పాలనలో ఉండలేమని, మీ వెంటే వస్తామని ప్రజలు వెంటబడినట్లు వెంకటేశులు తెలిపారు. అంటే ప్రజలెప్పుడు మంచి పాలకులనే కోరుకుంటారనే అర్థాన్ని నేటికీ అన్వయించుకోవచ్చని తెలిపారు. అలాగే మహాభారతంలో అణువణువునా మానవీయం కూడా కనిపిస్తుందని చెప్పారు. సమస్థ ప్రకృతి మానవీయమేనని పేర్కొన్నారు. పలువురు ఔత్సాహిక కవులు, ప్రముఖులు పాల్గొన్నారు.