‘సాక్షి’ టీవీ చానల్‌కి ఇటీవల ‘వెన్నెలకంటి’ ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ. ఇదే ఆయన ఆఖరి ఇంటర్వూ్య. వెన్నెలకంటి ‘అంతరంగం’ ఆయన మాటల్లో...
చిన్నప్పట్నించి నాకు పద్యాలు రాయటం అలవాటు. పదకొండు, పన్నెండేళ్లు వచ్చేటప్పటికే ఆటవెలది, కందపద్యాలు రాసేవాణ్ణి. భక్తి శతకాలు రాశాను. తర్వాత పద్యం నుండి గేయానికి వచ్చాను. గేయంలో అభ్యుదయ కవిత్వం వైపు వెళ్లాను. పద్యానికి పోలూరి హనుమా జానకి రామశర్మగారని నెల్లూరు సీఆర్ కాలేజీలో గురువుగారుండేవారు. గేయానికి నాగభైరవ కోటేశ్వరరావుగారు గురువుగా ఉండి నన్ను సొంత బిడ్డలా చూసుకునేవారు. ఇలా అన్ని ప్రక్రియలు దాటుకుని పాట దాకా వచ్చాను. సినిమా రంగానికి వచ్చిన తర్వాత సినిమా బాణీకి పాట రాయాల్సి వస్తుంది. నాకు గిరీశం అని చిన్ననాటి నుండి కలిసి పెరిగిన మిత్రుడున్నాడు. వాడు ట్యూన్ కడితే నేను పాట రాసేవాణ్ని. ఆ సమయంలో కొన్ని వందల పాటల్ని మేమిద్దరం తయారు చేశాం. అవన్నీ నాకు తర్వాత ఉపయోగపడ్డాయి.
ఆ ఇద్దరికీ నేను భక్తుణ్ణి
సముద్రాల గారి దగ్గరనుండి కొత్త కుర్రాళ్ల దాకా అందరి దగ్గరా నేర్చుకుంటూ ఉండేవాణ్ణి. 1986లో నేను వచ్చేనాటికి చాలామంది రచయితలు ఉన్నారు. ఎవరు మంచి పాట రాసినా వారికి అభిమాని అయ్యేవాణ్ణి. ఆత్రేయగారికి, వేటూరిగారికి మాత్రం నేను అభిమానిని కాను. వారికి మాత్రం నేను భక్తుణ్ని. ఆత్రేయగారిలోని లోతైన ఆలోచన, వేటూరిగారిలో ఉన్న భావవ్యక్తీకరణ అంటే నాకు బాగా ఇష్టం. ఆ రెండూ కలిపే ప్రయత్నమే నా పాట. వాళ్లతో ప్రత్యక్షంగా పరిచయం కావడం, వాళ్ల ఆశీర్వాదం లభించడం నా అదృష్టం. ఆత్రేయగారు ‘నీరాజనం’ సినిమాలో ‘మనసున్న మధుకలపం..’ పాటకి పల్లవి మాత్రం రాశారు.. చరణాలు ఇవ్వలేదు. ఓ రికార్డింగ్‌లో ముంబయ్‌లో ఉన్నారు. నిర్మాతగారు ఫోన్ చేస్తే అక్కడ ఎవరున్నారంటే నేనున్నానని చెప్పారు.. వాడు నాలాగే రాస్తాడు.. చరణాలు రాయించుకోండని ఆత్రేయగారు చెప్పడంతో నేను రాశా. ఇద్దరి పేర్లు వేయమంటే వద్దండీ.. ఇది నా గురుదక్షిణ అన్నాను. నేనంటే ఆయనకు చాలా ప్రాణం.
ఆ పాటకు ఎంతోమంది అభిమానులున్నారు
‘ఏప్రిల్ ఒకటి విడుదల’ సినిమాకి అన్నయ్య సీతారామశాస్త్రి పాటలన్నీ రాశారు. వంశీగారు నన్ను పిలిచి.. నాకు ఓ థీమ్ పాటలా కావాలన్నారు. రెండు చరణాలకు రెండు థీమ్స్ ఇచ్చి పాటగా రాయమన్నారు.. అలా రాశాను. ఇళయరాజాగారి ట్యూన్‌కి ‘మహర్షి’ సినిమాలో నేను రాసిన ‘మాటరాని మౌనమిది..’ పాట చాలా పెద్ద హిట్ అయింది.. ఆ పాటకి ఎంతో మంది అభిమానులున్నారు. సన్నివేశ ప్రాధాన్యం ఉన్న పాట అది. ఇళయరాజాగారికి చాలా పాటలు రాశాను. డబ్బింగ్ పాటలు కూడా ఎక్కువగా ఆయనవే రాశాను. ఈ మధ్య ప్రైవేట్ ఆల్బమ్స్ నాతోనే రాయించుకున్నారు తెలుగులో. ‘నాయకుడు’ సినిమా డబ్బింగ్ చిత్రం అని చెప్పలేం. అందులో నేను పాట రాశా. నేపథ్యంలో వచ్చే దానికి డబ్బింగ్‌లో రాసినా, స్ట్రయిట్‌గా రాసినా ఒక్కటే.. ‘సుందరాంగుడు’ చిత్రానికి నాతో బలవంతంగా డబ్బింగ్ పాటలు రాయించింది ఎంవీ రావు అనే ఫ్రెండ్. ఆ తర్వాత ‘సంగ్రామం’ అనే సినిమాలోని మొత్తం పాటలు నన్నే రాయమన్నారు.. కొంచెం కష్టం అనిపించింది. దానికి రాజశ్రీగారు నన్ను బాగా గైడ్ చేశారు.
డబ్బింగ్ కళాకారులను గుర్తించింది కమల్‌గారే
డబ్బింగ్ కళాకారులను బాగా గుర్తించింది ఎవరంటే కమల్‌హాసన్‌గారు.. డబ్బింగ్ రాయడం, కామెడీ రాయడం చాలా కష్టం అంటారాయన. మాటల వరకూ అయితే ఓ లెంత్ చూసుకుంటే చాలు.. పాటలయితే లిప్ మూమెంట్‌కి దగ్గరగా ఉండాలి. మాటల్లో ఒక్కో భాషలో ఒక్కో జాతీయాలుంటాయి.. అవి మనకు ఉండవు. కొన్ని ఎబ్బెట్టుగా ఉంటాయి. దానికి సమానమైన జాతీయాలు మనం వాడాలి. ఆరుద్రగారు చెప్పినట్టు లిప్ మూమెంట్ పాటిస్తూనే చెవికి తెలుగు వినపడేట్టు చేయడం అనువాద రచయిత లక్షణం. ఇన్ని భాషల్లో రాశాను.. ఇప్పుడు తమిళం కూడా నాకు కొద్ది కొద్దిగా వచ్చు. మిగతా ఏ భాష కూడా రాదు. హిందీ సినిమాల డబ్బింగ్ వెర్షన్ నేనే రాశాను. సూపర్ హిట్ అయ్యాయి. కానీ నాకు హిందీ అక్షరం ముక్క రాదు.
మలయాళం, కన్నడ కూడా రాదు. తెలుగు వస్తే చాలు. సన్నివేశం చూసి రాసేవాణ్ణి. మొదట్లో స్క్రిప్ట్ చూసి ప్రిపేర్ అయ్యేవాణ్ణి.. స్క్రిప్ట్‌తో థియేటర్‌కి వెళ్లేవాణ్ణి. ఇప్పుడు తమిళ్ వరకూ అది అక్కర్లేదు. తమిళ్‌లో కూడా ఒక్క కమల్‌హాసన్‌గారి సినిమాలకు మాత్రం, ముఖ్యంగా క్రేజీ మోహన్‌గారు–కమల్‌గారు కలిస్తే ముందు హోమ్ వర్క్ చేసుకుని స్క్రిప్ట్ మొత్తం రాసుకునే థియేటర్‌కి వెళ్లాలి. ముళ్లపూడి రమణగారి స్క్రిప్ట్ ఇంకో భాషలోకి అనువదించడం ఎంత కష్టమో.. క్రేజీ మోహన్‌గారు–కమల్‌గారి సినిమా అనువదించడం కూడా అంతే కష్టం. ‘భామనే సత్యభామనే, తెనాలి, పంచతంత్రం’ ఈ సినిమాలన్నీ కామెడీవే. వెంటవెంటనే పంచ్‌లుంటాయి.
అది గొప్ప అదృష్టం
‘జురాసిక్ పార్క్’ అన్నది మామూలు సినిమా కాదు.. అందులో సైంటిఫిక్‌గా చాలా క్లిష్టమైన విషయాలున్నాయి.. చాలా ప్రమాదాలుంటాయి. వాటిని చాలా సింపుల్‌గా ఉండేలా లిప్ సింక్ అయ్యేలా తీసుకురావాలి. పైగా ఆ సినిమాకి డబ్బింగ్ చెప్పేది ఎవరంటే జగ్గయ్యగారు. అంత గొప్పాయన నన్ను పిలిపించారు. మాటలు ఎవరు రాస్తున్నారంటే నేనే రాస్తున్నానని చెప్పడంతో నా ఆఖరు సినిమా నీకే చెబుతున్నాను.. అని డబ్బింగ్ చెప్పారాయన.. అది గొప్ప అదృష్టం. ఆ తర్వాత టైటానిక్, మమ్మీ సిరీస్, హ్యారీ పోటర్ సిరీస్, జేమ్స్‌బాండ్‌లో కొన్ని సిరీస్ చేశాను. హిందీలో ‘దిల్‌వాలే దుల్హనియా లే జాయేంగే, కహోనా ప్యార్‌హై, రాజా హిందుస్తాన్..’ ఇలా చాలా చేశాను.
ఆయన నమ్మకమే నిజమైంది
‘ ప్రేమాలయం’ చిత్రానికి సూరజ్ బర్‌జాత్యగారు డైరెక్టర్. వాళ్ల నాన్న రాజ్‌కుమార్ బర్‌జాత్యగారు ‘మేం తెలుగులో ఆడియో విడుదల చేయడం లేదు.. సినిమా విడుదలైన వంద రోజుల వరకూ రిలీజ్ చేయం’ అనడంతో నా గుండె జారిపోయింది. పాటలు బాగా హిట్ అయితేనే కదా ప్రేక్షకులు సినిమాకి వస్తారు.. లేకుంటే రారు అని చెప్పాను. అప్పట్లో పైరసీలు ప్రస్తుత పరిస్థితుల్లోగా లేవు. అందుకే పాటలు వినాలంటే కచ్చితంగా థియేటర్‌కి వచ్చి చూస్తారు అని ఆయన అన్నారు.. ఆయన నమ్మకమే నిజమైంది. పాటలు రిలీజ్ చేయకపోయినా వంద రోజులు హౌస్‌ఫుల్ కలెక్షన్స్‌తో సినిమా ఆడింది. ఆ తర్వాత ఆడియో విడుదలయ్యాక సిల్వర్ జూబ్లీ ఆడింది. ‘ప్రేమాలయం, ప్రేమించి పెళ్లాడతా’ సినిమాల్లో పాటలు బాగా పాపులర్ అయ్యాయి.
అందుకే ఆ ముద్రపడింది
చెన్నైలో ఉంటూ రాయడంవల్ల డబ్బింగ్ మాటల రచయితగా నా మీద ముద్రపడింది. అది సహజం. నేను అక్కడ బిజీగా ఉన్న సమయంలోనూ నన్ను పిలిచి స్ట్రయిట్ చిత్రాలకు పాటలు రాయించుకున్న దర్శక–నిర్మాతలకు, సంగీత దర్శకులకు నేనెప్పుడూ రుణపడి ఉంటాను.. ఆ పాటలు కూడా బాగా హిట్ అయ్యాయి. అయితే డబ్బింగ్ రచయిత అనే ముద్ర నాకు మేలే చేసింది. కానీ దాని వల్ల స్ట్రయిట్ సినిమాల్లో పాటలు రాసే కొన్ని అవకాశాలు తగ్గి ఉండొచ్చు. అయితే అనువాదంలోకి వెళ్లడంతో కమల్‌హాసన్‌గారికి పర్మనెంట్ రైటర్ అయ్యాను. ఓ సారి కమల్‌గారి బర్త్ డేలో రజనీకాంత్‌గారికి నన్ను పరిచయం చేస్తూ, మీ ‘బాషా’ తెలుగు రచయిత, నా పర్మనెంట్ తెలుగు రచయిత’ అన్నారు. ‘‘కమల్‌గారి ‘మహానది’లో ‘శ్రీరంగ రంగ..’ అనే పాట సాహిత్యం చాలా బాగుంది, ఇంత మంచి సాహిత్యం తెలుగు అనువాదంలో వస్తుందా?’’ అంటూ దర్శకుడు కె. విశ్వనాథ్‌గారు నన్ను అభినందించారు.
డబ్బింగ్ రైటర్ అంటే చిన్న చూపు
డబ్బింగ్ రైటర్ అంటే ఓ చిన్న చూపు ఉంటుంది. బడ్జెట్, పారితోషికం... ఇలా ఏ రకంగా చూసుకున్నా స్ట్రయిట్ సినిమా రేంజ్ వేరు? డబ్బింగ్ సినిమా రేంజ్ వేరు. గతంతో పోలిస్తే ఇప్పుడు డబ్బింగ్ సినిమాలు స్ట్రయిట్ సినిమాకి పోటీ పడే స్థాయిలో రావడం సంతోషం. ఒకానొక సమయంలో డబ్బింగ్ సినిమాలు బ్యాన్ చేయాలనే చర్చ తెలుగు సినిమా పెద్దల మధ్య జరిగింది. స్ట్రయిట్ సినిమా అయినా డబ్బింగ్ సినిమా అయినా బాగుంటేనే ఆడతాయి.
నా పిల్లలు నా శిష్యులు కాదు
ప్రాక్టీస్ అన్నది చేసేకొద్దీ వస్తుంది. నా పిల్లలు ఎవరూ నా వద్ద శిష్యరికం చేయలేదు. డబ్బింగ్‌లు చెప్పే మా పెద్దబ్బాయి శశాంక్ వెన్నెలకంటిని డబ్బింగ్ రచయితని చేశారు. వాడి తొలి సినిమా ‘మన్మథ’ 100 రోజులు ఆడింది. రెండో సినిమా ‘గజనీ’ పెద్ద హిట్ అయింది. ‘ఆకాశమే నీ హద్దురా’ సినిమాకి రెండో అబ్బాయి రాకేందు మౌళి రాశాడు. నాలుగోతరంలో నా మనవడు, మనవరాలు కూడా డబ్బింగ్ రంగంలోకి వచ్చారు. వారిద్దరికీ పదేళ్ల లోపే ఉంటాయి. ఓ కుటుంబం నుంచి నాలుగు తరాలు రావడం చాలా ఆనందంగా ఉంది. మా నాన్నగారి ఆశీర్వాదాల వల్లే ఇదంతా జరిగింది. మా అబ్బాయిలకు సలహాలు చెప్పే అవసరం పెద్దగా రాలేదు. రాకేందు మౌళి ‘అందాల రాక్షసి’ సినిమాకి ఉత్తమ అప్‌కమింగ్ లిరిక్ రైటర్, బెస్ట్ అప్‌కమింగ్ సింగర్ అవార్డులు అందుకున్నాడు. ఆ స్టేజిపై మాట్లాడుతూ లిరిక్ రైటర్ అవార్డు నా వల్ల, సింగర్ అవార్డు నా భార్య వల్ల వచ్చిందని మాకు కృతజ్ఞతలు చెబుతూ, బాలుగారికి ఏకలవ్య శిష్యుణ్ణి అని చెప్పి ఆయనకు అంకితం చేశాడు.
నిజానికి నేను ఆత్రేయగారికి భక్తుణ్ణి. ఆయనంత గొప్ప కవిని కాకపోయినా ఆయన బద్దకం మాత్రం నాకు బాగా వచ్చింది. ఇది చాలా రోజులుగా అనుకుంటున్నదే.. కార్యాచరణలో పెట్టాలి. ఓ కావ్యం రాశాను.. అది ప్రింట్ చేయాలి. ఇప్పుడు రాస్తున్న ‘రామాయణం’ కూడా ప్రింట్ చేయాలి. పాటలన్నీ కలిపి ఓ పుస్తకం తేవాలి.. ఇలా చాలా ఉన్నాయి.
– రెంటాల జయదేవ
Comments
Please login to add a commentAdd a comment