రీల్ లైఫ్‌లో నటిగా నా లక్ష్యాన్ని చేరుకున్నాను. రియల్ లైఫ్‌లో నాకంటూ ఓ లక్ష్యం ఉంది.. అమ్మమ్మ పాత్ర వరకూ ఉండాలనుకుంటున్నా (నవ్వుతూ). నా కూతురి పిల్లలతో అమ్మమ్మ అనిపించుకుంటే నా లక్ష్యం తీరినట్టే.
‘‘ప్రస్తుతం తెలుగులో రెండు పెద్ద సినిమాలు ఒప్పుకున్నాను. తమిళ్‌లో కూడా ఓ సినిమా చేయబోతున్నా. తమిళ్, తెలుగు భాషల్లో మా ఆయన దర్శకత్వం వహించనున్న ఓ వెబ్ సిరీస్‌లో నటిస్తాను. లాక్‌డౌన్ తర్వాత ఈ వెబ్ సిరీస్ స్టార్ట్ అవుతుంది’’ అని నటి రాశి అన్నారు. నేడు ఆమె పుట్టినరోజు. ఈ సందర్భంగా సాక్షితో మాట్లాడుతూ పలు విశేషాలు పంచుకున్నారు రాశి.
► ఈ పుట్టినరోజు అనే కాదు.. నేను ఏ పుట్టిన రోజునీ ప్రత్యేకంగా చూడను.. వేడుకలు జరుపుకోను. బర్త్ డేకి గుడికి వెళ్లి వచ్చి, ఇంట్లోనే కుటుంబంతో కలిసి సంతోషంగా ఉంటాను. మా నాన్న చనిపోయారు. ప్రస్తుతం కరోనా లాక్‌డౌన్ వల్ల మా అమ్మ నా దగ్గరే ఉంటున్నారు. అమ్మ, నేను, నా భర్త శ్రీనివాస్, పాప కలిసి ఇంట్లోనే ఉంటున్నాం. లాక్‌డౌన్ సమయంలో కొందరు అక్కడక్కడ చిక్కుకుపోయారని విన్నాను. అదృష్టవశాత్తూ మేమంతా ఇంట్లోనే హాయిగా ఉన్నాం. ఈ లాక్‌డౌన్‌లో ‘రాశి విజన్స్’ అనే యూట్యూబ్ చానల్ ఓపెన్ చేశాం.
► మా పాప రిధిమా మొదటి పుట్టినరోజు సమయంలో వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిగారిని కలిసి ఆశీస్సులు తీసుకున్నాం. ఆయన ముఖ్యమంత్రి అయ్యాక కలవలేదు. జగన్‌గారిని కలిసినప్పుడు నేను రాజకీయాల్లోకి వస్తున్నాననే పుకార్లు బాగా వచ్చాయి. అయితే రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన ఏమాత్రం లేదు.
► ఇన్నేళ్లు నటనలో గ్యాప్ రాలేదు.. నేనే ఇచ్చాను. రిధిమాని చూసుకునేందుకే సమయం సరిపోయేది.. ఇక నటించేందుకు తీరిక ఎక్కడిది? తను 1వ తరగతికి వెళ్లే వరకు సినిమాలు చేయొద్దని నిర్ణయించుకుని నటనకు దూరంగా ఉన్నాను. ఇప్పుడు మా పాపకి ఐదేళ్లు వచ్చాయి. ఇప్పుడు నటించేందుకు వీలు కుదురుతోంది. ఇలాంటి పాత్రలే చేయాలనుకోవడం లేదు. నా మనసుకి నచ్చిన ఏ పాత్ర అయినా చేస్తాను.
► ఓ సీరియల్ షూటింగ్‌లో నేను పోలీస్ యూనిఫామ్‌లో ఉన్న నా వీడియో, ఫొటోలు బాగా వైరల్ అయ్యాయి. ‘బాగా సన్నబడ్డట్టున్నారే.. మీ లుక్ బాగుంది’ అని చాలామంది అంటుంటే సంతోషంగా ఉంది. నేను నటించిన మొదటి సీరియల్ ఇది. నాలుగు రోజులు షూటింగ్‌లో పాల్గొన్నాను. ఈ చిత్రీకరణలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం కోవిడ్ నివారణ చర్యలు తీసుకున్నాం. వెండితెరకి, బుల్లితెరకి పెద్ద తేడా అనిపిం^è లేదు. ప్రస్తుతం సినిమాకి ఉపయోగించే టెక్నాలజీ బాగుంది. సీరియల్‌కి కొంచెం హార్డ్ వర్క్ ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment