‘మాటరాని మౌనమిది... మౌనవీణ గానమిది.. గానమిదీ నీ ధ్యానమిది.. ధ్యానములో నా ప్రాణమిదీ.. ప్రాణమైన మూగ గుండె రాగమిది’... పదాల కూర్పు చదివారు కదా. మౌనంతో ముగించి.. మౌనంతో ఆరంభించి.. గానంతో ముగించి.. గానంతో ఆరంభించి... ధ్యానంతో ముగించి.. ధ్యానంతో ఆరంభించి... మొదటి పంక్తిలోని చివరి పదంతో రెండో పంక్తిని మొదలుపెట్టడం. ఇదే కాదు...‘నేను ఆటోవాణ్ణి..’ అని మాస్‌కి కిక్ ఇచ్చారు. ‘హృదయం ఎక్కడున్నది..’ అంటూ ప్రేమికులకు మంచి పాటిచ్చారు ‘రాసలీల వేళ.. రాయబారమేల..’ అంటూ రొమాన్స్ పండించారు.ఇంకా ఎన్నో ఇచ్చారు... మంచి పాటలా మనసులో నిలిచిపోయారు.ఇప్పుడు ఆ కలం మౌనం వహించింది. మాటలు ఎప్పటికీ ఉంటాయి.
ప్రముఖ గేయరచయిత వెన్నెలకంటి (64) మంగళవారం గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన అసలు పేరు రాజేశ్వరప్రసాద్. ‘వెన్నెలకంటి’ ఇంటి పేరు. సుమారు 300పై చిలుకు సినిమాల్లో రెండువేలకు పైగా పాటలు రాశారు. ఆ 300 సినిమాల్లో 270కి పైగా సినిమాలు అనువాద చిత్రాల్లోని పాటలే. 1957లో నెల్లూరులో జన్మించారు వెన్నెలకంటి. విద్యాభ్యాసాన్నంతా నెల్లూరులోనే పూర్తి చేశారు. చిన్నప్పటి నుంచీ సాహిత్యమంటే అభిరుచి ఎక్కువ. వెన్నెలకంటి తండ్రి వి. కోటేశ్వరరావు (సినీ ఇండస్ట్రీలో ప్రొడక్షన్ ఇన్‌చార్జ్‌గా చేసేవారు). టైటిల్ కార్డ్స్‌లో తండ్రి పేరు చూసి సినిమాల్లోకి రావాలనే ఆకాంక్ష ఎక్కువైంది. పదకొండేళ్ల వయసున్నప్పుడే ‘దుఃఖనాశ పార్వతీశా’ అనే మకుటంతో శతకం రాశారు వెన్నెలకంటి. అలానే ‘రామచంద్ర శతకం, లలితా శతకం’ కూడా రాశారు. మనసంతా నాటకాలు, సినిమాలతోనే నిండిపోయుండేది. నెల్లూరులో సాంస్కృతిక, సాహిత్యానికి సంబంధించిన ఏ కార్యక్రమమైనా వెన్నెలకంటి తప్పనిసరి ఉండేవారు. చదువు పూర్తి చేసి బ్యాంక్‌లో ఉద్యోగం పొందినా, దృష్టంతా సినిమాల వైపే. నెల్లూరు నుంచి సరదాగా చెన్నై వెళ్లి వస్తుండేవారు. నటుడు, నిర్మాత ప్రభాకర్ రెడ్డి ద్వారా 1986లో ‘శ్రీరామచంద్రుడు’ సినిమాలో తొలి పాట రాసే అవకాశం వచ్చింది. చదవండి: తేజకు నో చెప్పిన కాజల్.. తాప్సీ ఓకే
అలా వెన్నెలకంటి రాసిన మొదటి పాట ‘చిన్ని చిన్ని కన్నయ్యకు వెన్నెల జోల...’. గాయకులు యస్పీ బాలసుబ్రహ్మణ్యం ప్రోత్సాహంతో 1987లో ‘అన్నా చెల్లెలు’లో ‘అందాలు ఆవురావురన్నాయి..’ అనే పాట రాశారు. ఆ తర్వాత రచయితగా బిజీ కావడంతో బ్యాంక్ ఉద్యోగానికి రాజీనామా ఇచ్చేశారు. 1988లో ‘మహర్షి’ సినిమా రూపంలో ఆయన కెరీర్‌కు పెద్ద బ్రేక్ దొరికింది. ఆ సినిమాకి రాసిన ‘మాట రాని మౌనమిది.. మౌనవీణ గానమిది...’ పాటను తెలుగు రాష్ట్రమంతా పాడుకుంది. దీంతో ‘మహర్షి’ నిర్మాత ‘స్రవంతి’ రవికిశోరే ‘నాయకుడు’ (మణిరత్నం – కమల్‌హాసన్) తెలుగు డబ్బింగ్ వెర్షన్‌కి పాటలు రాయించారు. ఆ వెంటనే వంశీ ‘చెట్టుకింద ప్లీడర్’ సినిమాలో ‘చల్తీకా నామ్ గాడీ చలాకీ వన్నె లేడీ...’, ‘అల్లిబిల్లి కలలా రావే.. అల్లుకున్న కథలా రావే..’ పాట రాశారు. సింగీతం శ్రీనివాసరావు ‘బృందావనం’లో రాసిన ‘మధురమే సుధా గానం..., ఓహో ఓహో బుల్లి పావురమా...’ పాటలు రాశారు వెన్నెలకంటి. ఈ పాటలు విని, ‘పింగళిగారితో రాయించుకున్న ఫీలింగ్ కలుగుతోంది’ అని మెచ్చుకున్నారట సింగీతం.
ఆ తర్వాత ‘స్వాతి కిరణం, క్షత్రియపుత్రుడు, మహానది’ వంటి అనువాద సినిమాలకు పాటలు రాశారు. అర్జున్, ఖుష్భూ ప్రధాన పాత్రల్లో నటించిన ‘సంగ్రామం’తో డైలాగ్ రైటర్‌గా మారారు. కమల్ నటించిన ‘పంచతంత్రం, పోతురాజు, ముంబై ఎక్స్‌ప్రెస్, దశావతారం, మన్మధ బాణం’ వంటి సినిమాలకు తెలుగు డైలాగ్స్ రాశారు. లాక్‌డౌన్‌లో రామాయణానికి సంబంధించిన పద్యాలు రాశారు. ఆయుష్షు ఉంటే రామాయణ మహాగ్రంధాన్ని రాయాలనుందని ఇటీవలే తన కోరికను పంచుకున్నట్టు వెన్నెలకంటి కుమారుడు శశాంక్ వెన్నెలకంటి పేర్కొన్నారు. వెన్నెలకంటికి భార్య ప్రమీలాకుమారి, ఇద్దరు కుమారులు శశాంక్, రాకేందు మౌళి ఉన్నారు. శశాంక్ రచయితగా, రాకేందు రచయితగా, నటుడిగానూ చేస్తున్నారు. వెన్నెలకంటి మరణం ఆ కుటుంబానికే కాదు సినిమా ఇండస్ట్రీకి కూడా తీరని లోటు.
వెన్నెలకంటి కలం నుంచి వచ్చిన మొదటి పాట ‘చిన్ని చిన్ని కన్నయ్యకు వెన్నెల జోల...’. అవును... ఇప్పుడు నింగి పండగ చేసుకునే వేళ. నింగికి జోల వినిపించడానికి వెన్నెల వెళ్లారు. ఆ వెన్నెల కూడా ఈ వెన్నెలకు జోల పాడబోతోంది. ఇక ‘మాట రాని మౌనం’ ఇక్కడ. కానీ... పాటల వెన్నెల బతికే ఉంటుంది.
వెన్నెలకంటి హిట్స్‌లో కొన్ని
- నేనాటోవాణ్ణి ఆటోవాణ్ణి అన్నగారి రూటువాణ్ణి (బాష)
- రాసలీల వేళ రాయబారమేళ (ఆదిత్య 369)
- శ్రీరంగ రంగనాథుని రూపమే చూడవే (మహానది)
- సన్నజాజి పడకా (క్షత్రియ పుత్రుడు)
- హృదయం ఎక్కడున్నది హృదయం ఎక్కడున్నది (గజిని) చిరునవ్వుల వరమిస్తావా చితినుంచి బతికొస్తాను (చిరునవ్వుల వరమిస్తావా).
Comments
Please login to add a commentAdd a comment